Monday, 27 April 2015

పెన్ను

పెన్ను

అడగకుండానే నాన్న కొనిచ్చిన ఫౌంటేన్ను పెన్ను,
నా చేతిలో వొదిగపోయి హత్తుకుంది, నన్ను ఆప్యాయంగా .

ఆశయ సౌధాల పునాదై నిలిచినా వెన్ను దన్ను ,

నాన్న కొనిచ్చిన పెన్ను.
సిరా నింపుకుని ,పాళీని నొక్కి ఇంకు లో
ముంచుకుని  పేపర్ పై తేలుతూ
పరుగులెడుతూ ఉంటే ,
కొత్తగా టోక్యో- నగోయల మధ్య
పరిగెడుతున్న మాగ్లేస్ రైలును తలపించేది.

స్టేషన్లో ఆగినట్టే ఆగి,  పేరా పేరా కి  మరింత
వేగంగా సమాధానాల అక్షరాలను ఆకాశంలో
నక్షత్రాల్లా పొందికగా అద్దేది .
ఎన్ని తరగతుల మజిలీలను దాటేందుకు
 ఎంత గా సహకరిచిందనీ, ఈ పెన్ను.
పాసైన ప్రతీసారీ దాన్ని కళ్ళ కద్దుకుంటూ
 అమ్మని ముద్దాడి నంతగా  మురిసిపోయేవాడిని.
ఎక్కడికెళ్ళినా  కవచ కుండలంలా అది నాతోనే, నాలోనే.
గుర్తుకొచ్చినప్పుడల్లా ,గుర్తుకు రానప్పుడల్లా
 నా కళ్ళు ,నా చేయి ఎప్పుడూ దాన్ని తడుముతూనే ఉండేవి.
నాన్న స్పర్శలా  వెచ్చగా తగిలేది. ఎంత ధైర్యం గా ఉండేదో?
నాన్న అంతిమ సంస్కారాల ఆనక, లెక్క లకోసమని
తీసుకుని జేబులో పెట్టుకుపోయాడు, కేటరింగ్ వాడు.
తిరిగి అడగాలనిపించలేదు.
మరి ,ఇప్పుడు , ఎప్పుడు పెన్నుని తాకినా  
నాన్నతో మాట్లాడి నట్టుంటుంది,
పెన్నే నాన్నై నన్ను నడిపిస్తున్నట్టు ఉంటుంది .
                                                                         డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                                                         22-04-15


వలస

       వలస

ఆకలి రుచికి చిరునామాలవి,
అవమానాలే నరాల్లా  సాగుతున్నప్రాణాలవి  ,
పుట్టి పెరిగిన ఊరే ,
కార్పొరేట్ కాల సర్పమై ఉరి కౌగిలి  బిగిస్తుంటే  ,
పొలం ,పుట్రా వదిలి మెతుకు వేటలో  -
చంకలో పాపడు  ,నెత్తిన మూటడు  
ఆచ్చాదన లేని శరీర భాగలై అతుక్కున్న జీవచ్చవ యాత్ర - 
అందనంత   దూరానున్న బతుకు మజిలీ కోసం.
బండెక్కో,బస్సెక్కో, రైలేక్కో, పడవెక్కో
అనంతం లోనికి పరుగుల పందెం.
మృత్యువు వోడి లోనికి వలస ప్రయాణం.
                                       
                                                                                             డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                                       20-04-15.