క్షతగాత్రులు
అ దొక అంతులేని అసహాయ అవేదనల సమూహం,
సహజీవన ఆలంబన కరువై , ఆక్రందనలకు నెలవైన
అనుమానపు బాణాల గాయాల చిరునామాలవి..
ఆ హృదిలో కూడా జాతీయ సమైక్య సద్భావనా వీచికలే .
అయినా , నిర్దాక్షిణ్య , దురహాంకార ఫాసిస్ట్ చేతుల్లో
బలౌతున్న పరాచికాల పాచికలు .
మాతృ దేశ భక్తి భావనల పేగు తెంచుకుని
అలీగానో, అక్బర్ గానో ,అమీనా గానో ఊపిరి పీల్చుకున్న ప్రాణం
మస్ జిద్ గోడ ప్రక్క గోలీలాడుకుంటూ , స్వేద తీరే ప్రాయంలోనే
సైనైడు గుళికలై , బెల్ట్ బాంబు లై పేలిపోతున్నాయి.
గుట్టుగా గమ్మున తప్పిపోయి , పవిత్రపోరుకు నైవేద్యాలుగా మారిపోతున్నాయి.
అమ్మీ అబ్బాల జ్ఞాపకాల్లోనో , గోడకు తగిలించిన
నమాజ్ టోపీల్లోనో మిగిలిపోతున్నాయి. -
తప్పితే , చీకట్లోనే బానేట్లుకు నెత్తురు మరకలై ఎండిపోవడమో -
రెక్కలు తెగిన పంజరపు చిలకల్లా , జైల్లో మగ్గి పోవడమో -
అప్రమేయంగా, ఓడిపోయి , పరాధీనమై వాడి పోవడమో -
అలవడ్డ అనివార్య అణిచిన ఆక్రందనల జీవనం..
కడుపుకోతకు పర్యాయంగా అవిసిన గుండెల్లో కన్నీళ్ళై
ఘనీభవించి కానరాని కలల కల్లోలాలై మిగిలిపోవడమో
అదొక అంతులేని వింత వ్యధ .. ఖుదా !ప్చ్
శాపగ్రస్తుల్లా విముక్తి లేని పుట్టుక.
ప్రపంచం లో ఎక్కడ ఏ మూల ఏమి పేలినా ,ఎవరు రాలినా
అందరి అనుమానపు చూపులు ఆ బస్తీ వైపే .
ఆ నామ రూపాలు సాక్షులు , మతమే నేర నిర్ధారణా యంత్రం,
ఖాకీలజులుం కో , కళ్ళాల్లేని కషాయిల కవాతుకో
యవ్వనమే శాపమై, కరిగిపోతున్న నిషిద్ద స్వరాలువి .
హలాల్ అందిస్తూ , హలీమ్ తో మరపిస్తూ, సాంబ్రాణి ధూపా లేస్తూ
దర్గాల్లో, కడుపులు పండాలని
సుతిమెత్తని పీరుల నెమలి ఈకలు విసురులతో సౌకుమార సూఫీలు పాడుతూ ,
జనజీవన భాగాస్వామ్య మమేకమౌ వ్వాల్సినోళ్ళు ,
పుట్టు మచ్చను రాచ పుండు గా మార్చింది ,మాయ లోకం .
దిక్కు చూపుల బిక్కు దైనందినం లో
రేపటి బ్రతుకు కోసం పోరు ,
నిన్నటి ఆనవాళ్ళ జాడలు చెరిపేసుకోవాలనే వెతుకులాటలో
చేయని నేర భారాలతో బరువెక్కిన అస్తిత్వపు శకలాలు.
వేయిపడగల కాలనాగు తర తరాలుగా తరాలను
విషం తుల్యం చేసేస్తూ ఒక ప్రక్క-
లౌకిక మార్కెట్టు లో తాకట్టు వస్తువులై
తూకం కొలతలే కాదు మూల్యం కూడా లేని
అత్యవసర తాజా సరుకు లై ఒక ప్రక్కా-
ఫత్వా, తత్వా, మోలీ,దళారుల మతలబులోక పక్కా -
పెట్టుబడుల పేదరాసి పెద్దన్నయ్య పెద్దరికపు ఉక్కు పాదం అటు ప్రక్క-
ఎటు చూస్తే అటు దుఃఖం , ఎటు తిరిగితే అటు నేరం
జీవించడం అంటేనే రోజూ చావడ మైన తరుణం ,
బ్రతకనీయండంటూ బ్రతిమాలుతూ బ్రతుకీడ్చడం అలవడ్డ నైరాశ్యం ,
స్వేఛ్చ,సమానత్వాన్నీ ప్రజాస్వామ్య స్వాభిమానాన్ని ఉరితీయడమే,
హక్కులే అయోమయమైన వేళ , బ్రతుకు గీతాల్ని బలిమితో చేరిపెయడమే
అస్తిత్వపు ఆకాంక్షను హత్య చేయడమే ,
ఇంతకీ హంతకులు ఎవరు ? ఎవరిదీ పాపం ? డాక్టర్ మాటూరి శ్రీనివాస్
7-12-14