A renowned poet, writer, transalator and a social activist. A doctor (pulmonologist) by profession.
Monday, 7 February 2022
రమాబాయి - అంబేద్కర్ విజయ రహస్యం
@అంబేద్కర్ విజయరహస్యం -
రమాబాయి అంబేద్కర్ @
ఫిబ్రవరి 7, (1897-1935) రమాబాయి అంబేద్కర్ 125 జన్మ దినం సందర్భంగా..
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
“నా జీవితంలో నేను నిన్ను కలిసి ఉండకపోయినట్లు అయితే? నా జీవితం ఏమైపోయి ఉండేదో?? నా జీవన సంగీతం శృతి తప్పిన రాగమై ఉండేది. నా బ్రతుకంతా తల క్రిందులై ఉండేది. ఎంతో వేదనాభరితమై ఉండేది. నేనొక మరుగుజ్జు వృక్షములా నిలిచి పోయి ఉండేవాడని...” ఈ మాటలన్నది ఎవరో కాదు డాక్టర్ భీమారావు రాంజీ అంబేద్కర్. తన జీవిత భాగస్వామి రమాబాయి గురించి రాసిన మాటలివి . 1930లో లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళే ముందు తన జీవిత భాగస్వామి రమాబాయికి రాసిన ఉత్తరం ఏంటో ప్రాచుర్యం పొందింది . అందులో అతడు ఎంతో కీలకమైన తన మనోభావాలను వ్యక్తపరచడమే కాకుండా రమాబాయి వ్యక్తిత్వాన్ని విలక్షణ సంస్కారాన్నీ కూడా ఆవిష్కరిస్తాయి. రమాబాయి అంబేద్కర్ గారి జీవితంలో పోషించిన అతి సున్నితమైన, అత్యంత కీలకమైన భూమిక గుర్తు చేసుకుంటూ తను భారతరాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన ప్రస్థానంలో ఆమె పాత్రను శ్లాఘిస్తూ తన విధేయతను ప్రకటిస్తారు. నిజనికి అది ప్రతీ ఒక్కరో అందరూ చదవాల్సిన ఒక సుదీర్ఘమైన ప్రేమలేఖ. అంబేద్కర్ తన భార్యను ఎంత ప్రేమించారో , ఎంతగా గౌరవించారో, ఎంత అభిమానించారో ఆమెకు తన జీవితంలో ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారో ఆ లేఖ తెలుపుతుంది. అంతకంటే ముఖ్యంగా ఆమె గుణసీలతనూ, సంయమనాన్నీ , సహనాన్నీ , త్యాగాన్నీ, విశాల మనస్తత్వాన్నే వివరిస్తుంది. రమాబాయి భర్తను గౌరవంగా “సాహెబ్” అని, అతడు ఆమెను ప్రేమగా “రామూ” పిలుచుకునేవారు.
డాబోల్ హార్బర్లో (మహారాష్ట్ర ,రత్నగిరి లో ఒక చిన్న వాడరేవు) బుట్టల్లో చేపలు మోసే కూలీ గా జీవిస్తున్న భీకూ ధోత్రేకూ,రుక్మిణి కీ ఫెబ్రవరి 7,1898లో జన్మించిన రెండవ సంతానం,రమాబాయి. ఆమెకు గోరాబాయి, మీరాబాయి, శంకర్ తోబుట్టువులు. డాబోల్ దగ్గరలోనే మహాపుర లో చిన్న గుడిసెలో నివాసం. చిన్నతనంలోనే తల్లితండ్రులిద్దరినీ కోల్పోయి తన తోబుట్టువులతో సహా ముంబై బైకుల్లా ప్రాంతంలో తన మేనమామ గోవింద పుర్కార్ ఇంట పెరిగారు. ముక్కుపచ్చలారని 9వ ఏటే బాబాసాహెబ్ (14సంవత్సరాల వయసు) తో బైకుల్లా చేపల బజారులో 1906 వివాహం జరిగిపోయింది. అక్కడ నుండీ ఒక పసి బాలిక ఒక మహోన్నత వ్యక్తిత్వానికి ఆసరాగా,వెన్నుదన్నుగా ఒక సంపూర్ణ భాగస్వామిగా ఎదిగిన తీరు ప్రశంసనీయం . బహుసా ఒక భారతీయ స్త్రీగా,గృహిణి గా జీవితంలో ఎవరూ చూడడాన్ని కష్టాలను చవి చూసిన రమాబాయి ఎన్నో త్యాగాలకు ప్రతిరూపంగా నిలిచారు. ఆమె జీవితాన్ని స్పృసిస్తే ఉదాత్తత, నిరంతర శ్రమ వ్యక్తి జీవిత సాఫల్యానికి రెండు ముఖ్యమైన పార్శ్వాలుగా తోస్తాయి. 20శతాబ్దపు అత్యుత్తమ మేధస్సుగా కొలవబడే అంబేద్కర్ వెనుక ఉన్న నిశ్శబ్ద ప్రేరణా శక్తి కీ , అకుంఠిత స్పూర్తీ కీ చిహ్నంగా రమాబాయి నిలుస్తారు. సాధారణ దళిత గృహిణి కి మించి వెయ్యి రెట్లు సాహసోపేత జీవితాన్ని ఆమె గడిపారు. ఓర్పుకూ, సహనానికీ, అణుకువకూ చిరునామా రమాబాయి. ఆమె జీవిత పోరాటం చిన్నతనంలో తల్లితండ్రులను కోల్పోవటంతోనే ఆరంభమయ్యింది. అంటరాని తనం ఒకప్రక్క , కటిక దారుద్ర్యం మరొక ప్రక్కా ఆమె జీవితాన్ని మరింత జటిలం చేసాయి. అంబేద్కర్ విదేశాల్లో స్పాన్సర్ల ఆర్ధిక సహకారంతో, స్కాలర్ షిప్ మీద చదువుతున్న రోజుల్లో ఇక్కడ ఇంటిలో పిల్లలకు రెండు పూటలా కడుపునిండా ఆహారం అందించలేని దుస్థితి అమెది. పిల్లలను అర్ధాకలితొ నిద్రపుచ్చి, నీళ్ళు త్రాగి నిద్రపోయిన రాత్రులెన్నోఆమె జీవితంలో . వీధిలలో తిరిగి ఆవు పేడ ఎత్తుకుని వచ్చి పిడకలను చేసి అమ్మిన డబ్బులతో ఇంటిని నడిపిన అభిమానవంతురాలు రమాబాయి. ఆమె ఇచ్చిన నైతిక బలం, ఆమె చూపిన సహనం, దృఢ సంకల్పం బాబాసాహెబ్ ఉన్నత శిఖరాలకూ విజయపరంపరలకూ లకు మూల స్తంభాలుగా నిలిచాయి. ఆమె అంతటి పేదరికములోను కూడా విదేశాలలో చదువుకుంటున్న అంబేద్కర్‌కు ఏ లోటూ రానీయలేదు, ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. ఆమె మౌనమే అతనికి ప్రోత్సాహమై నిలిచింది. ఆమె నిశ్శబ్ద కన్నీళ్ళు అతన్ని మరింత దృఢ నిశ్చయునిగా మార్చాయి. ఎందఱో బంధువులు అంబేద్కర్‌ను ఉన్నత చదువులకు వెళ్ళనీయకుండా ఆపడానికి ఆమెద్వారా ప్రయత్నించినా ఆమె పట్టుదలా సహనం ముందు వారి ఆటలు సాగలేదు. అంబేద్కర్ సాధించిన విలువైన డిగ్రీలూ , జ్ఞాన సంపద ఆయన ఆశయ సాధన, భావి బహుజన సామాజిక విప్లవానికీ ఎంత అవసరమో ఆమె బాగా తెలుసు. అందుకే అతని విద్యకు ,అతని ఏకాగ్రతకూ ఎలాంటి విఘాతము కలుగనీయ కుండా అన్ని కష్టాలనూ ఆమె మౌనంగా స్వీకరించింది. అంబేద్కర్ అనే శిఖరం వోరిగిపోకుండా ఒక కీలకబిందువై నిలిచింది, పీడిత వర్గాల నావ మునిగిపోకుండా లంగరులా కాపాడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సందర్భాలలో నిస్సంకోచంగా ఆమె అందించిన స్పూర్తినీ ,సేవలనూ, త్యాగనిరతిని నైత్యిక స్థైర్యాన్నీ బహిరంగంగానే కొనియాడారు. వీరిద్దరి మధ్యా విద్యాపరమైన, జ్ఞానపరమైన ,ఆలోచనాపరమైన ఎన్ని అంతరాలు ఉన్నా అంబేద్కర్ లోని కుటుంబపరమైన సంశయాలను నివృత్తి చేయడంలోనూ భయాలు పారద్రోలడంలోనూ, అతనికి అన్ని విధాలుగానూ ప్రోత్సహించడంలోనూ అందించిన ఆమె సహకారానికి మచ్చుతునక డాక్టర్ అంబేద్కర్ సాధించిన విజయాలే.
రమాబాయి తల్లిగా అనుభవించిన క్షోభ వర్ణనాతీతము. వారిద్దరికీ ఐదుగురు సంతానము. వరుసగా గంగాధర్ , యశ్వంత్, రమేష్ ,కుమార్తె ఇందూ ,ఆఖరివాడు రాజారత్నం . ఎంత మమకారంగా పెంచుకుందామనుకున్నా కూతురు ఇందూతో సహా నలుగురి బిడ్డలూ అనారోగ్యంతో పౌష్టికాహార లోపంతో మరణించారనంటే నమ్మశక్యంగా ఉండదు, కానీ వాస్తవమదే . పిల్లలను పేదరికం నుండీ కాపాడుకోవడానికి రమాబాయి చేయని సాహసం లేదు. బ్రతికున్నఒక్కగానొక్క సంతానము యశ్వంత్ మాత్రం. అతడే అంబేద్కర్ తరపున మిగిలిన వారసుడు. ఆకలి అలసిపోయిన ఆరోగ్యం, కన్న వారిని కోల్పోయిన నైరాశ్యం ఎంత కాలం సహకరిస్తుంది. కష్టాలు తీరి ఆర్ధికంగా పుంజుకునే సమయాని రమాబాయి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆరునెలలు తీవ్ర అనారోగ్యాన్ని అనుభవించి మార్చ్ 27,1935 న ఆ మహా త్యాగ మూర్తి తన తనువు చాలించారు.
“నన్ను సాగానపడానికి నౌక దగ్గరకు వచ్చావు. నీ భావోద్వేగాన్ని అర్ధం చేసుకోగలిగాను. నీ పెదవులు కంపించాయి కానీ, నీ గొంతు పెగల లేదు. నీ కళ్ళే మాటలకు మించిన భావాలను ప్రదర్శిస్తూ మౌనంగా మిగిలిపోయాయి. ఆ క్షణం కన్నీళ్ళే భాషగా నిన్ను ఆదు కున్నాయి..”అన్న డాక్టర్ అంబేద్కర్ మాటలు రమాబాయి హృదయం ఎంత లోతైనదో , ఆమె మనసు ఎంత విశాల మైందో తెలియచేస్తుంది. రమాబాయి యొక్క సహ్రుదయతకూ, ఔదార్యానికీ, నైతిక స్వచ్ఛతకూ, కష్టాలను అనుభవించిన ఆమె ధీరోదాత్తతకూ, అతనితో కలిసి బాధలను అనుభవించడానికి ఆమె చూపిన సంసిద్దతకూ కృతజ్ఞతగా ”పాకిస్తాన్ ఆర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా “ 1940 రాసిన (వాల్యుం 😎 అనే గ్రంధాన్ని రమాబాయి అంకితం చేసి తన ప్రేమ చాటుకున్నారు అంబేద్కర్ .
అటువంటి మహోన్నత స్త్రీ మూర్తికి నివాళి
Subscribe to:
Comments (Atom)