Saturday, 10 January 2015

ఆకాశం


ఆకాశం
                                                        డాక్టర్ మాటూరి శ్రీనివాస్   

నా హృదయం ఆకాశమైతే  ఎంత బాగుణ్ణు ?
నిండుగా, ఆద్యంతం విశాలమై ,కుశల కాంతులీనుతూ
 లోతుగా  స్వీకరిస్తూ  ఆదరిస్తూ
  శూన్యమై నిర్వికార భావజల గానమై
భేషరతుల సమూహాన్నై ,
సృష్టి ని అను నిత్యం తిలకిస్తూ ,పులకిస్తూ అనుభవిస్తూ.
       
 దూరాన పుడమి వొడిలో వోదిగిపోతున్నఆకాశం  
 లోలోన హృదయాంతరాల స్వాంతనలో ఇమిడి పోతూ నేను .

ఉషః కాంతుల ఎర్రదనం  ఉల్లాసపు  వింత మెరుపు
కనుముల్లోంచి, కనుబోమల  నడుముల్లోంచి  సింధూర సూర్య తిలకం
అందిస్తున్న జీవన వెలుగు,జిలుగుల ప్రాణ కిరాణాల్ను  ఆస్వాదిస్తూ ఆకాశం  
చీకటి కలలను  నెట్టి అభ్యుదయ అలల ఈదుకుంటూ

నేను,నా హృదయం.... 

  
జట్లు విడితూ ,కడుతూ  ,
పోటీ పడి తూ  ‘’డీ’’ కొంటూ గర్జించినా -
చల్లగా జారుకున్నా, మెల్లగా చేరుకున్నా మళ్ళీ
స్రవించి, ద్రవించి అనునయించడం ఆకాశానికే  సాధ్యం కదా!
సంఘర్షణలతో సతమతమైనా
సహనము కోల్పోయి హుదుద్ లా భీభత్స రాగాన్ని ఆశ్రయించినా
ఆత్మీయ అలంబనతో అలవోకగా వర్షించినా
కారుమబ్బులా  డీలాపడి నిస్పృహతో రోదించినా 
వెండిలా తళ తళ లాడుతూ ఉత్సాహాన్ని మరిపించినా
అచ్చం నీలాగే ! నేనూ,-నాలాగే నీవూ .

 నా వెచ్చని రుధిర హృదయం  
మరి ఆకాశం కాక మరేంటి?
 ----------------------- 













నిశబ్దం


                           నిశ్శబ్దం
                                                 డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                 11-12-14

మనసు తెలిసిన దానిలా , మాట్లాడడం ,మాట్లాడించడం -,
ఏడవడం, ఏడిపించడం ,నెల బాలుడిలా  -
కరగడం, కరిగించడం గ్రీష్మ హిమ సమూహంలా-
 స్రవించడం, స్రవింప చేయడం, స్పందించడం
హృదయవిదారకంగా విలపించడం
రుషి లా ధ్యానాన్ని ఆశ్రయించడం, ఆధ్యాత్మికతను అనుభవించడం
అలుపెరుగని  నిశ్శబ్దానికన్నీ తెలుసు.


 
మనసుగాయాన్ని మరామత్తు చేసుకుంటూ
కసురుమాటల్ని జీర్ణించేసుకుంటూ
విసురు మాటల ముసురు గాలుల్ని కసిరి  కాటేయడం
సుద్దు బుద్దుల నేర్చిన
నాగరిక నిశ్శబ్దానికి  బాగా తెలుసు.


 
ఒక నియంత్రణ లేని నియంత    
 ఒక నిలకడలేని ప్రజాస్వామ్యం
నిర్వీర్య నిరాశావాదం, అంగీకారం,చోద్యం-
 వేయిగొంతుల నిరసనోద్యమం –
కోటి అర్దాల నిఘంటువు నిశ్శబ్దం .

పోరాడడం,సాధించడం, సంస్కరిచుకోవడం
తెలిసిన మేధో పరిష్కార మార్గం  -నిశ్శబ్దం.


ఒక ఉత్పాత హెచ్చరిక , ఒక నేస్తం, ఒక శత్రువు.
ఒక అగాధం, ఒక ఆకాశం , ఒక సందేశం
దాని శబ్ద తీవ్రత అనుభవించ లేనంత అనంతం
వైరాగ్యపు కాలుష్యం ఆకళించుకోలేనంత వైషమ్యం .
అట్టుడికించడం ,ఆకట్టుకోవడంతో బాటూ
అన్నీ తెలిసిన నిశ్శబ్దానికి - అలుసూ ఎక్కువే. 
తననుతనను  ఎంతగా  ఆస్వాదించడం  తెలిసినా ,
 నియంత్రించుకోవడం  నిష్ణాతురాలైనా  .
తానొక అహంకారిఅని  అస్సలే తెలీదు,
అదొక ప్రతీకార పరాకాష్ట అని ఎప్పుడు తెలుసుకుంటుందో?