భారమైపోతున్న పసి ప్రాయాలు గూని బారిపోతుంటే ,
చిరిగిపోతున్న అప్యాయాలు , పెరిగిపోతున్న
అంతరాల పరదాల దొంతర్లు మినార్ల మీద కూర్చున్నాయి.
ఎక్కడో గానీ కనిపించని పలకరింపుల చిలకరింపులు
కరువు కాలాన్నితలపిస్తూన్న ఎల్నినో ఎఫెక్ట్ .
పలకలేని బ్రతుకు బలపాలు , పలుకబడుల చదువులు
నిరంతరం కారం అద్దుకుంటున్న గాయాలే జీవన గేయాలు .
అప్పుడు అనుకునే వాడిని ఎప్పుడు పెద్ద అయిపోతానాని
ఇప్పుడేమో మళ్ళీ బాల్యాన్ని హత్తుకు పడుకోవాలనుంది.
అమ్మ దనం లో కమ్మదనం మమ్మీల్లో నిక్షిప్తం అయిపోక ముందే
నా గుండెల్లోని మమకారం ఇంకి పోయి బీడు వారక ముందే
మనిషి గా ఒక్క క్షణం బ్రతికి పోవాలని వుంది.
-డాక్టర్ మాటూరి శ్రీనివాస్
