Friday, 10 August 2018

పూనిక


 ఒక తీక్షణ సంకల్పం సామూహికంగా నిశ్చయ బుద్ధితో
 అమాంతం పరిసరాలను తృణ ప్రాయంగా విస్మరించి
 దారీ తెన్నూ లేని ఎడారిలో ముళ్ళ జెముళ్ళ మాదిరి
 సముద్ర గర్భాన స్వాతి ముత్యాల తెన్నుగా
 ప్రపంచాన్ని ప్రాణాలతో పలకరించాలని చేస్తోందొక సుదీర్ఘ తపస్సు
  ఆ విపశ్యనామయ ప్రశాంతతకు అనుకంపతో మద్దతుగా
 తనవంతు ఆలంబనందిస్తూ సహా ధ్యానిగా లాండ్ లువాంగ్ గుహ

 అక్కడ ఆ బిలంలో చీకటి చిచ్చులో చిత్తడి రొచ్చులో
నిరంతరం  నిశ్శబ్దపు కటికత్వం హాహాకారాలు చేస్తుంది
 మధ్యలో గబ్బిలాల ఊళలు వాళ్ళ దైనందిన స్వేచ్ఛతో పోటీ పడుతున్నాయి.
 భయం వింత వింత శబ్దాలతో మారుడిలా నాట్యమాడుతోంది
 దిగులు జయిస్తానాని ధీమాగా గుహ గోడను మెల్లగా ఆవరిస్తోంది
 దౌష్ట్యాల  అవిరాళ ఆటంక  ప్రయత్నాలన్నిటినీ  తిప్పి కొడుతూ
 అంతటి తమస్సులో ఒక తపోధనుని సాన్నిధ్యంలో శ్రావకులై
 అభినవమైన మొక్కవోని నిశ్చలత తో ఆ యవ్వన  సమూహం

 ఇక్కడ అలుపెరుగక ప్రాణాన్వేషణ వేటలో మరొక పట్టుదల
 ప్రపంచాన్నేఏకం చేసి ఒక అత్యాధునికతను వేటకు వలగా నేసింది.
 ఎల్లలు దాటొచ్చిన వేట గాళ్ళు సొరంగ మార్గంలో సోదాలకే సవాళ్లు విసిరి
 ఉత్కంకే ఊపిరాడనివ్వక  జలగండాన్ని జయించి శోధించారు
 వైల్డ్ బోర్స్ ప్రాణ రక్షణకోసం  సీల్స్, డైవర్స్ ప్రాణాలను పణంపెట్టి
 సర్వ మానవతను  సమిధిగా వెలిగించిన  ఒక యజ్ఞం
 తల్లులే కాదు సర్వజనమూ  పొలాలూ పల్లెలూ ఊళ్ళే కాదు
 ప్రపంచమే  సంఘటితమై చేసిన ఒక చారిత్రిక అద్భుత సాహసం

 రెండు వారాలుగా ఇరువైపులా ఆకలీ దాహం తెలియనీ
 అయినవాళ్ళ ఆనవాళ్ళు  కూడా గుర్తురాని అధి భౌతికత వాతావరణంలో
 ఆలోచనలు లేవు ఆశలు లేవు ఆందోళనలు లేవు ఆశయమొక్కటే
 ఆ కొండ కుహరంలోని వారికి ప్రాణ వాయువయ్యింది
 యజ్ఞ సాకారమైంది  తపస్సు సాఫల్యమైంది కలగలిసిన
 ధ్యానమే చివరకు ఆ సంకల్పానికి  ప్రాణమైంది  .

                                    డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (15-07-18)

No comments:

Post a Comment