ఏమిటది?
డా. మాటూరి శ్రీనివాస్
అది ఒక ప్రయోగశాల , విద్వత్తుల భాండాగారం
అస్తిత్వపు కుహరంలో నిక్షిప్తపు జ్ఞాన గని ,
అది సముద్రపు అగాధం , నీతుల లోతుల ఊబి .
దాని అంచుల తీవ్రతను తాకడం ఎవ్వరి తరమూ కాదు,
అంతర్గత సంక్లిష్టత ను ఆవిష్కరించడం వృధా ప్రయాసే –అయినా ,
అ సీమలో పయనించడం అంటే ,
నిన్నునీవు తెలుసుకోవడమే కాదు, విస్తృత పరుచుకోవడం కూడా .
అది అంతు చిక్కని, చిక్కని ఆలోచనల అంతర్ముఖ సులోచనం ..
కానరాని కల్పనలను ఊహిస్తూ
మానవాళి మనుగడనే శాసిస్తూన్న ప్రజ్ఞా పరిపూర్ణ ప్రతీక ,
అజ్ఞానంధకారం లోకరదీపిక .
నిత్య చైతన్యపు నిండు జాబిల్లి వెన్నెల చిత్రం ,
దాన్ని గీయలేము, చూడలేము,తాకలేము .
అలసిపోదు,సోలసిపోదు నిరంతరం నిశ్చల స్రవంతి ,
అక్షరాన్ని ఆయుధంచేసే కార్య క్షేత్రం ,
శిక్షణ తో రక్షణ కల్పించే వీర్య నేత్రం .
ధ్యానం, గానం. భాష్యం ,లాస్యం ,
యధాభూతదర్శనం , నిత్యం సత్యాన్వేషణం,
కార్యా కారణం సంకీర్ణం దాని తక్షణ కర్తవ్యం .
నిన్నటి రేపుకి రేపటి నిన్నకి అను సంధాన వ్యక్తిత్వం
పంచేంద్రియాల సమూహపు ఆరవ ఇంద్రియం,
మేధ అను ,మస్తిష్కపు శోధ అను లేదా వ్యధామృత గాధ అను
నిరంతర వికసిత సుగంధ మహిమాన్విత అమూల్య మాల్యము
..... మనసు.