Friday, 10 August 2018

నేనూ- నా ప్రస్థానం


నేనూ , నా ఈనాటి మనుగడ ఎన్నో మరెన్నో త్యాగ,శ్రమ ఫలితాల మిశ్రమం
ప్రక్రుతిని  సవాలు చేసి నన్ను ప్రపంచానికి  పరిచయం చేసి అమ్మను
మెలిక పడ్డ కన్నపేగును సవరించి గర్భస్థ చివరి వోడుదుడుకులను
సరిజేసిన  పరోక్ష్య ప్రసన్న పరమావౌషధపు పుణ్యాత్ముల కధ  ఒకటుంది...
ప్రాణాలు పోయడమే దాని ప్రధాన ప్రధమ అంతిమ కర్తవ్యం .
అమ్మ పురిటి నొప్పుల్ని మాటు మాయం చేసి, తనకి సుఖ ప్రశాంత ప్రసవాన్ని
 ప్రసాదించిన లేబర్ అనల్జేసియా, అనస్తీషియాల అవిరామ కధ అది ,
ఆ మత్తుమందుల గమ్మత్తుకు చిత్తైంది నరకయాతన సమానమైన అమ్మ ప్రసూతి వేదన
బయటపడుతూ ఉప్పగా ఉందని చప్పరించానా, కమ్మ నీరనుకుని నా ఉమ్మ నీరును నేనే
ఇక  ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైయ్యానా  ఏడవడం కూడా కష్టమైన నా అంతర్వేదన చెప్పలేను.
నా నాసికా కవాటాల్లోంచే  కాక నవరంధ్రాల్లోకి చోచ్చుపోయిందట
 పిండంతో మొదలై నాతో పాటూ  జుగల్బందీగా ఎదిగిన ఉబ్బ జలం
 అమ్మ ప్రేమ ఫలం నన్ను విడవలేని ఆప్యాయతా  బలం అనుకుంటా..
నన్నావరించి అతలాకుతలం చేసి నప్పుడు దాన్నంతటినీ
పీల్చేసి గుండె శబ్దాలను లయ పరచి  గాలిని నింపి పసి నెత్తురు కందుకు ప్రాణం పోసి
పునర్జీవింపచేసిన నియోనేటల్ అనస్తీషియా ప్రతిభకే నేనెప్పుడూ గులామునే కదా!...

అంతటితో ఆగిందా? నా జీవన్మరణ యాత్ర మజిలీ లేని మత్తు వైద్య జాతర
అదేమీ వైపరీత్యమో పొట్టలోని చిన్న పేగు ముడి పడిందని శరఘాతంలా స్కానింగ్ రిపోర్ట్
  ఈ  సారి శస్త్ర చికిత్స తోగానీ గత్యంతరం లేదట,లేదా నాకీ భూమ్మీద నూకలు చెల్లాట
ఇక ఆ మృత్యు మహమ్మారిని జయిస్తానో లేదో? ఎదో తెలియని భయం ఆవరిస్తున్నా
దుఃఖం అంచున విలపిస్తున్న అమ్మకు  ధైర్యం చెప్పాలని ఉంది
కానీ చెప్పే వయసూ లేదు,మాటలూ రావు ఇంకా నిండా బయట పడలేదుగా !??
నాలోనేనే ఇద్దరినీ వోదారుస్తున్నాను నన్నూ అమ్మనీ ,
ఈ లోగా ఆపద్బాంధవుల్లా అన్నీ తామై మళ్ళీ వాళ్ళే- ఆ మత్తుమందు వైద్యులే
 ప్రత్యక్ష్య మయ్యారా ...అబ్బా ఎంత హాయిగా ఊపిరి తీసుకున్నానో?
ఎ పరేషాన్ లేకుండా ఆపరేషన్ జరిగిపోయింది.
అది నుండీ, మధ్యలోనూ , ఆఖరి వరకూ తిరిగి తెలివిని పునః స్థాపితమైయ్యేవరకూ
నా ప్రాణానికి కంటి పాపలైయ్యారు  నిస్వార్ధ సేవకులయ్యారు నా జీవన దాతలైయ్యారు
నాకర్ధమైయింది .... వీరు అభేధ్యులు . మృత్యువును ఇక  నా చెంతకు ఇక చేరనివ్వరు
 ఏ ఆత్యయిక స్థితిలోనూ నిరంతర అప్ర ‘మత్తులు’
క్రిటికల్ కేర్ నిష్ణాతులు, భౌతిక మానసిక శస్త్ర ఆరోగ్య పర మైన ఎటువంటి
వ్యాకులతనైనా
చిటికెలో మటుమాయం చేసే మత్తు వైద్యం వీళ్ళ సొంతం
నొప్పి  విమోచనా మార్గం  వీళ్ళ పంతం
తీవ్ర రోగాల జీవిత చరమాంకానికి  సైతం స్వాంతననింపడం  వీళ్ళ నైజం
వాళ్ళ కళ్ళు నిరంతరం వైద్యమే  మాట్లాడతాయి, త్యాగం చేయాలని మెదడు ఉరకలేస్తుంది
ప్రాణంతోనే వాళ్లకి అనుబంధం దుఃఖ ఉపశమనంతోనే వాళ్లకి సంబంధం
నేను కొన శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న ప్రతీసారీ నన్ను బ్రతికిస్తూ
బ్రతకాలన్న నా ఆశను బ్రతికించారీ ప్రాణ ప్రతిష్టులు, జీవన లైన్ మెన్లు
నిరాడంబర నియమ నిష్ట సుశిక్షిత కార్యదీక్షుతులు అనస్థటిస్ట్ లు........

                                               ...డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                   27-07-18

No comments:

Post a Comment