దాసోహం
డాక్టర్
మాటూరి శ్రీనివాస్
అవలవంక ఆకాసాన్ని ఎంత తొందరగా
అందుకున్దామా అనుకుంటుంటే
రెండో వైపు నుండి తల్లి వేరు నన్ను
క్రిందికి
లార్తొచ్చి చెప్పలేనంత ఏడుపొచ్చింది.
కానీ ఎదగడం అంటే నిలదొక్కుకోవడం అని తెలిసాక కుదుటపడ్డా.
నా లేత పసిబుగ్గలు ఇంద్ర వర్ణాలతో రెపరెపలాడుతూ వుంటే
ఏ శాఖాహారులో వచ్చి చిదిమేస్తారోనని
క్షణక్షణం ప్రాణభయంతో
బిక్క బిక్కుగా దిక్కులు చూస్తుంటే ,
ఓ ప్రేమికుడు నాప్రక్కనే నాతో సహజీవనం చేస్తున్న
తుమ్మరెమ్మల మెడలు విరిచేసి నాచుట్టూ
కంచ కట్టిన రోజు
బాధగానే ఆనందించా - సమీప భవిష్యత్తుకు డోఖా లేదని పించింది .
పచ్చదనానికి ప్రతీకగా , ఎండకీ వానకీ ఎందరికో గొడుగునై ,
బుడతల కోతికొమ్మచ్చిలుకు నా రెమ్మలను ఎంత
ఉత్సాహంగా అందించానో!
పశు పక్ష్యాదులతో స్నేహం , నా తోర్రల్లోంచి పిట్టలు దొంగాటలు
పంచుకున్న పరవశం,పెంచుకున్న లాలిత్యం
నాకు జీవిత సాఫల్యాన్ని , తలెత్తుకు టీవిగా నిలిచే స్థర్యాన్ని ఇచ్చాయి.
ఎన్ని వసంతాలని అవలీలగా అనుభవిన్చానో-
జీవితం ఇంత ఆహ్లాదమా ? అనుకునేంతలో
ఎదో అలికిడి, ఎదో అలజడి , ఎక్కడో ఏదో అందోళన
సన్నగా చిన్నగా గాలి,
అది రోజూ స్పృశించే తెమ్మెరకాదు-
ఎదో రాబోయే ఉత్పాత సూచికలా తగిలింది,
వొళ్ళంతా-
ఒక్కసారి జలదరించినట్టుగా తాకరానిదదేదో తాకినట్టుగా .
కాసేపటికే పగబట్టినట్టు , విడత విడతకూ పెరుగుతూ
నా అంతాన్ని చూడ్డానికి నిర్ణయించుకున్నట్లు
పెను వాయుభూతం నా మీద ఉరుముతూ ఉరుకుతూ
అగమ్య హస్తాలతో నెడుతూ నేలదోయాల్నివిశ్వప్రయత్నం
వాటి వాటంగా కొట్టు కొస్తున్నవర్షపు జళ్ళు
,
ఒక ప్రక్క గాయం చేస్తూ మందు పూస్తున్నట్లనిపించినా , అది నిజం కాదు .
కాసేపటికే నా కాళ్ళు, వేళ్ళు పట్టు
తప్పడం నేను గమనిస్తున్నాను.
భూమితో నా జన్మానుబంధం గతి తప్పుతున్నట్లనిపించింది మొదటిసారి.
పెను రాక్షసి విజ్రుంభించిన ప్రతిసారీ
కొంచెం కొంచెం వొరుగుతూ లేస్తూ
నిలదోక్కుకునే నా ప్రయత్నం లో నేనుండగా
ఎవరో కత్తితో నా రెక్కలు నరికేస్తున్న చప్పుడు...అదీ దాని పనే -
పిట్టలతో పాటూ నా శరీరపు ఆకుల అచ్చాదన కూడా
ఎప్పుడు గాల్లో కల్సిపోయిందో తెలీనేలేదు.
అలసిపోయిన గాలి వికృతపు ఆట - స్వేద
తీరేందుకు విరామం అడిగినట్టుంది .
నన్ను నేను చూసుకునేందుకు కళ్ళు లేవు,
నన్ను నేను తడుముకునేందుకు చేతులూ లేవు,
నా కాళ్ళ వేర్లు భూమినంటుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భావన.
అప్పటికప్పుడే వాయులీనం
అయిపోతున్నట్లు ,
అప్పుడే నిలదొక్కుకుంటున్నట్లు ,
సగం తల తెగి నెత్తురోడుతూ నేల చూపులుచూస్తున్న సైనికుడిలా, అది నేనేనా?
విరామానంతరం ఆట ద్వితీయార్ధం మొదలైంది,
విలయం తో ప్రళయం ఎదురు మెరుపు దాడి
రెట్టించిన ఉధృతం , గుక్కత్రిప్పుకోనీయని ప్రకోపంతో ప్రకృతి అలజడి
నా బుర్ర పట్టు తప్పి తెగి క్రింద పడినంతపనైయ్యింది.
సగం వాలిన మొండి దేహం ,
ఒక్కసారిగా నిటారై చివరి
సారిగా తల్లి పాదాలకి నమస్కరించి
అమాంతం కుప్పకూలిన శబ్దం నాదో ,కాదో
,ఏమో ?
నా అక్రందనో ,గాలి గర్వపు కేరింతో ?
నేలమీద నేను , నా మొండి దేహం. రోదించే వోపిక లేక అచేతంగా
కాళ్ళను పట్టుకు బ్రతిమాలి అలసిన మట్టిపెళ్లలు ..
ఎవరో మొహం మీద నీళ్ళు చిలకరించారు,
చినుకుల్లా ఉన్నాయి .
నిర్జీవంగానే పరిసరాలను పరికించే ప్రయత్నం చేశా
చుట్టూ యుద్ధ భూమిలో చంపివేయబడ్డ విగతుల్లా చెల్లా చెదురై ,
అక్కడక్కడ క్షతగాత్రులై ప్రాణ రక్షణ కోసం పరితపిస్తున్న మానులు.
ఆ చీకట్లో మా పార్ధీవ శరీరాలు మాట్లాడుకుంటున్నాయి నిర్జీవ భాషలో .
బహుశా రెండు రోజులైనట్టుంది,
నేను ఎండిపోతున్నట్టు ,లోలోపలి చమ్మ ఇంకి పోతున్నట్టు
నాలిక తడారి పోతూ కుళ్ళుతూ కృశించి
నశించి పోతున్నట్లు
నా పసరు వాసన నన్ను మరింత
పిండేస్తున్నాట్లనిపించింది.
ఏమిటీ ఈ వింత అనుభవం ?
ఇంతలోనే , ప్రక్కనేక్కడో ఎవరో దేన్నో
గొడ్డలితో నరుకుతూ చీలుస్తున్నట్లు శబ్దం . ఇదంతా కలైతే ఎంత బాగుణ్ణు ?
ఎవరినో ఈడ్చుకుంటూ డోజార్లు, వేటినో విరుస్తున్న పెళ పెళలు .
మర రంపపు కర కర కోతలు దగ్గరగా బిగ్గర గానే వినబడుతున్నాయి .
బహుశా ఇదే నా చివరి క్షణమేమో , ఇప్పటికి .
కానీ,
గాలి వేగంతోనే నా ఉనికిని కూడా అంత
దూరమూ వెద చిమ్మానని తెలుసుకున్నాను ,
అట నీదే – నేను, నా విశాఖ నీకు
దాసోహం... హుదుహుద్.





