A renowned poet, writer, transalator and a social activist. A doctor (pulmonologist) by profession.
Tuesday, 14 December 2021
జీవించే హక్కును సినిమా గా తీస్తే దాని పేరు " జై భీమ్"
జీవించే హక్కును సినిమా గా తీస్తే దాని పేరు జై భీమ్
ఇదేదో అంబేద్కర్ భజన సినిమా అనో, SC ST రిజర్వేషనల గురించి తీసిన సినిమా అనో ,మన కులానికి సంబంధం సంబంధం లేదు, దళితుల గొడవలే అనో మీరనుకుంటే వేడి పప్పు లో కాలేసినట్లే. నిజానికి జైభీం పేరు ఈ సినిమా కి తగిందేనా కాదా అనే చర్చ కూడా జరుగుతుంది. ఆ ఆపేరు ఎందుకు పెట్టారో దర్శక నిర్మాతలు వారే ఆఖరిలో ఒక నిముషం పాటూ క్లారిటీ ఇచ్చారు. మరే పేరూ ఆ సినిమాకు నప్పదని నిర్ధారించుకున్నారు. సినిమా చూసాక మనం కూడా వారితో ఏకీభవించక తప్పదు. ముప్పై యాళ్లనాడు చూసిన మృణాల్ సేన్ మృగయా, గోవిన్ నిహలానీ అర్థ సత్య మొన్నటి 1993 లో ఉమామహేశ్వర రావు తీసిన అంకురం నిన్న వచ్చిన విచారాణ సినిమాలు కేవలం గుర్తుకు వస్తాయి తప్ప వాటికీ ఈ సినిమాకూ ఎక్కడా పొంతన ఉండదు. 1993 ఒక యాదృచ్చికం కావొచ్చు అదే కాలంలో తమిళనాట ఒక అడ్వకేట్ జీవించే వాడు. అతడి పేరు అడ్వొకేట్ చంద్రు . ప్రజల నాయకుడిలా ప్రజల డాక్టర్ లా అతడు ప్రజల లాయర్. ఎన్నో సామాజిక వివక్షకు బలైన కేసులను ఒక్క రూపాయి కూడా ఫీజ్ తీసుకోకుండా వాదించి గెలిపించి నేటికీ న్యాయ వ్యవస్థను సజీవంగా నిలిపిన మాహానుభావుడు.వామపక్ష భావజాలానికి ఊపిరి పోసినవాడు . అనంతర కాలంలో అతడు మద్రాస్ హై కోర్ట్ న్యాయమూర్తిగా జస్టీస్ చంద్రుగా దాదాపు 96,000 కేసులను పరిష్కరించి “పేదలకు న్యాయం “ అనే ఏకపక్ష అజెండాతో గిరిజనుల పక్షాన నిలబడి ఎన్నో లాండ్ మార్క్ జడ్జి మెంట్స్ ఇచ్చాడు. స్త్రీల హక్కుల విషయంలో, కులాలవారీ స్మశానాలను వ్యతిరేకిస్తూ ఆయన డీల్ చేసిన అనేక కేసుల్లో అతి క్లిష్టమైన ఒక పది కేసుల్ని “listen to my case “పేరా పుస్తకం కూడా వేసాడు. అందులో ఒక ప్రముఖమైన కేసు ఇతివృత్తమే ఈ సినిమా, అంటే యదార్ధ గాధను అతడి జీవితాన్ని అద్దంలో పట్టి చూపిన సినిమా.
మనదేశంలో ఎన్నో కులాలు సంచార జీవులుగా బ్రతుకుతున్నారు. పూసలవాళ్ళ నీ చెంచులనీ , గమేలాలూ కత్తులూ అమ్మేవారానీ ఇలా వేల జాతులున్న దేశం మనది. వారి జీవితాలు తరచి చూసిన కొద్దీ ఎన్నో దీనావస్థలు కనబడతాయి. సినిమా ఆరంభంలో వాళ్ళు ఎలుకలను (తినడానికి) పట్టే తీరు , వారి నిబద్దతా ఆశ్చర్యంగా ఉన్నా ఎదో డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలుగుతుంది. డీగ్లామరైజెడ్ పాత్రలు చూడడం మరిచిపోయిన మనకు ఆ పాత్రలను అంగీకరించడానికి కాస్త టైం పడుతుంది . మన ఊహకు అందని రీతిలో ఒక సర్వ సాధారణ సమస్యను మనకు ఎందరికో తెలియని సర్వ సాధారణ సామాజిక రుగ్మతను దర్శకుడు జ్ఞానవేలు డీల్ చేసిన తీరు అమోఘం. మనదేశంలో ఇంకా కోట్ల మందికి ఆధార కార్డ్ గానీ వోటరు కార్డ్ గాని లేదనేది పచ్చి నిజం. మరి వారి పౌరసత్వం వారి ఉనికి వారి భవిష్యత్ సంగతేమిటి? ఈ ప్రశ్న మనందరికీ సినిమా మొదట్లోనే సూటిగా తాకుతుంది. సినిమా అరగంట తరవాత హీరో ప్రవేశిస్తాడు. ఒక ఉద్యమకారుడుగా ఒక ఫైర్ ఉన్న లాయర్ గా సూర్య తన విశ్వ రూపాన్ని చూపించాడు. సినిమా ఆసాంతం హీరో చంద్రు కళ్ళలో పాలనా తీరు మీద ఒక అసంతృప్తీ, వ్యవస్థ మీద నిరసనా కనబడేట్టు ఉంటాడు. ఒకే తీక్షణత తన కళ్ళలో ప్రతిబింబిస్తాడు. “ సమస్యలపై పోరాటం చేయడానికి చట్టం ఒక అస్త్రం, కుదరకపోతే రోడ్డు మీదకోస్తాం “ అని ప్రకటిస్తాడు. వాస్తవాలు నమ్మడానికి కష్టంగా కఠినం గా ఉంటాయి. ఇంట్లో కూర్చుని ఇలా ఉందా దేశ పరిస్థితి అంటే అవుననే వోప్పుకోవాలి. సూర్య పేరు కూడా చంద్రు గా పెట్టి సినిమాకు మరింత నేటివిటీని తెచ్చాడు డైరెక్టర్ . చంద్రు దృష్టి కొచ్చిన ఒక నిండు చూలాలైన సిన్నమ్మ అనే గిరిజన మహిళకు జరిగిన అన్యాయం కేసును ను వాదించడానికి స్వీకరిస్తాడు. గతంలో ఎక్కడ దొంగతనా జరిగినా స్టూవర్టు పురం వైపు చూసే వారు, పోలీసులు. బ్రిటీష్ గెజెట్ లో కూడా కొన్ని కులాలను నేరపూరిత కులాలుగా ఉన్న సంగతి వాస్తవమే కానీ వారు నేరస్తులు కారు. దొంగతనం నేరారోపణతో పోలీసులు తీసుకెళ్ళిన సిన్నమ్మ భర్త రాజన్న పోలీసు స్టేషన్ నుండీ తప్పించుకున్నాడని, కనబడడం లేదనేది ఆ కేసు.ఆ కేసును ఎవ్వరూ వాదించడానికి ముందుకు రారు ఎందుకంటే అన్ని ఆధారాలూ రాజన్న పోలీసు కస్టడీ నుండీ పారిపోయాడనే వాదనను నిర్ధారిస్తాయి. అలాంటి జఠిలమైన కేసును పోలీసు వ్యవస్థలూ, న్యాయ వ్యవస్థ కూ ఎదురు నిలిచి వాదించి ఆ గిరిజన మహిళను న్యాయం చేయడం ఉన్న తృప్తి గురించి చివరలో ఆ కేసు ఎంక్వయిరీ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) అన్న మాటలు చాలా మంది అనే మాటలే. చంద్రు అతి సామాన్య జీతితాన్ని జీవిస్తూనే . కింది నుండీ పై వరకూ అందరూ చే గౌరవించబడతాడు.స్వాభిమానానికి చిహ్నం గా కనబడతాడు. వర్గ పోరాటాన్నీ, కుల పోరాటాన్నీ రెండు పోరాటాలనూ జమిలీగా నడుపుతూ లాల్ నీల్ సమ్మేళనానికి నాంది ఉంటూ చివరకి సిన్నమ్మకి భూమి వచ్చేట్లు వాదించడం ఒక కోణం అయితే నగరంలో ఇప్పించేట్లు వాదన చేయడం కొసమెరుపు.
పోలీసుల ఆగడాలను కాస్త లోతుగా చర్చిలోకి తెచ్చి , వారి వికృత కృత్యాలను విపులంగా చూపించి పోలీసు వ్యవస్థ బండారాన్నిబయట పెట్టడం మరొక సాహసం. చేసిన ఒక తప్పు కప్పి పుచ్చడానికి ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందో తెలియ చేయడం అటుంచి వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి పోలీసు వ్యవస్థ మొత్తం IG,DGP, నుండీ అతున్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ న్యాయవాది వరకూ అందరూ ఆ తప్పులను సమర్ధిస్తున్న న్యాయ వ్యవస్థ ఒక వైపు ఒక అనామక ఇల్వార్ తెగకు చెందిన అక్షరజ్ఞానం లేని కేవలం భర్తను కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న గర్భిణీ ఒక వైపుగా సాగే పోరాటంలో అడ్వకేట్ చంద్రు సినిమా మొత్తం అయితే పోలీసు స్టేషన్లో తప్పితే కోర్టులో అన్నట్లు నడిపిస్తాడు. ప్రత్యెక విచారణాధికారిగా నమ్మకమున్న ఒక పోలీసుఅదికారి నియమింప బడేట్లు సాహసిస్తాడు. ప్రకాష్ రాజ్ పాత్రలోని విచారణ అధికారి కూడా ప్రభుత్వ ఉచ్చు లో ఉండే విచారణ మొదలు పెడతాడు. కానీ అతన్ని గూడెం కి తీసుకెళ్ళి అక్కడి వారి ఘోష వినిపిస్తాడు చండ్రు. ప్రతీ ఒక్కరిదీ ఒక్కొక్క పోలీసుల జులుం కి బలైన ఒక్కొక్క కధ. బడిలో ఎవరి రబ్బరు కనబడకపోయినా తన బేగ్ నే వెతుకుతారంటూ ఏడుస్తూ చెప్పే బాలుని కధకు కరిగిపోతాడు ఆ అధికారి. “వాళ్లకి డబ్బూ,అధికారం, కులం ఉన్నాయి సార్ !,వీళ్ళకు ఎవరున్నారు సార్ మనం తప్ప” అన్తాది లాయర్ ఆ అధికారితో. న్యాయానికీ అన్యాయానికీ మధ్య నలిగిపోయే పోలీసు అధికారి పాత్రకు ప్రకాశ రాజ్ తప్ప మరొకరు దొరకరు. ఒక సందర్భంలో హిందీలో వాంగ్మూలం ఇస్తున్న బంగారం వ్యాపారికి చెంప మీద కొట్టి తెలుగులో చెప్పు అంటాడు. అక్కడ అది కరెక్ట్. అతడి వాంగ్మూలం తెలుగులో తీసుకోవడం అనివార్యం పైగా ఎందఱో ఇలాంటివారు ఇతర రాష్ట్రాల నుండీ వచ్చి గ్రామాల్లో తండాల్లో ఏళ్ల తరబడి స్టిరపడి స్థానిక భాష నేర్చుకుని వ్యాపారం పేరుతొ గిరిజనులను దోచుకుంటున్నారన్నది కూడా వాస్తవం.
ప్రజాస్వామ్యబద్దంగా దేశం నడవాలంటే లేజిస్లేటివే వ్యవస్థ(ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు), కార్యనిర్వాహక వ్యవస్థ(IAS,IPSలూ బ్యురోక్రాసీ అంటాం) , న్యాయవ్యవస్థ (ఇందులోకే పోలీసు వ్యవస్థ వస్తుంది)ఈ మూడూ సక్రమంగా పనిచేయాలి. రాజ్యాంగం ఇచ్చిన ఒక మనిషి, ఒకే వోటు, ఒకే విలువ,ఒకే న్యాయం అనే సిద్దాంతానికి అందరకీ స్వేచ్చ సమానత, సహోదరత్వం ,సమన్యాయం అనే మౌలిక విలువలకూ అడుగడుగునా అడ్డం పడుతున్న పందికొక్కుల్ని పట్టిచ్చే ఎలుకలు తినేవారి జీవితాలు తెరకెక్కించినదీ సినిమా. అలగా జనానికి న్యాయం ఎందుకులే అనే నూన్యమైన ఆలోచలున్న న్యాయవ్యవస్థ నూ , పై పదవుల కోసం, ప్రాపకంకోసం ,రాజకీయ పలుకుబడి కోసం ఊడిగం చేసే కార్యనిర్వాహక వ్యవస్థనూఎండగడుతూ, దొరలే నేడు దొంగలనీ దొంగలకు జాతి ఉండదని నిరూపిస్తాడు చంద్రూ . 2015 నుండీ 2020 మధ్య కాలంలో దేశంలో సుమారు 500 మంది లాక్ అప్ లో మరణించారని నేషనల్ క్రైం బ్యూరో చెపుతుంది. కానీ ఇప్పటివరకూ ఒక్క పోలీసు కూడా శిక్షించబడలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల పేరెత్తకుండా దాదాపు 40-45 నేరాలను మోపుతూ ఎన్నో రాజ్యంగపరమైన ఆర్టికల్స్ (ఆర్టికల్స్ నంబర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా )ఉటంకిస్తూ సిన్నతల్లి కేసును వాదించి విచారణలో తన పైచేయిని సాదిస్తాడు. తమిళనాడు కేరళలో భూ పోరాటాలకు ఊపిరి పోసిన ఎర్రజెండా ఉద్యమాన్ని దర్శకుడు వాడుకున్నాడు. మొదట్లో చెప్పిన విధంగా జస్టీస్ చండ్రుగా రిటైర్ అయిన సామాజిక ఉద్యమ కారుడు గురించి చివర్లో సినిమాలో చూపుతూ 96,000 కేసులుకు న్యాయం చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలూ ఆయన రైటింగ్స్, రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడ్డాయి అని ముగిస్తాడు దర్శకుడు.. మరి ! ఇప్పుడు చెప్పండి ఇలాంటి సినిమాకి జై భీమ్ పేరు సరైందేనా?? నటుల గురించి నటన గురించి, దర్శకత్వం, స్క్రీన్ ప్లే ,సంగీతం గురించి ఇక ఇక్కడ ఎంత రాసినా తక్కువే.
డా.మాటూరి శ్రీనివాస్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment