Tuesday, 26 January 2016

భోగిమంటలు

సిమెంటు అడవుల్లో నల్లని తారు ఎడారుల్లో
రణగొణధ్వనుల్తో నలిగిన ఉరుకుల పరుగుల్లో
ఏ సి ల చలిగిలి గింత బతుకుల్లో
నులి వెచ్చని భోగి మంటల సంక్రాంతి పండగొచ్చింది
చేయ్ జారిపోయన పంట చేతికొచ్చినంత సందడొచ్చింది.
...
పల్లెను మింగిన క్షామం లో
డాలరు మరిగిన కామంలో
ప్రపంచమే ఒక గ్రామం
జీవనమొక దుర్భర ధామం
దళారి కాల్చిన బ్రతుకులతో
సర్కారు నరికిన పీకలతో
పుట్టెడు దుఖపు నాగలి కింద నలిగి సలిగి
మొండమై నగరానికి నడిచి వచ్చిన ఆకలి.
రైతుకూలీ తోటమాలీ
బల్ల ఇస్త్రీ , తాపీ మేస్త్రీ
వాచ్ మేన్ , వలస మేను
బలిచక్రవర్తి వారసుడా
బ్రతుకు చెడిన జీవుడా
పొట్ట చేత పట్టుకొచ్చావనుకున్నాను, కానీ
మా చిన్ననాటి ఙ్నాపకాలు మూట కట్టు కొచ్చావనుకోలేదు.
చులకనైన జీవితాలనుకున్నాను, కానీ
పల్లె పరవశాన్ని మల్లె చెండుల్లా
మాపై చిలకరిస్తావనుకోలేదు.
మా పట్టణ బ్రతుకుల్లో
పండుగ పారవశ్యాన్ని నింపిన పల్లెవాసీ
ఎప్పటికీ నీవే ఈ దేశానికి రాశి....
ఉదయాన్నే వాకింగ్కు వెళ్లి నప్పుడు దారంతా భోగిమంటలు ఎప్పుడూ లేనంతగా కనిపించాయి.

No comments:

Post a Comment