dr maturi srinivas poet
A renowned poet, writer, transalator and a social activist. A doctor (pulmonologist) by profession.
Monday, 7 February 2022
రమాబాయి - అంబేద్కర్ విజయ రహస్యం
@అంబేద్కర్ విజయరహస్యం -
రమాబాయి అంబేద్కర్ @
ఫిబ్రవరి 7, (1897-1935) రమాబాయి అంబేద్కర్ 125 జన్మ దినం సందర్భంగా..
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
“నా జీవితంలో నేను నిన్ను కలిసి ఉండకపోయినట్లు అయితే? నా జీవితం ఏమైపోయి ఉండేదో?? నా జీవన సంగీతం శృతి తప్పిన రాగమై ఉండేది. నా బ్రతుకంతా తల క్రిందులై ఉండేది. ఎంతో వేదనాభరితమై ఉండేది. నేనొక మరుగుజ్జు వృక్షములా నిలిచి పోయి ఉండేవాడని...” ఈ మాటలన్నది ఎవరో కాదు డాక్టర్ భీమారావు రాంజీ అంబేద్కర్. తన జీవిత భాగస్వామి రమాబాయి గురించి రాసిన మాటలివి . 1930లో లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళే ముందు తన జీవిత భాగస్వామి రమాబాయికి రాసిన ఉత్తరం ఏంటో ప్రాచుర్యం పొందింది . అందులో అతడు ఎంతో కీలకమైన తన మనోభావాలను వ్యక్తపరచడమే కాకుండా రమాబాయి వ్యక్తిత్వాన్ని విలక్షణ సంస్కారాన్నీ కూడా ఆవిష్కరిస్తాయి. రమాబాయి అంబేద్కర్ గారి జీవితంలో పోషించిన అతి సున్నితమైన, అత్యంత కీలకమైన భూమిక గుర్తు చేసుకుంటూ తను భారతరాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన ప్రస్థానంలో ఆమె పాత్రను శ్లాఘిస్తూ తన విధేయతను ప్రకటిస్తారు. నిజనికి అది ప్రతీ ఒక్కరో అందరూ చదవాల్సిన ఒక సుదీర్ఘమైన ప్రేమలేఖ. అంబేద్కర్ తన భార్యను ఎంత ప్రేమించారో , ఎంతగా గౌరవించారో, ఎంత అభిమానించారో ఆమెకు తన జీవితంలో ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారో ఆ లేఖ తెలుపుతుంది. అంతకంటే ముఖ్యంగా ఆమె గుణసీలతనూ, సంయమనాన్నీ , సహనాన్నీ , త్యాగాన్నీ, విశాల మనస్తత్వాన్నే వివరిస్తుంది. రమాబాయి భర్తను గౌరవంగా “సాహెబ్” అని, అతడు ఆమెను ప్రేమగా “రామూ” పిలుచుకునేవారు.
డాబోల్ హార్బర్లో (మహారాష్ట్ర ,రత్నగిరి లో ఒక చిన్న వాడరేవు) బుట్టల్లో చేపలు మోసే కూలీ గా జీవిస్తున్న భీకూ ధోత్రేకూ,రుక్మిణి కీ ఫెబ్రవరి 7,1898లో జన్మించిన రెండవ సంతానం,రమాబాయి. ఆమెకు గోరాబాయి, మీరాబాయి, శంకర్ తోబుట్టువులు. డాబోల్ దగ్గరలోనే మహాపుర లో చిన్న గుడిసెలో నివాసం. చిన్నతనంలోనే తల్లితండ్రులిద్దరినీ కోల్పోయి తన తోబుట్టువులతో సహా ముంబై బైకుల్లా ప్రాంతంలో తన మేనమామ గోవింద పుర్కార్ ఇంట పెరిగారు. ముక్కుపచ్చలారని 9వ ఏటే బాబాసాహెబ్ (14సంవత్సరాల వయసు) తో బైకుల్లా చేపల బజారులో 1906 వివాహం జరిగిపోయింది. అక్కడ నుండీ ఒక పసి బాలిక ఒక మహోన్నత వ్యక్తిత్వానికి ఆసరాగా,వెన్నుదన్నుగా ఒక సంపూర్ణ భాగస్వామిగా ఎదిగిన తీరు ప్రశంసనీయం . బహుసా ఒక భారతీయ స్త్రీగా,గృహిణి గా జీవితంలో ఎవరూ చూడడాన్ని కష్టాలను చవి చూసిన రమాబాయి ఎన్నో త్యాగాలకు ప్రతిరూపంగా నిలిచారు. ఆమె జీవితాన్ని స్పృసిస్తే ఉదాత్తత, నిరంతర శ్రమ వ్యక్తి జీవిత సాఫల్యానికి రెండు ముఖ్యమైన పార్శ్వాలుగా తోస్తాయి. 20శతాబ్దపు అత్యుత్తమ మేధస్సుగా కొలవబడే అంబేద్కర్ వెనుక ఉన్న నిశ్శబ్ద ప్రేరణా శక్తి కీ , అకుంఠిత స్పూర్తీ కీ చిహ్నంగా రమాబాయి నిలుస్తారు. సాధారణ దళిత గృహిణి కి మించి వెయ్యి రెట్లు సాహసోపేత జీవితాన్ని ఆమె గడిపారు. ఓర్పుకూ, సహనానికీ, అణుకువకూ చిరునామా రమాబాయి. ఆమె జీవిత పోరాటం చిన్నతనంలో తల్లితండ్రులను కోల్పోవటంతోనే ఆరంభమయ్యింది. అంటరాని తనం ఒకప్రక్క , కటిక దారుద్ర్యం మరొక ప్రక్కా ఆమె జీవితాన్ని మరింత జటిలం చేసాయి. అంబేద్కర్ విదేశాల్లో స్పాన్సర్ల ఆర్ధిక సహకారంతో, స్కాలర్ షిప్ మీద చదువుతున్న రోజుల్లో ఇక్కడ ఇంటిలో పిల్లలకు రెండు పూటలా కడుపునిండా ఆహారం అందించలేని దుస్థితి అమెది. పిల్లలను అర్ధాకలితొ నిద్రపుచ్చి, నీళ్ళు త్రాగి నిద్రపోయిన రాత్రులెన్నోఆమె జీవితంలో . వీధిలలో తిరిగి ఆవు పేడ ఎత్తుకుని వచ్చి పిడకలను చేసి అమ్మిన డబ్బులతో ఇంటిని నడిపిన అభిమానవంతురాలు రమాబాయి. ఆమె ఇచ్చిన నైతిక బలం, ఆమె చూపిన సహనం, దృఢ సంకల్పం బాబాసాహెబ్ ఉన్నత శిఖరాలకూ విజయపరంపరలకూ లకు మూల స్తంభాలుగా నిలిచాయి. ఆమె అంతటి పేదరికములోను కూడా విదేశాలలో చదువుకుంటున్న అంబేద్కర్కు ఏ లోటూ రానీయలేదు, ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. ఆమె మౌనమే అతనికి ప్రోత్సాహమై నిలిచింది. ఆమె నిశ్శబ్ద కన్నీళ్ళు అతన్ని మరింత దృఢ నిశ్చయునిగా మార్చాయి. ఎందఱో బంధువులు అంబేద్కర్ను ఉన్నత చదువులకు వెళ్ళనీయకుండా ఆపడానికి ఆమెద్వారా ప్రయత్నించినా ఆమె పట్టుదలా సహనం ముందు వారి ఆటలు సాగలేదు. అంబేద్కర్ సాధించిన విలువైన డిగ్రీలూ , జ్ఞాన సంపద ఆయన ఆశయ సాధన, భావి బహుజన సామాజిక విప్లవానికీ ఎంత అవసరమో ఆమె బాగా తెలుసు. అందుకే అతని విద్యకు ,అతని ఏకాగ్రతకూ ఎలాంటి విఘాతము కలుగనీయ కుండా అన్ని కష్టాలనూ ఆమె మౌనంగా స్వీకరించింది. అంబేద్కర్ అనే శిఖరం వోరిగిపోకుండా ఒక కీలకబిందువై నిలిచింది, పీడిత వర్గాల నావ మునిగిపోకుండా లంగరులా కాపాడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సందర్భాలలో నిస్సంకోచంగా ఆమె అందించిన స్పూర్తినీ ,సేవలనూ, త్యాగనిరతిని నైత్యిక స్థైర్యాన్నీ బహిరంగంగానే కొనియాడారు. వీరిద్దరి మధ్యా విద్యాపరమైన, జ్ఞానపరమైన ,ఆలోచనాపరమైన ఎన్ని అంతరాలు ఉన్నా అంబేద్కర్ లోని కుటుంబపరమైన సంశయాలను నివృత్తి చేయడంలోనూ భయాలు పారద్రోలడంలోనూ, అతనికి అన్ని విధాలుగానూ ప్రోత్సహించడంలోనూ అందించిన ఆమె సహకారానికి మచ్చుతునక డాక్టర్ అంబేద్కర్ సాధించిన విజయాలే.
రమాబాయి తల్లిగా అనుభవించిన క్షోభ వర్ణనాతీతము. వారిద్దరికీ ఐదుగురు సంతానము. వరుసగా గంగాధర్ , యశ్వంత్, రమేష్ ,కుమార్తె ఇందూ ,ఆఖరివాడు రాజారత్నం . ఎంత మమకారంగా పెంచుకుందామనుకున్నా కూతురు ఇందూతో సహా నలుగురి బిడ్డలూ అనారోగ్యంతో పౌష్టికాహార లోపంతో మరణించారనంటే నమ్మశక్యంగా ఉండదు, కానీ వాస్తవమదే . పిల్లలను పేదరికం నుండీ కాపాడుకోవడానికి రమాబాయి చేయని సాహసం లేదు. బ్రతికున్నఒక్కగానొక్క సంతానము యశ్వంత్ మాత్రం. అతడే అంబేద్కర్ తరపున మిగిలిన వారసుడు. ఆకలి అలసిపోయిన ఆరోగ్యం, కన్న వారిని కోల్పోయిన నైరాశ్యం ఎంత కాలం సహకరిస్తుంది. కష్టాలు తీరి ఆర్ధికంగా పుంజుకునే సమయాని రమాబాయి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆరునెలలు తీవ్ర అనారోగ్యాన్ని అనుభవించి మార్చ్ 27,1935 న ఆ మహా త్యాగ మూర్తి తన తనువు చాలించారు.
“నన్ను సాగానపడానికి నౌక దగ్గరకు వచ్చావు. నీ భావోద్వేగాన్ని అర్ధం చేసుకోగలిగాను. నీ పెదవులు కంపించాయి కానీ, నీ గొంతు పెగల లేదు. నీ కళ్ళే మాటలకు మించిన భావాలను ప్రదర్శిస్తూ మౌనంగా మిగిలిపోయాయి. ఆ క్షణం కన్నీళ్ళే భాషగా నిన్ను ఆదు కున్నాయి..”అన్న డాక్టర్ అంబేద్కర్ మాటలు రమాబాయి హృదయం ఎంత లోతైనదో , ఆమె మనసు ఎంత విశాల మైందో తెలియచేస్తుంది. రమాబాయి యొక్క సహ్రుదయతకూ, ఔదార్యానికీ, నైతిక స్వచ్ఛతకూ, కష్టాలను అనుభవించిన ఆమె ధీరోదాత్తతకూ, అతనితో కలిసి బాధలను అనుభవించడానికి ఆమె చూపిన సంసిద్దతకూ కృతజ్ఞతగా ”పాకిస్తాన్ ఆర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా “ 1940 రాసిన (వాల్యుం 😎 అనే గ్రంధాన్ని రమాబాయి అంకితం చేసి తన ప్రేమ చాటుకున్నారు అంబేద్కర్ .
అటువంటి మహోన్నత స్త్రీ మూర్తికి నివాళి
Tuesday, 14 December 2021
సహజం
సహజం
కన్నీళ్లకు ఎంత బలమో కదా ?!
అవి ఇంకితేనే గానీ హృదయం తేలికవదు
కలవవనుకునే భూమీ ఆకాశాల
మధ్య ప్రణయమైనా ప్రళయమైనా కూడా అంతే!
అవినాభావమే ప్రకృతి మార్మికతకు పర్యాయం
కురిసినదంతా ఇంకాల్సిందే
ఉరికినదంతా ఉరిమిందంతా కలవాల్సిందే
అనుభవాలలోతెంతైనా జీవితంలో మేళవించాల్సిందే, అంతే ..
పులకింపైనా , చిర చిరలైనా
పుడమి చిట్ట చివరకంతా భరించాల్సిందే
ముసురు వెల్లువలో కొట్టుకుపోవాల్సిందే ,
మొదమైనా ఖేదనైనా అంతే
భూమేగా విత్తుకి చిరునామా
కనికరించని నాడు
మేఘాల కాఠిన్యానికి ఒప్పగించుకోవడమే ,
నువ్వైనా నేనైనా ూడా అంతే....
కూడి కురిసినప్పుడు పులకించడం
ఘర్జించడం కంపిండం
వీడి విచ్చిన్నమై ఛిద్రమైపోయినప్పుడు
కాలం పూసిన లేపన సాయంతో ఘనీభవించడం,అంతే
ప్రకృతి గేలానికి గుచ్చిన ఎర బతుకెప్పుడూ పరాధీనమే
మేఘామైనా దేహమైనా కూడా అంతే ...
NEET లో నీతి ; ఓ వివాదం
NEET లో నీతి ; ఓ వివాదం
NEET అనేది మెడికల్ కాలేజి లో MBBS లో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష. ఈ NEET పై కేంద్ర వైఖరి నీట్ గా లేదు. అన్ని వ్యవస్థ లతో పాటూ వైద్య విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడం, ఆశ్రిత పక్షపాత ధోరణి అవలంబించడంతో ఈ వివాదానికి తెర లేచింది. దీనుకి ద్రావిడ పార్టీ దక్షిణాది రాష్ట్రం తమిళనాడు ప్రముఖ పాత్ర పోషించడంతో వివాదానికి ప్రాధాన్యత ఏర్పడింది. 12త్ క్లాస్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెడికల్ కాలేజీల్లో సీట్ల పంపిణీ జరగాలనేది తమిళనాడు ప్రభుత్వ ప్రధాన డిమాండ్. దీనికి అనేక సాంకేతిక సామాజిక హేతుబడ్డ మైన కారణాలను చూపడంలో ఆ ప్రభుత్వం సఫలీకృతమైంది. అందులో NEET వలన జరిగే ప్రధాన నష్టాలను ప్రజల ముందు ఉంచడం ఒకటి. అదే సామాజిక న్యాయం అంశం. దెస వ్యాప్త ప్రవేశ పరీక్షలో స్టేట్ సిలబస్ వారు, గ్రామీణ ప్రాంతాలలో చదివినవారు CBSEచదివిన వారితో పోటీ పడలేరనేది రాజీ లేని వాస్తవం, మరి అలాంటివారితో NEET పరీక్షలో ఈ వెనుకబడిన విద్యార్ధులు ఎలా పోటీ పది నెగ్గుకు రాగలరు. పట్టణాల్లో డబ్బు తో చదువు ముదిప్పడి ఉంది. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంట మంచి కోచింగ్ సెంటర్ లో అంట ఉత్తమ టీచర్ల ద్వారా తర్ఫీదు ఉంటుంది. ఎలా చూసినా NEET సామాజిక ఆర్ధిక వ్యత్యాసాలను పెంచుతూ సామాజిక అన్యాయానికి దారి తీస్తుంది. నిజానికి ఈ NEET ప్రతిపాదనను CBSE బోర్డూ,MCI(మెడికల్ కౌన్సిల్)రెండూ ఆదిలోనే వ్యతిరేకించాయి. ఈ ప్రహాసనం 2013లోనే ఆరంభమైంది. NEET ప్రారంభంతో PGI ఛండీగర్,AI IMS ఢిల్లీ, GIPMER పాండిచెర్రి లలోని కేంద్ర ప్రవేశ పరీక్షలను రద్దు చేసి వైద్య విద్య లోని నాణ్యత తో రాజీ పడింది. దీనికి కేంద్ర ఇచ్చే జవాబు ఒకే విద్యా విధానం లో మెరిట్ ఉంది, విద్యార్ధుల పై వొత్తిడి ఉండదు, అనేక ఎంట్రేన్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు, అందరకీ అవకాసం ఉంటుంది, పారదర్సకత ఉంటుంది, సీట్ల స్కాం కుదరదు లాంటి వాదనలను తేరా మీదకు తెసుంది.
తమికనాడు ప్రభుత్వం కేంద్రం పై చేస్తున్నప్రధాన మైన ఆరోపణ ఒకటి న్యాయపరమైనది, రెండవది విద్యా వ్యవస్థ పరమైనది. మూడవది విద్యార్ధుల ప్రాణాలకు సంబందించినది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (అమెండమేంట్)బిల్ 2016 ప్రకారం NEET పరీక్ష వద్దుకునే రాష్ట్రాలు వారు వారికి ఇష్టమైన పద్దతులను అనుసరించవచ్చనేది ప్రధానాంశం. ఆ రాజ్యంగా సవరణ మేరకు తమిళనాడు ప్రభుత్వం NEET వద్దనుకుంది. ఎందుకంటే కేంద్ర వైఖరి డబ్బున్న వారికీ, పట్టణాల్లో చదువుకున్నవారికీ సులభతరమై వర్గ వివక్ష, కుల వివక్ష, లింగ వివక్ష తో పాటూ ఆడపిల్లలకూ గ్రామాల్లో చదివి పైకివచ్చిన వారికీ, ఇతర వెనుక బడ్డ వర్గాలవారికీ ఈ వైద్య విద్య దూరం చేసే కుట్రగా కనిపించింది. అలాగే విద్యార్ధులకు వొత్తిడిని మూడింతలు చేస్తుంది. కుటుంబ సభ్యుల నుండీ వచ్చే వొత్తిడి ని , కోచింగ్ సెంటర్ నుండీ వచ్చే వొత్తిడి నీ ,తోటి విద్యార్ధులతో పోటీ వొత్తిడి నే తట్టుకోలేక ఆత్మహత్యలు పాల్పడడం సభ్యసమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది.
“క్షమించండి ,అలసిపోయాను” అని రాసి 19సంవత్సరాల బాలిక మదురై లో ఆత్మహత్య చేసుకుంది. ఆదిత్య రెండవసారి NEET ఫెయిల్ అయి ధర్మపురిలో మూడవ సారి తప్పి ఆత్మహత్యచేసుకున్నాడు.మోతీలాల్ ,విజ్ఞేశ్ ఇలా వరుసగా 13మంది విద్యార్ధులు NEET పరీక్షలో ఉత్తీర్ణులు కాలేక ప్రానాలర్పించుకున్నారు. గత కొద్ది కాలంలో ఇవి ఇంకా పెరగడం తో స్టాలిన్ ప్రభుత్వం NEET రద్దు పై తన నిర్ణయాన్ని ప్రకటించిది. తమిళనాడులో బిజెపి తో పాటూ AIDMKలు తప్ప అన్ని ప్రధాన పార్టీలు స్టాలిన్ కు మద్దతు ప్రకటించాయి. ఈ విద్యార్ధుల ఆత్మహత్యల ప్రహాసనం కేవల తమిళనాడుకే పరిమితం అనుకుంటే పొరపాటు.రాజస్తాన్ లోని కోటా , తెలంగాణా,ఆంధ్రప్రదేశ్, కేరళలలో కూడా అనేక మంది విద్యార్ధులు తమ ప్రాణాలను తీసుకున్నారు. అనిత అనే అమ్మాయిది మరోక విషాదం. ఇంటర్ లో 1200 కు 1176 మార్కులు తెచ్చుకుని NEET లి ఫెయిల్ అవడం తో ఆత్మహత్య చేసుకుంది.ఈమెకు ప్రతిభ లేదనాలా?జాతీయత పోటీలో నిలబడ లేక పొయిందనాలా? భాషా పరమైన ఇబ్బందా? . ఇదే NEETకు సంబంధించిన రెండు బిల్లుయ్లను కూడా సెప్టెంబర్ 20౧౭ లో రాష్ట్రపతి రిజక్ట్ చేసారు, ఇదే ప్రశ్న ను మద్రాస్ హై కోర్టు లేవనెత్తింది. ఆట అనేది సమాన స్థాయి లో సమాన అవకాశాలు ఇచ్చి సమాన క్రీడాకారుల మధ్య ఆడించాలి. బోధనా మీడియం లో వ్యత్యాసాలు,బోధనా స్థాయిలో వ్యత్యాసాలు, కర్రికులం లో వ్యత్యాసాలు, కాలేజి సిలబస్లో వ్యత్యాసాలు, వెనుకబాటుతనం ఇలా ఇన్ని వ్యత్యాసాలను ఉంచుకుని కామన్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించడం లో హేతుబద్దత లేదని నిరూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. స్వాగాతించడమే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా పై వ్యత్యాసాలను ద్రిష్టిలో ఉంచుకుని విధ్యార్త్దుల ఆత్మహత్యలను సంస్థాగతమైన హత్యలుగా పరిగణించాలీ. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ ఏకపక్షంగా ఉండకూడదు. కోచింగ్ కు అవకాసం లేని వారు, ఉన్నతవర్గాలనుండీ ఆసరా కరువైనవారు, సామాజికంగా ఆర్ధికంగా ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత చదువుల వైపు నడుస్తున్న వెనుకబడిన, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోరే వారైతే సర్వ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొస మెరుపు ; ఏమిటంటే అమెరికన్లకూ ఆసియా అమెరికన్లకూ మద్య వివక్షా పూరిత వ్యత్యాసాలను తొలగించేందుకు ఇటీవల యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా SAT/ACT అనబడే కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను రద్దు చేసింది.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
జీవించే హక్కును సినిమా గా తీస్తే దాని పేరు " జై భీమ్"
జీవించే హక్కును సినిమా గా తీస్తే దాని పేరు జై భీమ్
ఇదేదో అంబేద్కర్ భజన సినిమా అనో, SC ST రిజర్వేషనల గురించి తీసిన సినిమా అనో ,మన కులానికి సంబంధం సంబంధం లేదు, దళితుల గొడవలే అనో మీరనుకుంటే వేడి పప్పు లో కాలేసినట్లే. నిజానికి జైభీం పేరు ఈ సినిమా కి తగిందేనా కాదా అనే చర్చ కూడా జరుగుతుంది. ఆ ఆపేరు ఎందుకు పెట్టారో దర్శక నిర్మాతలు వారే ఆఖరిలో ఒక నిముషం పాటూ క్లారిటీ ఇచ్చారు. మరే పేరూ ఆ సినిమాకు నప్పదని నిర్ధారించుకున్నారు. సినిమా చూసాక మనం కూడా వారితో ఏకీభవించక తప్పదు. ముప్పై యాళ్లనాడు చూసిన మృణాల్ సేన్ మృగయా, గోవిన్ నిహలానీ అర్థ సత్య మొన్నటి 1993 లో ఉమామహేశ్వర రావు తీసిన అంకురం నిన్న వచ్చిన విచారాణ సినిమాలు కేవలం గుర్తుకు వస్తాయి తప్ప వాటికీ ఈ సినిమాకూ ఎక్కడా పొంతన ఉండదు. 1993 ఒక యాదృచ్చికం కావొచ్చు అదే కాలంలో తమిళనాట ఒక అడ్వకేట్ జీవించే వాడు. అతడి పేరు అడ్వొకేట్ చంద్రు . ప్రజల నాయకుడిలా ప్రజల డాక్టర్ లా అతడు ప్రజల లాయర్. ఎన్నో సామాజిక వివక్షకు బలైన కేసులను ఒక్క రూపాయి కూడా ఫీజ్ తీసుకోకుండా వాదించి గెలిపించి నేటికీ న్యాయ వ్యవస్థను సజీవంగా నిలిపిన మాహానుభావుడు.వామపక్ష భావజాలానికి ఊపిరి పోసినవాడు . అనంతర కాలంలో అతడు మద్రాస్ హై కోర్ట్ న్యాయమూర్తిగా జస్టీస్ చంద్రుగా దాదాపు 96,000 కేసులను పరిష్కరించి “పేదలకు న్యాయం “ అనే ఏకపక్ష అజెండాతో గిరిజనుల పక్షాన నిలబడి ఎన్నో లాండ్ మార్క్ జడ్జి మెంట్స్ ఇచ్చాడు. స్త్రీల హక్కుల విషయంలో, కులాలవారీ స్మశానాలను వ్యతిరేకిస్తూ ఆయన డీల్ చేసిన అనేక కేసుల్లో అతి క్లిష్టమైన ఒక పది కేసుల్ని “listen to my case “పేరా పుస్తకం కూడా వేసాడు. అందులో ఒక ప్రముఖమైన కేసు ఇతివృత్తమే ఈ సినిమా, అంటే యదార్ధ గాధను అతడి జీవితాన్ని అద్దంలో పట్టి చూపిన సినిమా.
మనదేశంలో ఎన్నో కులాలు సంచార జీవులుగా బ్రతుకుతున్నారు. పూసలవాళ్ళ నీ చెంచులనీ , గమేలాలూ కత్తులూ అమ్మేవారానీ ఇలా వేల జాతులున్న దేశం మనది. వారి జీవితాలు తరచి చూసిన కొద్దీ ఎన్నో దీనావస్థలు కనబడతాయి. సినిమా ఆరంభంలో వాళ్ళు ఎలుకలను (తినడానికి) పట్టే తీరు , వారి నిబద్దతా ఆశ్చర్యంగా ఉన్నా ఎదో డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలుగుతుంది. డీగ్లామరైజెడ్ పాత్రలు చూడడం మరిచిపోయిన మనకు ఆ పాత్రలను అంగీకరించడానికి కాస్త టైం పడుతుంది . మన ఊహకు అందని రీతిలో ఒక సర్వ సాధారణ సమస్యను మనకు ఎందరికో తెలియని సర్వ సాధారణ సామాజిక రుగ్మతను దర్శకుడు జ్ఞానవేలు డీల్ చేసిన తీరు అమోఘం. మనదేశంలో ఇంకా కోట్ల మందికి ఆధార కార్డ్ గానీ వోటరు కార్డ్ గాని లేదనేది పచ్చి నిజం. మరి వారి పౌరసత్వం వారి ఉనికి వారి భవిష్యత్ సంగతేమిటి? ఈ ప్రశ్న మనందరికీ సినిమా మొదట్లోనే సూటిగా తాకుతుంది. సినిమా అరగంట తరవాత హీరో ప్రవేశిస్తాడు. ఒక ఉద్యమకారుడుగా ఒక ఫైర్ ఉన్న లాయర్ గా సూర్య తన విశ్వ రూపాన్ని చూపించాడు. సినిమా ఆసాంతం హీరో చంద్రు కళ్ళలో పాలనా తీరు మీద ఒక అసంతృప్తీ, వ్యవస్థ మీద నిరసనా కనబడేట్టు ఉంటాడు. ఒకే తీక్షణత తన కళ్ళలో ప్రతిబింబిస్తాడు. “ సమస్యలపై పోరాటం చేయడానికి చట్టం ఒక అస్త్రం, కుదరకపోతే రోడ్డు మీదకోస్తాం “ అని ప్రకటిస్తాడు. వాస్తవాలు నమ్మడానికి కష్టంగా కఠినం గా ఉంటాయి. ఇంట్లో కూర్చుని ఇలా ఉందా దేశ పరిస్థితి అంటే అవుననే వోప్పుకోవాలి. సూర్య పేరు కూడా చంద్రు గా పెట్టి సినిమాకు మరింత నేటివిటీని తెచ్చాడు డైరెక్టర్ . చంద్రు దృష్టి కొచ్చిన ఒక నిండు చూలాలైన సిన్నమ్మ అనే గిరిజన మహిళకు జరిగిన అన్యాయం కేసును ను వాదించడానికి స్వీకరిస్తాడు. గతంలో ఎక్కడ దొంగతనా జరిగినా స్టూవర్టు పురం వైపు చూసే వారు, పోలీసులు. బ్రిటీష్ గెజెట్ లో కూడా కొన్ని కులాలను నేరపూరిత కులాలుగా ఉన్న సంగతి వాస్తవమే కానీ వారు నేరస్తులు కారు. దొంగతనం నేరారోపణతో పోలీసులు తీసుకెళ్ళిన సిన్నమ్మ భర్త రాజన్న పోలీసు స్టేషన్ నుండీ తప్పించుకున్నాడని, కనబడడం లేదనేది ఆ కేసు.ఆ కేసును ఎవ్వరూ వాదించడానికి ముందుకు రారు ఎందుకంటే అన్ని ఆధారాలూ రాజన్న పోలీసు కస్టడీ నుండీ పారిపోయాడనే వాదనను నిర్ధారిస్తాయి. అలాంటి జఠిలమైన కేసును పోలీసు వ్యవస్థలూ, న్యాయ వ్యవస్థ కూ ఎదురు నిలిచి వాదించి ఆ గిరిజన మహిళను న్యాయం చేయడం ఉన్న తృప్తి గురించి చివరలో ఆ కేసు ఎంక్వయిరీ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) అన్న మాటలు చాలా మంది అనే మాటలే. చంద్రు అతి సామాన్య జీతితాన్ని జీవిస్తూనే . కింది నుండీ పై వరకూ అందరూ చే గౌరవించబడతాడు.స్వాభిమానానికి చిహ్నం గా కనబడతాడు. వర్గ పోరాటాన్నీ, కుల పోరాటాన్నీ రెండు పోరాటాలనూ జమిలీగా నడుపుతూ లాల్ నీల్ సమ్మేళనానికి నాంది ఉంటూ చివరకి సిన్నమ్మకి భూమి వచ్చేట్లు వాదించడం ఒక కోణం అయితే నగరంలో ఇప్పించేట్లు వాదన చేయడం కొసమెరుపు.
పోలీసుల ఆగడాలను కాస్త లోతుగా చర్చిలోకి తెచ్చి , వారి వికృత కృత్యాలను విపులంగా చూపించి పోలీసు వ్యవస్థ బండారాన్నిబయట పెట్టడం మరొక సాహసం. చేసిన ఒక తప్పు కప్పి పుచ్చడానికి ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందో తెలియ చేయడం అటుంచి వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి పోలీసు వ్యవస్థ మొత్తం IG,DGP, నుండీ అతున్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ న్యాయవాది వరకూ అందరూ ఆ తప్పులను సమర్ధిస్తున్న న్యాయ వ్యవస్థ ఒక వైపు ఒక అనామక ఇల్వార్ తెగకు చెందిన అక్షరజ్ఞానం లేని కేవలం భర్తను కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న గర్భిణీ ఒక వైపుగా సాగే పోరాటంలో అడ్వకేట్ చంద్రు సినిమా మొత్తం అయితే పోలీసు స్టేషన్లో తప్పితే కోర్టులో అన్నట్లు నడిపిస్తాడు. ప్రత్యెక విచారణాధికారిగా నమ్మకమున్న ఒక పోలీసుఅదికారి నియమింప బడేట్లు సాహసిస్తాడు. ప్రకాష్ రాజ్ పాత్రలోని విచారణ అధికారి కూడా ప్రభుత్వ ఉచ్చు లో ఉండే విచారణ మొదలు పెడతాడు. కానీ అతన్ని గూడెం కి తీసుకెళ్ళి అక్కడి వారి ఘోష వినిపిస్తాడు చండ్రు. ప్రతీ ఒక్కరిదీ ఒక్కొక్క పోలీసుల జులుం కి బలైన ఒక్కొక్క కధ. బడిలో ఎవరి రబ్బరు కనబడకపోయినా తన బేగ్ నే వెతుకుతారంటూ ఏడుస్తూ చెప్పే బాలుని కధకు కరిగిపోతాడు ఆ అధికారి. “వాళ్లకి డబ్బూ,అధికారం, కులం ఉన్నాయి సార్ !,వీళ్ళకు ఎవరున్నారు సార్ మనం తప్ప” అన్తాది లాయర్ ఆ అధికారితో. న్యాయానికీ అన్యాయానికీ మధ్య నలిగిపోయే పోలీసు అధికారి పాత్రకు ప్రకాశ రాజ్ తప్ప మరొకరు దొరకరు. ఒక సందర్భంలో హిందీలో వాంగ్మూలం ఇస్తున్న బంగారం వ్యాపారికి చెంప మీద కొట్టి తెలుగులో చెప్పు అంటాడు. అక్కడ అది కరెక్ట్. అతడి వాంగ్మూలం తెలుగులో తీసుకోవడం అనివార్యం పైగా ఎందఱో ఇలాంటివారు ఇతర రాష్ట్రాల నుండీ వచ్చి గ్రామాల్లో తండాల్లో ఏళ్ల తరబడి స్టిరపడి స్థానిక భాష నేర్చుకుని వ్యాపారం పేరుతొ గిరిజనులను దోచుకుంటున్నారన్నది కూడా వాస్తవం.
ప్రజాస్వామ్యబద్దంగా దేశం నడవాలంటే లేజిస్లేటివే వ్యవస్థ(ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు), కార్యనిర్వాహక వ్యవస్థ(IAS,IPSలూ బ్యురోక్రాసీ అంటాం) , న్యాయవ్యవస్థ (ఇందులోకే పోలీసు వ్యవస్థ వస్తుంది)ఈ మూడూ సక్రమంగా పనిచేయాలి. రాజ్యాంగం ఇచ్చిన ఒక మనిషి, ఒకే వోటు, ఒకే విలువ,ఒకే న్యాయం అనే సిద్దాంతానికి అందరకీ స్వేచ్చ సమానత, సహోదరత్వం ,సమన్యాయం అనే మౌలిక విలువలకూ అడుగడుగునా అడ్డం పడుతున్న పందికొక్కుల్ని పట్టిచ్చే ఎలుకలు తినేవారి జీవితాలు తెరకెక్కించినదీ సినిమా. అలగా జనానికి న్యాయం ఎందుకులే అనే నూన్యమైన ఆలోచలున్న న్యాయవ్యవస్థ నూ , పై పదవుల కోసం, ప్రాపకంకోసం ,రాజకీయ పలుకుబడి కోసం ఊడిగం చేసే కార్యనిర్వాహక వ్యవస్థనూఎండగడుతూ, దొరలే నేడు దొంగలనీ దొంగలకు జాతి ఉండదని నిరూపిస్తాడు చంద్రూ . 2015 నుండీ 2020 మధ్య కాలంలో దేశంలో సుమారు 500 మంది లాక్ అప్ లో మరణించారని నేషనల్ క్రైం బ్యూరో చెపుతుంది. కానీ ఇప్పటివరకూ ఒక్క పోలీసు కూడా శిక్షించబడలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల పేరెత్తకుండా దాదాపు 40-45 నేరాలను మోపుతూ ఎన్నో రాజ్యంగపరమైన ఆర్టికల్స్ (ఆర్టికల్స్ నంబర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా )ఉటంకిస్తూ సిన్నతల్లి కేసును వాదించి విచారణలో తన పైచేయిని సాదిస్తాడు. తమిళనాడు కేరళలో భూ పోరాటాలకు ఊపిరి పోసిన ఎర్రజెండా ఉద్యమాన్ని దర్శకుడు వాడుకున్నాడు. మొదట్లో చెప్పిన విధంగా జస్టీస్ చండ్రుగా రిటైర్ అయిన సామాజిక ఉద్యమ కారుడు గురించి చివర్లో సినిమాలో చూపుతూ 96,000 కేసులుకు న్యాయం చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలూ ఆయన రైటింగ్స్, రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడ్డాయి అని ముగిస్తాడు దర్శకుడు.. మరి ! ఇప్పుడు చెప్పండి ఇలాంటి సినిమాకి జై భీమ్ పేరు సరైందేనా?? నటుల గురించి నటన గురించి, దర్శకత్వం, స్క్రీన్ ప్లే ,సంగీతం గురించి ఇక ఇక్కడ ఎంత రాసినా తక్కువే.
డా.మాటూరి శ్రీనివాస్
పురుషాహంకారం, మతోన్మాదం మతానికి రెండు పార్శ్వాలు
పురుషాహంకారం, మతోన్మాదం భక్తుల రెండు పార్శ్వాలు
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
మనదేశం అనవసర ఆర్భాటాలకూ,అసహజ అలవాట్లకూ, మసిపూసే గారడీలకూ నక్కలకూ నాగలోకాలకూ, హిందూ మనోభావాలకూ మతోన్మాదాలకూ ఆలవాలమై పోయింది. సామరస్యం ఆనే పదం దేశద్రోహ పదమై కూర్చుంది. ఈ నేపధ్యంలో ఈ మధ్య మనదేశం లో జరిగిన రెండు అవాంచనీయ సంఘటనలు. రెండూ పురుష దురహంకారానికి మతొన్మాదానికీ ప్రతీకలుగా నిలిచాయి.
మొదటిది కడవా/కర్వా(కుండ ) చౌత్ అనే పండుగ మీద వచ్చిన ఒక ప్రకటన. ప్రతీ ఏడాది లాగే ఇటీవల ఈ పండుగ ను భారతీయులు జరుపుకున్నారు. ఈ పండగే ఒక సామాజిక దురాచారం. ఉత్తర భారత దేశం లో కాస్త ఎక్కువ గా జరుపుకుంటారు. పెళ్ళైన మహిళలు కార్తీక మాసంలో ముఖ్యం దీన్ని ఆచరిస్తారు. చంద్ర కాల మాన ప్రకారం అంటే lunar callender (ప్రపంచం మొత్తం సూర్య కాల మానాన్ని అంటే solar callender అనుసరిస్తుంది మన దేశంలో కూడా ,కానీ హిందూ పండగలన్నీ చాంద్రమానాన్నిప్రోస్తాహిస్తాయి, పెళ్ళిళ్ళ ముహూర్తాలతో సహా) కార్తిక మాసంలో పౌర్ణమి వెళ్ళిన నాల్గవ రోజున దీన్నిఆచరిస్తారు. ఆంధ్రుల అట్ల తద్ది లాంటిదన్నమాట. అట్ల తద్ది మంచి మొగుడు రావాలని వచ్చిన మొగుడు బాగా ఏలుకోవాలని ఆడపిల్లలు నోము నోచుకుంటే ,భర్తల ఆయురారోగ్యాలకోసం చేసుకునే పండుగ ఈ కడవా చౌత్ . భారతీయ సంప్రదాయం అని బుకాయించే హిందూ సంప్రదాయంలో మనువు ప్రకారం స్త్రీలు కూడా శూద్రులతో సమానం (నా మాట కాదు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం). స్త్రీలు తమ ఉనికి కోసం తమ ఆయురారోగ్యాలకోసం మాట్లాడకూడదు(నస్త్రీ స్వతంత్రమనర్హతి) . విషయానికి వస్తే ఈ పండుగ ను ఉద్దేశించి డాబర్ కంపనీ ఒక వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది .ఇక్కడ 1998 దీపా మెహతా తీసిన “ఫైర్” సినిమా ను గుర్తు చేయాలి. ఇద్దరు మహిళల కధ అది. ఇద్దరి భర్తలూ పెట్టే నరక యాతన భరించ లేక వారి వారి భర్తలను వదిలేసి ఈ మహిళలు ఇద్దరూ సహజీవనానికి సాహసిస్తారు. ఈ సినిమా అప్పుడు పెద్ద దుమారాన్నే లేపింది. పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగాయి. పోస్టర్లూ బ్వనర్లూ చించేసారు. కొండకచో స్క్రీన్లను కాల్చేశారు. సహజంగా మనదేశంలో అదే కదా జరిగేది. సినిమా ని బ్యాన్ చేయించేసారు ఉన్మాదులు. సినిమా తీసింది స్త్రీలు, నటించింది స్త్రీలు, ఇతివృత్తం వారి సామాజిక స్వేచ్చ. గమ్మత్తుగా నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ జోషి నిరసన కారుల ఉద్యమ స్పూర్తిని అభినందించారు కూడా . మళ్ళీ ఇప్పుడు 23 సంవత్సరాల తర్వాత , స్వలింగ సంపర్కానికి చట్ట సమ్మతి , ఆర్టికల్ 377 ద్వారా లభించిన 2 సంవత్సరాల తర్వాత అదే చరిత్ర పునరావృతం అవ్వడం శోచనీయం.
ప్రస్తుతానికొస్తే డాబర్ వాణిజ్య ప్రకటన ఏమిటీ అంటే ? ఒక యువతీ మరొక యువతీ ముఖానికి డాబర్ ఉత్పత్తి ని ఫేస్ బ్లీచ్ ను పూస్తుంది. ముఖ సౌందర్యానికి సంబధించినప్రకటన అన్న మాట. వారి తల్లి వయసున్న మరొక స్త్రీ వచ్చి వారిద్దరికీ నూతన వస్త్రాలను బహూకరిస్తూ ఆమె ముఖ సౌందర్యాన్ని చంద్రబింబంలా మెరిసిపోతుందని పొగుడుతుంది. తర్వాత ఆ పెద్డావిడ వారిద్దరికీ ఒకరికొకరికి పరస్పరం జల్లెడ లోంచి చంద్రున్ని వారి ముఖాలను చూపి మంచి నీళ్ళు ఇచ్చి వారి ప్రాతివ్రత్య ఉపవాస దీక్షను విరమింప చేస్తుంది. ఈ ప్రకటన అద్భుతంగా ప్రగతి శీలం గా ఉందని అనేకులు అభ్యుదయవాదులూ సామాజిక మాధ్యమాల్లో పొగిడారు. కానీ అంత కంటే పెద్ద ఎత్తున అతివాద మతవాదుల నుండీ నిరసనలూ మొదలయ్యాయి. హిందూ సంప్రదాయాల్లో విధవరాళ్లకూ, విడాకులు పుచ్చుకున్న మహిళలకూ పండుగలలో, పెళ్ళిళ్ళలో పేరంటాలలో ప్రాధాన్యత ఇవ్వరు, సరికదా వారిని ఆ వేడుక సమయాలలో ఆ దరిదాపులకు రానీయరు. మానవ సమాజం పరివర్తన చెంది ఇటువంటి అంశాలలో అభ్యుదయ ఆలోచనలను స్వాగతించడం, చర్చించడం మాని విభేదిస్తూ పాత సంప్రదాయాలను కొనసాగించే దిశగా ఆలోచించడం, అలాంటి దురాచారాలను ఎగదోయడానికి అతివాదులు నిత్యం సిద్దం గా ఉండడం చూస్తే సమాజ తిరోగమనానికి సూచనగా నిలుస్తుంది. ఈ దుర్మార్గుల గోల పడలేక వ్యాపారాలలోని లొసుగుల మేరకు చివరికి ఆ ప్రకటనను డాబరు వారు ఉపసంహరించుకున్నారు. ఇటీవల కాలంలో మనోభావాల పేరుతొ రెచ్చగొట్టే ట్రోల్లింగ్ జరిగడం సోషల్ మీడియాలో నిత్య కృత్యం . దీపావళి సమయంలో పర్యావరణ గురించి ఒక సెలబ్రిటి మాట్లాడుతూ శబ్ద కాలుష్యం వాతావరణ కాలుష్యం పై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తే అతడిని ముస్లీం అని తిట్టారు. పాత మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తే మత ఉన్మాదులు దాడులకు ఎగబడుతున్నారు. మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా డాబర్ ప్రకటన ఉపసంహరణకు సూత్రధారి . ఆ ప్రకటనను ఖండిస్తూ స్వలింగ సంపర్కులు, లెస్బియన్లు కడవా చోత్ జరుపుకోవడం హిందూ సంప్రదాయ విరుద్దమని మనోభావాలను రెచ్చగొట్టాడు. డాబర్ కంపనీ అధినేతలు అమిత్ బర్మన్ , మొహిత్ మల్హోత్రా ఇద్దరూ హిందువులే. వారి అభ్యుదయ స్పూర్తికి గండి కొడుతూ ఆ ప్రకటనను ఉపసంహరించేవరకూ మతవాదులు ఊరుకోలేదు.
సుప్రీం కోర్ట్ జడ్జి జస్టీస్ డి వై చంద్రచూడ్ ఈ మతోన్మాదుల చర్యలను ఉదంతాన్ని సీరియస్ గా తీసుకుని మతోన్మాద మూకల అసహనాన్ని ఖండించారు. స్వలింగ వివాహాలకు చట్ట సమ్మతి, అనుమతి ఉన్న విషయాన్ని ఈ ఉన్మాదులు గుర్తు ఉంచుకోవాలని సూచించారు. ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన స్వలింగ వివాహం చట్ట బద్ధతను కూడా మేము అంగీకరించమని నాటి BJP నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. . డాబర్ వారు అ ప్రకటనను ఉపసంహరించుకోవడం బాధాకరం, బహిరంగ క్షమార్పణల అడగడం మరింత దయనీయం అని” మహిళా సాధికారత- చట్టాలపై అవగాహన “పై జరిగిన సదస్సులో సుప్రీం కోర్ట్ జడ్జి జస్టీస్ డి వై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
మరొక ఉదంతం ప్రసిద్ద ఫేషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ కి, అతడి మంగళ సూత్రా డిజైనర్ ప్రచార ప్రకటనకు సంబంధించినది.“ సవ్యసాచి హిందూ సంస్కృతిని అవమానపరిచాడు”అనే శీర్షిక తో ట్రోల్లింగ్ జరిగింది.” Mangalasootra campaign “ పేరున కొత్తగా డిజైన్ చేసిన ఆభరణాల ప్రకటనలో ఒక స్త్రీ ఒక పురుషుడూ సన్నిహితంగా ఉండడం ఆమె లోదుస్తులలో నూతనంగా డిజైన్ చేసిన మంగళ సూత్రాలు ధరించి ఉండడంతో హిందూ మతవాదులు అభ్యంతరం తెలిపడమేకాకుండా పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేసారు. “inclusivity, empowerment” (సంఘటిత- స్త్రీ సాధికారత)అనే మూల రూపం(concept) తో మంగళసూత్రాలను బంగారమూ వజ్రాలూ పొదిగి design చేయడం జరిగింది. దీనికి కూడా bjp కి చెందిన్ మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా యే సారధ్యము వహించాడు. మంగళ సూత్రం హిందూ మత పవిత్ర చిహ్నం, దాన్ని అవమానిస్తే ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చాడు. చివరికి సవ్యసాచి ఆ ప్రకటన తొలగించాల్సి వచ్చింది.
నేటి తరం స్ద్త్రీలు మంగళ సూత్రం ఒక బానిసత్వపు ఆనవాలు గా చూస్తారు. వాటి చరిత్ర చూస్తే అవి హిందూ సంప్రదాయము లో పితృస్వామ్యానికి , పురుషుని ఆధిపత్య చిహ్నం గామనకు అర్ధం అవుతుంది. వాటి ఆకారం రొమ్ములని పోలి ఉంటాయిని వేరే చెప్పక్కరలేదు . పూర్వకాలం లో పురుషులు తమ భార్యల రోమ్ములకు రక్షణగా బలవంతంగా ఆ ఆకారం లో ఉన్న లోహ తొడుగులు తొడగేవారు. కాలక్రమేనా కాస్త కూస్తో నాగరికత అలవరచుకున్న పురుష జాతి వాటి సైజు తగ్గించడానికి వొప్పుకున్నారు గానీ తీసి వేస్తే వారు అదొక సంప్రదాయ వ్యతిరేక ధోరణిగా తప్పు పడుతూ మనోభావాల పేరుతొ స్త్రీల మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. లోదుస్తులు వేసుకున్న అమ్మాయి ఒక పురుషునితో శృంగార సన్నివేశాలలో మంగళ సూత్రం ధరించి సన్నిహితంగా ఉన్నట్లు చిత్రించడం అలాగే భిన్న మోడల్స్ లో మంగళ సూత్రాలు అమ్మాయిల మెడలో అందంగా చూపడానికి లో నెక్ దుస్తులు తప్పనుసరిగా భావించిన సవ్యసాచి మతవాదుల ముందు బొక్క బోర్లా పడ్డాడు. కొత్త ఆకారాలలో మంగళ సూత్రాలు ఒక ఎత్తు అయితే స్త్రీలు వారి అభీష్టాల మేరకు వస్త్రధారణ సాధికారతతో ప్రవర్తించే ఒక సంకేతాన్ని ఇస్తున్నందుకు సదరు తమకు తాముగా హిందూ పెద్దలుగా పిలుచుకునే వారికి నచ్చలేదు .వీర్ దురహంకారాన్ని భరిచలేక వ్యాపారాన్ని కాస్త పెట్టుకోలేక తన అభ్యుదయ వినూత్నతను ప్రక్కన పెట్టి సవ్యసాచి ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నాడు.
గతంలో తనిష్క్ ఆభరణాల విషయంలోనూ హిందూ పెద్దలుగా చలామణి అవుతున్నవారు రచ్చ చేసారు. ఒక హిందూ స్త్రీని కోడలుగా స్వీకరించిన ముస్లీం దంపతులు వారి హిందూ కోడలికి శ్రీమంతం చేస్తూ ఆభరణాలను అలంకరిస్తున్న ప్రకటనను తప్పు పడుతూ ఇది లవ్ జీహాద్ ను ప్రోత్సహిస్తుందని నానా యాగీ చేసారు. నిజానికి టాటా వారు హిందూ ముస్లీం మతసామరస్య చిహ్నంగా ఆ వ్యాపార ప్రకటనను తీసారు. మరొక ఉదంతం దీపావళి ముందు వచ్చిన మాన్యవర్ క్రొత్త డిజైన్ల కలెక్షన్ కు పెట్టిన పేరు ఉర్దూ ఉంది. ముస్లీం పేరు పెట్టారని రభస చేసారు. యు పీ లక్నో ప్రాంతాల్లో పుట్టి పెరిగిన భాష ఉర్దూ. ఉర్దూ పాకిస్తానీ భాష కాదు. ఇంగితం కామన్ సెన్స్ లేని మూర్ఖుల చేతిలో పడిన దేశం లో ఇలాంటివి భరించక తప్పని పరిస్థితి . అలియ బట్ నటించిన మాన్యవార్ కే సంబంధించిన ఒక వ్యాపార ప్రకటన విషయంలోనూ ఇదే మతోన్మాద ప్రవృత్తిని చూపుతూ దేశ మత సామరస్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. “సంస్కృతీ అదే ఆలోచన కొత్తది “ అనే శీర్షికన అభ్యుదయ ఆలోచనలున్న విద్యావంతురాలైన అమ్మాయి తనను మగ పెళ్లి వారికి కన్యాదానం చేయడాన్ని ప్రశ్నిస్తుంది. అలియ పెళ్లి మండపంలో వరుడి ప్రక్కన కూర్చుని గతంలో తండ్రీ ,నానమ్మ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. తనొక పరాయ ధనం(ఇతరులకు చెందిన ఆస్తి ) గా వారు భావిన్చాదాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. తల్లి తనవైపు రావడాన్ని చోస్తూ ఆమె అన్న మాటలు చిడియా (పిట్ట)అని పిలవడం నీ దానా పానీ ఎక్కడో కదా అనే అర్ధం వచ్చేట్లు మాట్లాడడం గుర్తుకు తెచ్చుకుంటుంది. కానీ ఆకాసమంతా పక్షులదే కదా అని ప్రశ్నించు కుంటుంది. నేనొక వస్తువునో లేదా మరొకరి ఆస్తినో కాదుగా పరాయిలకు ఇచ్చేయడానికి అన్న భావాన్ని వ్యక్త పరుస్తుంది. “ఎందుకీ కన్యా దానం? , నాదొక కొత్త ఆలోచన .దాని పేరు కన్యా మాన్” అంటుంది. “మాన్” అంటే “విలువైనది” అని అర్ధం. వెంటనే పెళ్లి కొడుకు తో సహా అతడి తల్లి తండ్రులు ఆ సూచనని వెంటనే అంగీకరిస్తూ అమ్మాయి తల్లి తండ్రులూ అబ్బాయి తల్లి తండ్రులూ నలుగురూ కలిసి పెళ్లి కొడుకునూ పెళ్లి కూతురినీ ఒకరికొకరిని అప్పగిస్తూ వైవాహిక జీవితం లో ఇద్దరూ సమానమే,ఇద్దరిదీ సమాన బాధ్యత అనే అర్ధం వచ్చే విధంగా లింగ సమానత్వాన్ని చాటే విధంగా ముగిసే ఈ ప్రకటనఎంతో అద్భుత మైన ఆలోచన. కనీ దీనిని కూడా జీర్ణించుకోలేని సమాజం లో మనం బ్రతుకుతున్నాం.
కొస మెరుపు; ప్రకటనలు తీసిన వారూ, అభ్యంతరం తెలుపుతున్నవారూ ఇరు పక్షాలవారూ హిందువులే. ఒక పక్షం మతం తో వ్యాపారం చేస్తుంటే ,మరొక పక్షం మతం రాజకీయం చేస్తుంది. మొదటి పక్షానిది సదుద్దేశ్యం. ప్రగతి శీలం గా అభ్యుదయ ధోరణిగా మతసామరస్యాన్ని ప్రోత్సహించే ప్రకటనలు ఆలోచనలు రేకెత్తించే ప్రకటనలుగా భావించాలి. ఎందుకంటే వారి వ్యాపార ప్రకటనలు రాజ్యాంగబద్దంగా, చట్ట పరిధిలో ఉంటున్నాయి, ఉండాలి కూడా. కానీ అభ్యంతరం తెలుపుతున్న పక్షం ఏక పక్షంగా, అధికార మదంతో ఆహేతుకతతో, తిరోగమన బుద్ధితో మనోభావాల పేరుతొ మాత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. అసలు వీరికి మత పెద్దరికం ఎవరు ఇచ్చారు? మతాన్నీ మనోభావాల్నీ కాపు కాస్తున్నట్లు భ్రమింప చేస్తూ విద్వేషాలను రేచ్చాగోటడం వీరి అజెండా. వీరి మీద ప్రజాసంఘాలూ ప్రగతి శీల సంస్థలూ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాయి. కానీ శక్తి చాలడం లేదు. వీరి మీద కేసులు పెట్టి న్యాయపరంగా హక్కులు సాదిద్దా మంటే చట్టాలూ, న్యాయ మూర్తులూ వీరి చుట్టాలై కూర్చున్నారు. మనం చేయాల్సింది ఏమైనా ఉన్నదంటే ఈ మతోన్మాద చర్యలను బహిరంగంగాఖండించడం , సామాజిక మాధ్యమాల్లో ద్వారా నిరంతరం ఉద్యమించడం , సదరు కంపనీలకు సంఘీభావం ప్రకటించి కోర్టుల్లో చాలంజ్ చేసే విధంగా వారికి సహకరించడం, ప్రజా వ్యతిరేక, రాజ్యంగా వ్యతిరేక ,లౌకిక వాద వ్యతిరేక చర్యలుగా అవకాశం దొరికినప్పుడల్లా ఎండగట్టడమూ ఒక్కటే మార్గం.
-----------------------------------------------------------------------------------------------
మొదటిగా దళితుల వద్దకు ధమ్మాన్ని
దళితుల వద్దకు ధమ్మాన్ని
(సండే టైమ్స్ సెప్టెంబర్ 14,2014)
రచన ;డా.హేమ గునతిలకే
(మనం ఈ ఏడాది సెప్టెంబర్ 17 అనగారిక ధమ్మపాల గారి 150 జయంతిని జరుపుకుంటున్నాం. దక్షిణ భారత దేశంలో అతడు చేసిన పధ నిర్దేశకత , వలసవాదులు వేసిన సంకెళ్ళ నుండీ శ్రీ లంక వాసులను విముక్తి గావించిన తీరును గురించి ఈ వ్యాసం లో గమనిద్దాం.)
1891లో అనగరిక ధర్మపాల మొదటిసారిగా బుద్ధుని జన్మ భూమి అయిన భారత దేశంలో బౌద్ధ పునరుద్దరణ కార్యక్రమాన్ని చేపట్టారన్నా సంగతి మనకు విదితమే. పర్యవసానంగా ఉన్నత వర్గాలవారెందరో బౌద్ధం వైపుగా ఆకర్షితులైయ్యారు. చాల మందికి తెలియని విషయం ఏమిటంటే డాక్టర్ అంబేడ్కర్ కంటే దాదాపు ఏభై ఏళ్ల క్రితమే దక్షిణ భారత దేశం లోని తమిళులకు ,దళితులతో సహా ఒక పెద్ద బౌద్ధ జనోద్యమానికి స్పూర్తిగా నిలిచాడు.
అనగారికుని మొట్టమొదటి భారత పర్యటన దక్షిణ భారతం నుండే ఆరంభమైంది. తన భారత పర్యటనలో భాగంగా మాడమ్ బ్లావెస్కీ మరియ హెన్రీ ఆల్కొట్ ఆధ్వర్యంలో మద్రాస్, అడయార్ లో ధియోసాఫికల్ సొసైటీ లో మొదటిసారిగా కాలు మోపాడు. అంతే కాకుండా తన ఉత్కృష్ట మైన బౌద్ధ ధమ్మదూత కార్యకలాపాలను కూడా అక్కడ నుండే ఆరంభించాడు. పండిత అయోతి ధాస్ చేసిన సేవల ఆధారితంగా ధర్మపాల తన కార్యకలాపాలను నిర్మించాడు. ధర్మపాల సారనాద్, బుద్ధగయా, బెనారస్ లను సందర్శించదానికి ఎంతో ముందే మద్రాస్ లో ఒక దళిత పరియా కులం లో జన్మించిన అయోతి ధాస్ (1845-1914) దక్షిణ భారత దేశ అణగారిన ప్రజల సామాజిక పరివర్తన కోసం ఉద్యమించాడు.
“అంటరానివారు హిందువులు కారు” అనే ఒక విప్లవాత్మక ప్రకటనను 1886లోనే అయోతిధాస్ చేసాడు. దానికి అనుగుణం గానే 1891లో ద్రవిడ మహాజన సభను స్థాపించాడు. హిందూ మతంలోనే ఉంటూ అంటరానివారిగా జీవించే బదులు 1891లో జరిగిన జన గణన (జనాభా లెక్కలు)లో దళితులందరూ “కులరహిత ద్రావిడులు”గా నమోదు చేయించుకోవాలని పిలుపును ఇచ్చాడు. తమిళ దళితులే ఆదిమ లేదా మూల బౌద్దులని వాదించాడు. ఇదే సంవత్సరంలో అంటే 1891, మే 31న అనగారిక ధర్మపాల మొదటి సారిగా మహాబోధి సొసైటీని కొలొంబో లో ఆరంభించి అనంతర కలకత్తాను ప్రధాన కేంద్రంగా చేసుకుని బుద్ధ గయలో బౌద్ధ ఆరామాలను బౌద్ధ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు పూనుకున్నాడు . ఈ చర్యను భారత దేశ బౌద్ధ పునరుద్ధరణ చరిత్ర లో ప్రధమ ఘట్టంగా పరిగణించవచ్చు. రెండు నెలల తర్వాత “;రామన్న/ రామన్య నికాయ”( శ్రీలంకలో ఉన్న మూడు ప్రధాన బౌద్ధ సంప్రదాయా స్రవంతుల లో ఒకటి) భిక్కులను నలుగురిని బోధ గయా తీసుకుని వచ్చాడు. వీరినే శ్రీలంక నుండి వచ్చిన మొదటి తరం ఆధునిక ధర్మదూతలుగా భావిస్తారు.
1892 జనవరి నెలలో మొదటి సారి మహా బోధి పత్రిక ఆరంభించబడింది. అది 8 పేజీల చిన్న పావు ఠావు సైజు లో ఉన్నప్పటికీ ప్రపంచ దృష్టి ఆకట్టుకోగలిగింది. నిజానికి 1893, అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వ మత సమ్మేళనములో పాల్గొనేందుకు అనగారిక ధర్మపాలని ఆహ్వానించడానికి బీజం వేసింది కూడా ఈ పత్రికే. అది జరిగిన వందేళ్ళ కాలం తరువాత ఈ వ్యాస రచయితకు ప్రపంచ మత సమ్మేళనంలో 10 నిముషాల పత్ర సమర్పనకు అవకాశం లభించింది.
అక్టోబర్ 1892లో అనగారిక ధర్మపాల మరియు కల్నల్ ఆల్కొట్ కలిసి మయాన్మార్ లోని అక్యాబ్ (నేడు అది అరాకన్ /రాఖీన్ దీవిలోని సిత్ట్ ప్రాంతంగా చలామణి లో ఉంది) సందర్శించి అక్కడ మహాబోధి సొసైటీ శాఖను ప్రారంభించారు . మయన్మార్ లో అరాకన్ బౌద్ధులు ద్వారా లభించిన ఆర్ధిక విరాళాల సహకారంతో కొలకత్తా లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని ప్రారంభించి మహాబోధి సొసైటీ కార్యక్రమాలను కొనసాగించారు. తర్వాత కాలంలో 1904 లో కొంత కాలం దానిని మూసివేసారు. బ్యాంకాక్ యువరాజు రాజక్సీ ఆహ్వానం మేరకు అనగారిక ధర్మపాల 1894లో బాంకాక్ సందర్శించి స్థానిక రాజరిక వ్యవస్థ సహకారంతో అక్కడ కూడా మహాబోధి సొసైటీ శాఖను ప్రారంభించాడు. మద్రాస్ లో పంచమ కులస్తులకు ఎన్నో స్కూళ్ళను అయోతీ ధాస్ ఆరంభించాడు. అదే కాలంలో పంచమ కులస్తులకు ఉచిత పాఠశాలాలూ నిర్వహిస్తున్న ఇండియన్ ధియో సోఫికల్ సొసైటీ అధ్యక్షుడు కల్నల్ హెచ్ ఎస్ ఆల్కాట్ అయోతీ ధాస్ కు పరిచయమయ్యాడు. “తమిళ బౌద్ధము” స్థాపనకై సహకరించాలని కల్నల్ ఆల్కాట్ ను అయోతీదాస్ అభ్యర్ధించాడు. ఆనాటి శ్రీలంక లో మంచి పేరున్న, బౌద్ధాన్ని పునరుద్దరించిన బౌద్ధ భిక్కు మరియు “విద్యోదయ పిరవిన”(బౌద్ధ పాఠశాల) ప్రిన్సిపాల్ అయిన పూజ్య భిక్కు హిక్కుదువే సుమంగళ నాయక ధేరో కు అల్కొట్ అయోతీదాస్ చేసిన అభ్యర్ధనను ప్రతిపాదనను ఉత్తరంగా రాస్తాడు . పర్యవసానంగా ధర్మపాల తో సహా శ్రీ లంక నుండి వచ్చిన మరొక బౌద్ధ భిక్కు తో కలిసి నిమ్న కులాల వారికి మద్రాస్ లో ద్రవిడియాన్ బుద్ధిష్ట్ సొసైటీ ఏర్పాటు చేయడం కోసం బహిరంగ సభ జరిగింది.
పిదప అయోతీదాస్ కొందరు దళిత వర్గ పెద్దలతో కలిసి శ్రీలంక పర్యటించాడు. అక్కడ పూజ్య హిక్కుదువే సుమంగళ నాయక ధేరో గారినీ ఇతర అనేక మంది బౌద్ధ భిక్కులను కలసారు. మద్రాస్ నుండీ వెళ్ళిన బృందం విద్యోదయ పిరవిన(బౌద్ధ పాఠశాల)లో పంచశీలను స్వీకరించి ఆచరించారు. పూజ్య హిక్కుదువే సుమంగళ నాయక ధేరో ఆశీస్సులతో భారత్ తిరిగి వచ్చి అయోతీధాస్ “శాక్య బౌద్ధ సంఘాన్ని” స్థాపించాడు . దీనినే “ఇండియన్ బుద్ధిష్ట్ సొసైటీ’ అని కూడా అంటారు. 1998లో శాక్య బౌద్ధ సంఘం తన మతపరమైన కార్యక్రమాలను ప్రారంభించింది. పంచశీలను స్వీకరించడం, ప్రతీ ఆదివారమూ బౌద్ధ సభలు నిర్వహించడం, కలవడం, మతపరమైన ప్రసంగాలను వినడం ,సామాజిక అంశాలను చర్చించడం మొదలు పెట్టారు. 1998ఆగస్ట్ 8 న మద్రాస్ రోయ్యిపేట్ లోకల్నల్ ఆల్కాట్ మరియు అయోతీ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు హాజరవ్వాలని వారి నుండీ ఆహ్వానం అందుకున్నాడు, ధర్మపాల. ఆ సభ అనతరం ఎందఱో దక్షిణ భారతీయులు బౌద్ధం వైపు చూడడం మొదలుపెట్టారు.
మరుసటి సంవత్సరం దక్షిణ భారత దేశంలో మద్రాస్ లో మహాబోధి సొసైటీ శాఖను ఆరంభించడం కోసం ధర్మపాల మరొక ఆహ్వానాన్ని అందుకున్నాడు. అప్పుడే మద్రాస్ లో ధర్మపాల మరియు అయోతీదాస్ ఇద్దరూ సహా కార్యదర్శులుగా “బుద్ధిష్ట్ యంగ్ మెన్స్ అసోసియాషన్” రూపు దిద్దుకుంది. శాక్య బౌద్ధ సంఘానికి చెందిన బౌద్ధ భిక్కులు ఆనాడు మహా బోధి సొసైటీ శాఖకు పెద్ద సంఖ్యలో వచ్చిన యాత్రికులకు బౌద్ధ సంప్రదాయం లో పూజలు నిర్వహించారు. ఆ విధంగా ఆ మహాబోధి సొసైటీ శాఖ అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంది.
మద్రాస్ పెరంబుర్లో చిన్న విహారాన్ని నిర్మించడం కోసం మిసెస్ మేరీ ఫోస్టర్ అతనికి ఇచ్చిన విరాళం లోనుండీ 3 వేల రూపాయిలను ధర్మపాల పంపించాడు. మహా బోధి కార్యాలయాన్ని అక్కడ మొదలు పెట్టారు. సింహళీ భంతే నిల్వాక్క సోమనానందను దక్షిణ భారతదేశంలో బౌద్ధ ధర్మ వ్యాప్తి కొరకు నియమిద్దామనే ఉద్దేశ్యంతో తమిళం నేర్చుకోమని ప్రోత్సహించాడు ధర్మపాల. ఆ విధంగా సింహళీ భంతే నిల్వాక్క సోమనానంద పెరంబూర్ విహారలో స్థానిక నివాస బౌద్ధ భిక్కుగా, తమిళనాట తమిళం తెలిసిన మొదటి దమ్మ దూతగా, బౌద్ధ పండితునిగా ప్రసిద్ది చెందాడు. దమ్మ పదను తమిళం లోనికి తర్జుమా చేసాడు. అదే తమిళము లోని దమ్మ పదం యొక్క మొదటి అనువాదము. అది మొదలు అనేక బౌద్ధ గ్రంధాలను, కరపత్రాలను తమిళం లోనికి అనువదించాడు. వాటన్నిటినీ పెరంబూర్ బౌద్ధ విహార ప్రచురించింది. అతి కొద్ది కాలం లోనే పెరంబూర్ విహార తమిళనాడు లో అత్యంత క్రియాశీలకమైన బౌద్ధ కేంద్రం గా మారిపోయింది.
పెరంబూర్ విహార ఆరంభించిన వెంటనే 1900 లో దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటిసారిగా వైశాఖి వేడుకలు వైభవంగా జరిపారు. ఆ చారిత్రక పర్వ దినాన “బుద్ధ భగవానుని జీవితమూ-బోధనలు” తమిళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాటికీ కలకత్తాలో వైశాఖి వేడుకలు ఆరంభించి కేవలం నాలుగు సంవత్సరాలే అయ్యింది. అప్పటికే దక్షిణ భారత దేశాన అనేక మంది తమిళులు బౌద్ధం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. “బుద్ధ భగవానుని జీవితమూ-బోధనలు” పుస్తకం మొదటి ప్రచురణ విడుదలైన వెంటనే మరొక 2వేల కాపీలు ముద్రించవలసి వచ్చింది.
అయోతీ దాస్ మద్రాస్ లో 1907లో “ఒరు పైసా తమిళన్ “అనే వార పత్రికను మొదలుపెట్టాడు. కొత్తగా ఏర్పడిన అన్ని శాక్య బౌద్ధ సంఘాల సమాచార సమాహారంగా ఆ పత్రిక పనిచేసింది. తానూ క్రొత్తగా రూపొందించిన “తమిళ బౌద్ధం” గురించి, బౌద్ధ నేపధ్యంలో భారత దేశ చరిత్ర గురించి ఆ పత్రిక విస్తృతంగా చర్చించేది. దక్షిణ భారత దేశంలో అలా క్రొత్తగా ఏర్పడి గుర్తింపు పొందిన తమిళ బౌద్ధ సమాజం అప్పటివరకూ బ్రాహ్మణ కుల అణిచివేతకు బలైన వారు, వారి ప్రాచీన బౌద్ధ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తామే మూల భారతీయ బౌద్ధులమని తమ ఉనికిని చాటారు. అయోతీదాస్ ప్రకారం పరియా కులస్తులే అసలైన బౌద్దులు, వారి భూములను తర్వాత వచ్చిన ఆర్య దురాక్రమణదారులు దోచుకుని ఆక్రమించుకున్నారు.
ఆ విధంగా అయోతీదాస్ దక్షిణ భారత దేశ తమిళ బౌద్ధ ఉద్యమానికి ఆద్యుడైయ్యాడు. బౌద్ధానికి ఒక జన సామాన్యతను కల్పించాడు . కేవలం తమిళ నాడులోనే కాక బర్మాలోని కొన్ని ప్రాంతాలలో దక్షిణాఫ్రికాలోనూ ఎక్కడైతే దక్షిణ భారతం నుండీ వలస వెళ్లి పోయిన అస్పృశ్య కూలీలున్నారో వారినందరినీ కూడా ఉత్తేజపరిచాడు.
మహా బోధి సొసైటీకి చెందిన ఒక క్రియాశీలక సభ్యుడు ప్రొఫెసర్ పి. లక్ష్మీనరసు, బౌద్ధాన్ని స్వీకరించిన తమిళుడు(నిజానికి యితడు ఆంధ్రుడు/తెలుగువాడు) ,మద్రాస్ బుద్ధిష్ట్ అసోసియాషణ్ సభ్యుడు . 1907లో “ఎస్సెన్స్ అఫ్ బుద్ధిజం”అనే గొప్ప గ్రంధాన్ని రాసాడు. ఆ మొదటి ప్రచురణకు పరిచయ వాక్యాలు రాసినది అనగారిక ధర్మపాల .ఆ పుస్తకం ఎన్నో ముద్రణలను వెళ్లి ఎన్నో భారతీయేతర భాషలలోనికి కూడా అనువదించబడినది, ముఖ్యంగా జపాన్, జేకోస్లావేకియాన్ భాషల లోనికి. అనంతర కాలంలో అప్పదురైయార్ రాసిన “పుతరత్తు అరులారం” (బుధుని కరుణామయ మతం) పుస్తకానికి లక్ష్మి నరసు మూలగ్రంధంగా సహకరించింది .
1923లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమ్మేళనంలో బౌద్ధులకు బుద్ధ గయను అప్పగించాలనే డిమాండ్ కు మరింత బలం చేకూర్చడానికి శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ ప్రతినిధుల బృందంలో అప్పదురైయార్ కూడా చేరాడు . తమిళ నాట దక్షిణ భారత బౌద్ధ పునర్భావానికి ముగ్ధులై 1920లో సిలోన్ తమిళ్ బుద్ధిష్ట్ అసోషియషన్ చెందిన అనేక మంది సింహళీయ బౌద్ధులు ఉత్తేజితులై తమిళ బౌద్ధ సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి దానిని పరిపుష్టి చేయడానికి పూనుకున్నారు.
అయోతీదాస్ దక్షిణ భారతదేశ తమిళ బౌద్ధ ఉద్యమానికి ఆద్యుడైనప్పటికీ ప్రారంభంలో అనగారిక ధర్మపాల అత్యధిక సంఖ్యలో మేధావులను బౌద్ధం వైపు ప్రేరేపించి ఆకర్షించి ఆసక్తిని రగిలించాడు. ధర్మపాల పలుబౌద్ధ వ్యాపకాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ప్రచార నిమిత్తం జపాన్ లాంటి అనేక ఆసియా దేశాలతో పాటూ అమెరిక ఐరోపా దేశాల్లో తిరుగుతూ ఉన్నప్పటికీ భౌతికంగా లేకపోయినప్పటికీ అతడు ప్రారంభించిన కార్యకలాపాలు నిరాఘాటంగా కొనసాగేవి .
అనువాదం – డా.మాటూరి శ్రీనివాస్
Monday, 22 November 2021
Subscribe to:
Comments (Atom)