వలస
ఆకలి రుచి చిరునామాలవి,
అవమానాలే నరాల్లా సాగుతున్నఅల్ప జీవాలవి ,
పుట్టి పెరిగిన ఊరే
కార్పొరేట్ కాలసర్పం కబంద కౌగిల్లో బిగిస్తుంటే ,
పొలం ,పుట్రా వదిలి మెతుకు వేటలో
బతుకు బాట వెతుక్కుంటూ
చంకలో పాపడు ,నెత్తిన మూటడు,
ఆచ్చాదన లేని శరీరం చేస్తున్న జీవచ్చవ యాత్ర ,
అందని లేనంత దూరానున్న మజిలీ కోసం,
బండెక్కో,బస్సెక్కో, రైలేక్కో, నావెక్కో
అనంతం లోనికి ఆకలితో పరుగు పందెం.
మృత్యువు వోడి లోనికి వలస ప్రయాణం.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
20-04-15.
బంగారు బాట
పసిడి మెరుపులా నిత్య సింగారం, పచ్చ బంగారం
రాజు –పేదల కుల ,కొల మానపు అగాధం.
పెట్టుబడుల విపణి అంబరం శాసనం .
కారేట్టు కో రేటు, జీవన ప్రమాణాలకు చాటు మాటు వేటు.
రంకేలసే దున్న పై ఎగబ్రాకు మార్కెట్టు.
మభ్యపెట్టి మోసగించు ,
తిదియ నమ్మకాల అమ్మకాల విరాట్టు.
దొంగ రవాణా నీటు గా సాగే అంతర్జాతీయ గేటు ,
కోట్లకు పడగెత్తిన షో రూమ్లకు లేదేదీ ధీటు
‘గ్లోబలైజేషన్’ ... దీని నేమ్ ప్లేటు .
నల్ల బంగారం,నాణ్యమై, కుదిరితే
ధగ ధగల కొంగ్రొత్త కోహినూర్ అందం.
లేకుంటే , మాడి మసై పోవాల్సిన నాసిరకం రాక్షసి.
వోబులపుర రాజాల రత్నాల గని. గాలి తీసి జైలు పాల్జేసే కఠిన దేవేరి.
ముడిసరుకుగా ముప్పు తిప్పలెట్టే
మురికి మాఫియాల మనసైన మల్లె .
దోచుకున్న వాడు , ఎంత దాచుకోగలిగితే
దానికి ‘నేషన్’ ఇచ్చిన ముద్దు పేరే, ‘ప్రైవేటైజేషన్’.
మాదిప్పుడు బరువున్న్న విలువైన మాట
కలప దుంగలు , నోట్ల మూట లై
రక్తాన్ని పూసుకుంటూ అడవుల్లో రెపరెపలాడుతున్నాయి.
నాయకులకూ, అధినాయకులకూ కధానాయికలై
వాన పాటలు పాడుతున్నాయి.
కూలీల ప్రాణాలుపై పోలీసు తూటాల సంతకాలే
వీరు ‘లిబరల్’ గ తీసుకునే ‘రెమ్యూనరేషనే ’ , ‘లిబరలైజేషన్’ .
డాక్టర్ మాటూరి శ్రీనివాస్ . 23-4-15
పెన్ను
అడగకుండానే నాన్న కొనిచ్చిన ఫౌంటేన్ను పెన్ను,
నా చేతిలో వొదిగిపోయి హత్తుకుంది,నన్ను .
ఆశయాలసౌధాలకు పునాదిగా నిల్చిన వెన్ను దన్ను .
లోని సిరా పోసుకుని పాళీ ని దులిపిన ఇంకు లో
ముంచుకుని పేపర్ పై తేలుతూ
పరుగులెడుతూ ఉంటే , కొత్తగా టోక్యో- నగోయల మధ్య
పరిగెడుతున్న మాగ్లేస్ రైలును తలపించేది.
స్టేషన్లో ఆగినట్టే ఆగి పేరా పేరా కి మరింత
వేగంగా సమాధానాల అక్షరాలను ఆకాశంలో
నక్షత్రాల్లా పొందికగా అద్దేది .
ఎన్ని తరగతుల మజిలీలను దాటేందుకు
ఎంత గా సహకరిచిందనీ, ఈ పెన్ను.
పాసైన ప్రతీసారీ దాన్ని కళ్ళ కద్దుకుంటూ
అమ్మని ముద్దాదినట్టు మురిసేవాడిని.
ఎక్కడికెల్లాలన్న కవచ కుండలంలా అది నాతోనే, నాలోనే.
గుర్తుకొచ్చినప్పుడల్లా ,గుర్తుకు రానప్పుడల్లా
నా కళ్ళు ,నా చేయి ఎప్పుడూ దాన్ని తడుముతూనే ఉండేవి.
నాన్న చేయిలా వెచ్చగా తాగిలేది. ఎంత ధైర్యం గా ఉండేదో?
నాన్న అంతిమ సంస్కారాల ఆనక లెక్క లకోసమని
తీసుకుని జేబులో పెట్టుకుపోయాడు కేటరింగ్ వాడు.
తిరిగి అడగాలనిపించలేదు.
మరి,
ఇప్పుడు , ఎప్పుడు పెన్నుని తాకినా
నాన్నతో మాట్లాడి నట్టుంటుంది.
పెన్నే నాన్నై నన్ను నడిపిస్తున్నట్లు ఉంటుంది..
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
22-04-15