మిత్రమా! గౌరవించు
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
మిత్రమా! ఒక్కసారి దళితుడిగా పుట్టరాదా
నీకూ నా భాధ భోధ పడుతుందంటే అంత ఉలిక్కి పడ్డావేం ?
ఎన్ని ఏళ్ళు గా పుడుతూ చస్తూ బ్రతుకుతున్నామో
నీకెలా అర్థం అయ్యేలా చెప్పాలి?
వెలివాడల్లో, మలి నీడల్లో
ఎలా మ్రగ్గి పోయి ముడతలు పడిపోయామో
మీ ముత్తాతల నాగళ్ళకు వేలాడిన మా ముత్తాతల ప్రేగులు
సాక్షిగా నీవు తెలుసుకుని తీరాల్సిందే.
అలుపెరుగని ఆత్మగౌరవ పోరాటం నాది,
ఆత్మ వంచనతో ఆధిపత్యపు ఆరాటం నీది.
కళల కాణాచినై ప్రకృతి పంచిన ప్రతిభ నాదైతే ,
దారపు పోగుల ద్విజ అహంకార పరిజ్ఞానం నీది కాదా ?.
జంట పక్షులు అప్పుడే కలసి అప్పుడే విడిపోతాయి,
మనం విడి విడిగా కల్సి ఉన్నట్లు నటిస్తూ
కలి విడిగా బ్రతుకుతున్న ఊష్ట్రపక్షులం కాదా ?,
నీకు తెలుసు , గర్వం గా తలెత్తుకుతిరిగే సింధు చరిత్ర నాదని,
పురాణాలే చరిత్రంటూ సిగ్గుపడాల్సిన ఆర్య నీతి నీదని ,
అయినా , చరిత్రని వ్రాయాల్సింది పులులు గానీ , వేటగాడు కాదుగా.
నీటిలోని రాయి ని పట్టిన నాచు లా ఉపరితలాన పచ్చగా వుంటూనే
పల్టీలు కొట్టించే సంస్కృతి ని తరగని ఆస్తిగా కూడగట్టుకున్నావ్ .
శoభూకుడు, ఏకలవ్యుడు, బలి , కోటేసులు
నీకు నిద్రలేని రాత్రుల్లతో పాటూ , పగటి కలలకు కళ్ళాలు వేయలేదా?
పురుషుడుకు పుట్టినోళ్ళు, పైగా శాస్త్రాలు తెలిసినోళ్ళు
మాలాగ పుట్టక్కరలేదులే గానీ,
తల్లికి పుట్టినోళ్ళను గా మమ్మల్ని గౌరవించు చాలు, సెలవు.
12-06-14