చుండూరు
చుండూరు నేటికీ పచ్చి పుండూరు
ఎండిన రక్తపు చారల ఆక్రందనల ఆనవాళ్ళు
మసిబారిన మానవత్వపు నిర్వికార నీడలు
కాటేసిన కంచెలే కులపు పెట్టు బడులుగా
మేసేసినాయి , చేనుల తలరాతలు .
పంచె కాలు కదపలేదు , పంచె కట్టు జారలేదు
అందరమూ వైష్ణవంలమే బుట్టలో రొయ్యలన్ని ఎటు మాయమయ్యి పోయాయి
గండ్రాగొడ్డళ్ళు గాల్లో తేలుకుంటూ గొంతుల్లో దిగబడగా
కులం కోర్టు రూపములో తెగిన తలలను వేలం లో కొనుక్కుంది
కళ్ళు లేని న్యాయ దేవత చెవులను కులానికి అమ్మేసుకుంది
దేవీ దేవతలందరూ కులానికి దాసోహలే
పోయినోళ్ళ లోటు తీర్చలేనిదంటూ న్యాయమూర్తులు తీర్పు
పోగొట్టినోల్లను రక్షించుకోవడం లో వీళ్ళకు వీళ్ళే నేర్పు
వోట్ల కాలము అయినా, ఒక్కడు నోరెత్తితే ఒట్టు
సీట్ల పేకగాళ్ళు ,చమ్చానాకేటోళ్ళు
నోట్లతో మాట్లాడేటోళ్ళు, కులపుతోలు కప్పుకున్న రాజకీయ తోడేళ్ళు
గెలిచినా ,వోడినా డబ్బు కంపు కొట్టే టో ళ్ళు
న్యాయపోరు చేద్దామంటే నకరాలు పోయేటోళ్ళు .
చేయి చేయి కలుపుదాము సురకత్తుల వోట్ల ను
కులము కుత్తుకల్లో దింపు దాము ,
అడుగు అడుగు ముందుకేస్తూ బహుజనాన్ని మేల్కొలుపుతూ
కుల ము హద్దులు చెరుపుదాము .
కులము బలముతో బలిసినో ళ్ళను,బలాదూర్లను
నిర్భయముగా నిరసిద్దాము ,నిర్ణేతలుగా నిలుద్దాము .
డా .మాటూరి శ్రీనివాస్