A renowned poet, writer, transalator and a social activist. A doctor (pulmonologist) by profession.
Tuesday, 14 December 2021
మొదటిగా దళితుల వద్దకు ధమ్మాన్ని
దళితుల వద్దకు ధమ్మాన్ని
(సండే టైమ్స్ సెప్టెంబర్ 14,2014)
రచన ;డా.హేమ గునతిలకే
(మనం ఈ ఏడాది సెప్టెంబర్ 17 అనగారిక ధమ్మపాల గారి 150 జయంతిని జరుపుకుంటున్నాం. దక్షిణ భారత దేశంలో అతడు చేసిన పధ నిర్దేశకత , వలసవాదులు వేసిన సంకెళ్ళ నుండీ శ్రీ లంక వాసులను విముక్తి గావించిన తీరును గురించి ఈ వ్యాసం లో గమనిద్దాం.)
1891లో అనగరిక ధర్మపాల మొదటిసారిగా బుద్ధుని జన్మ భూమి అయిన భారత దేశంలో బౌద్ధ పునరుద్దరణ కార్యక్రమాన్ని చేపట్టారన్నా సంగతి మనకు విదితమే. పర్యవసానంగా ఉన్నత వర్గాలవారెందరో బౌద్ధం వైపుగా ఆకర్షితులైయ్యారు. చాల మందికి తెలియని విషయం ఏమిటంటే డాక్టర్ అంబేడ్కర్ కంటే దాదాపు ఏభై ఏళ్ల క్రితమే దక్షిణ భారత దేశం లోని తమిళులకు ,దళితులతో సహా ఒక పెద్ద బౌద్ధ జనోద్యమానికి స్పూర్తిగా నిలిచాడు.
అనగారికుని మొట్టమొదటి భారత పర్యటన దక్షిణ భారతం నుండే ఆరంభమైంది. తన భారత పర్యటనలో భాగంగా మాడమ్ బ్లావెస్కీ మరియ హెన్రీ ఆల్కొట్ ఆధ్వర్యంలో మద్రాస్, అడయార్ లో ధియోసాఫికల్ సొసైటీ లో మొదటిసారిగా కాలు మోపాడు. అంతే కాకుండా తన ఉత్కృష్ట మైన బౌద్ధ ధమ్మదూత కార్యకలాపాలను కూడా అక్కడ నుండే ఆరంభించాడు. పండిత అయోతి ధాస్ చేసిన సేవల ఆధారితంగా ధర్మపాల తన కార్యకలాపాలను నిర్మించాడు. ధర్మపాల సారనాద్, బుద్ధగయా, బెనారస్ లను సందర్శించదానికి ఎంతో ముందే మద్రాస్ లో ఒక దళిత పరియా కులం లో జన్మించిన అయోతి ధాస్ (1845-1914) దక్షిణ భారత దేశ అణగారిన ప్రజల సామాజిక పరివర్తన కోసం ఉద్యమించాడు.
“అంటరానివారు హిందువులు కారు” అనే ఒక విప్లవాత్మక ప్రకటనను 1886లోనే అయోతిధాస్ చేసాడు. దానికి అనుగుణం గానే 1891లో ద్రవిడ మహాజన సభను స్థాపించాడు. హిందూ మతంలోనే ఉంటూ అంటరానివారిగా జీవించే బదులు 1891లో జరిగిన జన గణన (జనాభా లెక్కలు)లో దళితులందరూ “కులరహిత ద్రావిడులు”గా నమోదు చేయించుకోవాలని పిలుపును ఇచ్చాడు. తమిళ దళితులే ఆదిమ లేదా మూల బౌద్దులని వాదించాడు. ఇదే సంవత్సరంలో అంటే 1891, మే 31న అనగారిక ధర్మపాల మొదటి సారిగా మహాబోధి సొసైటీని కొలొంబో లో ఆరంభించి అనంతర కలకత్తాను ప్రధాన కేంద్రంగా చేసుకుని బుద్ధ గయలో బౌద్ధ ఆరామాలను బౌద్ధ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు పూనుకున్నాడు . ఈ చర్యను భారత దేశ బౌద్ధ పునరుద్ధరణ చరిత్ర లో ప్రధమ ఘట్టంగా పరిగణించవచ్చు. రెండు నెలల తర్వాత “;రామన్న/ రామన్య నికాయ”( శ్రీలంకలో ఉన్న మూడు ప్రధాన బౌద్ధ సంప్రదాయా స్రవంతుల లో ఒకటి) భిక్కులను నలుగురిని బోధ గయా తీసుకుని వచ్చాడు. వీరినే శ్రీలంక నుండి వచ్చిన మొదటి తరం ఆధునిక ధర్మదూతలుగా భావిస్తారు.
1892 జనవరి నెలలో మొదటి సారి మహా బోధి పత్రిక ఆరంభించబడింది. అది 8 పేజీల చిన్న పావు ఠావు సైజు లో ఉన్నప్పటికీ ప్రపంచ దృష్టి ఆకట్టుకోగలిగింది. నిజానికి 1893, అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వ మత సమ్మేళనములో పాల్గొనేందుకు అనగారిక ధర్మపాలని ఆహ్వానించడానికి బీజం వేసింది కూడా ఈ పత్రికే. అది జరిగిన వందేళ్ళ కాలం తరువాత ఈ వ్యాస రచయితకు ప్రపంచ మత సమ్మేళనంలో 10 నిముషాల పత్ర సమర్పనకు అవకాశం లభించింది.
అక్టోబర్ 1892లో అనగారిక ధర్మపాల మరియు కల్నల్ ఆల్కొట్ కలిసి మయాన్మార్ లోని అక్యాబ్ (నేడు అది అరాకన్ /రాఖీన్ దీవిలోని సిత్ట్ ప్రాంతంగా చలామణి లో ఉంది) సందర్శించి అక్కడ మహాబోధి సొసైటీ శాఖను ప్రారంభించారు . మయన్మార్ లో అరాకన్ బౌద్ధులు ద్వారా లభించిన ఆర్ధిక విరాళాల సహకారంతో కొలకత్తా లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని ప్రారంభించి మహాబోధి సొసైటీ కార్యక్రమాలను కొనసాగించారు. తర్వాత కాలంలో 1904 లో కొంత కాలం దానిని మూసివేసారు. బ్యాంకాక్ యువరాజు రాజక్సీ ఆహ్వానం మేరకు అనగారిక ధర్మపాల 1894లో బాంకాక్ సందర్శించి స్థానిక రాజరిక వ్యవస్థ సహకారంతో అక్కడ కూడా మహాబోధి సొసైటీ శాఖను ప్రారంభించాడు. మద్రాస్ లో పంచమ కులస్తులకు ఎన్నో స్కూళ్ళను అయోతీ ధాస్ ఆరంభించాడు. అదే కాలంలో పంచమ కులస్తులకు ఉచిత పాఠశాలాలూ నిర్వహిస్తున్న ఇండియన్ ధియో సోఫికల్ సొసైటీ అధ్యక్షుడు కల్నల్ హెచ్ ఎస్ ఆల్కాట్ అయోతీ ధాస్ కు పరిచయమయ్యాడు. “తమిళ బౌద్ధము” స్థాపనకై సహకరించాలని కల్నల్ ఆల్కాట్ ను అయోతీదాస్ అభ్యర్ధించాడు. ఆనాటి శ్రీలంక లో మంచి పేరున్న, బౌద్ధాన్ని పునరుద్దరించిన బౌద్ధ భిక్కు మరియు “విద్యోదయ పిరవిన”(బౌద్ధ పాఠశాల) ప్రిన్సిపాల్ అయిన పూజ్య భిక్కు హిక్కుదువే సుమంగళ నాయక ధేరో కు అల్కొట్ అయోతీదాస్ చేసిన అభ్యర్ధనను ప్రతిపాదనను ఉత్తరంగా రాస్తాడు . పర్యవసానంగా ధర్మపాల తో సహా శ్రీ లంక నుండి వచ్చిన మరొక బౌద్ధ భిక్కు తో కలిసి నిమ్న కులాల వారికి మద్రాస్ లో ద్రవిడియాన్ బుద్ధిష్ట్ సొసైటీ ఏర్పాటు చేయడం కోసం బహిరంగ సభ జరిగింది.
పిదప అయోతీదాస్ కొందరు దళిత వర్గ పెద్దలతో కలిసి శ్రీలంక పర్యటించాడు. అక్కడ పూజ్య హిక్కుదువే సుమంగళ నాయక ధేరో గారినీ ఇతర అనేక మంది బౌద్ధ భిక్కులను కలసారు. మద్రాస్ నుండీ వెళ్ళిన బృందం విద్యోదయ పిరవిన(బౌద్ధ పాఠశాల)లో పంచశీలను స్వీకరించి ఆచరించారు. పూజ్య హిక్కుదువే సుమంగళ నాయక ధేరో ఆశీస్సులతో భారత్ తిరిగి వచ్చి అయోతీధాస్ “శాక్య బౌద్ధ సంఘాన్ని” స్థాపించాడు . దీనినే “ఇండియన్ బుద్ధిష్ట్ సొసైటీ’ అని కూడా అంటారు. 1998లో శాక్య బౌద్ధ సంఘం తన మతపరమైన కార్యక్రమాలను ప్రారంభించింది. పంచశీలను స్వీకరించడం, ప్రతీ ఆదివారమూ బౌద్ధ సభలు నిర్వహించడం, కలవడం, మతపరమైన ప్రసంగాలను వినడం ,సామాజిక అంశాలను చర్చించడం మొదలు పెట్టారు. 1998ఆగస్ట్ 8 న మద్రాస్ రోయ్యిపేట్ లోకల్నల్ ఆల్కాట్ మరియు అయోతీ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు హాజరవ్వాలని వారి నుండీ ఆహ్వానం అందుకున్నాడు, ధర్మపాల. ఆ సభ అనతరం ఎందఱో దక్షిణ భారతీయులు బౌద్ధం వైపు చూడడం మొదలుపెట్టారు.
మరుసటి సంవత్సరం దక్షిణ భారత దేశంలో మద్రాస్ లో మహాబోధి సొసైటీ శాఖను ఆరంభించడం కోసం ధర్మపాల మరొక ఆహ్వానాన్ని అందుకున్నాడు. అప్పుడే మద్రాస్ లో ధర్మపాల మరియు అయోతీదాస్ ఇద్దరూ సహా కార్యదర్శులుగా “బుద్ధిష్ట్ యంగ్ మెన్స్ అసోసియాషన్” రూపు దిద్దుకుంది. శాక్య బౌద్ధ సంఘానికి చెందిన బౌద్ధ భిక్కులు ఆనాడు మహా బోధి సొసైటీ శాఖకు పెద్ద సంఖ్యలో వచ్చిన యాత్రికులకు బౌద్ధ సంప్రదాయం లో పూజలు నిర్వహించారు. ఆ విధంగా ఆ మహాబోధి సొసైటీ శాఖ అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంది.
మద్రాస్ పెరంబుర్లో చిన్న విహారాన్ని నిర్మించడం కోసం మిసెస్ మేరీ ఫోస్టర్ అతనికి ఇచ్చిన విరాళం లోనుండీ 3 వేల రూపాయిలను ధర్మపాల పంపించాడు. మహా బోధి కార్యాలయాన్ని అక్కడ మొదలు పెట్టారు. సింహళీ భంతే నిల్వాక్క సోమనానందను దక్షిణ భారతదేశంలో బౌద్ధ ధర్మ వ్యాప్తి కొరకు నియమిద్దామనే ఉద్దేశ్యంతో తమిళం నేర్చుకోమని ప్రోత్సహించాడు ధర్మపాల. ఆ విధంగా సింహళీ భంతే నిల్వాక్క సోమనానంద పెరంబూర్ విహారలో స్థానిక నివాస బౌద్ధ భిక్కుగా, తమిళనాట తమిళం తెలిసిన మొదటి దమ్మ దూతగా, బౌద్ధ పండితునిగా ప్రసిద్ది చెందాడు. దమ్మ పదను తమిళం లోనికి తర్జుమా చేసాడు. అదే తమిళము లోని దమ్మ పదం యొక్క మొదటి అనువాదము. అది మొదలు అనేక బౌద్ధ గ్రంధాలను, కరపత్రాలను తమిళం లోనికి అనువదించాడు. వాటన్నిటినీ పెరంబూర్ బౌద్ధ విహార ప్రచురించింది. అతి కొద్ది కాలం లోనే పెరంబూర్ విహార తమిళనాడు లో అత్యంత క్రియాశీలకమైన బౌద్ధ కేంద్రం గా మారిపోయింది.
పెరంబూర్ విహార ఆరంభించిన వెంటనే 1900 లో దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటిసారిగా వైశాఖి వేడుకలు వైభవంగా జరిపారు. ఆ చారిత్రక పర్వ దినాన “బుద్ధ భగవానుని జీవితమూ-బోధనలు” తమిళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాటికీ కలకత్తాలో వైశాఖి వేడుకలు ఆరంభించి కేవలం నాలుగు సంవత్సరాలే అయ్యింది. అప్పటికే దక్షిణ భారత దేశాన అనేక మంది తమిళులు బౌద్ధం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. “బుద్ధ భగవానుని జీవితమూ-బోధనలు” పుస్తకం మొదటి ప్రచురణ విడుదలైన వెంటనే మరొక 2వేల కాపీలు ముద్రించవలసి వచ్చింది.
అయోతీ దాస్ మద్రాస్ లో 1907లో “ఒరు పైసా తమిళన్ “అనే వార పత్రికను మొదలుపెట్టాడు. కొత్తగా ఏర్పడిన అన్ని శాక్య బౌద్ధ సంఘాల సమాచార సమాహారంగా ఆ పత్రిక పనిచేసింది. తానూ క్రొత్తగా రూపొందించిన “తమిళ బౌద్ధం” గురించి, బౌద్ధ నేపధ్యంలో భారత దేశ చరిత్ర గురించి ఆ పత్రిక విస్తృతంగా చర్చించేది. దక్షిణ భారత దేశంలో అలా క్రొత్తగా ఏర్పడి గుర్తింపు పొందిన తమిళ బౌద్ధ సమాజం అప్పటివరకూ బ్రాహ్మణ కుల అణిచివేతకు బలైన వారు, వారి ప్రాచీన బౌద్ధ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తామే మూల భారతీయ బౌద్ధులమని తమ ఉనికిని చాటారు. అయోతీదాస్ ప్రకారం పరియా కులస్తులే అసలైన బౌద్దులు, వారి భూములను తర్వాత వచ్చిన ఆర్య దురాక్రమణదారులు దోచుకుని ఆక్రమించుకున్నారు.
ఆ విధంగా అయోతీదాస్ దక్షిణ భారత దేశ తమిళ బౌద్ధ ఉద్యమానికి ఆద్యుడైయ్యాడు. బౌద్ధానికి ఒక జన సామాన్యతను కల్పించాడు . కేవలం తమిళ నాడులోనే కాక బర్మాలోని కొన్ని ప్రాంతాలలో దక్షిణాఫ్రికాలోనూ ఎక్కడైతే దక్షిణ భారతం నుండీ వలస వెళ్లి పోయిన అస్పృశ్య కూలీలున్నారో వారినందరినీ కూడా ఉత్తేజపరిచాడు.
మహా బోధి సొసైటీకి చెందిన ఒక క్రియాశీలక సభ్యుడు ప్రొఫెసర్ పి. లక్ష్మీనరసు, బౌద్ధాన్ని స్వీకరించిన తమిళుడు(నిజానికి యితడు ఆంధ్రుడు/తెలుగువాడు) ,మద్రాస్ బుద్ధిష్ట్ అసోసియాషణ్ సభ్యుడు . 1907లో “ఎస్సెన్స్ అఫ్ బుద్ధిజం”అనే గొప్ప గ్రంధాన్ని రాసాడు. ఆ మొదటి ప్రచురణకు పరిచయ వాక్యాలు రాసినది అనగారిక ధర్మపాల .ఆ పుస్తకం ఎన్నో ముద్రణలను వెళ్లి ఎన్నో భారతీయేతర భాషలలోనికి కూడా అనువదించబడినది, ముఖ్యంగా జపాన్, జేకోస్లావేకియాన్ భాషల లోనికి. అనంతర కాలంలో అప్పదురైయార్ రాసిన “పుతరత్తు అరులారం” (బుధుని కరుణామయ మతం) పుస్తకానికి లక్ష్మి నరసు మూలగ్రంధంగా సహకరించింది .
1923లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమ్మేళనంలో బౌద్ధులకు బుద్ధ గయను అప్పగించాలనే డిమాండ్ కు మరింత బలం చేకూర్చడానికి శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ ప్రతినిధుల బృందంలో అప్పదురైయార్ కూడా చేరాడు . తమిళ నాట దక్షిణ భారత బౌద్ధ పునర్భావానికి ముగ్ధులై 1920లో సిలోన్ తమిళ్ బుద్ధిష్ట్ అసోషియషన్ చెందిన అనేక మంది సింహళీయ బౌద్ధులు ఉత్తేజితులై తమిళ బౌద్ధ సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి దానిని పరిపుష్టి చేయడానికి పూనుకున్నారు.
అయోతీదాస్ దక్షిణ భారతదేశ తమిళ బౌద్ధ ఉద్యమానికి ఆద్యుడైనప్పటికీ ప్రారంభంలో అనగారిక ధర్మపాల అత్యధిక సంఖ్యలో మేధావులను బౌద్ధం వైపు ప్రేరేపించి ఆకర్షించి ఆసక్తిని రగిలించాడు. ధర్మపాల పలుబౌద్ధ వ్యాపకాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ప్రచార నిమిత్తం జపాన్ లాంటి అనేక ఆసియా దేశాలతో పాటూ అమెరిక ఐరోపా దేశాల్లో తిరుగుతూ ఉన్నప్పటికీ భౌతికంగా లేకపోయినప్పటికీ అతడు ప్రారంభించిన కార్యకలాపాలు నిరాఘాటంగా కొనసాగేవి .
అనువాదం – డా.మాటూరి శ్రీనివాస్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment