Wednesday, 17 December 2014

పెషావర్

 
నిన్న మొన్నటి పాఠ్య పాటల పరవశాల గుడి,
కలిసిమెలసి భవిష్యత్ సప్తవర్ణ చిత్రాలను
తమ కలల కుంచెలతో నగిషీలు దిద్దుతున్నతరుణ మది ...
కేరింతల కిలకిలలు, చిరు యవ్వన కితకితలు విచ్చుకుని ,
యువజనోత్సవం - వున్నత విద్యా బుద్దులకోసం ఉరకలేస్తున్న ప్రాయం.
చదువులమ్మ వెచ్చని వోడిలో మానవ వికాసం వెదజిమ్ముతున్నవేళ-
బుల్లెట్ల జడివానలో తడిచి
రక్తపుటేరులో కొట్టుకు పోయింది , మానవత్వం .
పవిత్ర యుద్దానికి వందలసంఖ్యలో నెత్తుటి నైవేద్యం,
అ దైవం కోసం అంటూ –
జీహాదీయులు, తూటాల గంటలు కొట్టి ప్రాణాలునుకాల్చేసి
విద్యాలయాన్ని తడి ఆరని ఉప్పని రుధిరపాత్రను చేసారు .
మానవత్వపు మానానికే మచ్చతెస్తూ పాకిస్తాన్ పడగమీది
ఉగ్రవాద కరాళ నృత్యం మనసున్నవాడి మదిలో
మనిషిగా పుట్టినందుకు సిగ్గుతో చావాలనిపించేలా చేసింది .
ప్రాణభయం, నోట్లో గుడ్డను కుక్కుకుని బట్టకట్టిన భయానక సందర్భం.
కయ్యానికి సమవుజ్జీలవసరమనే యుద్ధనీతికి నీళ్ళోదిలి
బాలల గుండెలవిసేలా గుళ్ళను గుమ్మరించి గుర్తింపుకోసం
కన్నవారి కడుపు కోతను, కన్నీటినీ శవపేటికల్లో చుట్టేసింది
తాలిబాన్ సేన నీతిబాహ్యంగా , నరమేధంతో మానవ స్వభావ విరుద్దంగా.
ఇప్పుడు, పెషావర్ అమానుష నిర్దయాత్మక హత్యాదోషానికి
నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచాన్ని నిద్దరపోనీయదు.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
17-12-14

Thursday, 30 October 2014

దాసోహం


                                                               దాసోహం

                                                                                                        డాక్టర్ మాటూరి శ్రీనివాస్

 

పుడమి వోడి లోనుంది తలెత్తి  పైకి తొంగి చూసి   
అవలవంక ఆకాసాన్ని  ఎంత తొందరగా అందుకున్దామా అనుకుంటుంటే
రెండో వైపు నుండి తల్లి వేరు  నన్ను క్రిందికి
లార్తొచ్చి చెప్పలేనంత ఏడుపొచ్చింది.
కానీ ఎదగడం అంటే నిలదొక్కుకోవడం అని తెలిసాక కుదుటపడ్డా.
నా లేత పసిబుగ్గలు ఇంద్ర వర్ణాలతో రెపరెపలాడుతూ వుంటే
ఏ శాఖాహారులో  వచ్చి చిదిమేస్తారోనని క్షణక్షణం ప్రాణభయంతో
బిక్క బిక్కుగా దిక్కులు చూస్తుంటే ,
ఓ ప్రేమికుడు నాప్రక్కనే నాతో సహజీవనం చేస్తున్న
తుమ్మరెమ్మల మెడలు విరిచేసి  నాచుట్టూ కంచ కట్టిన రోజు
బాధగానే ఆనందించా - సమీప భవిష్యత్తుకు డోఖా లేదని పించింది .
పచ్చదనానికి ప్రతీకగా , ఎండకీ వానకీ ఎందరికో గొడుగునై ,
 బుడతల కోతికొమ్మచ్చిలుకు నా రెమ్మలను ఎంత ఉత్సాహంగా అందించానో!  
పశు పక్ష్యాదులతో స్నేహం , నా తోర్రల్లోంచి పిట్టలు దొంగాటలు 
పంచుకున్న పరవశం,పెంచుకున్న లాలిత్యం 
నాకు జీవిత సాఫల్యాన్ని , తలెత్తుకు టీవిగా నిలిచే  స్థర్యాన్ని ఇచ్చాయి.
ఎన్ని వసంతాలని అవలీలగా అనుభవిన్చానో-
జీవితం ఇంత ఆహ్లాదమా ? అనుకునేంతలో
ఎదో అలికిడి, ఎదో అలజడి , ఎక్కడో ఏదో అందోళన
సన్నగా చిన్నగా గాలి,
అది రోజూ స్పృశించే తెమ్మెరకాదు-
 ఎదో రాబోయే ఉత్పాత సూచికలా తగిలింది, వొళ్ళంతా-
ఒక్కసారి జలదరించినట్టుగా తాకరానిదదేదో  తాకినట్టుగా .
కాసేపటికే పగబట్టినట్టు , విడత విడతకూ పెరుగుతూ
నా అంతాన్ని చూడ్డానికి నిర్ణయించుకున్నట్లు
పెను వాయుభూతం నా మీద ఉరుముతూ ఉరుకుతూ
అగమ్య  హస్తాలతో నెడుతూ నేలదోయాల్నివిశ్వప్రయత్నం  
వాటి  వాటంగా కొట్టు కొస్తున్నవర్షపు జళ్ళు ,
ఒక ప్రక్క గాయం చేస్తూ మందు పూస్తున్నట్లనిపించినా , అది నిజం కాదు .
కాసేపటికే నా కాళ్ళు, వేళ్ళు  పట్టు తప్పడం నేను గమనిస్తున్నాను.
భూమితో నా  జన్మానుబంధం  గతి తప్పుతున్నట్లనిపించింది మొదటిసారి.
పెను రాక్షసి  విజ్రుంభించిన ప్రతిసారీ కొంచెం కొంచెం  వొరుగుతూ లేస్తూ
నిలదోక్కుకునే నా ప్రయత్నం లో నేనుండగా
ఎవరో కత్తితో నా రెక్కలు నరికేస్తున్న చప్పుడు...అదీ దాని పనే -
పిట్టలతో పాటూ నా శరీరపు ఆకుల అచ్చాదన కూడా
 ఎప్పుడు గాల్లో కల్సిపోయిందో  తెలీనేలేదు.
అలసిపోయిన గాలి వికృతపు  ఆట - స్వేద తీరేందుకు విరామం అడిగినట్టుంది .
నన్ను నేను చూసుకునేందుకు  కళ్ళు లేవు,
నన్ను నేను తడుముకునేందుకు చేతులూ లేవు,
నా కాళ్ళ వేర్లు భూమినంటుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భావన.
అప్పటికప్పుడే  వాయులీనం అయిపోతున్నట్లు ,
అప్పుడే నిలదొక్కుకుంటున్నట్లు  ,
సగం  తల తెగి నెత్తురోడుతూ  నేల చూపులుచూస్తున్న సైనికుడిలా, అది  నేనేనా?
విరామానంతరం ఆట ద్వితీయార్ధం మొదలైంది,
విలయం తో ప్రళయం ఎదురు మెరుపు దాడి
రెట్టించిన ఉధృతం , గుక్కత్రిప్పుకోనీయని ప్రకోపంతో ప్రకృతి అలజడి  
నా బుర్ర పట్టు తప్పి తెగి క్రింద పడినంతపనైయ్యింది.  
సగం వాలిన మొండి దేహం ,
 ఒక్కసారిగా నిటారై చివరి సారిగా తల్లి పాదాలకి నమస్కరించి
అమాంతం  కుప్పకూలిన శబ్దం నాదో ,కాదో ,ఏమో ?
నా అక్రందనో ,గాలి గర్వపు కేరింతో ?
నేలమీద నేను , నా మొండి దేహం. రోదించే వోపిక లేక అచేతంగా
కాళ్ళను పట్టుకు బ్రతిమాలి అలసిన మట్టిపెళ్లలు ..
ఎవరో  మొహం మీద నీళ్ళు చిలకరించారు, చినుకుల్లా ఉన్నాయి  .
నిర్జీవంగానే పరిసరాలను పరికించే ప్రయత్నం చేశా
చుట్టూ యుద్ధ భూమిలో చంపివేయబడ్డ విగతుల్లా చెల్లా చెదురై ,
అక్కడక్కడ క్షతగాత్రులై ప్రాణ రక్షణ కోసం పరితపిస్తున్న మానులు.
ఆ చీకట్లో మా పార్ధీవ శరీరాలు మాట్లాడుకుంటున్నాయి నిర్జీవ భాషలో .
బహుశా రెండు రోజులైనట్టుంది, 
నేను ఎండిపోతున్నట్టు ,లోలోపలి చమ్మ ఇంకి పోతున్నట్టు
నాలిక తడారి పోతూ  కుళ్ళుతూ కృశించి నశించి పోతున్నట్లు
నా పసరు వాసన  నన్ను మరింత పిండేస్తున్నాట్లనిపించింది.
ఏమిటీ ఈ వింత అనుభవం ?
ఇంతలోనే , ప్రక్కనేక్కడో ఎవరో దేన్నో
గొడ్డలితో నరుకుతూ చీలుస్తున్నట్లు శబ్దం . ఇదంతా కలైతే  ఎంత బాగుణ్ణు ?
ఎవరినో ఈడ్చుకుంటూ డోజార్లు, వేటినో విరుస్తున్న పెళ పెళలు  .
మర రంపపు  కర కర కోతలు దగ్గరగా  బిగ్గర గానే వినబడుతున్నాయి .
బహుశా ఇదే నా చివరి క్షణమేమో , ఇప్పటికి .
కానీ,  
గాలి వేగంతోనే నా ఉనికిని కూడా అంత  దూరమూ వెద చిమ్మానని  తెలుసుకున్నాను ,
అట నీదే – నేను, నా విశాఖ  నీకు దాసోహం...  హుదుహుద్.















చిగురించడం అంటే ?


హుదుద్ మా విశాఖ పచ్చదనాన్ని తన ప్రచండ గాలులతో కాల్చి వెళ్ళిన వారం ,పది రోజుల్లోనే కూలిపోయినవీ, నేలమీద వాలిపోయినవీ, మోడుల్లా నిలిచిపోయినవీ చిగురించడం మొదలెట్టాయి,
మా విశాఖ మళ్ళీ పచ్చదనపు తివాచీని పరిచేందుకు సిద్దమవుతుంది , మిమ్మల్ని స్వాగతించడానికి.







 చిగురించడం అంటే.....

చిగురించడం అంటే ,
వెచ్చని పచ్చదనం పురివిప్పి పునర్భవించడమే
అంకురించిన జీవం ఆకుల పండగ చేసుకోవడమే
హరిత విప్లవాన్ని హారతి తో స్వాగతించడమే  ,
లేలేత ప్రాణవాయు దూతలు పర్యావరణాన్నిఅలంకరించడమే .
 తొలకరించి, పలకరించడమే, పులకించడమే   -
 చిగురించడం అంటే ,
నైరాశ్యాన్ని శాసించడం , ఆశించడం, 
ఆశయాలను సాధించడం
అపజయాన్ని జయించడం , జయాన్ని శ్వాసించడం ,
లోలోని ఆత్మవిశ్వాసం  విచ్చుకున్న రెక్కలతో 
విహంగ వీక్షణం చేయడం,  - 
చిగురించడం అంటే
 కొమ్మకి,రెమ్మకి అస్తిత్వాన్నిస్తూ
వాడిపోయి, వోడిపోయిన పండుటాకు పసిప్రాయాన్ని
స్వాగతిస్తూ ఖాళీ స్థలాన్ని అందించడమే,
కొత్త నీరు పరవళ్లతో పచ్చని పొలాలు పరవశించడమే, 
నిన్నటి అనుభవంతో రేపటి  వైపు  ఆశావహంతో  ప్రయాణించడమే
 -  చిగురించడం అంటే,
ప్రకృతి తన మీద తన కున్న మమకారాన్నిపునః ప్రతిష్టిం చుకోవడమే
చిగురించడం అంటే .....
 పంచడం , పెంచడం – బ్రతకడం , బ్రతికించుకోవడం .
మనిషైనా , మానైనా తన గాయాలకు తనకు తానూ చికిత్సించు కోవడమే ,
చిగురించడం అంటే ....
                                                 డాక్టర్ మాటూరి శ్రీనివాస్ 
                                                         ఇరవైరెండు అక్టోబర్ 




ఫీల్ గుడ్

హుదుద్ విశాఖ ను అతలాకుఅతలం చేసి వెళ్ళిన మర్నాడు నేను నా ఉక్కు కర్మాగారానికి వెళితే స్మశానం లా అనిపించింది,మరొక్కఇరువై నాలుగు  గంటల్లో ఉపిరిపోసుకుని  ఉనికిని చాటింది ...
ఆనాటి స్పందనే ఈ   ఫీల్ గుడ్ '' కవిత ;


                                    ఫీల్ గుడ్ 
                                                                                   డాక్టర్ మాటూరి శ్రీనివాస్ 
                                                                                                పదిహేను అక్టోబర్ 
                                        
 

మూడు రోజులైయిందా ,ఎంత దీవైందో నీ మీద
నిన్ను చూడకుండా నేనుండ లేనని నీకు తెలుసుకదా !
ఎక్కడికక్కడ ఛిద్ర మై శిధిలమై , అందవిహీనమై
వివస్త్ర శిలలా నిలిచిపోయావు.
కానీ వీసమింతైనా విశ్వాసాన్ని కోల్పోలేదు,
పిసరంత ధైర్యాన్ని వీడలేదు, ఎంత గుండె నిబ్బరం నీది.
చిన్ని పడవ  లాంటి కారులో నిన్ను పలకరిద్దామని వచ్చానా,
సముద్రంలో కూలిపోయిన నిమాన శకలాల్లా నీ అస్తిత్వం
కలింగ యుద్దనంతరం రుధిర నదిమీద తేలుతున్న
వీరుల  మొండాల్లా ఎగిరిపడి మునిగీమునగనట్లున్న నీ అవశేషాలు
నిలువుదోపిడీచేసి, గోరింట దూసినట్లు  బోసి పోయిన  
వృక్ష జాలాలను  , వోడలిపోయిన  వాటి ఆస్తిపంజరాలును  చూస్తుంటే
పర్యావరణ ఆవరణ అవసానానికి పరాకాష్ట  అనిపించి దుఃఖ మొచ్చింది.
మొక్కవోని ధైర్యం తో నడుం బిగించి నలుగురినీ పోగేసి ,
పలుగు, పారా – రంపం ,సుత్తి లతో  అలుపెరుగని  కార్మికులు
వాళ్ళ మనసెరిగిన అధికారుల సమన్వయంలో  ,
 పడినంత వేగంగా లేచి అలై ఉరుకుతుంటే ఎంత ముద్దోచ్చావో?
మూర్ఖులు , అదిగో పులి ఇదిగో తోకంటూ,గ్యాస్ లీకంటూ హడాలుగోట్టిన
అవకాశవాదులను లాగికొట్టాలనిపించింది కదూ, నీక్కూడా .
ఆ కొద్దిమంది అంతే , పిరికిపందలు.. వాళ్ళతో మనకేం పని?
ప్రభుత్వ మంత్రాంగ యంత్రాంగాల  అమూల్య  సహాయం  తో
ఊపిరి పీల్చుకుని  జవసత్వాలు పుంజుకున్న సంకేతాల ఈలలు ,
నీలోలోపలనుండీ ఎగదన్నుకు  బయటకోస్తున్న వెచ్చని ఆవిర్లు , 
అస్సలలవాటులేని నిశ్శబ్దాన్ని చీల్చు కుంటూ
 వాటిదైన భాషలో ఘోషిస్తున్న యంత్రాలు,
నీ ,  ఆ పొడవు  ముక్కు  చిమ్నీల్లోంచి వదులుతున్న  నిశ్వాస పొగలు  ,
అల్లంత దూరం నుండే మా అందరి కళ్ళలో ఎన్ని దీపకాంతులు
వెలిగించాయో, వెయ్యి దీపావళులు ఒక్కసారే జరుపుకున్నంత .
కోమా లోంచి తిరిగొచ్చిన అమ్మ గుర్తోచింది, నా ప్రాణం లేచొచ్చింది. ,.                                          
                                                   
                                                                                            డాక్టర్ మాటూరి శ్రీనివాస్











 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సహకారంతో మా టి పి పి తిరిగి విద్యుత్ ఉత్పత్తి ని సాధించింది 


                                                     థర్మల్ పవర్ ప్లాంట్         
            
                                                                                                                           పదహారు అక్టోబర్  


 


పడి లేచిన కడలి కెరటపు అల అల్లంత దూరం వెనక్కిపోయి
ఎంత ఉరకలేస్తూ ఉరుకుతుందో ,
వాయుగండం గడిచినాక ఎప్పుడెప్పుడా అని నేను కూడా,
కానీ పవర్లేనితనం నన్ను నాశనం చేయబోతుంటే
ఏభై మెగావాట్ల శక్తి ని కొన ఉపిరితోనున్న  నాకిచ్చి
బ్రతుకిచ్చిన బంగారు బాబుకు వందనాలు.
ఆమాత్రం చేయూత చాలదూ ,
 అలల్లా పారి ,నురగల్లె మురిసి మెరిసి పోవడానికి.
నన్ను నేను పుంజుకుని కొత్త జవసత్వాలతో
ఒక్కొక్క టర్బైన్ ను ఒక్కొక్క సుదర్సనంలా త్రిప్పే యనూ ,
ఒక్కొక్క జేనరేటర్ తో వందల మెగా ఉనిట్లును పెంచి పోషించనూ.
బొగ్గుని,నీటి తో కలిపి, వ్యర్ధ వాయువులను హీట్ తో రాజేసి
వందలవేడి  ఉష్ణోగ్రత సృష్టించి, బోయిలర్లలో మరిగించి
క్షీర సాగర మధనం లా కిలోవాట్ల విద్యుతామ్రుతాన్ని చిలకరించనూ ,,     
గ్రిడ్ల నుండి ఎక్కడెక్కడికో ప్రవహించి
కోట్ల  చీకటి జీవితాల్లో  వాట్ల దీపాల కాంతులు వెలిగించనూ ,


  

Wednesday, 17 September 2014

మనసు

ఏమిటది?                                            
                                             డా. మాటూరి శ్రీనివాస్ 
అది ఒక ప్రయోగశాల , విద్వత్తుల భాండాగారం
అస్తిత్వపు కుహరంలో నిక్షిప్తపు జ్ఞాన గని ,
అది సముద్రపు అగాధం , నీతుల లోతుల ఊబి .         
 దాని అంచుల తీవ్రతను తాకడం ఎవ్వరి తరమూ కాదు,
 అంతర్గత సంక్లిష్టత ను ఆవిష్కరించడం వృధా ప్రయాసే అయినా ,
అ సీమలో పయనించడం అంటే ,
నిన్నునీవు తెలుసుకోవడమే కాదు, విస్తృత పరుచుకోవడం కూడా .
అది అంతు చిక్కని, చిక్కని ఆలోచనల అంతర్ముఖ సులోచనం  ..
కానరాని  కల్పనలను ఊహిస్తూ
 మానవాళి మనుగడనే శాసిస్తూన్న ప్రజ్ఞా పరిపూర్ణ  ప్రతీక ,
 అజ్ఞానంధకారం లోకరదీపిక .
నిత్య చైతన్యపు నిండు జాబిల్లి వెన్నెల చిత్రం ,
దాన్ని గీయలేము, చూడలేము,తాకలేము .
అలసిపోదు,సోలసిపోదు నిరంతరం నిశ్చల స్రవంతి ,
అక్షరాన్ని ఆయుధంచేసే కార్య క్షేత్రం ,
శిక్షణ తో రక్షణ కల్పించే వీర్య నేత్రం .
ధ్యానం, గానం. భాష్యం ,లాస్యం ,
యధాభూతదర్శనం , నిత్యం సత్యాన్వేషణం,
 కార్యా కారణం సంకీర్ణం దాని తక్షణ కర్తవ్యం .
నిన్నటి రేపుకి రేపటి నిన్నకి అను సంధాన వ్యక్తిత్వం
పంచేంద్రియాల సమూహపు ఆరవ ఇంద్రియం,
మేధ అను ,మస్తిష్కపు శోధ అను లేదా వ్యధామృత గాధ అను
 నిరంతర వికసిత సుగంధ మహిమాన్విత అమూల్య మాల్యము
 ..... మనసు.