Wednesday, 17 December 2014

పెషావర్

 
నిన్న మొన్నటి పాఠ్య పాటల పరవశాల గుడి,
కలిసిమెలసి భవిష్యత్ సప్తవర్ణ చిత్రాలను
తమ కలల కుంచెలతో నగిషీలు దిద్దుతున్నతరుణ మది ...
కేరింతల కిలకిలలు, చిరు యవ్వన కితకితలు విచ్చుకుని ,
యువజనోత్సవం - వున్నత విద్యా బుద్దులకోసం ఉరకలేస్తున్న ప్రాయం.
చదువులమ్మ వెచ్చని వోడిలో మానవ వికాసం వెదజిమ్ముతున్నవేళ-
బుల్లెట్ల జడివానలో తడిచి
రక్తపుటేరులో కొట్టుకు పోయింది , మానవత్వం .
పవిత్ర యుద్దానికి వందలసంఖ్యలో నెత్తుటి నైవేద్యం,
అ దైవం కోసం అంటూ –
జీహాదీయులు, తూటాల గంటలు కొట్టి ప్రాణాలునుకాల్చేసి
విద్యాలయాన్ని తడి ఆరని ఉప్పని రుధిరపాత్రను చేసారు .
మానవత్వపు మానానికే మచ్చతెస్తూ పాకిస్తాన్ పడగమీది
ఉగ్రవాద కరాళ నృత్యం మనసున్నవాడి మదిలో
మనిషిగా పుట్టినందుకు సిగ్గుతో చావాలనిపించేలా చేసింది .
ప్రాణభయం, నోట్లో గుడ్డను కుక్కుకుని బట్టకట్టిన భయానక సందర్భం.
కయ్యానికి సమవుజ్జీలవసరమనే యుద్ధనీతికి నీళ్ళోదిలి
బాలల గుండెలవిసేలా గుళ్ళను గుమ్మరించి గుర్తింపుకోసం
కన్నవారి కడుపు కోతను, కన్నీటినీ శవపేటికల్లో చుట్టేసింది
తాలిబాన్ సేన నీతిబాహ్యంగా , నరమేధంతో మానవ స్వభావ విరుద్దంగా.
ఇప్పుడు, పెషావర్ అమానుష నిర్దయాత్మక హత్యాదోషానికి
నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచాన్ని నిద్దరపోనీయదు.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
17-12-14