Tuesday, 14 November 2017

గురజాడ రచనల్లో బౌద్ధము

ఒక సాహితీ సమావేశంలో చాలా కాలంగా క్రితం జరిగిన సంభాషణ. నాలో ఉన్న
ఆలోచన డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావు గారితో అన్నాను, “మాస్టారు !
గురజాడ వారి మీద బౌద్ధం ప్రభావం చాలా ఉన్నట్టు అనిపిస్తుంది” అని. ఆయన
చాలాసేపటి తరువాత “ నిజమే నయ్యా” అన్నారు. గత నవంబర్ 30న విశాఖలో జరిగిన
గురజాడ శతవర్ధంతి సభలో ఆచార్య కే.వి గారు మాట్లాడుతూ “ మంచి గతమున
కొంచమేనోయ్” అని వివరిస్తూ ఉంటే ఆయన మాటల్లో ఏదో నిఘూడత నాకు
గోచరించింది. గురజాడ అభిమానిగా,బౌద్ధ అభిమానిగా ప్రత్యక్షంగానో
పరోక్ష్యంగానోనా పై వీరిద్దరి ప్రభావం నా మీద ఉండడం చేత వ్యాసానికి
పూనుకున్నాను. కొందరు నా అవగాహనతో ఏకీభవించకపోవచ్చు. ఎవరి కారణాలు
వారికుంటాయిగా .
గురజాడ వెంకట అప్పారావు గారు తెలుగు సాహిత్యం గర్వించదగ్గ మహనీయుడు,
మహా మనీషి. గొప్ప సంస్కర్త. నాటి సమాజాన్ని లోపలనుండీ ఎండగట్టి సంస్కరింప
ప్రయత్నించచిన బహు కొద్ది మందిలో ఒకరు . ముందుగా వారి ‘ముత్యాల సరములు’
చూస్తే సమాజ రుగ్మతలైన కులాన్ని,మతాన్ని, ఆవశ్యకములైన మానవ విలువలను
ఆయన సాహిత్యంలో ప్రస్తావించారు. గతంలో ఎవ్వరూ ప్రస్తావించలేదని కాదు
గానీ, ఆయన రాసింది రాశి లోనూ వాశి లోనూ ఎంతో శ్లాఘనీయమైనది. “ఎల్ల
లోకములోక్క ఇల్లై , వర్ణ భేదము లెల్ల కల్లై , వేలనేరుగని ప్రేమ బంధము ,
వేడుకలు కురియ” అంటూ వర్ణ వ్యవస్థ ను, అలాగే “మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును” అంటూ అజ్ఞానం వలన సమాజం ఏ రీతిన భ్రష్టు
పట్టిపోతుందో వివరించే తీరు , జ్ఞానం యొక్క అవసరాన్ని,విద్య యొక్క
ప్రాధాన్యతను తెలుపుతాయి. విద్య తద్వారా జ్ఞానము , తద్వారా ప్రజ్ఞ
తద్వారా సత్ చిత్తం వస్తుందని క్రీస్తు పూర్వమే భారతదేశానికి చాటింది,
గౌతమ్ బుద్ధుడే .
“మలినదేహము మాలలనుచు, మలిన చిత్తుల కధిక, కులముల నెల వొసంగిన వర్ణ
ధర్మ మధర్మ ధర్మంబే” అనే వాక్యం ‘లవణరాజు కల’ అనే కవితలోనిది. వర్ణ
ధర్మమూ ఎంత అధర్మ ధర్మమొ ఘంటా పధం గా ప్రకటించిన ఆధునిక భారతీయ
సంస్కర్త ఆయన. ఇంకాస్త ముందుకెళ్ళి “ మంచిచెడ్డలు మనుజులందున , ఎంచి
చూడగా,రెండే కులములు ; మంచి యన్నది మాల అయితే , మాల నేనగుడున్” అని ఆకాలంలో
మాట్లాడం రాయడం నిజంగా సాహసమే. అగ్రహారాలలో ఆ రోజుల్లో అన్నితిట్లు
,చివాట్లు ‘మాల’ శబ్దానికి ముడిపెడుతూ కుల వివక్షాపూరితంగావాడే వారు. కారణం
విదితమే. మరి కులనిర్మూలనకు గురజాడ వారి కవిత్వం ఏమేరకు
దోహదపడిందో,అభ్యుదయ కవులు,గురజాడవారసులు ఏ మేరకు ప్రయత్నించారో,అసలు
ప్రత్నించారో లేదో తెలియదు. కానీ అవసరమున్న లేకున్నా ఈ పంక్తులను
ఉటంకించడం మాత్రం చేస్తుంటారు. వర్ణ వ్యవస్థ ను ,కుల ప్రాతిపదిక ప్రక్కన
పెట్టిన మొట్ట మొదటి సామాజిక విప్లవకారుడు బుద్ధుడేనని చెప్పనవసరం లేదు.
ఉపాలి మొదలుకుని ఆమ్రపాలి వరకు ఎంతోమందిని ఆదరించి వేదాలు అపౌరషేయాలు కాదు
అని ప్రకటించాడు. గురజాడ వారితో బుద్ధుడే ఈ సాహసం చేయించాడా? అంటే నిజమే
అనిపిస్తుంది. వేదాలను అన్ని భారతీయ చింతనలు అంగీకరించలేదని, అంగీకరించినా ఒకే
రీతిలో అంగీకరించలేదని అంటారు, అప్పారావు గారు. వేదాలను మొదటిసారిగా
బహిరంగంగా ప్రశ్నించినది,బుద్ధుడే. అందుకే ఒక సందర్భాలో “బౌద్ధాన్ని
భారతదేశం లోనుండీ వెళ్ళ గొట్టి దేశం మతపరంగా ఎంతో పెద్ద తప్పు చేసింది”
అంటారు, గురజాడ అప్పారావు .

కానీ ,కొన్ని సందర్భాల్లో అవసరార్ధమనో లేక స్వజాతి
అనునయింపుకో “ విద్య నేర్చినవాడు విప్రుడు, వీర్య ముందినవాడు క్షత్రియడన్న
పెద్దల ధర్మనీతి మరిచి... ” అని ‘కన్యక’ అనే కవితలో అన్నా,అలాగే ‘మెరుపులు’ అనే
కవితలో “నాల్గు రీతుల గనకంబు నాడెగమగును, వెతుగీతుల తునియించి వెచ్చజేసి, నరుడు
నట్టుల నాల్గింట నాడె మగును; కులము,శీలంబు,కర్మంబు ,గుణము చేత” అంటూ ఛాందస
సంప్రదాయ వాసన వెదజల్లుతారు. ఆయనా, గురజాడ మీద సాంప్రదాయవాదుల దాడులు
నేటికీ ఆగలేదు. అయితే ఆయన చిత్తశుద్ధికి ఇవేమీ అడ్డు రావంటారు,విజ్ఞులు.
‘మనిషి’ కవితలో “మనిషి చేసిన రాయిరప్పకు, మహిమ గలదని,సాగి మొక్కుతు, మనుషులంటే
రాయిరప్పల కంటే కనిష్టం” అనే మాటల్లో హేతువాదం ప్రతిబింబిస్తూ
మూఢత్వానికి,అసమానతలకు నిరసన ధ్వనిస్తుంది,ఆయన్లోదాగున్న నాస్తికత్వం
తొంగి చూస్తుంది. భారతీయతత్వ చింతనలో శాస్త్రీయ దృక్పధంతో హేతువాదాన్ని
సమాజానికి పరిచయం చేసింది, బుద్ధుడే అంటే విభేధించేవారూ ఉంటారు. చెప్పాను
కదా! ఎవరి కారణాలు వారికుంటాయిని. వీరందరికీ సమాధానం , బుద్ధుని ‘కాలమా సుత్త’.
బుద్ధుని కాలామ సుత్త కంటే మించిన హేతువాద దృష్టి బహుసా బ భారతీయా
సాహిత్య చరిత్రలోనే కానరాదంటే అతిశయోక్తి కాదేమో.
గురజాడ వారు దేశానికిచ్చిన అపురూప,అమూల్య కానుక దేశ భక్తి గీతం. ఏ
దేశానికైనా, ఏ కాలానికైనా సరితూగగల గీతం అది. “ వెనుకచూసిన కార్యమేమోయ్ ,
మంచిగతమున కొంచెమేనోయ్, మందగించక ముందు కడుకేయ్, వెనుక పడితే
వెనుకేనోయ్,” సత్యాన్వేషణతో గతమెంత ఘనకీర్తి అన్న ధోరణికి భిన్నంగా
అభ్యుదయ స్పూర్తిని నరనరాలా నింపుతారు . గతం లోని ఉన్న మంచి ఏమిటో
తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తారు. వెనుకబాటుకు కారణాలను కూడా
నర్మగర్భంగా అంచనా వేస్తాడు. ద్వేషాన్ని, స్వార్ధాన్ని వీడ మంటూ “పూను
స్పర్ధను విద్యలందే ,వైరము వాణిజ్యమందే ,వ్యర్ధకలహము పెంచబోకోయ్ ,
కట్టి వైరం కాల్చవోయ్” అన్నా, “వొరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యము
నేర్చవోయ్”, “వొకరి మేల్ తన మేలనెంచే ,నేర్పరికి మేల్ కొల్లలోయ్” అన్న
మాటలకు నేపధ్యం మనకు యిట్టె అర్ధం అయిపోతుంది. ఇతరుల మేలు చేయ తలంపు
మనకు ఎంత మేలు చేస్తుందో ఎంత సౌఖ్యాన్నిస్తుందో తెలిపే ఈ మాటలు
బౌద్ధంలోని ముదిత , మైత్రి, శాంత చిత్తము స్పురణకు తె స్తాయి. ఇవన్నీ
ఎప్పటికైనా కనీస సామాజిక అవసరాలు. వాటి కొరతను అంచనా వేస్తున్నారు.
నాటికల్లోకి,కధల్లోకి వస్తే “ఆధునిక మహిళా చరిత్రను తిరగరాస్తుంది “ అని
ప్రకటించి స్త్రీకు సాధికారత తివాచి పరుస్తారు, గురజాడ అప్పారావు గారు.
కన్యాశుల్కం లో మధురవాణి పాత్ర బహుముఖ ప్రజ్ఞ ను, స్త్రీ యొక్క
ఔన్నత్యాన్ని చాటుతుంది. స్త్రీ స్వేచ్ఛ కు వ్యక్తీ స్వేచ్చకు నిలువెత్తు
నిదర్శనం మధురవాణి . కులముకన్నా గుణమెంత మిన్నో ఉదాహరిస్తూ,సంస్కరణలను
సోదాహరిస్తూ అగ్రహారాల్లోని అమానుషత్వాన్ని సమాజానికి పరిచయం చేసిన
గొప్ప సాంఘీక విప్లవం, కన్యాశుల్కం నాటిక. ప్రపంచ చరిత్రలోనే స్త్రీ పురుష
సమానత్వం గురించి,సమానావకాశాలు గురించి మాట్లాడిన మొదటి సాంఘిక
విప్లవకారుడని ప్రపంచమే బుద్ధునికి కితాబు ఇచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం,
సహోదరత్వం, సమ న్యాయం ప్రాతిపదికనే బుద్ధుని బోధనలన్నీ సాగాయి.

అముద్రిత భాగామైన ‘బిల్హణీయం’ లో పండితుడు, హేతువాది అయిన
బిల్హణుడు ఇలా అంటాడు- “దేవుడిని కూడా మభ్య పరుప ప్రయత్నిస్తారు. పేరుగల
మతమలెల్లా సత్ప్రవర్తనను,భూత దయను ముఖ్యమని చాటుతున్నవి. వైదిక మతముల
కన్నాబౌద్ధ జైన మతములలోనే వీటికి ప్రాముఖ్యతలు లావు. నిర్వ్యాజమైన ఈ

గుణములతో మేళనలేని జపతపాదులు వ్యర్ధములు” . నాటి సమాజంలో
సత్ప్రవర్తనను,భూత దయకు కారణాలను ప్రత్యక్షం గానే గురజాడవారు
ప్రకటించారు. వేద ప్రమాణాలను కూడా విమర్శిస్తూ స్వర్గ నరకాలు ఈ లోకంలోనే
ఉన్నవని, చూడ నేర్చినవాడికి ప్రతి దేశంలోనూ కనబడతాయంటారు. నిజమైన
జ్ఞానమును సాధించవలెనన్నామతముల యడల అసూయ ఉండకూడదు. మన మతమే
నిజమూ,పరమతములన్నీ అబద్దమూ అనుట అజ్ఞాత. ఏ దేశంలో ఏమతంలో యే మేలు
ఉంటే అదల్లా గ్రహించాదగినదే, అని ఉద్భోధ చేయిస్తారు, బిల్హణుడి చేత
బిల్హణీయంలో . మతములన్నీ మాసిపోక పోయినా కనీసం మత సహనము యెక్క
ఆవశ్యకతను గుర్తుచేస్తారు, ఈ కావ్యంలో . నేటి సమాజానికి గురజాడవారి
అవసరాన్ని, అధ్యాయనాన్ని,సందర్భాసుద్దినీ, ఔచిత్యాన్ని ,సంగతత్వాన్ని ఈ
మాటలు తెలియచేస్తాయి. ‘కొండుభోట్టీయము’లో తృతియాంకం ద్వితీయరంగంలో
పై వాటికి కొనసాగింపుగా అనిపించే మాటలు కొన్ని కనిపిస్తాయి. దివాన్
బహుద్దూర్ రాజారాం గిరీశం పంతులుగారితో ఒక సందర్భంలో “ హిందూ హిందూ అనే
మాట తుడుపు పెట్టి సంఘ సంస్కారమే ముఖ్యముగా ఆలోచించవలసి ఉంటుంది .హిందూ
అనే మాట చేర్చగానే మన ఉద్యమముల లాభము సంకుచిత మౌతుంది;’అంటారు. నేటి
సామాజిక రాజకీయపరిణామాలకు అక్షరాల అన్వయించుకోదగ్గ మాటలివి. సమాధానంగా
‘నిష్కల్మషమైన మనసు , అవ్యాజ్యమైన భూత దయ ఉంటే యే మతమైనా సమ్మతమే
“ అంటుంది గిరీశం పంతులు గారి పాత్ర అంటుంది. నేటి మత అసహన నేపధ్యంలో వారి
రచనల ప్రస్తుతాన్వయమూ ఎంతో బోధపడతాయి. అంతేనా క్రీ.పూ అశోకుడు శిలా
శాసనాల్లో రాయించిన పర మత సహనం ఈ మాటల్లో ఉట్టి పడుతుంది.
గురజాడ వారి కధల్లోకి కధానికల్లోకి వెళితే రాసినవి బహు కొద్దే అయినా
సమాజంలోని రుగ్మతలకు అద్దం పడతాయి. అవిద్య అజ్ఞానానికి ,కోరికలకి,
బలహీనతకీ హేతువు. అలాగే విద్య జ్ఞానానికి సంస్కారానికి ప్రతీక అని
తెలియచేస్తూ భర్త కు కనువిప్పు కలిగించే మేటి కధ “దిద్దుబాటు”. కొన్ని
కారణాలతో తెలుగు కధా చరిత్రలోనే మొదటి కధగా ప్రత్యేకత సంతరించుకున్న కధ
ఇది. “సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే”
అనిపిస్తారు , కనువిప్పి కలిగిన భర్త చేత , గురజాడ వారు. మరొక కధా కలికితురాయి మీ
పేరేమిటి? అనే కధ . ఈ కధ పూర్తి పేరు ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన
దేవుళ్ళారా ! మీ పేరేమిటి?’. ఈ కధ ఆరంభమే బౌద్ధుల ప్రస్తావన అవుతుంది.
పురాణాల గురించి మేము శంకలు వేస్తే, మా గురువుగారు, “ వెధవ చదువు! మీ మతులు
పోతున్నాయి. మీరు వొట్టి బౌద్ధులు” అనేవారు- అంటాడు శిష్యులలో ఒకరు. అంటే
ప్రశ్నలు వేసేదీ ,సమాధానాలు శాస్త్రీయంగా లేకపోతే అడ్డు చెప్పేదీ కేవలం
బౌద్దులేనని నాటి సమాజం నిర్దారణ కు వచ్చినట్లు అర్ధం అవుతుంది. అంతకు మించి
ఈ కధ మొత్తంగా చదివితే గురజాడ వారికి బౌద్ధం మీద, బౌద్ధ సాహిత్యం మీద
బౌద్ధ స్తూపాలమీద పరిపూర్ణమైన అవగాహన , సానుకూల దృక్పధము, అలాగే
బౌద్ధాన్ని వక్రీకరించి నిర్వీర్యం చేసిన శైవ వైష్ణవాల కుట్ర మనకు అవగతం
అవుతాయి. శిష్యులే గురువు చేత బుద్ధ చరిత్ర చదివించి కనువిప్పు కలిగిస్తారు.
బౌద్ధ కట్టడాలను బుద్ధుని ప్రతిమలను ఎలా విష్ణు క్షేత్రాలుగా శైవ
క్షేత్రాలుగా మార్చేసి ఘర్షణలు పడేవారో ఈ కధ తెలియచేస్తుంది. ఒక చోట
“ఈదేశంలో పాండవులు ఉండని గుహలు, సీతమ్మ వారు స్నానమాడని గుంటలు లేవు” అన్న
మాటలు రామాయణ భారతాల డొల్లతనాన్ని బయట పెడతాయి. బౌద్ధ చారిత్రకతని
వివరిస్తాయి.
మెటిల్డ అనే కధ లో “చెడ్డ తలంపు చెప్పి రాదు,ఎక్కడనుంచో రానక్కరలేదు.కంటికి
కనబడకుండా మనసు లోనే పొంచి ఉంటుంది” అంటుంది ఒక పాత్ర. బౌద్ధంతో పరిచయం
ఉన్నవారికి ‘మనస్సు అన్ని తలంపులకి కారణము’, ‘మనస్సు నీ యజమాని’, ‘దమ్మానికి

మూల ధాతువు మనస్సు’ అని చెప్పే దమ్మపద లో ‘మనోపుబ్బంగమ దమ్మ .... ” అనే
పంక్తి గుర్తుకు రాక మానదు. మరొక సందర్భములో వర్డ్స్ వర్త్ కవిత్వం గురించి
మాట్లాడుతూ “ పుట్టుకవల్ల గొప్ప రానేరదు, గుణ యోగ్యత వలననే గొప్ప
వచ్చును”అంటారు, గురజాడ. ఈ మాటలు – ‘బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో
వచ్చేది కాదు , ప్రజ్ఞతోనే వస్తుంది,’ అనే బుద్ధుని బోధకు ఎంతో దూరం కావు
కదా!.
1900 వ సంవత్సరం డిసెంబర్ లో గురజాడ వారు కలకత్తా లోని సందర్శించిన
మ్యుజియం గురించి తన డైరీ ఇలా రాసుకున్నారు, “ఇక్కడ పురావస్తు విభాగంలో
బౌద్ధ కట్టడాలు, స్తూపాలు,చైత్యాలు విరివిగా ఉన్నాయి. బౌద్ధ కళా
కృతుల్లో గ్రీకుల కళానైపుణ్యం ప్రస్పుటిస్తుంది.” అంటే గాంధార కళ అని ఆయన
ఉద్దేశముగా అర్ధం అవుతుంది. కొన్ని అద్భుతమైన బుద్ధుళ్ళ మరియు బోధి
సత్వుల విగ్రహాలు ఉన్నట్లుగాను రాస్తూ , “ ఇప్పటికీ నాకు అర్ధం అయింది
ఏమిటంటే బుద్ధుళ్ళ మరియు బోధి సత్వులకు ఉన్న తేడా, బోధి సత్వులు ఆభరణాలు
ధరించి ఉన్నారు”, అని ముక్తాయిస్తారు. మరొక చోట “కృష్ణా జిల్లాలోని బౌద్ధ
అవశేషాలు” సంబంధించిన పుస్తకాన్ని ఆయన చదవనున్నట్లు తెలుస్తుంది. నిజమే
బౌద్ధం మీద విశేషమైన అభినివేశం లేకపోతే ఆయన కధల్లో అంత లోతైన విషయాలు,
సామాజిక సంస్కరనీయ అంశాలు చర్చించేవారు కాదేమో అనిపిస్తుంది. కలకత్తా
నేషనల్ మ్యుజియం మన దేశానికి తలమానిక.అతిపెద్ద మ్యుజియం. పూర్తిగా
దర్శించాలంటే రెండు రోజులు పడుతుందంటే అతిశయోక్తి కాదు. అటువంటి
మ్యూజియంలో సందర్శించి ఎన్నో ప్రత్యేకలతలున్నా కేవల బౌద్ధ చరిత్రను
ఉటంకించడం బౌద్ధం పై అతనికున్న అభిమానాన్ని అతనిపై ప్రభావాన్ని
చాటుతుంది.
నా స్వంత ఆలోచనలు(My own thought)అని ఆయన ఆంగ్లంలో రాసుకున్న
స్వగాతాల్లో ప్రేమ,కరుణ,శాంతి,ప్రశాంతత గురించి తరచుగా రాసుకున్నారు. ప్రేమ
ఇచ్చిన ప్రేమ వచ్చును, అంటూ ప్రేమలోని తాత్వికతను బయటపెట్టారు. మూఢ
నమ్మకాలగురించి చాలా చోట్ల చాలా నిశితంగా విమర్శించడం మనకు కనిపిస్తుంది.
‘అసంతృప్తిని, కోపాన్ని తాత్వికతతో సంభాళించు కున్నట్లు అయితే సుఖ శాంతులు
లభిస్తాయి. రెచ్చగొట్టే ధోరణినికి లొంగకుండా దాని వెనుక ఉన్న
ఉద్దేశాన్ని,ఆలోచనని అంచనాలతో అర్ధం చేసుకుని తాత్విక దృష్టి తో చూడాలి.
అప్పుడే తుఫాన్లో అతలాకుతలమైన చెట్టులా కాకుండా భూమితో నున్న శిలలా
నిబ్బరంగా ఉంటారు అని ఆంగ్లంలో రాసుకుంటారు గురజాడ. ఈ పై అంశాలనే బుద్ధుడు
దుఃఖ కారణాలుగా వివరిస్తూ అష్టాంగ పరిష్కార మార్గాన్ని బోధిస్తాడు. క్షమా
గుణాన్నే వివరిస్తూ ఉపేక్ఖ అనే ఒక్క పదం తో ప్రపంచానికి దగ్గరౌతాడు .
గురజాడ అప్పారావు గారి రచనల్లోని విశిష్టత అందరికీ బాగా పరిచయమే.
సామాజిక స్పృహకు, అభ్యుదయ చైతన్యానికి, భాషా సంస్కరణలకు,దేశభక్తికీ
గురజాడ సాహిత్యం దోహద పడినంతగా మరి ఎవరి సాహిత్యమూ , మరే భాష లోనూ
దోహదపడలేదు. నేటికీ వారి రచనల ప్రాసంగీకత ఎంతో నేటి కాల పరిస్థీతులే
తెలియచేస్తున్నాయి. నేటి సాహితీ సమాజం వాటిని మరలా పునర్మూల్యాంకన
చేయ వలసిన అవసారాన్ని గుర్తు చేస్తున్నాయి. వ్యక్తిగత ఆచరణలో చిన్న చిన్న
విమర్శలున్నప్పటికీ అంతర్జాతీయ కవిగా గుర్తింపు పొందగలిగిన స్థాయున్న
సాహితీ ద్రష్ట, గురజాడ. ఎందరో సాహితీ వేత్తలు,సంస్కర్తలు నాటి నుండీ నేటి
వరకు బౌద్ధం యొక్క ప్రభావానికి లోనయి నప్పటికీ విస్మరించడాన్నో,
వక్రీకరించడాన్నో సాహితీ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ గురజాడ వారి ఆలోచనా
విస్తృతి దీనికి భిన్నంగా ఉండడాన్నేకాదు, పారదర్శకతతో ఎద్దేవా చేయడాన్ని
కూడా మనం చూస్తాం. సాహిత్యము సమాజ శ్రేయస్సుకు ఎలా దోహదపడగలదో,

సమాజహితానికి కొలమానం కాగాలదో తెలుసుకోవాలంటే గురజాడ అప్పారాగారి రచనలు
చదవాల్సిందే. సాహిత్యం దేశ ప్రయోజననాల్ని సమిష్టి గా సమభావంతో తీర్చే
మహోన్నత రూపాన్ని సంతరించుకున్నప్పుడు ఆ కవిత్వం జాతీయత సంతరించుకుంటుంది.
ఇక్కడే గురజాడలో బౌద్ధం ఛాయలు తొంగి చూస్తాయి. వారికి శత వర్ధంతి నివాళి
అర్పిస్తూ,కన్యాశుల్క నూట పాతిక జయంతికి శుభాకాంక్షలు తెలియచేయడానికి
గర్వపడుతున్నాను .
డాక్టర్ మాటూరి శ్రీనివాస్ .

No comments:

Post a Comment