Tuesday, 26 January 2016

ఈ శతాబ్థపు మరొక వేకువ
మంచు ముసుగు తొలగించు కుంటు
పడుచు పదహారు లో పరవశంతో
ప్రవేశిస్తుంది-ప్రాతః పరువం తో
ఉరకలేస్తూ....
నిన్నటి జ్ఞాపకాల చిరుప్రాయం
ఙ చిన్ని చిన్ని ఆశలతో
చిలిపి యవ్వసంలోనికి ప్రయాణిస్తుంది
గతానుభవాల పల్లకీలో
ముస్తాబై మురిసిపోతూ.
క్రొత్త కాలం
పసితనం ఆకురాలి
నవ్య ఋత రాగాన్ని ఆలపిస్తోన్న కాలం
మనలోని కాలుష్య కావరాలు
చేదు కల్లోల కాఠిణ్యాలు
కన్నీటి కష్టాలు స్వార్థపు జాఢ్యలు
నిన్నటి వ్యర్థాలను సమాథుల్లో శిథిలమైపోవాలి
కొంగ్రొత్త కారుణ్య పునాదులు గా వెలియాలి.
భవిష్యత్ భ్రమరాలు
ఝంఝమ్మని తేనెపాటలు పాడాలి.
ఇప్పుడంతా చిటికల్లో పని
వేగమే వేదము, సాథనే శోథన
మనోవేగంతో విశ్యాంతరాల్లో విహరించే కాలం
విశ్యాంతరాల్లో మానవులు గా అవతరిద్దాం.
క్రొత్త సంవత్సరం అంటే
పాతగోడమీద క్రొత్త కేలండర్ తగిలించడం కాదు
అర్థ రాత్రి సంబరాలు అంబరాలై వెలగడం కాదు
క్రొత్త సంవత్సరం అంటే
క్రొత్త జీవితానికి సరి క్రొత్త ద్వారాలు తెరవడం
పాత స్నేహాలను నిత్య సాఫల్యదిశగా నడిపించడం
క్రొత్త సంవత్సరం అంటే
పాత స్పర్థలు వీడి
క్రొత్త మైత్రీవనంలో విహరించడం
సుతిమెత్తని మససును ఆవిష్కరించడం...

భోగిమంటలు

సిమెంటు అడవుల్లో నల్లని తారు ఎడారుల్లో
రణగొణధ్వనుల్తో నలిగిన ఉరుకుల పరుగుల్లో
ఏ సి ల చలిగిలి గింత బతుకుల్లో
నులి వెచ్చని భోగి మంటల సంక్రాంతి పండగొచ్చింది
చేయ్ జారిపోయన పంట చేతికొచ్చినంత సందడొచ్చింది.
...
పల్లెను మింగిన క్షామం లో
డాలరు మరిగిన కామంలో
ప్రపంచమే ఒక గ్రామం
జీవనమొక దుర్భర ధామం
దళారి కాల్చిన బ్రతుకులతో
సర్కారు నరికిన పీకలతో
పుట్టెడు దుఖపు నాగలి కింద నలిగి సలిగి
మొండమై నగరానికి నడిచి వచ్చిన ఆకలి.
రైతుకూలీ తోటమాలీ
బల్ల ఇస్త్రీ , తాపీ మేస్త్రీ
వాచ్ మేన్ , వలస మేను
బలిచక్రవర్తి వారసుడా
బ్రతుకు చెడిన జీవుడా
పొట్ట చేత పట్టుకొచ్చావనుకున్నాను, కానీ
మా చిన్ననాటి ఙ్నాపకాలు మూట కట్టు కొచ్చావనుకోలేదు.
చులకనైన జీవితాలనుకున్నాను, కానీ
పల్లె పరవశాన్ని మల్లె చెండుల్లా
మాపై చిలకరిస్తావనుకోలేదు.
మా పట్టణ బ్రతుకుల్లో
పండుగ పారవశ్యాన్ని నింపిన పల్లెవాసీ
ఎప్పటికీ నీవే ఈ దేశానికి రాశి....
ఉదయాన్నే వాకింగ్కు వెళ్లి నప్పుడు దారంతా భోగిమంటలు ఎప్పుడూ లేనంతగా కనిపించాయి.

Monday, 4 January 2016

వలస

       వలస

ఆకలి రుచి చిరునామాలవి,
అవమానాలే నరాల్లా  సాగుతున్నఅల్ప జీవాలవి  ,
పుట్టి పెరిగిన ఊరే
కార్పొరేట్ కాలసర్పం కబంద కౌగిల్లో  బిగిస్తుంటే  ,
పొలం ,పుట్రా వదిలి మెతుకు వేటలో 
 బతుకు బాట వెతుక్కుంటూ
చంకలో పాపడు  ,నెత్తిన మూటడు,  
ఆచ్చాదన లేని శరీరం చేస్తున్న జీవచ్చవ యాత్ర ,
అందని లేనంత దూరానున్న మజిలీ కోసం,
బండెక్కో,బస్సెక్కో, రైలేక్కో, నావెక్కో
అనంతం లోనికి ఆకలితో పరుగు పందెం.
మృత్యువు వోడి లోనికి వలస ప్రయాణం.
                                       
                                                                                                                 డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                                                           20-04-15.









బంగారు బాట

పసిడి మెరుపులా నిత్య సింగారం, పచ్చ బంగారం
రాజు –పేదల కుల ,కొల మానపు అగాధం.
పెట్టుబడుల విపణి అంబరం శాసనం .
కారేట్టు కో  రేటు, జీవన ప్రమాణాలకు చాటు మాటు  వేటు.
రంకేలసే దున్న పై ఎగబ్రాకు మార్కెట్టు.
మభ్యపెట్టి మోసగించు ,
తిదియ నమ్మకాల  అమ్మకాల  విరాట్టు.
దొంగ రవాణా నీటు గా సాగే అంతర్జాతీయ గేటు ,
కోట్లకు పడగెత్తిన షో రూమ్లకు  లేదేదీ ధీటు
 ‘గ్లోబలైజేషన్’ ... దీని నేమ్ ప్లేటు .

నల్ల బంగారం,నాణ్యమై, కుదిరితే
ధగ ధగల కొంగ్రొత్త కోహినూర్ అందం.
లేకుంటే , మాడి  మసై పోవాల్సిన నాసిరకం రాక్షసి.
వోబులపుర రాజాల రత్నాల గని. గాలి తీసి జైలు పాల్జేసే కఠిన దేవేరి.
ముడిసరుకుగా ముప్పు తిప్పలెట్టే
మురికి మాఫియాల మనసైన మల్లె .
దోచుకున్న వాడు , ఎంత దాచుకోగలిగితే
దానికి ‘నేషన్’ ఇచ్చిన  ముద్దు పేరే,  ‘ప్రైవేటైజేషన్’.

మాదిప్పుడు  బరువున్న్న విలువైన మాట
కలప దుంగలు , నోట్ల మూట లై
రక్తాన్ని పూసుకుంటూ అడవుల్లో రెపరెపలాడుతున్నాయి.
నాయకులకూ, అధినాయకులకూ కధానాయికలై
వాన పాటలు పాడుతున్నాయి.
కూలీల ప్రాణాలుపై  పోలీసు తూటాల సంతకాలే
వీరు  ‘లిబరల్’ గ తీసుకునే ‘రెమ్యూనరేషనే ’ , ‘లిబరలైజేషన్’ .

                                                 డాక్టర్ మాటూరి శ్రీనివాస్ .    23-4-15








పెన్ను

అడగకుండానే నాన్న కొనిచ్చిన ఫౌంటేన్ను పెన్ను,
నా చేతిలో వొదిగిపోయి హత్తుకుంది,నన్ను .
ఆశయాలసౌధాలకు పునాదిగా నిల్చిన వెన్ను దన్ను .
లోని సిరా పోసుకుని  పాళీ ని దులిపిన ఇంకు లో
ముంచుకుని  పేపర్ పై తేలుతూ
పరుగులెడుతూ ఉంటే , కొత్తగా టోక్యో- నగోయల మధ్య
పరిగెడుతున్న మాగ్లేస్ రైలును తలపించేది.
స్టేషన్లో ఆగినట్టే ఆగి  పేరా పేరా కి  మరింత
వేగంగా సమాధానాల అక్షరాలను ఆకాశంలో
నక్షత్రాల్లా పొందికగా అద్దేది .
ఎన్ని తరగతుల మజిలీలను దాటేందుకు
 ఎంత గా సహకరిచిందనీ, ఈ పెన్ను.
పాసైన ప్రతీసారీ దాన్ని కళ్ళ కద్దుకుంటూ
 అమ్మని ముద్దాదినట్టు మురిసేవాడిని.
ఎక్కడికెల్లాలన్న కవచ కుండలంలా అది నాతోనే, నాలోనే.
గుర్తుకొచ్చినప్పుడల్లా ,గుర్తుకు రానప్పుడల్లా
 నా కళ్ళు ,నా చేయి ఎప్పుడూ దాన్ని తడుముతూనే ఉండేవి.
నాన్న చేయిలా వెచ్చగా తాగిలేది. ఎంత ధైర్యం గా ఉండేదో?
నాన్న అంతిమ సంస్కారాల ఆనక లెక్క లకోసమని
తీసుకుని జేబులో పెట్టుకుపోయాడు కేటరింగ్ వాడు.
తిరిగి అడగాలనిపించలేదు.
మరి,
ఇప్పుడు , ఎప్పుడు పెన్నుని తాకినా  
నాన్నతో  మాట్లాడి నట్టుంటుంది.
పెన్నే నాన్నై నన్ను నడిపిస్తున్నట్లు ఉంటుంది..
                                                                         డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                                                       22-04-15


కల

కల

సముద్రంలో అలా లేచి సముద్రం లోనే
 కరిగిపోయిన అలల్లా
నా ఆశయాల  కలలన్నీ ఇట్టే చెదిరిపోయాయి.
చెదిరిన కలలను చేరదీయడానికి 
నా హృదయానికి సముద్రమంతా లోతు లేదు
కానీ అగాధమంత శూన్యముంది.
సాలె పురుగు గర్భంలో పట్టు దారం ఊరినట్టు
 స్తబ్ధ శూన్యత లోనుండి నా నిర్ణీత కలలు
వినీలాకాశము లో విశ్వశాంతి గీత మాలపిస్తూ
పురి విప్పిన ముయురలై
ఇంద్రధనుస్సు పై నాట్య మాడుతున్నాట్టు
ఎంత అద్భుతమైన కల.                                       5-1-16