హుదుద్ మా విశాఖ పచ్చదనాన్ని తన ప్రచండ గాలులతో కాల్చి వెళ్ళిన వారం ,పది రోజుల్లోనే కూలిపోయినవీ, నేలమీద వాలిపోయినవీ, మోడుల్లా నిలిచిపోయినవీ చిగురించడం మొదలెట్టాయి,
మా విశాఖ మళ్ళీ పచ్చదనపు తివాచీని పరిచేందుకు సిద్దమవుతుంది , మిమ్మల్ని స్వాగతించడానికి.
చిగురించడం అంటే.....
వెచ్చని పచ్చదనం పురివిప్పి
పునర్భవించడమే
అంకురించిన జీవం
ఆకుల పండగ చేసుకోవడమే
హరిత విప్లవాన్ని
హారతి తో స్వాగతించడమే ,
లేలేత ప్రాణవాయు దూతలు
పర్యావరణాన్నిఅలంకరించడమే .
తొలకరించి, పలకరించడమే, పులకించడమే -
చిగురించడం అంటే ,
నైరాశ్యాన్ని
శాసించడం , ఆశించడం,
ఆశయాలను సాధించడం
అపజయాన్ని జయించడం
, జయాన్ని శ్వాసించడం ,
లోలోని
ఆత్మవిశ్వాసం విచ్చుకున్న రెక్కలతో
విహంగ వీక్షణం
చేయడం, -
చిగురించడం అంటే
కొమ్మకి,రెమ్మకి అస్తిత్వాన్నిస్తూ
వాడిపోయి,
వోడిపోయిన పండుటాకు పసిప్రాయాన్ని
స్వాగతిస్తూ ఖాళీ
స్థలాన్ని అందించడమే,
కొత్త నీరు పరవళ్లతో
పచ్చని పొలాలు పరవశించడమే,
నిన్నటి అనుభవంతో
రేపటి వైపు ఆశావహంతో ప్రయాణించడమే
-
చిగురించడం అంటే,
ప్రకృతి తన మీద తన
కున్న మమకారాన్నిపునః ప్రతిష్టిం చుకోవడమే
చిగురించడం అంటే
.....
పంచడం , పెంచడం – బ్రతకడం , బ్రతికించుకోవడం .
మనిషైనా , మానైనా
తన గాయాలకు తనకు తానూ చికిత్సించు కోవడమే ,
చిగురించడం అంటే
....
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
ఇరవైరెండు అక్టోబర్


No comments:
Post a Comment