Saturday, 26 October 2019

వాణీ

వాణీ!
vsgh అనుభవయుక్త బాణీ
వాణీ !
సకల కళా సౌశీల్య సమన్వయ వేణి

కళ్లలో కళ్ళు పెట్టి
లూూపును ఒడుపు గా పట్టి
తీ క్షణ చూపును ఎక్కుపెట్టి
దృష్టిని ప్రసాదించు వెలుగుల రాణి
అజరామరం నీ ధోరణి

చుక్కలు చుక్కలుగా
చుక్కలమందును వేసి
చక్కని నయనాలను చుక్కలతో ముంచి
పగటి చుక్కల్ని మరపించి
చక్కగా కబుర్లెన్నో పంచి
అచ్చంగా కటకాలను అమర్చి
కంటిలోన అరను
ముదిరిపోయిన పొరను
అలవోకగా మార్చి
ముసలి ముతకలను ఓదార్చు
జానీ.... ఆఫ్తాల్ పారాణి

శుక్ల పూవులను చిటుక్కున తెంచు
ఉచిత సేవల బోణి వాణీ
స్పూర్తిదాయక ద్రోణి

op లో సేకరించి
ot లో పరీక్ష చేయు
శస్త్ర చికిత్సల తెలివిడి
తీయ మాటల పలుకబడి
సెటైర్ల పాండిత్య జడి
నేడు రిటైర్మెంట్ ఒడిలో పడి
కానీ.... వాణీ

నీవు
నిత్య సులోచనాపారాయని
చతుర్ నేత్ర వరదాయని
విభాగ కీర్తి ప్రదాయని
అందుకో మిత్ర అోభినందన గని....
       
        డా. మాటూరి శ్రీనివాస్
         31-08-19

సంవేదన



చూసాను, అదేదో సినిమా కాదు
చదివింది కూడా పురాణ కాలక్షేపం కాదని తెల్సింది
గమనించానా, అదొక జ్ఞాపకం..

జరిగింది ఆలోచించి అన్వయించ చూడబోతే అదోలా అనిపించింది
కొత్త దాన్ని దేన్నో కనుగొన్న భావన
అంతా ఒక ప్రహాసన
అంతా ఒక ప్రస్పుట పాఠం
అలల మధ్య అలవాటైన జీవితానికి ఒడుదుడుకులు కొత్త కాదు
కల్లోలాలల కూడా కమనీయంగానే పలకరిస్తాయి

కాసింత ఆశ్చర్యం , ఎంతో
కొంత ఆస్వాదం
ఒక విద్వేగ పూరిత విషాదం
గాల్లో లీలగా అలుముకున ఆనందం
విడిగా అయినా కలివిడిగనైనా
విరబూసి వికసింపచేస్తాయి
అనుభవ మాలను మెడలో వేస్తాయ్
అది ఆది అంతం లేని జలపాతంగా మారి అనుభవాలను పూలగానో ముళ్లగానో గుది గుచ్చుతూ నిరంతర ప్రవాహంగా మారి
బండల మీద పడి విఛ్చిన్నమై మళ్లీ పుంజుకుంటుంది

చినుకు పడితే ఆ అనుభవ ప్రవాహాన్ని ఆపతరమా?!
నది అవుతుంది
సముద్రంగా మారుతుంది

సముద్రమంత లోతు
అంతకు మించిన వైశాల్యం కలది
అనుభవాల పరిధి
సుడిగుండాల జలధి
ఈ జీవిత కాలానికి చాలనది...

              డా.మాటూరి శ్రీనివాస్
              21-10-19
నాడు వారు నేడు వీరు
కావరంతో కనికరాన్ని కాలరాసారు
కాలానికి నిచ్చెన వేసిన చరిత్రను
నాగరికతను నిర్వచించిన అద్దాన్నీ
అపార్థాలకు అన్వయిస్తూ
అసహనంతో రూపుమాపారు

ధర్మం నడచిన అడుగుల సవ్వడి
అక్కడ గాలిలో సంచరిస్తుంది
సముద్రపు ఘోష అలల శ్వాస
ఆ అవశేషాలతో సజీవ గీతాన్ని
ఆలపిస్తూనే ఉంటుంది

నిత్య అధునాతనమైన సజ్జన సంఘం ఆ అపురూప పురాతనానికి సజీవ సాక్ష్యం
సముద్రమంత లోతైన భాష్యాలు చెపుతాయి


పర్యాటకం పేరుతో ఒకరు
పరిహాసాల కోసం ఒకరు
పరాచికాల కోసం మరొకరు
పబ్బం గడుపుకునేందుకు కొందరు ఆనవాళ్లన అపహాస్యం చేసారు

పంచశీల పరమార్ధాన్ని ప్రకాశింపచేసిన పుణ్య భూమి
బావికొండ బావురుమంది
అవమానాలను అవాంతరాలనూ ఎన్నింటినో భరించిన తొట్లకొండ పాదాన్యాస శిధిలావశేషాలు
పునర్నిమాన దుష్ప్రవర్తనను
అప శబ్ద అవక తవకలను ఆవాహనము చేసుకోలేక
అవినీతి ఇటుక రాయిని తనలో ఇముడ్చుకోలేక
చినుకు సాయం కోరింది
చిత్తడితో జత కట్టి నిలువునా కూలి పోయింది

నిబద్దత తో మరొకమారు నిలబెట్టమని నివేదించుకుంది
నిలువెత్తు నిరహంకారం
అదే చరిత్ర దేశానికి నేర్పన సాధుత్వ సంస్కారం

డాక్టర్ మాటూరి శ్రీనివాస్