అస్తిత్వం
పూవులన్నీ ఒకే వాసనతో , ఒకే రంగులో ఎందుకు ఉంటాయి?
పిట్టలన్నీ ఒకే రూపుతో ఒకే కూత కూయవుగా !
అది ప్రకృతి .
నువ్వు,నేనూ, వాడూ -అతడూ,ఆమె ఒకేలా వున్నామా?
ఎవడి కులపు గుర్రం మీద వాడు సవారీ చేస్తున్నాం ,
దృశ్యా అదృశ్యరూపాల్లో, గరిష్ట దుష్ట చేష్టలతో
- ఇది వికృతి.
కానీ ! మానుకీ , మనిషికీ మానవత్వమంత తేడా లేదూ ?
ఎవరి గోచీ వారు ఎగ్గట్టుకు లేస్తే మన కేమిటి పేచీ?
అనుకుందామా! కానీ -
సముద్రపు నీరంత ఉప్పగా,
నదీజలమంత చప్పగా,
ఆకాశమంత సహజంగా
చట్టమేమో కులం తో మమేకమై - తన తప్పుడు పనులు
తానూ చేసుకుపోతూ ఉంది ..
దేశం కూలిపోయినా, పేలిపోయినా, ఎఫ్.డి.ఐ ల్లో కాలిమాసై పోయినా ,
బోన్సాయ్ మత అతివాదం మాత్రం
‘’ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’’ లా ‘’ ఘర్ వాపసీ ‘’అంటుంది ,
గాంధీని కాల్చిన పొడవైన చేతులుతో మస్ జిద్ ను కూల్చి
చర్చిల ముంగిట్లో నీడలతో దొంగాట్లాడుతూ .
త్రిశూలం , ట్రినిటీ ల ఆధిపైత్యపు పోరుని పిల్లి తీర్చిన వేళ –
రాజ్యాంగ భజన మొదలెట్టింది - దొడ్డ అవతారమెత్తి, సామ్రాజ్యవాదం.
గుడ్డునీ,పిల్లనీ ఎక్కిరిస్తుంది ,పీడ రాసి పెద్దన్న పెద్దరికం .
‘’ప్రేమ’’ పవిత్రతను కూడా ఒక ఉన్మాదం లా
చూసే కాషాయపు కళ్ళు,
అప్ప చెల్లెళ్ళను మూడు రేపుల, అరు కాన్పుల
ఆటబొమ్మలను కునే ‘కర’ జాతి ,
కడనీతి పాలిస్తున్న రాజ్యానికి నిలువెత్తు సాక్ష్యం,
నాలో ప్రాణభయంతో వణుకుతున్న లౌకిక వాదం.
కలం హలం చేసుకుంటేనే , చరిత్ర పొలం పండింది .
మదమెక్కి మతపు-టేనుగుల ధ్వంస రచనకు
ఛిద్రమైన సృజన మెదడు ‘’మురుగన్’’ గా మిగలింది.
మకిలి మాటల చేతబడులును హేతువాదవేదం తో
అంధ శ్రద్ద నిర్మూలన ‘’దబోల్కర్’’ యై క్రాంతి బాట పట్టింది.
దారి దోపిడీల తోలు వలిచి డోలు కట్టే వేళ -
‘పనేసరే’ టోల్ పన్నై ఫాక్షన్ కు కమీషన్ గా బలైన దేశంలో
నిష్కపట స్వరాల గుండెల్లో కసాయి గుళ్ళు కవాతు,
కల్గించిందా ?కనివిప్పు .
తీరని ఆకలితో - ఎడారి రేణువులూ ,
సముద్ర తీరాలూ సునామీ సృష్టించాలంటే
ఇంకా ఎన్ని తలలు ముసుగు చేతుల కత్తులకు కుత్తుకలు అప్పగించాలి.
ఆగడాల సెగలు- నివురుగప్పిన నిప్పుల్లా, అణువణువూ రాజుకుని
మనసున్నోడిలో రక్తకణికలై మరగ కుండా వుంటాయా? ,
ప్రపంచ గ్రామంలో మార్కెట్టు విలువ లేని ఒకేఒక వస్తువు ప్రాణం.
దానికి నా కాలాన్ని ,కలాన్ని,గళాన్ని పణంగా పెట్టి –
కుల, మత కుచ్చితాలను చుట్టుముట్టి మట్టుబెట్ట పూనుకున్నా-
చైతన్యోదయాన్ని శతకోటి క్షుద్ర దరిద్ర గోముఖ వ్యాఘ్రా లడ్డుకున్నా-
సర్వజనీన , సమ భావనతో శాసించే లౌకిక -కవన గీతాన్ని నేనౌతా ...
సమున్నత సమ సమాజాన్ని శ్వాసించి
సామ్యవాద - భువన పతాకను నే నవుతా ...
స్వేచ్చా విహంగ క్షిపిణీ భావాన్నై ..
సౌభ్రాతృత్వపు సమైక్య సంజీవాన్నై..
మనిషిగా మరణిస్తా , చరిత్రలో చిగురిస్తా .
రేపటి నేటికి , నేనే ప్రజల ప్రబల మేనిఫెష్ట్తో ని.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్

