ఆధునిక మహిళా ! మేలుకో ..
ప్రతీ సంవత్సరం , మార్చ్ 8 వ
తారీఖున ప్రపంచ మహిళా దినోత్సవం
జరుపుకోవడం ఆనవాయితీ. యావత్ ప్రపంచం ఒకరినొకరు అభినందించుకోవడం కూడా పరిపాటే. ప్రపంచ మహిళలు అందరికీ శుభాభినందనలు. "మహిళలు ఎప్పుడో సాధికారత సంపాదించారు, అందులో సందేహం లేదు. కానీ, దానిని అంగీకరించడంలో ప్రపంచం తన వైఖరి
మార్చుకోవాలి.” అంటారు ఒక తత్వవేత్త . పురుష ప్రపంచమే కాదు, స్త్రీ ప్రపంచం కూడా తమ
ఆలోచనా సరళి మార్చుకోవాలని అతడి ఉద్దేశ్యం అయి ఉండవచ్చు. ప్రధానంగా
మహిళలే తమ తత్వాన్ని మార్చుకోవాలి. నేటికీ బారత దేశంలో 49 % ఉన్న మహిళా జనాభాలో
కేవలం 20 % మందికి మాత్రమే సామాజిక, రాజకీయ, ఆర్ధిక, అవగాహన ఉన్నట్లు సర్వేలు
తెలుపుతున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపధ్యం చాలా బలమైనది ,దాని
పూర్వాపరాలు మనందరికీ తెలుసు, వాటి జోలికి పోను. నన్ను, బాధించే విషయం ఏమిటంటే ?
కార్పొరేట్ సంస్థలు ఈ అపురూపమైన దినాన్ని మార్కెట్ వస్తువుగా చేసేసి
వక్రీకరిస్తున్నాయన్న నిజాన్నీ మహిళా సంఘాలూ మహిళలూ విస్మరించడం. ముగ్గులు పోటీలూ,
ఆటల పోటీలూ హోటళ్లలో డిస్కౌంట్లూ,నాలుగు సన్మానాలు, రెండు స్త్రీ ప్రాధాన్యత ఉన్న సినిమాలూ
, సామూహిక సమావేశాలూ ఇవా నేటి ఆధునిక మహిళలు కోరుకుంటున్నవి? ఇదా , ఆధునిక మహిళా చరిత్ర
తిరగ రాస్తుందన్న గురజాడ కలను నిజం చేయడం?
కానీ, నేడు మహిళా దినోత్సవం అంటే ఈ పై వీటిని
ప్రమోట్ చేయడమే అనుకునే స్థాయిలో ఇంకా మనం ఉన్నాం. అంతర్జాతీయ మహిళా ఉ ద్యమ
స్పూర్తి వీటి కోసమా? ఖచ్చితంగా కాదు. విద్యావంతులూ, ఉద్యోగస్తులూ అయిన మహిళలు
కూడా ఈ మూసలో పడి కొట్టుకుపోవడం
చింతించదగ్గ విషయం. నిజానికి వారి సాధికారతకే ముప్పుతెచ్చే మార్గాలు ఇవి. ఆకాశంలో
సగం మేం అని నిలదీసేవారు, అవకాశాల్లో నిరూపించుకున్నవారూ
ఉన్నారు. నిజానికి వాస్తవమేమిటంటే ఏ కొద్ది మందో తప్ప మహిళల హక్కుల కోసం , రాజ్యాంగంలో ఉన్న మహిళా అంశాల గురించి , హిందూ కోడ్ బిల్లు
మీద,సామాన్య హక్కుల మీద అవగాహన ఉన్న
మహిళలు ఎందరు? వీటి గురించి ఆలోచించనీయకుండా మభ్య పెట్టి ఆటల పాటల పోటీలు పెట్టి
వారిని చీకట్లో ఉంచడం కార్పొరేట్ పితృస్వామ్య
వ్యవస్థ యొక్క లక్ష్యం.
అనుకున్న స్థాయిలో మహిళలు
సామాజిక ఉద్యమాల్లోకి ఎందుకు రాలేక పోతున్నారు? ఎంతో కొంత రాజకీయాల్లోకి ప్రవేశించినా వాళ్ళు మొగుడు చాటు
నాయకురాళ్ళుగానే ఎందుకు మిగిలి పోతున్నారు? దేశ భవిష్యత్ పట్ల వారి పాత్రం ఎంత విస్తృతమైనదో, ఎంత విలువైనదో
చరిత్ర చెపుతుంది. నేటి దేశ ఈ స్థితికి లేదా దుస్థితి కారాణాలను విచారించాల్సిన
అవసరం లేదా? సంవత్సరానికి ఒక రోజు వేడుకగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
కుంచింప చేయడం హర్షణీయమేనా?
మహిళలను సామాజిక
జవాబుదారులుగా , విజిల్ బ్లోయర్స్ గా ,
ప్రశ్నించేవారిగా ,నిలదీసేవారిగా రానివ్వకుండా ఉన్న అడ్డంకులేమిటి? లింగ వివక్ష
పూరిత పదవులు,పురుషాధిక్యత, ఇంటి బాధ్యతలు ప్రధాన కారణాలుగా కనబడతాయి. గమ్మత్తు
ఏమిటంటే ? భార్యాలకు మత పరమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే అవకాశం ఇచ్చే
పురుషులు సామాజిక కార్యక్రమాల దగ్గరకు వచ్చేసరికి ఆంక్షలు పెడతారు. ఇదే
పితృస్వామ్య వ్యవస్థ యొక్క రహస్యం. మతం నోములూ , వ్రతాలూ, పూజలు గురించి వల్లిస్తాయి తప్ప
హక్కులు గురించి మాట్లాడవుగా?. మాట్లాడినా, అవి పితృస్వామ్యాన్ని బలపరిచేవిగా
ఉంటాయనేది సత్యం. మతం పని ప్రధానంగా కులాన్ని చాప కింద నీరులా ప్రవహింప చేయడం.
సమాజంలోని అసమానతలను ప్రశ్నించ నీయకుండా నిలువరించడం. ఎందుకంటే మన దేశంలో కులం లేని మతం లేదు. కులం ఒక్కటే స్త్రీ
స్వేచ్చకు, స్త్రీ పురుషుల మధ్య వివక్షకూ, స్త్రీల మధ్య అసమానత్వానికే కనిపించని కంచె అంటే వొప్పుకోక పోవచ్చు.
మేధావులనుకునే స్త్రీలు, విధ్యాధికులైన స్త్రీలూ, ఉద్యోగస్టులైన స్త్రీలూ తోటి
స్త్రీలపై కుల వివక్ష చూపడం అంటే కాదు తోటి పురుష సహ ఉద్యోగులపైన , స్నేహితులపైన కుల వివక్ష చూపడం
నాతో సహా, చాలా మందికి అనుభవమే. ఈ కుచ్చిత మననస్తత్వం తో స్త్రీలందరూ కలికట్టుగా ఏకమై ఉద్యమించే
అవకాశాన్ని కోల్పోతున్నారన్న స్పృహ వారికి కలగక పోవడం విచారకరం. అలాగే అందరి
స్త్రీల సమస్యలూ ఒక్కటిగా లేకపోవడం వారి అనైక్యతకు మరొక కారణం. అగ్రవర్ణాల
స్త్రీలు, నిమ్న వర్ణాల స్త్రీలను చులకన చేయడం ,వివక్షతో వ్యవహరించడం వలనే, ఇకియట లోపించడం
వలనే ఇలాంటి మహిళా దినోత్సవాలలో కింది
కులాల స్త్రీ ఉద్యోగస్తులకూ పాత్ర లేకపోవదానికీ
కారణం. చివరికి పితృస్వామ్యం చేతిలో కుడిటిలో పడ్డ ఎలకల్లా కొట్టుకుంటున్నారు, ఆధునిక
మహిళలు. ఈ ఒక్క రోజే కదా మనది, ఎంజాయ్ చేద్దాం అనే మనస్తత్వాన్ని మహిళా సమాజానికి పితృస్వామ్య
అలవాటు చేసేసింది.
స్త్రీలను వారి హక్కుల గురించి,
సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యం గురించి, అడిగినప్పుడు 60%మంది స్త్రీలు కుటుంబ వ్యవహాల్లో బిజీ అనీ, మమ్మల్ని ఎవ్వరూ
ఆడగలేదనీ, మా వల్ల కాదనీ సమాధాన మిచ్చారు.20% మంది స్త్రీలు సమాజం కోసం మాకు సమయం లేదనీ, 16% మంది సమాజం పట్ల ఆసక్తి లేదనీ సమాధాన్యమిచ్చారట. ఇది అవగాహనా
రాహిత్యమా?, భాధ్యతారాహిత్యమా? సమాజంలోని మార్పులతో , చేర్పులతో, పాలకులు విధిస్తున్న
ఆక్షల పట్ల స్పందించాల్సిన అవసరం లేదా ? నేదు
యావద్దేశం ప్రైవెటైజేషన్ అవుటన్న నేపధ్యంలో
వారి భవిష్యత్ ప్రశ్నార్ధమవుతున్న విషయాన్ని వారు గ్రహించక పోవడం బాధాకరం. స్త్రీలు
ప్రకృతి పరంగా స్వతః గా మంచి పరిపాలనా
నైపుణ్యం కలవారు. వర్కింగ్ విమెన్ , మహిళా
పారిశ్రామికవేత్తలూ అనేక సందర్భాలలో ఈ విషయాన్ని నిరూపించారు. వారికి తగిన
అవకాశాలనూ ,సానుకూల వాతావరణాన్ని అందిస్తే
చాలు, వారు దూసుకు పొగలరు. ఎందరో మహిళా నేతలనూ , ముఖ్య మంత్రులనూ ప్రధాన మంత్రులను వారి పరిపాలనా దక్షత ను మనం
చూశాం. చరిత్రలో లేని అవకాశాలను అంది పుచ్చుకుని అగ్రవర్ణ మహిళలకు ధీటుగా సావిత్రి
భాయి ఫూలే, ఫాతిమా షేక్, తారాభాయి షిండే, ఝలకారిభాయి విలక్షణమైన సామాజిక ఉద్యమాలకు
ఊపిరిపోశారు. పొరపు పొరలుగా ఉన్న కుల వ్యత్యాసాలూ, లింగ వ్యత్యాసాలను చీల్చుకుని
రావాల్సిన అవసరాన్ని వారు చాటారు. భారత దేశ స్త్రీ వాద ఉద్యమాలు అనుకున్న స్థాయిలో రాణించకపోవడానికి
కారణం ఏమిటి? నాయకత్వం అగ్రవర్నాలా వారి చేతిలో ఉండ డం , కింది స్థాయి వారికి అవకాశాలు ఇవ్వకపోవడం, ఒక కారణం
అయితే, దళిత స్త్రీలు అనుభవిస్తున్న మూడు రకాల వివక్ష మరొక కారణం. అగ్ర వర్ణ పురుషుని
చేతిలో దళిత మహిళ ఎలాంటి మానుశాలకు బలవుతుందో
చూశాం, సాటి అగ్ర వర్ణ మహిళలు తోటి మహిళయినా దళిత మహిళా పట్ల వివక్ష చూపడం చూస్తున్నాం,
అంతే కాకుండా దళిత మహిళ తన సమాజంలో పురుషాఅహంకార వివక్ష ఎదుర్కోవదమూ చూస్తున్నాం.
చివరికి స్త్రీ వాదం అంటే మధ్య తరగతి
అగ్రవర్ణాల వారికి స్త్రీవాదం ఒక ఆట విడుపు అనే వాదన కూడా లేకపోలేదు. స్త్రీలు అధిక
సంఖ్యలో సమాజిక కార్యకర్తలుగా రావాలంటే
ఏమి చేయాలి? స్త్రీకి స్త్రీ సానుభూతిపరురాలుగా పరివర్తన చెండాలి. (లక్ష్మీం పేటలో
దళిత స్త్రీల పై మానభంగం జరిగినప్పుడు స ఉన్నత కులాల స్త్రీలు గా భావిస్తున్న స్త్రీలే
వాళ్ళ భర్తలకు అ పని చేయడానికి సహకరించారన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు._) .
పురుషులు స్త్రీలను
స్త్రీలగా కాకుండా వ్యక్తిత్వం గల వ్యక్తులుగా చూడగలగాలి, లింగ తటస్థ భాషను
ప్రోత్సహించాలి. పితృస్వామ్య భావజాలాన్ని త్యజించి లింగ సమానతను అలవాటు
చేసుకోవాలి. సభల్లో సమావేశాలలో స్త్రీలకు తగిన ప్రాతినిధ్యన్ని ఇవ్వాలి, వారికి
మాట్లాడే అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలి, అవసరమైనాపుడు అందరూ అన్నీ పనులనూ
సమానంగా పంచుకోగలగాలి. వారి వ్యక్తపరుస్తున్న భిన్నాభిప్రాయాలను గౌరవించాలి,
వారికి తగిన రక్షణ,భద్రత కలిగించినట్లు అయితే వారు ఉద్యమాల్లో భాగస్వామయులవడానికి
ముందుకు వస్తారు. ఇవి ఇంతా బయటా కూడా పురుషులకు వర్తిస్తాయి. గౌరవప్రదమైన
సురక్షితమైన అందరమూ సమానమే అనే వాతావరణాన్ని సృష్టించాలి . వారి సామర్ధ్యాలను చులకన
చేయక ఆ మేరకు అవకాశాలను ఇవ్వాలి. అన్నీ
సానుకూలగా ఉంటే స్త్రీలకు ఏ సమస్యే లేదు. కానీ,నేటి పరిస్తుతుల్లో ఏ అంశమూ వారికి
సానుకూలంగా లేదు. రాజకీయాల్లో 33% రాయితీలు లేవు. దామాషా ప్రకారం వారి
ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. అత్యాచారాలకు ముఖ్యంగా దళిత మహిళలపై హద్దు లేకుండా
కొనసాగుతున్నాయి. మరి ఇతర స్త్రీలు ఈ విషయాలపై స్పందించక పోవడానికి కారణం ఏమిటి?
,కనీసం సామాజిక మాధ్యమాల్లో ఖండించక పోవడానికి కారణం ఏమిటి? ,మన కులం స్త్రీలపై
మానభంగాలు జరగవులే అనే స్వార్ధపు ఆలోచనాలా? స్త్రీల ఆలోచన ధోరణిలో మార్పు రానంత వరకూ ,వారి హక్కులు ఏమిటో వారు తెలుసుకోనంత
కాలమూ , వర్గ వర్ణ భేదాలను త్యజించనంత కాలమూ జాతీయ అయినా అంతర్జాతీయ అయినా ఈ మహిళా
దినోత్సవ వేడుకలు పోటీలతో, బహుమతులతో, సన్మానాలతో ,లంచ్ లతో తూ తూ మంత్రపు వేడుకలుగానే కొనసాగుతాయి.
డాక్టోర మాటూరి శ్రీనివాస్