Sunday, 31 May 2020

తల్లి

నా తల్లి త్యాగాల మల్లి నా స్వాభిమాన బలం నీవు 
అపురూపం నీవంటే, ఆశీర్వదించే అనురాగం నీవుంటే , 
నీడనై ఉంటా నేనెప్పుడూ నీ వెంటే
అమ్మా ! నన్ను కని నీ మాతృత్వం ఇచ్చినందుకు  నీకు  వేన వేల వందనాలు
నీ ఉపకార స్మృతులకు నా జీవితమే కృతిగా ఋణం తీర్చుకోవడం నా సహజ ధర్మం  
నా ఉన్నతినే కోరుతూ   నీ శ్వాసనే ఆశయంగా పునాదులెన్నో వేసావు
నీ భాషనే నా తప్పటడుగులకు ఆలంబన చేసి
తల్లి వేరువై నన్నెంతో ఎత్తుకు తీసుకుపోవడానికి నీవెంతో లోతుకు వెళ్లావు
నీవు బలపడుతూనే నను ప్రామాణికముగా పెంచావు
నీ త్యాగఫలమే మే కదా, నన్నింతగా విస్తరింప చేసింది
నిను నేలలో విడిచాకే కదా ?! నేనాకాశములో వేన్నూల్లుకున్నాను
మరి..! వీళ్ళ గోలేమిటి??
నిను చంపుతున్నానంటున్నారు, బతికించ మంటారు ...
హంతకులే న్యాయమూర్తులు గా ప్రవర్తిస్తున్న నా దేశంలో
మనువాదం ముసుగేసి ముసలం పుట్టిస్తుంది తల్లీ !
మన పేదరికం వారి వ్యాపార వస్తువైందమ్మా
భాష మిషతో  నా గమనాన్నీ అడ్డుకోవాలని చూస్తున్నారు  
విత్తు పేరుతో  పైరునీ ఫలాలను  చిదిమేయాలని కుట్ర పన్నుతున్నారు  
నీ చావు పేరుతో అధికరించనీయకుండా  బ్లాక్మయిల్ చేస్తున్నారమ్మా
దారి కాచి  బందిపోటుల్లా మా బతుకుల్ని బుగ్గిపాల్జేయచూస్తున్నారు
గో హత్యలూ, మాతృ హత్యలూ వాళ్ళ సంస్కారం కదా?!
మరీ ఆ చోద్యం మాకు అంట గడతారేమిటి ?
తల్లి ఇంటికి దీపం ...మా భవిష్యత్తు దేశానికి రూపం
అంతా తెలిసే కదా , ఈ ఆత్మ వంచక కపట ప్రేమ
మొన్న దేవ భాషపై మోజు చూపి మోసినోళ్ళు
నేడు వాడుకను వాడుకోవడానికి  మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు
అకల్ లేనోళ్ళతో వేగవచ్చు,
స్వార్ధపూరిత విష త్రాచులను ఎలా వోర్చ మంటావమ్మా?!
మానవీయత మచ్చు కైనా లేని  ముసాఫిర్లు
అసత్య కృత్రిమ చేసే మిధ్యా వాదనలు ఎలా తుంచ మంటావమ్మా ?!
నిను బతికించు కోవడానికి ఏమేమి సమకూర్చాలో మాకు తెలీదా?
 నే బయటకెళ్ళి గోప్పోడివనైతే నీకే కదా? గొప్ప
నీ పేరు నిలపడానికే నిను విడిచి వెళుతున్నా
 నీ వెంటే ఉంటే అది సాధ్యం కాదని వారికి కూడా తెలుసుగా   
నేనెక్కడున్నా నిను మరువ, నీ కంట కన్నీరు రానివ్వను
నీ స్వస్థత నా బాధ్యతా ,
అత్యాధునికతో నిను వేల ఏళ్లు బ్రతికించు కుంటాను.
ఇప్పటివరకూ అణాకాణీ గాళ్ళని తెలియక అణిగి మణిగి ఉన్నాను
ఎదగ వద్దన్నవాడిని ముద్దాయిని చేసి  బోనులోకి పంపుతాను
అనివార్యం ఆశయానికి తోడైనదిలే ,ఇక తిరుగులేదు  
ఎప్పటికీ నాలో ఉన్నది నీ వేరులోని జీవమే తల్లి
త్యాగాల మల్లి,  నా తెలుగు కల్ప వల్లి !!

                                               డాక్టర్ మాటూరి శ్రీనివాస్

మేలుకో.....మూలవాసి...

మేలుకో.....మూలవాసి....                    
పల్లవి ;        మేలుకో మూలవాసి మేలుకో   (2)
                కనులు తెరచి దేశాన్ని ఏలుకో
                మేలుకో ఆదివాసి మేలుకో     (2)
               ఈ భూమీ నీదేనని  తెలుసుకో    
1 చరణం.   నవ భారత రాజ్యాంగం ఆయుధం
              నవజీవన సౌభాగ్యపు స్వాగతం
              సమభావన సాధనకై సంరంభం
              సంవిధాన సంగీతమే జీవనం  ....                -మేలుకో ‘-
2.చరణం.  బహుజనలకు అధికారమే నినాదం
             ద్విజత్వాన్ని కుటిలాన్ని నిలదీద్దాం  
             అహంభావ మనువునూ ఎదిరిద్దాం
            పురుష సూక్త పాఠమునే ప్రశ్నిద్దాం  ....        –మేలుకో –
3.చరణం.     ఉద్యమమే ఊపిరిగా పయనిద్దాం
                సద్భావన సమరతను పోషిద్దాం
               నలుగురిని నవ్యరీతి నడిపిద్దాం
               యువజనోద్యమ  భవ్య గీతి స్వరమౌదాం
              బహునోద్యమ నవ్య రీతికి బలమౌదాం    -        ..మేలుకో-,,,,

                                                               రచన  డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (28-12-19)




నేనెందుకొచ్చా ?
                                                                              డాక్టర్ మాటూరి శ్రీనివాస్
ఆఫ్ట్రాల్ జీవకణంలో సంగోరంతైనా , ఎంతో సొగసైన దాన్ని  నేను
మీ విశ్వ మానవ సముద్రాన ఉప్పుకణికలో చీమతలంత నేను ,
నేనెంత? , నా ఉనికెంత ? నా బ్రతుకెంత?
భూ మండలం లో ఎన్నిటినీ జయించినోడివి నీవు,
కానీ ,నా తలంపే నీకు వెన్నులో వణుకు పుట్టిస్తుందే
 ఎందుకో ,అర్ధమైందా !?
నేడిలా నేనిలా ఇంతలా ప్రపంచాన్ని భయపెట్టే ధైర్యం నాకు నీవిచ్చిందే  
నీ నిరంతరం స్వార్ధపు  ప్రాకులాటే కదా? ఈ ప్రకృతిలో  ప్రతీ ఉత్పాతానికీ నాంది
సునామీలూ దావానలాలు భూకంపాలూ తుఫానులూ  
కరువులూ కలరాలూ ప్లేగులూ సార్సులూ మెర్స్లూ
అన్నీ మానవ తప్పిదాలిచ్చిన ఆహ్వానాలే, నిర్లక్ష్యపు ఆకృత్యాలే పరిణామ అక్రమాలే
నీ స్వార్ధ లక్ష్యాలకు కాస్త బుద్ధి చెబుదామనే వస్తాయి, నేను కూడా అంతే
ఏదో భయం చెప్పి మిమ్మల్ని ఓ చూపు చూసిపోదామనుకుని వచ్చా
 మీరు నన్నిప్పుడు సర్వాంతర్యామిని చేసేసారు, థాంక్స్ .
మీ మనుషుల ముఖాలన్నీ  కనిపించని స్వార్ధపు మేలి ముసుగులే  
ప్రతీ ఒక్కరికీ  లోపలొకటీ బయటొకటి ఛద్మ ముఖం
అవసరానికొక ధోరణి అనవసరానికి ఒక వైఖరి మీ దారి
ఆ రంగుల పార్శ్వం ఇప్పుడు  ఈ ఈస్టమన్ రంగుల  మాస్క్ తో    
తప్పించుకోవడానికో తమను తాము బ్రతికించుకోవడానికో
పడే తాపత్రయం భలే రంజుగా ఉంది, దొరలు దొంగలుగా మారిపోతున్నారు
జరా భద్రం ,ఆగమంటుంటే, మూర్ఖపు రెక్కలు  విచ్చుకుని ద్వారం దాటి ఎగిరిపోతున్నారు
ప్రక్కవాడికి నన్ను కాస్త పంచుతూ ఎప్పుడూ లేని గుప్తదానాన్ని తెగ ప్రదర్శిస్తున్నారు
మీ మనుషుల యాతన చూస్తుంటే బాధగా సంతోష మేస్తుంది
ఎవడికి తోచింది వాడు  వాట్సప్పుల్లో తోసేస్తుంటే గర్వంగా జాలేస్తుంది
మీ ముసుగులు  వల్లిస్తున్న మంత్రాలకు భయపడి దేవుళ్ళు
కూడా తలుపులు వెనుక  సానిటైజేర్ రాసుక్కూచున్నారు
సర్వరోగ నివారిణి గో మూత్రం తాగినోల్లు కూడా ఎక్కడికక్కడ
చప్పున సొమ్మసిల్లి తలో మూల చతికిలబడి పోయారు
అదిగో , అక్కడ చూడు... వాళ్ళే నా దృష్టిలో నిజమైన పూజార్హులు
ఆ ఒక్క  దేవాలయానికి సెలవు లేదు, అదొక నిరంతరాయ అమ్మ వొడి
అక్కడ దైవత్వం మానవత రూపంలో నిత్యం  దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది .
మనిషి ఆశలను వారు తమ  ఆశయాలతో బతికిస్తారు.
మానవ తృష్ణకు తమ ప్రాణాలర్పిస్తూ జీవం పోస్తుంటారు .
సర్వాన్ని వదులుకోవడమంటే  ఏమిటో రుచి చూపిస్తారు ,
అందుకే వారంటే  నాకు గౌరవంతో కూడిన  భయం ,
దేన్నైనా శాస్త్రీయతే ఊపిరిగా పరిశోధనలతో వైజ్ఞానికంగా జయిచడం వారి నైజం  
మీ మానవజాతి  అంతఃకరణతో ఆదరించాల్సిన అర్హత ఉన్నవారు
నన్ను నిలదీసి నిలువరించే  సత్తా ఉన్న వారూ , వాళ్ళే   
ఇక నైనా మీ మెదడును బారుగా తెరవండి ,
వారిని కాదంటే ముప్పేనని తెలుసుకోండి ,
నేను వచ్చిన పని అయ్యింది, మీకు బుద్దొచ్చిందనుకుంటా ?
నేను పేరులోనే కిరీటాన్ని పొదుగుకున్న విశ్వ విజేతను,
ఎలాగా  వచ్చాగా కదా..! , అలా నాలుగు దేశాలూ తిరిగి పోతా ,
విర్రవీగితే మళ్ళీ వస్తా మరో రూపంలో మరో దేశంలో బయలుదేరి ,  బై, బై ....
                                                                             21-03-2020

వసంతం


                                    వసంతం

వచ్చినదే మళ్ళీ వచ్చిందా ?  తెచ్చిందాన్నే మళ్ళీ తెచ్చిందా?
లేదా, మళ్ళీ మళ్ళీ తనకు తానుగా అదే వచ్చిందా?
వస్తూ వస్తూ మళ్ళీ మళ్ళీ దాన్నే తెచ్చిందా?
ఇంతకీ ఎవరు ఎవరిని తీసుకుని వచ్చారు?
నిన్నటిని మొన్న తీసుకుని వచ్చిందా? రేపుని నేడు మోసుకొస్తుందా ?
కాలచక్రాన్ని భవ చక్రంతో సన్నిధానం చేసి ఋతువుల పరంపరను
ఎవరు ఎక్కడ నుండీ మోసుకొస్తున్నారు?
మనిషా? మమతా? రుతువా? క్రతువా?
ఆశయమా? ఆలోచనా ? క్రమ క్రమ పరిణామక్రమమా?
క్రమ విన్యాసమా ? ఆవిర్భావమా? పునర్భావమా ?  
దుఖం సుఖానికి దారి వేసి తీసుకుని వస్తుందా ?
సుఖమంతా దుఖమయమని గుర్తు చేస్తుందా?
ప్రశ్నల వర్షం ముగుస్తుందా ? గ్రీష్మం వసంతాన్ని తెస్తుందా ?
ప్రతీత్య సముప్పాదం శాంతి వసంతాన్ని కురుపిస్తుందా?

సింధులో వికసించిన హరప్పా కాలిబంగన్ పుష్పాలు
ఎవరు పుష్పింప చేసారు?
మొహంజదారో మనోహరాలు తిరిగి వికసిస్తాయా ?
వలస ధూర్తుల వరస దాడులు వర్ణ వంచనల పన్నాగాలు
ధ్వంస రచనల హింసాపూరిత పెత్తనాలు  వికటిస్తాయా?
 నాటి నాగరికతా వైభవాలు మూల పురుషుల ప్రభోదాలూ
తమ తమ సామర్ధ్యాన్ని తిరిగి ప్రకటిస్తాయా?
నిరుడుకురిసిన శుద్ధ శ్రమన జైన బౌద్ధ వసంతాలు
తిరిగి శాంతి అనుగ్రహ తొలకరులై వర్షిస్తాయా ?

కార్యాకారణ అనుబంధంగా చావు పుట్టుకుల పరిణామం
భవం ఎప్పటికైనా తన భావచ్చేదాన్ని ప్రకటిస్తుందా?
శాక్యముని సంవిధానం మౌర్య సామ్రాట్ ధమ్మరాజ్యం
పునరావృతమై ఎప్పటికైనా స్థిరపడి సుస్థిరతను  ప్రభవిస్తుందా?
మానవాళి మనుగడకి మరల బౌద్ధ వసంతం ప్రసరిస్తుందా?  

అనగారికుడు అవిరాళుడు  అత్యంత ఆధునిక నాగరికుడు
ప్రతిభా చిరునామా దయాళువు భవిష్యద్వాచాకుడు  
రాజ్యాంగ శాసన కర్తవ్య పాలకుడు భీమరాయుడు  
విరచించిన విఖ్యాతం ఉజ్జ్వలాగ్ని సిఖయై వెలుగుతుందా ?
పొద్దు తిరుగుడుల సమతా వసంతం ఆ సూర్య కిరణాలకు
దుఃఖ కారణ నివారణా మార్గమే  షడ్రుచుల సమాహారమై
 సమ్యక్ సంకలపమై మనలో ప్రసరిస్తుందా ?
నిరుడు ఏమో గానీ నేడైనా రేపైనా
ఆమని ప్రతీ మధు మాసపు తేనె చినుకూ  
మానవత్వం చిలకరించి సమసమాన వైశాఖ రాగం ఆలపిస్తుందా ?
సంఘీవభావ ఉజ్జీవానికి ప్రాణం పోస్తుందా ?
శిశిరంతో  జతకలిసి వసంతానుకంప మానవాలోచనకు  
మమకారంతో మాతృత్వాన్ని అందిస్తుందా ?
సమతను సాధికారతతో ప్రవర్ధమానం చేస్తుందా ??
                                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్ 

ఏది దారి ?

ఏది దారి ?
                                 
రోడ్లు ఆకాశాల్లైయ్యాయి
కాళ్ళు కందిపోయిన ఎండు పుల్లల్లైయ్యాయి
ప్రభువులు పెట్టిన పొగ సెగకు ఎటుపోతున్నాయో తెలియని కందిరీగల
రెక్కలు అలసి అర్ధాంతరంగా రాలిపోతున్నాయి.
గుండెల మీద ఆడుకోవాల్సిన బుల్లి పాదాలు
రక్తమోడుతున్న ప్రాణాన్ని సిలువులా ఈడ్చు కెలుతున్నాయి  
ఏమీ పట్టనట్లు పై నుండీ  విమానాలు ప్రక్కనుండీ కార్లూ
వెక్కిరిస్తూ విసురుగా పోతున్న  
వైపరీత్యానికి మానవతే  సిగ్గుతో ఉరేసుకునే దౌర్భాగ్యం  
దారి తప్పి పట్టాలు స్మశాన దారులు పడుతుంటే
బావుల్లో వలస పక్షులు శవాలై ఉబ్బుతుంటే
అడుగు కొక ఆకలి మడుగు
ప్రతీ మలుపొక  ఎండమావి
ఎండిన రొమ్ములు చావు కలతో మాడిన చిరు డొక్కలని  
భారత మాత రోడ్డు మీదే పూడుస్తున్న దృశ్యాన్ని
చిరిగిన మూట తెగిన చెప్పు దేశ ముఖచిత్రాన్ని
విడతలు విడతలుగా మృత్యువు అతిక్రమించడాన్ని
గమనిస్తూ తామర  పందిరి కింద
రాజులిద్దరూ ఆడుకుంటున్నారు మూడు ముక్కలాట  
మరొక రెండు లక్షలు చేరాక వేయబోయే పధకానికి పదును పెడుతూ
దిక్కు లేని ఈ పేద ప్రాణాలుదేముంది
కంటి జీరలోనుండి దుఃఖం ఇంకిపోయాక
ఏ చెట్టుకో వేలాడుతాయి,
 సమాధానం లేని ప్రశ్నలా .....   
                                                                                                                            డాక్టర్ మాటూరి శ్రీనివాస్
    

మేడే


                                                మేడే

     నేడే నేడే నేడే  ....శ్రమజీవుల శుభ దినము మేడే.....  నేడే నేడే నేడే .....కాయ కష్టపు విశ్వ దినమీనాడే
       నేడే నేడే నేడే ....సమ్మె దిద్దిన చట్ట దినమీనాడే  ....నేడే నేడే నేడే  ...బహుజనుల పర్వ దినము  మేడే


చ 1 ;   దోపిడీలకి బలైటోళ్లకు.. క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే 
         కూలీ నాలీ చేసే టోల్లకు క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే 
         గనుల  మణులను  త్రవ్వేటోల్లకు క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే       
         రైతు రాజ్యం కోరేటోల్లకు క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే       
        రోజు భత్యపు హాకరులకు  క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే       
        రెక్కలార్చిన కార్మికునికి క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే                         
                                                                                              .... నేడే నేడే నేడే  ...”’
   
చ 2 ;  శ్రమ జీవుల స్వేద బిందువు విశ్రమించిన... క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే       
        బూర్జువాలని నిలువరించి సామ్యవాదం ప్రభవించిన, క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే       
        వెట్టిచాకిరీని  కట్టకట్టి మట్టుబెట్టిన ,  క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే
        కార్మిక చుట్టం శ్రామిక చట్టం అవతరించిన,   క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే
        పని గంటల కార్యకాలం ఖార్ఖానాల్లో కుదిరిన , క్షేమదినమీనాడే సంక్షేమ దినమీనాడే


       నేడే నేడే నేడే  ....శ్రమజీవుల శుభ దినం మేడే.....  నేడే నేడే నేడే .....స్వేద  రాసిన మొద దినమీనాడే
   నేడే నేడే నేడే ....సమ్మెట చెక్కిన  చట్ట దినమీనాడే  ....నేడే నేడే నేడే  ...బహుజనల పర్వదినం మేడే
                                                                           డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (22-04-20)

May Day


May Day
                                                                            
Today, today, yes, it’s today
The peasants’ auspicious day- the May day
Today, today, yes today!
Sweat victoried in jubilation
Today, today, yes today!
Strikes carved laws of industrialization
Today, today, yes, it’s today!
Bahujans’ celebration day- the May day

Day of welfare, Day of prosper…
For the exploited by tyrannical embroil
Day of prosper, Day of welfare…
For the hands that toil and moil
Day of prosper, Day of welfare…
For the gem diggers in trench and mine
Day of prosper, Day of welfare…
For the dreamers of a farmers’ reign
Day of prosper, Day of welfare…
For the daily waged and raged hawkers
Day of prosper, Day of welfare…
For the limb weary hard workers

Today, today, yes, it’s today
The peasants’ auspicious day- the May day
Today, today, yes today!
Sweat victoried in jubilation
Today, today, yes today!
Strikes carved laws of industrialization
Today, today, yes, it’s today!
Bahujans celebration day- the May day


Day of prosper, Day of welfare…
For sweat droplets of backbreakers that rested
Day of prosper, Day of welfare…
For socialism triumphed, bourgeoisies vanquished,
Day of prosper, Day of welfare…
When manual laborer’s slavery curtailed
Day of prosper, Day of welfare…
When work rules, on peasants bestowed
Day of prosper, Day of welfare…
When duty hours beautifully bested

Today, today, yes today’s the day
The peasants’ auspicious day- the Mayday
Today, today, yes today!
The joys won by sweat today
Today, today, yes today!
The laws were carved by strike this day
Today, today, yes, it’s today!
Day of festivities for the Bahujans - Mayday

                                                                                                Dr Maturi Srinivas
                                                                        (Translate by Dr Sujatha Guttala)

భారత్ మాతా జై కీ


భారత్ మాతా జై కీ
                                                                                             డాక్టర్ మాటూరి శ్రీనివాస్

ఏమిటో ఈ మధ్య ఎక్కడ చూస్తే అక్కడ దేశ భక్తీ
ఇసకేస్తే రాలనంతగా ఆవహించుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది
దేశానికీ దేశ భక్తికీ మధ్య ఈ ఆధిపత్య పోటీనీ
 అందలమెక్కిన అసహనాన్నీ  చూస్తుంటే 
చచ్చేంత అవమానంగానూ, చేవ చచ్చిన సిగ్గుగానూ ఉంది
పాము తన పిల్లలని తానే మింగినట్లు రాజ్యమే రాజ్యాన్ని మింగేయడం
అబద్దం ఉన్మాదమై కాదన్నవాడిని కాటేయడం ఇక్కడ వైరుధ్యం
సత్యం అసత్యానికి బందీ అయి నిర్భంధ గృహంలో మగ్గే రోజు కోసం
ఘడియలు లెక్కపెడుతోంది 
దేశ మానాన్ని మెలిపెడుతోంది
దేశద్రోహమేమోనని భయపడుతుంది  
నిన్నటివరకూ పక్కవాడి మతోన్మాదాన్ని ఎంతగా ఆడి పోసుకున్ననో
నేడు అంతకి రెట్టింపుగా వీడు చాపకింద నీరైయ్యాడు  
జాతీయతని వస్త్రంగానో అస్త్రంగానో వాడుకోవడం  తెలిసిన
తొండ ముదిరి ఊసరవల్లి నుండీ మొసలిగా మారి కన్నీళ్లు కారిస్తే
ఆకలికీ కటిక దరిద్రానికీ రోత పుట్టి నిరాహార దీక్షకు దిగాయి
 కంచె మేసిన చేను ఇక్కడే పండానని ఎలా చెపుతుంది   
ఎనభై యాళ్ల దర్జీ మీర్ సాయిబు
పొట్ట చేత్తో పట్టణానికి వచ్చిన మా తాత కి చిన్ననాటి దోస్త్
అతని నెరిసిన గెడ్డం, నెత్తిన తకియాతో , పాటూ నేనూ
ఉనికికి నోచుకోని విదేశీయులం  ఏది దారీ?
 రేపో మాపో దేశమే డిటెన్షన్ కేంప్ కు తరలే లోగా
ప్రజాస్వామ్యం సాక్షిగా రాజ్యాంగ గొంతునై  ప్రకటిస్తున్నాను    
భౌగోళికమైన హద్దులు భౌతికం
పటం మీది బొమ్మ కాదు నా భారత మాత
వ్యక్తిగతమైన మతం మానసికం 
ఉన్మాద ఉక్రోశ జపం కాదు నా
సోషలిజం నేర్పిన సౌభాగ్యం నా దేశం
  మనిషి మతాతీత లౌకికం
నీవేనని సార్లు అనమన్నా అంటాను , మేరా భారత్ మహాన్





నేనూ- నా ప్రస్థానం


నేనూ , నా ఈనాటి మనుగడ ఎన్నో మరెన్నో త్యాగ,శ్రమ ఫలితాల మిశ్రమం
ప్రక్రుతిని  సవాలు చేసి నన్ను ప్రపంచానికి  పరిచయం చేసి అమ్మను
మెలిక పడ్డ కన్నపేగును సవరించి గర్భస్థ చివరి వోడుదుడుకులను
సరిజేసిన  పరోక్ష్య ప్రసన్న పరమావౌషధపు పుణ్యాత్ముల కధ  ఒకటుంది...
ప్రాణాలు పోయడమే దాని ప్రధాన ప్రధమ అంతిమ కర్తవ్యం .
అమ్మ పురిటి నొప్పుల్ని మాటు మాయం చేసి, తనకి సుఖ ప్రశాంత ప్రసవాన్ని
 ప్రసాదించిన లేబర్ అనల్జేసియా, అనస్తీషియాల అవిరామ కధ అది ,
ఆ మత్తుమందుల గమ్మత్తుకు చిత్తైంది నరకయాతన సమానమైన అమ్మ ప్రసూతి వేదన
బయటపడుతూ ఉప్పగా ఉందని చప్పరించానా, కమ్మ నీరనుకుని నా ఉమ్మ నీరును నేనే
ఇక  ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైయ్యానా  ఏడవడం కూడా కష్టమైన నా అంతర్వేదన చెప్పలేను.
నా నాసికా కవాటాల్లోంచే  కాక నవరంధ్రాల్లోకి చోచ్చుపోయిందట
 పిండంతో మొదలై నాతో పాటూ  జుగల్బందీగా ఎదిగిన ఉబ్బ జలం
 అమ్మ ప్రేమ ఫలం నన్ను విడవలేని ఆప్యాయతా  బలం అనుకుంటా..
నన్నావరించి అతలాకుతలం చేసి నప్పుడు దాన్నంతటినీ  
పీల్చేసి గుండె శబ్దాలను లయ పరచి  గాలిని నింపి పసి నెత్తురు కందుకు ప్రాణం పోసి
పునర్జీవింపచేసిన నియోనేటల్ అనస్తీషియా ప్రతిభకే నేనెప్పుడూ గులామునే కదా!...

అంతటితో ఆగిందా? నా జీవన్మరణ యాత్ర మజిలీ లేని మత్తు వైద్య జాతర
అదేమీ వైపరీత్యమో పొట్టలోని చిన్న పేగు ముడి పడిందని శరఘాతంలా స్కానింగ్ రిపోర్ట్
    సారి శస్త్ర చికిత్స తోగానీ గత్యంతరం లేదట,లేదా నాకీ భూమ్మీద నూకలు చెల్లాట
ఇక ఆ మృత్యు మహమ్మారిని జయిస్తానో లేదో? ఎదో తెలియని భయం ఆవరిస్తున్నా
దుఃఖం అంచున విలపిస్తున్న అమ్మకు  ధైర్యం చెప్పాలని ఉంది
కానీ చెప్పే వయసూ లేదు,మాటలూ రావు ఇంకా నిండా బయట పడలేదుగా !??
నాలోనేనే ఇద్దరినీ వోదారుస్తున్నాను నన్నూ అమ్మనీ ,
ఈ లోగా ఆపద్బాంధవుల్లా అన్నీ తామై మళ్ళీ వాళ్ళే- ఆ మత్తుమందు వైద్యులే
 ప్రత్యక్ష్య మయ్యారా ...అబ్బా ఎంత హాయిగా ఊపిరి తీసుకున్నానో?
ఎ పరేషాన్ లేకుండా ఆపరేషన్ జరిగిపోయింది.
అది నుండీ, మధ్యలోనూ , ఆఖరి వరకూ తిరిగి తెలివిని పునః స్థాపితమైయ్యేవరకూ
నా ప్రాణానికి కంటి పాపలైయ్యారు  నిస్వార్ధ సేవకులయ్యారు నా జీవన దాతలైయ్యారు
నాకర్ధమైయింది .... వీరు అభేధ్యులు . మృత్యువును ఇక  నా చెంతకు ఇక చేరనివ్వరు
 ఏ ఆత్యయిక స్థితిలోనూ నిరంతర అప్ర ‘మత్తులు’
క్రిటికల్ కేర్ నిష్ణాతులు, భౌతిక మానసిక శస్త్ర ఆరోగ్య పర మైన ఎటువంటి వ్యాకులతనైనా
చిటికెలో మటుమాయం చేసే మత్తు వైద్యం వీళ్ళ సొంతం
నొప్పి  విమోచనా మార్గం  వీళ్ళ పంతం
తీవ్ర రోగాల జీవిత చరమాంకానికి  సైతం స్వాంతననింపడం  వీళ్ళ నైజం
వాళ్ళ కళ్ళు నిరంతరం వైద్యమే  మాట్లాడతాయి, త్యాగం చేయాలని మెదడు ఉరకలేస్తుంది
ప్రాణంతోనే వాళ్లకి అనుబంధం దుఃఖ ఉపశమనంతోనే వాళ్లకి సంబంధం
నేను కొన శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న ప్రతీసారీ నన్ను బ్రతికిస్తూ
బ్రతకాలన్న నా ఆశను బ్రతికించారీ ప్రాణ ప్రతిష్టులు, జీవన లైన్ మెన్లు
నిరాడంబర నియమ నిష్ట సుశిక్షిత కార్యదీక్షుతులు అనస్థటిస్ట్ లు........

                                               ...డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                   27-07-18