Saturday, 26 October 2019

నాడు వారు నేడు వీరు
కావరంతో కనికరాన్ని కాలరాసారు
కాలానికి నిచ్చెన వేసిన చరిత్రను
నాగరికతను నిర్వచించిన అద్దాన్నీ
అపార్థాలకు అన్వయిస్తూ
అసహనంతో రూపుమాపారు

ధర్మం నడచిన అడుగుల సవ్వడి
అక్కడ గాలిలో సంచరిస్తుంది
సముద్రపు ఘోష అలల శ్వాస
ఆ అవశేషాలతో సజీవ గీతాన్ని
ఆలపిస్తూనే ఉంటుంది

నిత్య అధునాతనమైన సజ్జన సంఘం ఆ అపురూప పురాతనానికి సజీవ సాక్ష్యం
సముద్రమంత లోతైన భాష్యాలు చెపుతాయి


పర్యాటకం పేరుతో ఒకరు
పరిహాసాల కోసం ఒకరు
పరాచికాల కోసం మరొకరు
పబ్బం గడుపుకునేందుకు కొందరు ఆనవాళ్లన అపహాస్యం చేసారు

పంచశీల పరమార్ధాన్ని ప్రకాశింపచేసిన పుణ్య భూమి
బావికొండ బావురుమంది
అవమానాలను అవాంతరాలనూ ఎన్నింటినో భరించిన తొట్లకొండ పాదాన్యాస శిధిలావశేషాలు
పునర్నిమాన దుష్ప్రవర్తనను
అప శబ్ద అవక తవకలను ఆవాహనము చేసుకోలేక
అవినీతి ఇటుక రాయిని తనలో ఇముడ్చుకోలేక
చినుకు సాయం కోరింది
చిత్తడితో జత కట్టి నిలువునా కూలి పోయింది

నిబద్దత తో మరొకమారు నిలబెట్టమని నివేదించుకుంది
నిలువెత్తు నిరహంకారం
అదే చరిత్ర దేశానికి నేర్పన సాధుత్వ సంస్కారం

డాక్టర్ మాటూరి శ్రీనివాస్

No comments:

Post a Comment