కాలం....
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
నీ కౌగిలిలో ఒదగని వారెవ్వరు,
నీ కబంధ హస్తాల్లో ఇమడని వారెవ్వరు ,
నీ భ్రమల వలయంలో చిక్కని వారెవ్వరూ
నీలోని కలవని వారెవ్వరు , కరగని వారెవ్వరు .
ఎవ్వరెంతగా ఉబలాటపడినా
నాదీ, నీదీ అంటూ వంచన తో పంచేసుకున్నా
కడకు నీకే అర్పించుకుంటారందరూ .
వీచే గాలుల ఆలంబనా గీతానివి నువ్వు ,
పూచే పూవు పరవశాల నవ్వువు నువ్వు
ఎగిరే పిట్టల రెక్కల రెపరెపల అలవోక అలజడివి.
ఓ !అశాశ్వతపు చిరునామా,
కలివిడి ఆటల , కన్నీటితడి చారల కరుకు చదరంగానివి నువ్వు .
ఎవ్వరున్నాగానీ, లేకున్నాగానీ ,
తుది వరకూ వెన్నంటి చరిస్తున్న అంతరంగానివి నువ్వు ,
ఊరిస్తూ, ఉయ్యాలలూగిస్తూ , కలల ఉహల్తో కవ్విస్తూ
అంతలోనే పాతాళానికి నెట్టేస్తూ
విశ్వాంతరాలలో విహరిస్తున్న మనస్సును
అదుపుచేసే బలీయ విధి విలాసానివి నువ్వు.,
జ్ఞాన జ్యోతిని ప్రసరించేందుకు,
శాంతి గీతం ప్రభవించేందుకు
మనిషిలో మానవత్వపు వాత్సల్య బీజాన్ని చిగురింపచేసే
అనిత్య పాఠానివి నువ్వు .
సుఖాదుఖాల మాయాజాలానివి నువ్వు
బతుకు ఉబలాటాలకు ఎర లేని గేలానికి నువ్వు.
కాలానివి నువ్వు !
భూత జ్ఞాపకాల శూలానివి నువ్వు
కాలానివి నువ్వు !
వర్తమానపు వొడిలోని వెచ్చని బహుమానానివి నువ్వు
కాలానివి నువ్వు !
భవిష్యత్ ద్వారానివి నువ్వు...