Sunday, 31 May 2020

ఏది దారి ?

ఏది దారి ?
                                 
రోడ్లు ఆకాశాల్లైయ్యాయి
కాళ్ళు కందిపోయిన ఎండు పుల్లల్లైయ్యాయి
ప్రభువులు పెట్టిన పొగ సెగకు ఎటుపోతున్నాయో తెలియని కందిరీగల
రెక్కలు అలసి అర్ధాంతరంగా రాలిపోతున్నాయి.
గుండెల మీద ఆడుకోవాల్సిన బుల్లి పాదాలు
రక్తమోడుతున్న ప్రాణాన్ని సిలువులా ఈడ్చు కెలుతున్నాయి  
ఏమీ పట్టనట్లు పై నుండీ  విమానాలు ప్రక్కనుండీ కార్లూ
వెక్కిరిస్తూ విసురుగా పోతున్న  
వైపరీత్యానికి మానవతే  సిగ్గుతో ఉరేసుకునే దౌర్భాగ్యం  
దారి తప్పి పట్టాలు స్మశాన దారులు పడుతుంటే
బావుల్లో వలస పక్షులు శవాలై ఉబ్బుతుంటే
అడుగు కొక ఆకలి మడుగు
ప్రతీ మలుపొక  ఎండమావి
ఎండిన రొమ్ములు చావు కలతో మాడిన చిరు డొక్కలని  
భారత మాత రోడ్డు మీదే పూడుస్తున్న దృశ్యాన్ని
చిరిగిన మూట తెగిన చెప్పు దేశ ముఖచిత్రాన్ని
విడతలు విడతలుగా మృత్యువు అతిక్రమించడాన్ని
గమనిస్తూ తామర  పందిరి కింద
రాజులిద్దరూ ఆడుకుంటున్నారు మూడు ముక్కలాట  
మరొక రెండు లక్షలు చేరాక వేయబోయే పధకానికి పదును పెడుతూ
దిక్కు లేని ఈ పేద ప్రాణాలుదేముంది
కంటి జీరలోనుండి దుఃఖం ఇంకిపోయాక
ఏ చెట్టుకో వేలాడుతాయి,
 సమాధానం లేని ప్రశ్నలా .....   
                                                                                                                            డాక్టర్ మాటూరి శ్రీనివాస్
    

No comments:

Post a Comment