Tuesday, 14 December 2021

పురుషాహంకారం, మతోన్మాదం మతానికి రెండు పార్శ్వాలు

పురుషాహంకారం, మతోన్మాదం భక్తుల రెండు పార్శ్వాలు డాక్టర్ మాటూరి శ్రీనివాస్ మనదేశం అనవసర ఆర్భాటాలకూ,అసహజ అలవాట్లకూ, మసిపూసే గారడీలకూ నక్కలకూ నాగలోకాలకూ, హిందూ మనోభావాలకూ మతోన్మాదాలకూ ఆలవాలమై పోయింది. సామరస్యం ఆనే పదం దేశద్రోహ పదమై కూర్చుంది. ఈ నేపధ్యంలో ఈ మధ్య మనదేశం లో జరిగిన రెండు అవాంచనీయ సంఘటనలు. రెండూ పురుష దురహంకారానికి మతొన్మాదానికీ ప్రతీకలుగా నిలిచాయి. మొదటిది కడవా/కర్వా(కుండ ) చౌత్ అనే పండుగ మీద వచ్చిన ఒక ప్రకటన. ప్రతీ ఏడాది లాగే ఇటీవల ఈ పండుగ ను భారతీయులు జరుపుకున్నారు. ఈ పండగే ఒక సామాజిక దురాచారం. ఉత్తర భారత దేశం లో కాస్త ఎక్కువ గా జరుపుకుంటారు. పెళ్ళైన మహిళలు కార్తీక మాసంలో ముఖ్యం దీన్ని ఆచరిస్తారు. చంద్ర కాల మాన ప్రకారం అంటే lunar callender (ప్రపంచం మొత్తం సూర్య కాల మానాన్ని అంటే solar callender అనుసరిస్తుంది మన దేశంలో కూడా ,కానీ హిందూ పండగలన్నీ చాంద్రమానాన్నిప్రోస్తాహిస్తాయి, పెళ్ళిళ్ళ ముహూర్తాలతో సహా) కార్తిక మాసంలో పౌర్ణమి వెళ్ళిన నాల్గవ రోజున దీన్నిఆచరిస్తారు. ఆంధ్రుల అట్ల తద్ది లాంటిదన్నమాట. అట్ల తద్ది మంచి మొగుడు రావాలని వచ్చిన మొగుడు బాగా ఏలుకోవాలని ఆడపిల్లలు నోము నోచుకుంటే ,భర్తల ఆయురారోగ్యాలకోసం చేసుకునే పండుగ ఈ కడవా చౌత్ . భారతీయ సంప్రదాయం అని బుకాయించే హిందూ సంప్రదాయంలో మనువు ప్రకారం స్త్రీలు కూడా శూద్రులతో సమానం (నా మాట కాదు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం). స్త్రీలు తమ ఉనికి కోసం తమ ఆయురారోగ్యాలకోసం మాట్లాడకూడదు(నస్త్రీ స్వతంత్రమనర్హతి) . విషయానికి వస్తే ఈ పండుగ ను ఉద్దేశించి డాబర్ కంపనీ ఒక వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది .ఇక్కడ 1998 దీపా మెహతా తీసిన “ఫైర్” సినిమా ను గుర్తు చేయాలి. ఇద్దరు మహిళల కధ అది. ఇద్దరి భర్తలూ పెట్టే నరక యాతన భరించ లేక వారి వారి భర్తలను వదిలేసి ఈ మహిళలు ఇద్దరూ సహజీవనానికి సాహసిస్తారు. ఈ సినిమా అప్పుడు పెద్ద దుమారాన్నే లేపింది. పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగాయి. పోస్టర్లూ బ్వనర్లూ చించేసారు. కొండకచో స్క్రీన్లను కాల్చేశారు. సహజంగా మనదేశంలో అదే కదా జరిగేది. సినిమా ని బ్యాన్ చేయించేసారు ఉన్మాదులు. సినిమా తీసింది స్త్రీలు, నటించింది స్త్రీలు, ఇతివృత్తం వారి సామాజిక స్వేచ్చ. గమ్మత్తుగా నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ జోషి నిరసన కారుల ఉద్యమ స్పూర్తిని అభినందించారు కూడా . మళ్ళీ ఇప్పుడు 23 సంవత్సరాల తర్వాత , స్వలింగ సంపర్కానికి చట్ట సమ్మతి , ఆర్టికల్ 377 ద్వారా లభించిన 2 సంవత్సరాల తర్వాత అదే చరిత్ర పునరావృతం అవ్వడం శోచనీయం. ప్రస్తుతానికొస్తే డాబర్ వాణిజ్య ప్రకటన ఏమిటీ అంటే ? ఒక యువతీ మరొక యువతీ ముఖానికి డాబర్ ఉత్పత్తి ని ఫేస్ బ్లీచ్ ను పూస్తుంది. ముఖ సౌందర్యానికి సంబధించినప్రకటన అన్న మాట. వారి తల్లి వయసున్న మరొక స్త్రీ వచ్చి వారిద్దరికీ నూతన వస్త్రాలను బహూకరిస్తూ ఆమె ముఖ సౌందర్యాన్ని చంద్రబింబంలా మెరిసిపోతుందని పొగుడుతుంది. తర్వాత ఆ పెద్డావిడ వారిద్దరికీ ఒకరికొకరికి పరస్పరం జల్లెడ లోంచి చంద్రున్ని వారి ముఖాలను చూపి మంచి నీళ్ళు ఇచ్చి వారి ప్రాతివ్రత్య ఉపవాస దీక్షను విరమింప చేస్తుంది. ఈ ప్రకటన అద్భుతంగా ప్రగతి శీలం గా ఉందని అనేకులు అభ్యుదయవాదులూ సామాజిక మాధ్యమాల్లో పొగిడారు. కానీ అంత కంటే పెద్ద ఎత్తున అతివాద మతవాదుల నుండీ నిరసనలూ మొదలయ్యాయి. హిందూ సంప్రదాయాల్లో విధవరాళ్లకూ, విడాకులు పుచ్చుకున్న మహిళలకూ పండుగలలో, పెళ్ళిళ్ళలో పేరంటాలలో ప్రాధాన్యత ఇవ్వరు, సరికదా వారిని ఆ వేడుక సమయాలలో ఆ దరిదాపులకు రానీయరు. మానవ సమాజం పరివర్తన చెంది ఇటువంటి అంశాలలో అభ్యుదయ ఆలోచనలను స్వాగతించడం, చర్చించడం మాని విభేదిస్తూ పాత సంప్రదాయాలను కొనసాగించే దిశగా ఆలోచించడం, అలాంటి దురాచారాలను ఎగదోయడానికి అతివాదులు నిత్యం సిద్దం గా ఉండడం చూస్తే సమాజ తిరోగమనానికి సూచనగా నిలుస్తుంది. ఈ దుర్మార్గుల గోల పడలేక వ్యాపారాలలోని లొసుగుల మేరకు చివరికి ఆ ప్రకటనను డాబరు వారు ఉపసంహరించుకున్నారు. ఇటీవల కాలంలో మనోభావాల పేరుతొ రెచ్చగొట్టే ట్రోల్లింగ్ జరిగడం సోషల్ మీడియాలో నిత్య కృత్యం . దీపావళి సమయంలో పర్యావరణ గురించి ఒక సెలబ్రిటి మాట్లాడుతూ శబ్ద కాలుష్యం వాతావరణ కాలుష్యం పై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తే అతడిని ముస్లీం అని తిట్టారు. పాత మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తే మత ఉన్మాదులు దాడులకు ఎగబడుతున్నారు. మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా డాబర్ ప్రకటన ఉపసంహరణకు సూత్రధారి . ఆ ప్రకటనను ఖండిస్తూ స్వలింగ సంపర్కులు, లెస్బియన్లు కడవా చోత్ జరుపుకోవడం హిందూ సంప్రదాయ విరుద్దమని మనోభావాలను రెచ్చగొట్టాడు. డాబర్ కంపనీ అధినేతలు అమిత్ బర్మన్ , మొహిత్ మల్హోత్రా ఇద్దరూ హిందువులే. వారి అభ్యుదయ స్పూర్తికి గండి కొడుతూ ఆ ప్రకటనను ఉపసంహరించేవరకూ మతవాదులు ఊరుకోలేదు. సుప్రీం కోర్ట్ జడ్జి జస్టీస్ డి వై చంద్రచూడ్ ఈ మతోన్మాదుల చర్యలను ఉదంతాన్ని సీరియస్ గా తీసుకుని మతోన్మాద మూకల అసహనాన్ని ఖండించారు. స్వలింగ వివాహాలకు చట్ట సమ్మతి, అనుమతి ఉన్న విషయాన్ని ఈ ఉన్మాదులు గుర్తు ఉంచుకోవాలని సూచించారు. ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన స్వలింగ వివాహం చట్ట బద్ధతను కూడా మేము అంగీకరించమని నాటి BJP నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. . డాబర్ వారు అ ప్రకటనను ఉపసంహరించుకోవడం బాధాకరం, బహిరంగ క్షమార్పణల అడగడం మరింత దయనీయం అని” మహిళా సాధికారత- చట్టాలపై అవగాహన “పై జరిగిన సదస్సులో సుప్రీం కోర్ట్ జడ్జి జస్టీస్ డి వై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. మరొక ఉదంతం ప్రసిద్ద ఫేషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ కి, అతడి మంగళ సూత్రా డిజైనర్ ప్రచార ప్రకటనకు సంబంధించినది.“ సవ్యసాచి హిందూ సంస్కృతిని అవమానపరిచాడు”అనే శీర్షిక తో ట్రోల్లింగ్ జరిగింది.” Mangalasootra campaign “ పేరున కొత్తగా డిజైన్ చేసిన ఆభరణాల ప్రకటనలో ఒక స్త్రీ ఒక పురుషుడూ సన్నిహితంగా ఉండడం ఆమె లోదుస్తులలో నూతనంగా డిజైన్ చేసిన మంగళ సూత్రాలు ధరించి ఉండడంతో హిందూ మతవాదులు అభ్యంతరం తెలిపడమేకాకుండా పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేసారు. “inclusivity, empowerment” (సంఘటిత- స్త్రీ సాధికారత)అనే మూల రూపం(concept) తో మంగళసూత్రాలను బంగారమూ వజ్రాలూ పొదిగి design చేయడం జరిగింది. దీనికి కూడా bjp కి చెందిన్ మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా యే సారధ్యము వహించాడు. మంగళ సూత్రం హిందూ మత పవిత్ర చిహ్నం, దాన్ని అవమానిస్తే ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చాడు. చివరికి సవ్యసాచి ఆ ప్రకటన తొలగించాల్సి వచ్చింది. నేటి తరం స్ద్త్రీలు మంగళ సూత్రం ఒక బానిసత్వపు ఆనవాలు గా చూస్తారు. వాటి చరిత్ర చూస్తే అవి హిందూ సంప్రదాయము లో పితృస్వామ్యానికి , పురుషుని ఆధిపత్య చిహ్నం గామనకు అర్ధం అవుతుంది. వాటి ఆకారం రొమ్ములని పోలి ఉంటాయిని వేరే చెప్పక్కరలేదు . పూర్వకాలం లో పురుషులు తమ భార్యల రోమ్ములకు రక్షణగా బలవంతంగా ఆ ఆకారం లో ఉన్న లోహ తొడుగులు తొడగేవారు. కాలక్రమేనా కాస్త కూస్తో నాగరికత అలవరచుకున్న పురుష జాతి వాటి సైజు తగ్గించడానికి వొప్పుకున్నారు గానీ తీసి వేస్తే వారు అదొక సంప్రదాయ వ్యతిరేక ధోరణిగా తప్పు పడుతూ మనోభావాల పేరుతొ స్త్రీల మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. లోదుస్తులు వేసుకున్న అమ్మాయి ఒక పురుషునితో శృంగార సన్నివేశాలలో మంగళ సూత్రం ధరించి సన్నిహితంగా ఉన్నట్లు చిత్రించడం అలాగే భిన్న మోడల్స్ లో మంగళ సూత్రాలు అమ్మాయిల మెడలో అందంగా చూపడానికి లో నెక్ దుస్తులు తప్పనుసరిగా భావించిన సవ్యసాచి మతవాదుల ముందు బొక్క బోర్లా పడ్డాడు. కొత్త ఆకారాలలో మంగళ సూత్రాలు ఒక ఎత్తు అయితే స్త్రీలు వారి అభీష్టాల మేరకు వస్త్రధారణ సాధికారతతో ప్రవర్తించే ఒక సంకేతాన్ని ఇస్తున్నందుకు సదరు తమకు తాముగా హిందూ పెద్దలుగా పిలుచుకునే వారికి నచ్చలేదు .వీర్ దురహంకారాన్ని భరిచలేక వ్యాపారాన్ని కాస్త పెట్టుకోలేక తన అభ్యుదయ వినూత్నతను ప్రక్కన పెట్టి సవ్యసాచి ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నాడు. గతంలో తనిష్క్ ఆభరణాల విషయంలోనూ హిందూ పెద్దలుగా చలామణి అవుతున్నవారు రచ్చ చేసారు. ఒక హిందూ స్త్రీని కోడలుగా స్వీకరించిన ముస్లీం దంపతులు వారి హిందూ కోడలికి శ్రీమంతం చేస్తూ ఆభరణాలను అలంకరిస్తున్న ప్రకటనను తప్పు పడుతూ ఇది లవ్ జీహాద్ ను ప్రోత్సహిస్తుందని నానా యాగీ చేసారు. నిజానికి టాటా వారు హిందూ ముస్లీం మతసామరస్య చిహ్నంగా ఆ వ్యాపార ప్రకటనను తీసారు. మరొక ఉదంతం దీపావళి ముందు వచ్చిన మాన్యవర్ క్రొత్త డిజైన్ల కలెక్షన్ కు పెట్టిన పేరు ఉర్దూ ఉంది. ముస్లీం పేరు పెట్టారని రభస చేసారు. యు పీ లక్నో ప్రాంతాల్లో పుట్టి పెరిగిన భాష ఉర్దూ. ఉర్దూ పాకిస్తానీ భాష కాదు. ఇంగితం కామన్ సెన్స్ లేని మూర్ఖుల చేతిలో పడిన దేశం లో ఇలాంటివి భరించక తప్పని పరిస్థితి . అలియ బట్ నటించిన మాన్యవార్ కే సంబంధించిన ఒక వ్యాపార ప్రకటన విషయంలోనూ ఇదే మతోన్మాద ప్రవృత్తిని చూపుతూ దేశ మత సామరస్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. “సంస్కృతీ అదే ఆలోచన కొత్తది “ అనే శీర్షికన అభ్యుదయ ఆలోచనలున్న విద్యావంతురాలైన అమ్మాయి తనను మగ పెళ్లి వారికి కన్యాదానం చేయడాన్ని ప్రశ్నిస్తుంది. అలియ పెళ్లి మండపంలో వరుడి ప్రక్కన కూర్చుని గతంలో తండ్రీ ,నానమ్మ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. తనొక పరాయ ధనం(ఇతరులకు చెందిన ఆస్తి ) గా వారు భావిన్చాదాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. తల్లి తనవైపు రావడాన్ని చోస్తూ ఆమె అన్న మాటలు చిడియా (పిట్ట)అని పిలవడం నీ దానా పానీ ఎక్కడో కదా అనే అర్ధం వచ్చేట్లు మాట్లాడడం గుర్తుకు తెచ్చుకుంటుంది. కానీ ఆకాసమంతా పక్షులదే కదా అని ప్రశ్నించు కుంటుంది. నేనొక వస్తువునో లేదా మరొకరి ఆస్తినో కాదుగా పరాయిలకు ఇచ్చేయడానికి అన్న భావాన్ని వ్యక్త పరుస్తుంది. “ఎందుకీ కన్యా దానం? , నాదొక కొత్త ఆలోచన .దాని పేరు కన్యా మాన్” అంటుంది. “మాన్” అంటే “విలువైనది” అని అర్ధం. వెంటనే పెళ్లి కొడుకు తో సహా అతడి తల్లి తండ్రులు ఆ సూచనని వెంటనే అంగీకరిస్తూ అమ్మాయి తల్లి తండ్రులూ అబ్బాయి తల్లి తండ్రులూ నలుగురూ కలిసి పెళ్లి కొడుకునూ పెళ్లి కూతురినీ ఒకరికొకరిని అప్పగిస్తూ వైవాహిక జీవితం లో ఇద్దరూ సమానమే,ఇద్దరిదీ సమాన బాధ్యత అనే అర్ధం వచ్చే విధంగా లింగ సమానత్వాన్ని చాటే విధంగా ముగిసే ఈ ప్రకటనఎంతో అద్భుత మైన ఆలోచన. కనీ దీనిని కూడా జీర్ణించుకోలేని సమాజం లో మనం బ్రతుకుతున్నాం. కొస మెరుపు; ప్రకటనలు తీసిన వారూ, అభ్యంతరం తెలుపుతున్నవారూ ఇరు పక్షాలవారూ హిందువులే. ఒక పక్షం మతం తో వ్యాపారం చేస్తుంటే ,మరొక పక్షం మతం రాజకీయం చేస్తుంది. మొదటి పక్షానిది సదుద్దేశ్యం. ప్రగతి శీలం గా అభ్యుదయ ధోరణిగా మతసామరస్యాన్ని ప్రోత్సహించే ప్రకటనలు ఆలోచనలు రేకెత్తించే ప్రకటనలుగా భావించాలి. ఎందుకంటే వారి వ్యాపార ప్రకటనలు రాజ్యాంగబద్దంగా, చట్ట పరిధిలో ఉంటున్నాయి, ఉండాలి కూడా. కానీ అభ్యంతరం తెలుపుతున్న పక్షం ఏక పక్షంగా, అధికార మదంతో ఆహేతుకతతో, తిరోగమన బుద్ధితో మనోభావాల పేరుతొ మాత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. అసలు వీరికి మత పెద్దరికం ఎవరు ఇచ్చారు? మతాన్నీ మనోభావాల్నీ కాపు కాస్తున్నట్లు భ్రమింప చేస్తూ విద్వేషాలను రేచ్చాగోటడం వీరి అజెండా. వీరి మీద ప్రజాసంఘాలూ ప్రగతి శీల సంస్థలూ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాయి. కానీ శక్తి చాలడం లేదు. వీరి మీద కేసులు పెట్టి న్యాయపరంగా హక్కులు సాదిద్దా మంటే చట్టాలూ, న్యాయ మూర్తులూ వీరి చుట్టాలై కూర్చున్నారు. మనం చేయాల్సింది ఏమైనా ఉన్నదంటే ఈ మతోన్మాద చర్యలను బహిరంగంగాఖండించడం , సామాజిక మాధ్యమాల్లో ద్వారా నిరంతరం ఉద్యమించడం , సదరు కంపనీలకు సంఘీభావం ప్రకటించి కోర్టుల్లో చాలంజ్ చేసే విధంగా వారికి సహకరించడం, ప్రజా వ్యతిరేక, రాజ్యంగా వ్యతిరేక ,లౌకిక వాద వ్యతిరేక చర్యలుగా అవకాశం దొరికినప్పుడల్లా ఎండగట్టడమూ ఒక్కటే మార్గం. -----------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment