Friday, 18 September 2015

కాలం

కాలం....
                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్
నీ  కౌగిలిలో ఒదగని వారెవ్వరు,
నీ కబంధ హస్తాల్లో ఇమడని వారెవ్వరు ,
నీ భ్రమల వలయంలో చిక్కని వారెవ్వరూ
నీలోని  కలవని వారెవ్వరు ,  కరగని వారెవ్వరు .
ఎవ్వరెంతగా ఉబలాటపడినా
నాదీ, నీదీ అంటూ వంచన తో పంచేసుకున్నా
కడకు నీకే అర్పించుకుంటారందరూ .
వీచే గాలుల ఆలంబనా గీతానివి నువ్వు ,
 పూచే పూవు పరవశాల నవ్వువు నువ్వు
ఎగిరే పిట్టల రెక్కల రెపరెపల అలవోక అలజడివి.
ఓ !అశాశ్వతపు చిరునామా,
 కలివిడి ఆటల , కన్నీటితడి చారల కరుకు చదరంగానివి నువ్వు .
ఎవ్వరున్నాగానీ, లేకున్నాగానీ ,
తుది వరకూ  వెన్నంటి చరిస్తున్న అంతరంగానివి నువ్వు ,
ఊరిస్తూ, ఉయ్యాలలూగిస్తూ , కలల ఉహల్తో కవ్విస్తూ
అంతలోనే పాతాళానికి నెట్టేస్తూ
విశ్వాంతరాలలో విహరిస్తున్న మనస్సును
 అదుపుచేసే  బలీయ విధి విలాసానివి నువ్వు.,
జ్ఞాన జ్యోతిని ప్రసరించేందుకు,
శాంతి గీతం ప్రభవించేందుకు
మనిషిలో మానవత్వపు  వాత్సల్య బీజాన్ని  చిగురింపచేసే
 అనిత్య పాఠానివి నువ్వు .
సుఖాదుఖాల మాయాజాలానివి నువ్వు
బతుకు ఉబలాటాలకు ఎర లేని  గేలానికి నువ్వు.  
కాలానివి నువ్వు !
భూత జ్ఞాపకాల శూలానివి నువ్వు  
కాలానివి నువ్వు !
వర్తమానపు వొడిలోని వెచ్చని బహుమానానివి నువ్వు
కాలానివి నువ్వు ! 
భవిష్యత్ ద్వారానివి నువ్వు...

Friday, 8 May 2015

అస్తిత్వం

                                                              అస్తిత్వం

 పూవులన్నీ   ఒకే వాసనతో  , ఒకే రంగులో ఎందుకు ఉంటాయి?
 పిట్టలన్నీ  ఒకే రూపుతో  ఒకే కూత కూయవుగా !
అది ప్రకృతి .
నువ్వు,నేనూ, వాడూ -అతడూ,ఆమె ఒకేలా వున్నామా?
ఎవడి  కులపు గుర్రం  మీద వాడు సవారీ చేస్తున్నాం ,
దృశ్యా అదృశ్యరూపాల్లో, గరిష్ట  దుష్ట చేష్టలతో 
 - ఇది వికృతి.
కానీ ! మానుకీ , మనిషికీ మానవత్వమంత  తేడా లేదూ ?

ఎవరి  గోచీ వారు  ఎగ్గట్టుకు లేస్తే మన కేమిటి పేచీ?
 అనుకుందామా! కానీ -
సముద్రపు నీరంత ఉప్పగా,
నదీజలమంత చప్పగా,
ఆకాశమంత సహజంగా
 చట్టమేమో కులం తో మమేకమై - తన తప్పుడు పనులు 
 తానూ చేసుకుపోతూ ఉంది ..
దేశం కూలిపోయినా, పేలిపోయినా, ఎఫ్.డి.ఐ ల్లో కాలిమాసై పోయినా ,  
బోన్సాయ్ మత అతివాదం  మాత్రం
‘’ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’’ లా  ‘’ ఘర్ వాపసీ ‘’అంటుంది ,
గాంధీని కాల్చిన పొడవైన చేతులుతో  మస్ జిద్ ను కూల్చి 
చర్చిల ముంగిట్లో నీడలతో దొంగాట్లాడుతూ . 
త్రిశూలం , ట్రినిటీ ల  ఆధిపైత్యపు పోరుని  పిల్లి తీర్చిన వేళ –
 రాజ్యాంగ భజన మొదలెట్టింది - దొడ్డ అవతారమెత్తి, సామ్రాజ్యవాదం.
గుడ్డునీ,పిల్లనీ ఎక్కిరిస్తుంది  ,పీడ రాసి పెద్దన్న పెద్దరికం .

‘’ప్రేమ’’ పవిత్రతను  కూడా ఒక  ఉన్మాదం లా
 చూసే కాషాయపు కళ్ళు,
అప్ప చెల్లెళ్ళను మూడు రేపుల, అరు కాన్పుల
ఆటబొమ్మలను కునే ‘కర’ జాతి ,
 కడనీతి పాలిస్తున్న  రాజ్యానికి నిలువెత్తు సాక్ష్యం,
నాలో ప్రాణభయంతో వణుకుతున్న లౌకిక వాదం.

కలం  హలం చేసుకుంటేనే , చరిత్ర పొలం  పండింది .
మదమెక్కి మతపు-టేనుగుల ధ్వంస రచనకు
ఛిద్రమైన  సృజన  మెదడు  ‘’మురుగన్’’ గా మిగలింది.
మకిలి మాటల చేతబడులును   హేతువాదవేదం తో  
 అంధ శ్రద్ద నిర్మూలన ‘’దబోల్కర్’’ యై క్రాంతి బాట పట్టింది.
దారి దోపిడీల  తోలు వలిచి డోలు కట్టే వేళ -
‘పనేసరే’  టోల్ పన్నై  ఫాక్షన్ కు  కమీషన్ గా బలైన దేశంలో  
నిష్కపట స్వరాల  గుండెల్లో  కసాయి గుళ్ళు కవాతు,
  కల్గించిందా  ?కనివిప్పు .
తీరని ఆకలితో - ఎడారి రేణువులూ  ,
సముద్ర తీరాలూ  సునామీ సృష్టించాలంటే
ఇంకా ఎన్ని తలలు ముసుగు చేతుల కత్తులకు కుత్తుకలు అప్పగించాలి.
ఆగడాల సెగలు-  నివురుగప్పిన నిప్పుల్లా, అణువణువూ రాజుకుని  
మనసున్నోడిలో రక్తకణికలై  మరగ కుండా వుంటాయా? ,
ప్రపంచ గ్రామంలో మార్కెట్టు విలువ లేని ఒకేఒక వస్తువు  ప్రాణం.
దానికి  నా కాలాన్ని ,కలాన్ని,గళాన్ని పణంగా పెట్టి –
 కుల, మత కుచ్చితాలను  చుట్టుముట్టి మట్టుబెట్ట పూనుకున్నా- 
చైతన్యోదయాన్ని శతకోటి క్షుద్ర దరిద్ర గోముఖ వ్యాఘ్రా లడ్డుకున్నా-
 సర్వజనీన , సమ భావనతో  శాసించే  లౌకిక  -కవన గీతాన్ని నేనౌతా ...
 సమున్నత సమ సమాజాన్ని శ్వాసించి
 సామ్యవాద  - భువన పతాకను నే నవుతా   ...
స్వేచ్చా విహంగ క్షిపిణీ  భావాన్నై ..
 సౌభ్రాతృత్వపు సమైక్య  సంజీవాన్నై..
మనిషిగా మరణిస్తా , చరిత్రలో  చిగురిస్తా .
రేపటి నేటికి , నేనే  ప్రజల ప్రబల మేనిఫెష్ట్తో ని.  

                                   డాక్టర్ మాటూరి శ్రీనివాస్       
                                                              
                                                            






మైత్రీ వనం

కోహినూర్-93 మిత్రులందరూ 12-4-2015 విశాఖలో కలిసి చదివిన కవిత


 
 
 
 
 
 
 
 
 
 
 
 
               సువిశాల సాగర సుందర తీరానికి యారాడ కొండ
అందమైన ఆత్మీయ స్నేహలతల అండ,
ప్రకృతి గుడిలోన  పరవశాల మరుమల్లె దండ
అల్లంత దూరాన పానగల్లు బడిలోన, కింగ్ జార్జి వొడిలోన
విచ్చుకున్న, ప్రజ్ఞ పాటవాల పద్మకుసుమాలు.
పంచుకున్నవెన్నో  పెంచుకున్నవి వెన్నో  - తిరుగులేని,తరిగిపోని
మరపురాని మానవీయ మైత్రీ సుగంధ పరిమళాలు .
చేసుకున్న బాసలెన్నో, చెప్పుకున్న ఊసులెన్నో
బాల్యాన్ని పిలుచుకుంటూ, కావ్యాలుగా మలచుకుంటూ.
నేడు , ప్రపంచ విజ్ఞాన విహంగాలై,  ఖండాంతరాల
ఎల్లలను దాటి -  దూరాలను మీటి  ,
జ్ఞాప ‘కాల’ గమనంలో  చిగురిస్తున్నవి, నిత్య పచ్చ వసంతాలై.

నైరాశ్యపు నీడల్ని తరిమేసే, ఆశావహపు అనురాగల నిధి
అసహాయ వేళల్లో ఆదరించే, ఔదార్యపు ఆలంబనల హృది .
అందరూ ఒక్కరిగా , ఒక్కరిలో అందరిమై
నిష్కల్మష ,నిరహంకార, నిర్మల, నిశ్చల తేజోమయ సంగీతమై ,
నూరు వత్సరాల నిరాఘాట నిర్విరామ ‘వాట్స్ అప్పుల’ ప్రయాణం
మొగలి పూల పరిమళమై  వెదజల్లగా దశ దిశలూ,
                    ‘కోహినూరు’ ధగ ధగలు  ప్రకాశించి , ప్రజ్వరిల్లు
స్నేహ బంధ వీచికలై . విశాఖ దీపికలై
సూచికలై, భారత భూమి మైత్రీవన జ్ఞాపికలై...
                       

 కలిసేది మళ్ళీ కలవడానికే....డాక్టర్ మాటూరి శ్రీనివాస్  ;12.4.15.

తల్లీ !

 తల్లీ !

తల్లీ ఎవరు కన్నారు అమ్మా మమ్మలను కన్న  నిన్ను ,?
ఎవరైతే నేమి, మాతవు , తండ్రిలేని  మాపాలిట దైవానివి.
 మరి ,ఎందుకు కొందరే నీకు జై కొడతారు? వాళ్ళ జాగీరులా ప్రవర్తిస్తారు .
వారే , ఆకొందరే యందుకు నిన్ను  
ప్రేమించినట్లు భావిస్తారు?  ఓంకారాలు ఘీంకరిస్తారు .
వారికి మాకు విభేదాల వంతెనలు ఎవరు కట్టారు?
ద్రౌపదిలా   పక్షపాతచిత్రనెందుకో?
జాతీయ పటానికి నిలువెత్తై 
పట్టు వస్త్రం తో విరబూసిన కురుల కిరీట ఠీవిగా నిలెట్టి
చేతిలో ఎవరు పెట్టరమ్మా ? ఆ జెండా
తిరంగమో, త్రివర్ణ మో, కొండకచొ  కాషయమో
ఎవరికీ తోచిన రీతిలో వాళ్ళు . ధర్మచక్రాన్ని అధర్మం పాల్జేయడానికా?
జాతీయ చిహ్నం పులికదా! నీ ప్రక్కన ఆ సింహమేమిటీ?
క్రూర జంతువుతో నీకేమి పని? ఏమిటి ఈ ఉన్మాద వైపరీత్యం.?
నిన్ను ఒకరు బొమ్మ తల్లినిచేస్తే ,ఒకరు పురాణ స్త్రీని చేసారే  పబ్బం కోసం.
నీకు చరిత్ర కూడా వ్రాస్తారు స్వార్ధం కోసం,  
గాంధి తాతను జాతి పితను చేసి , తండ్రినే చంపుకున్న చాణక్య చరిత్రమాది
చివరాకరికి మేము భారతీయులము , మముగన్న మాయమ్మలను
వెతుక్కునే వేటలో రాష్ట్రానికొక తల్లిని సృష్టించుకుంటున్నాం .
శంకరంబాడి పాట తో పూర్ణ కుంభం చేతపట్టి,
వరి కంకులు వెదజల్లుతూ తెలుగుతల్లి విలసిల్లితే
జొన్నపొత్తులు  చేతబూని, బోనాలతో నీ వారసురాలు
అరణాల తెలంగాణా తల్లి పురిటిలో అపశ్రుతులెన్నో .
 పుట్టింది మొదలు  ఆ తల్లికి జన్మనిచ్చినపిల్లలే
పెద్దమ్మతల్లికి  పంగనామాలు పెడతారు . 
తల్లులు లేని దేశాలు అనాధులేమీకాదు, గానీ ప్రగతి పధాన
దూసుకుపోయే కొత్త నీటి పునాదులు.  
 పితలు మాతలు వున్నా మనం మాత్రం
వెనక్కి నడుస్తున్న సంప్రదాయ సమాధులం.
                      డాక్టర్ మాటూరి శ్రీనివాస్ .                               



'కాల జ్ఞాని ' మా మాస్టారు

కాళీ పట్నం రామారావు మాస్టారికి 80 జన్మ దినాన శుభాకాంక్షలతో


కాలజ్ఞాని


మా గీతలు దిద్ది,  రాతలు మార్చి,
మా బాల్యాన్ని సుమధుర కావ్యంగా ,
పురోగమన లౌకిక స్వరంగా , వరంగా  మలచిన
మానవ బ్రహ్మ, కారణ జన్మ , విద్య ధర్మా !
అందుకో మా హృదయాలే నీ చెరగని చిరునామా
 , సహృదయ మూర్తీ !
ఎప్పటికీ నీ శిష్యులమే, మరువలేము నీ ఋష్యత్వం
చెరగని, చిరునగవుల అలుపులేని మానవీయం .
ఔరా ! అనిపించు నీ కలం చేయు విన్యాసం,
రా ! రా ! అని పిలిచే నీ గళం లోని ఆత్మీయం ,
‘’కారా’’ అని పులకించు విశ్వ సాహితీ ఆకాశం.
మేమంతా నీ పిల్లలమని,  నీ ఎల్లలమని
ఎలుగెత్తి చాటుతూ, ఖండా౦తరాలు మీటాము,
నీ యజ్ఞంతో పునీతమై, రసజ్ఞులుగా వెలిగాము.
అంతోనీ వొడిలోన , జోజి నాన్నల గుడిలోన
జ్ఞాన దీపమై వెలిగి ,  అవిద్యపు చీకట్లను అలవోకగా తరిమేసే
అవిశ్రాంత ఆచార్యా !
వన్నె పులుగుల గణిత శాస్త్ర జిలుగువి,
సాంఘీకాన్ని నేర్పించిన సామాజిక వెలుగువి,
తెలుగుతనపు సత్య వసంత మెరుగువి,
ఇల , అవతరించిన అవిరామ  కధల కాల జ్ఞానివి,
మా  ప్రియ  ‘’ కారా ‘’వి, మా సాహిత్యపు సహారా వి.
కధా నిలయవిజ్ఞాతుడా , లబ్ద వర్ణ జిజ్ఞాసుడా,
మాలోలోన విహరించు కళల కధల పల్లకీవి -
తెలుగింటి పచ్చని  నిత్య తమల తోరాణి వి .
అందుకో , మా అక్షర దక్షిణాన్ని , ప్రాణాభినందనాన్ని....
                                        .....డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (1978 batch )
                                                  Mobile ;09849000037.