Wednesday, 3 June 2020

ధప్పడ్


       
                                                         ధప్పడ్


                       “పోనీలే అయ్యిందే దో” , “వదిలేయొచ్చు కదా?” ,”తెగేదాకా లాగొద్దు” “చూసీ చూడనట్టు ఉండాలి” “సర్దుకు పోవాలి” ,”పెద్ద కొంపలేమీ మునిగిపోయాయి”, “మొగుడన్నాక ఆమాత్రం హక్కు ఉండదా?” “మొగుడే కదా “? “చిన్న విషయానికి అంత రాద్దాంతం అవసరమా ?” “అంత అహం పనికి రాదు” “ఏమిటంత పొగరు?” “మరీ బరితెగిస్తున్నావు” ఇలాంటివన్నీ మన సమాజంలో వంకర ఒకే బుద్ధిని చాటుతాయి. అదే పురుషాధిక్యత.  భార్యా భర్తల మధ్య సర్వ సాధారణంగా ఎంత చిన్న చిన్న కలతలు స్పర్ధలూ చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. అనేక సందర్భాల్లో అవి అలవాటుగా మారి సద్దుమనిగిపోతాయి. ఎన్నో సార్లు రాజీ పడుతూ ఉంటారు.అది ఒకరినొకరు అర్హం చేసుకోవడం అనండి, లేదా ఆధిపత్యపు అలవాటు అనండి, మన సమాజంలో స్త్రీలకున్న ప్రాధాన్యత అనండి పైవి మాత్రం సర్వ సాధారణంగా వింటూ ఉంటాము. ఇటీవల చూసిన ఒక హిందీ సినిమా లో ఇవన్నీ చోటు చేసుకున్నాయి. చూసాక ఈ నాలుగు వాక్యాలు రాయాలనిపించింది. భర్త ఎన్నో పని వొత్తిడి లలో సతమౌతూ ఉంటాడు. సంపాదనాలో అలిసి[ఆతడు. కెరీర్లో ఎదగడం కోసం ఆఫీసులో ఎందరికో ఊడిగం చేస్తాడు.  కనుక ఇంటికొచ్చిన భార్య అతడ్ని లాలనా సాకాలి. అతడు ఒక మాట అన్నా ఒక దెబ్బ, వేసినా సర్దుకు పోవాలి అనే సగటు భారతీయ స్త్రీ పురుషులకూ పితృస్వామ్య వాద భావజాలపు నేపధ్యంలో తీసినట్లు ఉన్నా అలాంటి సంప్రదాయబద్దంగా ఉంటున్నామనుకుంటున్న వారికి పెద్ద గా రుచించని కధ ఇది.
                   భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ అన్యోన్యం అంటే భర్తకి భార్య అన్ని విధాలా సహకరిస్తూ సహాయ పడుతూ అమ్మలా ఇల్లాలిగా పనిమనిషిలా అన్ని పాత్రల్లో ఒదిగిపోవాలి. అందరికంటే ముందు లేవాలి, అందరికంటే ఆలస్యంగా పడుకోవాలి. మన సినిమాలో ఆఫీసులో భర్త అనుకున్నది  జరగలేదు. లండన్ వెళ్ళే ప్రాజెక్ట్ రాలేదు. రావాల్సినంత గుర్తింపు రాలేదు. అతడ్ని అతడు నమ్ముకున్న కంపనీ అతడి ప్రొమోషన్ విషయం లో  మోసం చేసింది. కానీ తప్పుడు సమాచారంతో అనుకున్నది సాధించానన్న ధీమా తో  ఇంటిలో ఒక పెద్ద పార్టీ జరుగుతున్నా సమయమ లో  ఆ అవమానకరమైన వార్త అందుతుంది . అదే సమయంలో అక్కడే ఉన్న తన  పై ఆధికారితో  తాగిన మైకంలో గొడవ పడగా మరీ రసాభాస కాకూడదనే ఆలోచనతో భార్య భర్తను  ప్రక్కకు తీసుకువెళ్ళే ప్రయత్నంచేస్తుంది. జరిగిన అవమానం తో ఉక్రోషంలో విచక్షణ కోల్పోయిన భర్త భార్యను లెంపకాయ కొడతాడు. ఆ ఒక్క చిన్న అనాలో / పెద్ద అనాలో తెలియని సంఘటన కు అప్పటివరకూ అన్ని విధాల సహకరించిన భార్య మనసు విరిగిపోతుంది. తప్పుచేసిన భావనే లేని, పశ్చాత్తాపమనే సంస్కారం లేని కార్పోరేట్  సగటు మధ్య తరగతి భారతీయ భర్త , చదువుకుని భర్త ఆనందమే ధ్యేయంగా బ్రతుకుతూ ఎక్కడో మూల నున్న ఆత్మాభిమానం దెబ్బతిన్న మధ్యతరగతి భార్య ల మధ్య ఈ కధ అనేక మలుపులు తిరిగి విడాకుల దగ్గర ఆగుతుంది. భర్త భార్యను కొట్టొచ్చునా కొట్ట కూడదా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. భర్తేలనే  జీవితంగా భావించే భార్యలు ఇలాంటి విపత్కర భౌతిక దాడులపట్ల (భర్తలు వీటిని అనుకోని సంఘటనలగానూ, యాదృచ్చికంగా జరిగిపోయిన ప్రక్రియగానూ, వొత్తిడి తట్టుకోలేకో, మరెవ్వరి మీదో చూపించలేని ఫ్రస్ట్రేషన్ గానో సమర్ధించుకోవచ్చు.) ఎలా స్పందించాలనేది ఒక చర్చ. చెయ్యి చేసుకోవడం సహజమా అసహజమా,హక్కా  కాదా, లేదా ప్రేమ ప్రకటనలో లో ఒక విపరీత ధోరణి లో భాగమా ( అర్జున్ రెడ్డి లో లా )  అన్నదిమరొక చర్చ. ఎవరు ఎవరిని ఏ సందర్భంలోనైనా భౌతిక పరమైన దాడికి పాల్పడితే అది  క్షమార్హనీయం కాదనేది నిర్వివాదాంశం .  అలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎలా స్పందించాలనేది చర్చ. అతిగా ప్రేమించినప్పుడు , భర్త  ఉద్రేకాన్నో, కోపాన్నో, ఫ్రస్టేషన్ ను అడుపు చేసుకోలేనప్పుడు , లేదా త్రాగి వచ్చి , అనుమానించి వచ్చినప్పుడు, మాట వినకపోయినా ఎదురు తిరిగినా  భార్య మీద చేయి చేసుకోవడాన్ని పితృస్వామ్య వ్యవస్థలో  వివాహ వ్యవస్థలో భాగం గా చేసి చూపే కుట్రను ఎండ గట్టాలనేది ఇక్కడ చర్చ.
         పెళ్లి చేసుకున్నంత మాత్రాన తాళి కట్టి నంత  మాత్రాన , కన్యాదానం చేసినంత మాత్రాన సర్వాధికారాలూ భర్తవే కాబట్టి అతడు చెప్పినట్లు అతడి చెప్పు చేతల్లో ఉండాలనే అమానవీయ అశాస్త్రీయ శాస్త్రాలను వాటి  పూర్వాపరాలను చూడకుండా ప్రశ్నించకుండా  విద్యావంతులైన స్త్రీలు కూడా వీటిని  తూ. చ. తప్పకుండా పాటించడం ఆచరిచడం బాధించే  విషయం. నాన్ బైలబుల్ గృహ హింస లాంటి చట్టాలు అమలులో ఉన్నప్పటికీ కట్నం వేధింపులు, హింసలను అదుపు చేయలేకపోవడాన్ని ఆ సంఖ్య రోజు రోజుకీ పెరుగడాన్నీ  ఎలా చూడాలి. లింగ వివక్ష భారతీయ సమాజంలో అన్ని మత విధానాల్లో నర నరనాల్లో జీర్ణమై ఉండడమే  కాకుండా నిర్లజ్జ గా సమర్ధించే స్త్రీలతో నిండిపోయింది మన సమాజం. అనేక సందర్భాల్లో పితృస్వామ్యానికి కొమ్ముకాసేది స్త్రీలే అనేదానికి బోలెడు ఆధారాలున్నాయి. అందుకే నేటితరం చదువుకున్న అభ్యుదయ ఆలోచనలున్న అమ్మాయిలూ పెళ్ళిళ్ళ విషయమలో అనేక అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. నేటి యువత పెళ్లి తో ప్రమేయం లేకుండా సహజీవనం చేయడాన్నిఈ కోణంలోనే అర్ధం చేసుకోవాలి.  ఇదేదో పాశ్చాత్త సంప్రదాయం కాదు. మన సామాజిక పరివర్తనలో ఒక భాగం. సోషల్ డైనమిక్స్ లో ఒక భకోణం దాన్ని అసహజముగానో నేరంగానో పాపంగానో భావించడం సంస్కారమని పించు కోదు. నేటి కాల మాన పరిస్థితులలో స్వలింగ సహజీవనమే నేరం కాదు. పురాణాల్లోనూ మనకు ఈ సహజీవనం కాన్సెప్ట్ (ద్రౌపది ఐదుగురి భర్తలు,రాధ కృష్ణులు  ) తారాసపడుతుంది. పెళ్ళికి ముందు శృంగారాం తప్పు కాదన్న న్యాయమూర్తుల తీర్పులు కూడా ఉన్నాయి. నేషనల్‌ మహిళా కమీషన్ సమ్మతి కూడా ఉంది.
సహజీవనం తప్పుడు పనిగానో, అనైకతిక కార్యంగానో వారికి అనిపించకపోవడానికి అనేక కారణాలు కనబడతాయి. తమ పై తమకు తప్ప వేరే ఎవ్వరికీ అధికారం లేదనే స్వాభిమానం ఒక ప్రక్క అయితే, తమ జీవితాలను శాశ్వతంగా పరాధీనతలోనికి నెట్టి వేయ బడి  ఆనక పశ్చాత్తాప పడే అవసరం రాకూడదనే ముందు చూపు మరొక ప్రక్క , స్త్రీలు తమను తాము రీ డిస్కవర్ చేసుకోవడం ఇంకొక ప్రక్క వారికి ఏది న్యాయముగా హేతుబద్దంగా సబబుగా అనిపిస్త్యుందో అదే చేయాలనే ద్రుఖ్పధం తో  వారిని ఆ దిశగా నడిపిస్తున్నాయి. అవసరానికొక అబ్బాయి అని అనుకునే దిగాజారుడు తనపు భౌతిక సంబంధం కాదు, సహజీవనం అంటే. మనిషి కి మనిషి తోడూ, అవసరానికి మాట సహాయం, సహజత్వ మానసిక ఉల్లాసం, ఎమోషనల్ గా ఆధారపడడం, నైతికంగా సహకరించడం మరి కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అవసరం కూడా ఈ సహజీవన వ్యవస్థకి బలం చేకూరుస్తుంది.
         రాబోవు కాలం లో మగ పిల్లల తల్లి తండ్రులు వారి బిడ్డలకు లింగ తటస్థత అంటే జెండర్ న్యుట్రాలిటీ గురించి జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం గురించి నేర్పక తప్పని పరిస్థితి ఇది. కట్న కానుకుల విషయంలో అమానవీయంగా ప్రయత్నించినా, కులవివక్షాపూరిత నైజం ప్రదర్శించినా వారు జైళ్ళ కు వెళ్ళడమే కాకుండా ఎంతో పవిత్రత కలదీ అనుకుంటున్నా భారతీయ వివాహ వ్యవస్థ కు కూడా ద్రోహం చేసిన వారౌతారు. పిల్లల పెంపకంలో తల్లి తండ్రులు సమతుల్యత పాటించాల్సిన ఆవశ్యకత కొడుకైనా , కూతురైనా ఒక్కటే అనే పై పై కూతలు కాకుండా కూతుర్లు ఏమి నిర్ణయం తీసుకున్నా  తల్లి తండ్రులు సహృదయత సహకరించి ఆదరించే స్థాయికి ఎదగాలి. తల్లులు “సర్దుకు పొండి” అనే ఊక దంపుడు ఆచారాల నుండీ “నీ కాళ్ళ మీద  మీద నీవు నిలబడు తల్లీ” అని, నీ జీవితాన్ని నీవే కాపాడు అనీ చెప్పగలిగే స్థాయికి రావాలి. భారత్లోని లోని లోపాలను ప్రేమతో సహిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి, కుటుంబ సంక్షేమంకోసం త్యాగానికైనా సిద్ధపదాలి లాంటి సినిమా డైలాగులతో  ఆడ పిల్లల బ్రతుకులను  పురుషాంహకార నరకం కూపంలోనికి లోనికి నేత్తవద్దని విన్నపం.  ఏ తల్లితండ్రులైనా తమ కూతుళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. అని తల్లితండ్రుల సహజ ధర్మము. కానీ, అది కేవల వారు చూసిన సంబంధం ద్వారా జరిగిన వివాహం వలెనే జరగాలనే ఆలోచనను ప్రక్కన పెట్టి కాస్త అభ్యుదయ భావాన్ని కుటుంబానికి జోడిస్తే ఆధునిక సమాజం మరింత బలపడుతుంది.
      కాస్త ముందుకు వెళ్లి అవలోకిస్తే పెళ్లి అనే కట్టుబాటు లేకపోతే ఒకరినొకరు మోసం చేసుకోవడం , వివాహేతర అక్రమ సంబంధాలు , విడాకులు, ఆస్తుల గొడవలు , భరణం,  గృహ హింస, వరకట్నం చావులు అనే సమస్యలతో కూడిన ప్రశ్నలు ఉత్పన్నం కావు. నిజానికి మానవ సంబంధానికి నైతికత ముఖ్యం. అది వివాహం రూపంలో ఉన్నా సహజీవనం రూపంలో ఉన్న ఆదరించాల్సిన అగత్యంలోనికి మన సమాజాన్ని మనమే  నెట్టే స్తున్నాం. సహజీవనం అనే అంశాన్ని ఒక ప్రతికూల దృష్టి తో చూదాల్సినంత చెడ్డది కాదనిపిస్తుంది. భౌతిక , లైంగిక అంశాలకు అనవసర ప్రాముఖ్యత ఇవ్వడమే సహజీవనం పై అపోహలకు దారి తీసింది.  బాధ్యతలను పంచుకోవడం,ఒకరిపట్ల ఒకరికి గౌరవం ప్రదర్శించు కోవడం, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం ప్రధానం. దీనికని మరొక కోణంలో చూస్తూ అనుమానిన్చేవారూ ఉన్నారు. అదే, ఒకవేళ ఒక వ్యక్తితో సహజీవనం చేసిన తర్వాత విడిపోతే ఆమెకు పెళ్లి అవదు కదా? అనే వాదన. నిజానికి ఇది  చాలా ఉపరితలమైనది. పెళ్ళైన జంట స్పర్ధలు వచ్చిన విడిపోతే ఎలాగో, ఇదీ అలాగే అని అర్ధం చేసుకుంటే చాలు, ఏమంటారు?! కొందరికి కాస్త ఎబ్బెట్టుగా, మరికొందరికి కాస్త వెగటుగా ఉండొచ్చు.. ఎలా ఉన్నా  పర్వాలేదు, కాస్త ఆలోచిస్తే చాలు. 
(మరి ఆడపిలలు సంప్రదాయాలు మరిచి హద్దు మీరిపోతున్నారని, వీరి బరితెగుంపు వలన రోజురోజుకు విడాకుల  రేటు పెరిగిపోతున్నాయని , స్త్రీలోని సహనం, ఓర్పు, ప్రేమ, క్షమ క్షీణించిపోతున్నాయిని వాదించేవారి కోసం కాదీ పోస్ట్ )