కోహినూర్-93 మిత్రులందరూ 12-4-2015 విశాఖలో కలిసి చదివిన కవిత
సువిశాల సాగర సుందర తీరానికి యారాడ కొండ
అందమైన ఆత్మీయ స్నేహలతల అండ,
ప్రకృతి గుడిలోన పరవశాల మరుమల్లె దండ
అల్లంత దూరాన పానగల్లు బడిలోన, కింగ్ జార్జి వొడిలోన
విచ్చుకున్న, ప్రజ్ఞ పాటవాల పద్మకుసుమాలు.
పంచుకున్నవెన్నో పెంచుకున్నవి వెన్నో - తిరుగులేని,తరిగిపోని
మరపురాని మానవీయ మైత్రీ సుగంధ పరిమళాలు .
చేసుకున్న బాసలెన్నో, చెప్పుకున్న ఊసులెన్నో
బాల్యాన్ని పిలుచుకుంటూ, కావ్యాలుగా మలచుకుంటూ.
నేడు , ప్రపంచ విజ్ఞాన విహంగాలై, ఖండాంతరాల
ఎల్లలను దాటి - దూరాలను మీటి ,
జ్ఞాప ‘కాల’ గమనంలో చిగురిస్తున్నవి, నిత్య పచ్చ వసంతాలై.
నైరాశ్యపు నీడల్ని తరిమేసే, ఆశావహపు అనురాగల నిధి
అసహాయ వేళల్లో ఆదరించే, ఔదార్యపు ఆలంబనల హృది .
అందరూ ఒక్కరిగా , ఒక్కరిలో అందరిమై
నిష్కల్మష ,నిరహంకార, నిర్మల, నిశ్చల తేజోమయ సంగీతమై ,
నూరు వత్సరాల నిరాఘాట నిర్విరామ ‘వాట్స్ అప్పుల’ ప్రయాణం
మొగలి పూల పరిమళమై వెదజల్లగా దశ దిశలూ,
‘కోహినూరు’ ధగ ధగలు ప్రకాశించి , ప్రజ్వరిల్లు
స్నేహ బంధ వీచికలై . విశాఖ దీపికలై
సూచికలై, భారత భూమి మైత్రీవన జ్ఞాపికలై...
కలిసేది మళ్ళీ కలవడానికే....డాక్టర్ మాటూరి శ్రీనివాస్ ;12.4.15.

No comments:
Post a Comment