Friday, 10 August 2018

శిధిల జ్ఞాపకం



ఈ నా దేశం వేల సంవత్సరాలుగా దురాక్రమల పరం పరలకు
ఆధిపత్య వలస పోరులకూ అవిశ్రాంత విధేయరాలు   
మూలవాసులకిక్కడ ఎప్పుడూ ఇది  అంటరాని వసంతమే  
అప్పుడు సందట్లో సడేమియా ఇప్పుడు శ్వేతజాతి బడేమియా
తెల్లవాళ్ళ నల్ల చట్టాల కాళ్ళకింద నలిగి పోయిన మొగలిపూవు ఈ దేశం
స్వేచ్ఛావాయువుకై మొహం వాచిన నిస్సహాయ జటాయువు ఈ దేశం  
అయినా అలుపెరుగని  స్వాభిమానపు ఆనవాళ్ళు   
అక్కడ  బెంగాల్ పులులై ఆత్మాధీనతకై పంజాల విసురుతున్నాయ్   
ఇక్కడ నిర్విరామ హిమాలయ పాద పధం నుండీ దేశభక్తిని స్రవిస్తూ 
పంజాబ్ కిర్పాణ్ లు  తమ రోషానికీ తలమానికమైన సవాళ్లు చేస్తున్నాయ్
జవాబు వెతుకులాటలో బ్రిటీషు సామ్రాజ్యపు అహం బొక్కబోర్లా పడింది
గతిలేక రౌలత్ ఆరాజక విప్లవ నేరాల అభియోగ ప్రతీకారం దారికాసింది     
కానీ, మిలియన్ల భారతీయుల స్వాతంత్రోద్యమ కదంబాన్ని కాలరాయలేక   
వైశాఖి పర్వదినాన్ని పండగ చేసుకోబోయిన ఉద్యమ నిరసన తోట లోకి
వోర్వలేని బ్రిటీష్ పునాదులు కదలిక, విచక్షణ వీడి
డైయర్ రూపంలో మరణశాసనంతో ఉగ్ర మదాన్ని ఉసిగొల్పింది
ఆ సన్నని దారి అమాంతం రెండు బహుముఖ తూటాల ఫిరంగులగా మారి    
జలియన్వాలా బాగ్ ను  మృగ ప్రాయమైన ఉదంతంగా రక్తాక్షరాలతో రాసింది
అమృత సరోవరం రక్త దాహాన్ని రుచి చూడాల్సిన గర్హనీయ సందర్భమది  
స్వర్ణ మందిరం వర్ణ విహీనమై కంపించిన అఘోర మానవ హననమది  
వందల రౌండ్లు వేల ప్రాణాలను చాటునుండీ వచ్చి గుట్టుగా మింగేసాయ్
మందలకొద్దీ  దారీ తెన్నులేని నిరాయుధుల్నిదిగ్బంధించి  నిస్సిగ్గుగా  
బుల్లెట్లు తోట గోడలకు నిలివునా సిలువలు వేసి కక్ష సాధించాయ్
సమరసతను చిందించాల్సిన వేల కత్తులక్కడకక్కడే నేలకొరిగాయి
బాగ్ ఊరబావి లోని నీళ్ళకు బదులు మృతులు సవాలై ఊరగా   
అక్కడ దుఃఖపు మబ్బులు ఇంక ఇప్పటికీ వీడనే లేదు  
చేతకానితనపు యుద్ధనీతి ఇలానే ఉంటుందని గోడల మీద తూటాలు
చేసిన రంధ్రాలు నిరంతరం సామ్రాజ్యవాదులను వెక్కిరిస్తూనే ఉంటాయి
పూర్వీకులారా ! మీ నెత్తురు వృధా కాలేదు భవిష్య  స్వప్నానికి   
నరమేధం లోంచి విప్లవం  చిగురించేలా ఎన్నో జ్యోతులు వెలిగించింది
 ఆ చైతన్యపు భుగ భుగలను  భగత్ సింగ్ అని పిలుచుకున్నాము   
 స్వతంత్రోద్యపు ఆఖరి పోరాటపు  నాందిగా కొలుచుకుంటుంన్నాము . 
                                                          డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (10-08-18)

No comments:

Post a Comment