నిజంగానే....
వినీలాకాశాన్ని ఎప్పుడూ ఇంత హృద్యం గా
నేను చూడలేదు
నిర్మలంగా పరుచుకున్న సాగర కెరటాలతో
పోటీ పడడాన్ని
తీరాన కేరింతల గిరికీలను ఆకాశం ఆస్వాదించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు
సునీలకాలను హత్తుకుని అద్దుకున్న
మేఘాల్లోంచి
అటుగా ఆవల ఊదారంగును విశ్లేషిస్తూ
కనువిందుగా వెలుగురేడు అవ రోహిణి
ఇటుగా ఈవల మెల్లగా చల్లగా ఉధ్భవిస్తూ
నెలరేడు అధిరోహణ
జమిలిగా గగనాన జుగల్బంధీ ని
నేనిప్పుడే చూస్తున్నను.
ఒక ముగింపు మరొక ప్రస్థానానికి నాంది.
మనసు కాలయంత్రంలో రివ్వున వెనక్కి
పరిగెత్తడాన్ని నేను గమనిస్తున్నాను,
చెంప చాటున దాగిన గులాబి సిగ్గుతో
తిరిగి మొగ్గైంది
అమాంతంగా అందరం బాల్యంలోనికి పరుగు
తీసింది
జల్సా పంచుకుని పండగ చేసుకొమ్మని
ప్రకృతి వగలు కొమ్మలను చెంత చేర్చింది
అంత వరకు ఊహకందని అందమేదో అందర్లో
ఆవహించింది.
తృప్తికి అంతం ఉంటుందా?
కాస్తంత లోటే ఆ తృప్తికి అందం
కానీ, ఏలోటూ కానరాని అఖిలమైన తనివి
తీరడాన్ని నీవెప్పుడైనా అనుభవించావా?
అన్నీ కలగలిపిన మధురామృతాన్ని
చెలిమితో ముడివేసి బంధీని ఏమంటారో తెలుసా?
అవధుల్లేని ఆప్యాయతలు సాగర సంగమరీతిని
మరపిస్తే,
సైకత తీరాలు తీయగ హత్తుకుని ఆత్మీయంగా
గిలిగింతలు కల్పిస్తే
అలవికాని ఆ పెన్నిథిని ఆసాంతం సొంతం
చేసుకుని
మనసు మూలలలో నిక్షిప్తం చేసేసి
ఆ జ్ఞాపకాల శాశ్వత తాళం వేసేస్తే
ఏమంటారు?
ఆ అరుదైన బంధాన్ని
HAVE-LOCK అని కాక మరేమంటారు.
సుదూర తీరాలు దాటి ఖండాంతరాలను మీటి
అనుబంధమే సంబంధంగా
సుభద్రంగా శుభప్రదంగా
ఆవిష్కరించుకున్న మా అన్నోన్య అభిమానం
ఎంత ప్రయత్నించినా లోతైన సాగర గాఢతకు కూడా అంతు చిక్కడం లేదు.
నవ్వులనే ప్రాణవాయువుగా
మాటలనే
మిఠాయిలుగా పంచుకుంటూ నిండు పూర్ణ
చంద్రిక ఆలంబనలను ఆస్వాదిస్తూ సాగిన మైత్రీ ప్రయాణం అవిరామం గా
దిగంతాల తీరాలవైపు
అనంతాల పార్శ్వాల వైపు
అను నిత్యం సాగడాన్ని నేను
ఆశీర్వదిస్తున్నాను.
వెన్నలలోని అలల మిలమిలలు గొంతుల
గలగలగలతో పోటీ పడడాన్ని అనుభవిస్తున్నాను.
కాంతలీను కమనీయ ఉషోదయాలను మేల్కొల్పడం
అరుణోదయ వేళ మాంగ్రూవ్ వృక్షాలు
కళ్యాణి రాగాలాపన చేయడం నేనిక్కడే చూస్తున్నాను.
యావత్ జల సంపద కూడా ఏ ఒక్క కోహినూర్కు
సరితూగలేదని తెల్సింది
మరి, ఎన్నో కోహినూర్లు ఒకే చోట మెరిస్తే
అది భూతల స్వర్గ కాక మరేమౌతుంది..?
భూదేవి కి తోడుగా శ్రీదేవి లక్ష్మీ
కటాక్షం సోగ సిరులను కురిపిస్తుంటే,
మా శ్రేయస్సు,
నిరంతర అప్రమత్తత
పద్మపాణీ
ప్రత్యక్ష పలకరింపుతో
పరోక్ష్య పలవరింపులతో నన్నలరించడాన్ని
నేను అనుసరిస్తున్నాను
కాళికా పూనిక ఒక్క మాదిరిగా ఆవహించి
అలరించి పరవశించడాన్ని
బాల రత్నగా అవతరించడాన్ని నేను
ఆనందిస్తున్నాను.
ఆ పరవశ ప్రాంగణంలో నిదురను దరి చేర
నీయకుండా ఎన్ని లాలి పాటలు పాడుకున్నానో జీర పోయిన నా గొంతు కు కూడా అంతు పట్టడం
లేదు
ఇక, గతిలేని జోరుగాలి ఈలపాట నావబాట
చతికిలపడక తప్పలేదు
ఉండబట్టలేని నిండు చందమామకు
కన్నుకుట్టిందో ఏమో
సంభ్రమశ్చర్యాలను కప్పి పుచ్చేందుకో
ఏమో
అవని ఆవల వయ్యారంగా దాక్కో
ప్రయత్నించింది
సూర్యగ్రహంతో దొంగాటలాడింది
అయినా...ప్రపంచమే ఒక్క చోట చేరినప్పుడు
భూమి సూర్యచంద్రులు
ఒక్క కక్ష్యలో చేరి సయ్యాటలాడడంలో
వింతేముంది..
రత్నాకర పురిలో మానస సరోవరాన్ని
తలపించు
అను రాధా నగరిలో
భాస్కరుని సమ్మోహన వీడ్కోలు ఒక ప్రక్క
కలువ రాయుని చంద్రతాపపు కుంచె
చిత్రిస్తున్న కమనీయ కౌముదీ హేల మరొక ప్రక్క
ఆ క్షణాలను ఆస్వాదించడమే జీవిత
పరమార్థంగా అనిపించడం ఒప్పే అనిపించిందక్కడ నాకు
అలుపూ సొలుపూ లేని మా సుజాతకానికి
అందిరితో పాటూ నేనూ ఎంత మురిసిపోయానో!!
జాపోత ఎరుగక మరపురాని పూత పూసిన
నవ్వుల విరి జాత కు నేనెప్పుడూ దాసోహమే
ప్రశాంతతే ఆభరణంగా
స్వశ్ఛీలత సంచరిస్తున్న
స్నేహావరణానికి గులాములు కానిదెవ్వరు?.
అల్లంత దూరాన ఏదో తెలియనితనంతో
నల్లని కురుల కను సన్నలల్లోంచి శైలు
కళ్లు
అలల నురగల్లో సంచరిస్తున్న మీనాలతో
పోటీ పడడాన్ని
లంగరేసుకుని స్వేద తీరుతున్న పడవ
పసిగట్టడాన్ని నేను గమనిస్తున్నాను..
చిరు ఆటు పోట్లతో తన నిశ్శబ్దానికి
భంగం కల్గిస్తున్నా
నావ తన సహజ సహన ఔదార్యాన్ని నేను
పూజిస్తున్నాను
ఏటి దివిటీలలా నీటి కెరటాలు ఆత్మీయ
ఆలింగనాన్ని
మమ్మల్ని ఆవరించి తన ప్రియత్వాన్ని
చాటడం నేను అంతర్ముఖుడనై
ధ్యానిస్తున్నాను....
ఆ ధ్యానంలో మైత్రీ భానవను
నిస్వార్థంగా శ్వాసిస్తున్నాను..
.......
మాటూరి శ్రీనివాస్
04-02-18