Sunday, 31 May 2020

గే-మ్ (కధ)


గే-మ్
           డాక్టర్ మాటూరి శ్రీనివాస్

                గాయత్రీ మంత్రం మంద్ర స్వరం తో నిరంతరం ఆ ఇంటిలో వినబడుతూనే ఉంటుంది. పడుకున్నప్పుడూ, ఇంటిలో ఎవరూ లేనప్పుడూ తప్ప. ఇండిపెండెంట్ స్వంత ఇల్లు , పెద్ద ఆవరణ తోటలో ఒకవైపు వినాయకుడు విగ్రహం మరొక వైపు కృష్ణుడు విగ్రహం పూజలతో పోటీ పడుతూ ఉంటాయి. శంకరంపిళ్ళై వినాయకుని భక్తుడు. శంకరం పిళ్ళై చాలా తెలివైన వాడు. బెంగుళూరు లో రెండు సాఫ్ట్ వేర్ కంపనీలకు అధిపతి. దేశములో అలాగే విదేశాల్లో  ఉన్న చాలా విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్. ఎన్నో పుస్తకాలు రాసాడు. ఆయన చెప్పే ఆన్ లైన్ క్లాసెస్ అంటే దేశవ్యాప్తంగా విద్యార్ధులకు చాల ఇష్టం. ఒక విధంగా నేటి ఆధునిక విద్యా ప్రపంచానికి రాయబారి అతడు . వయసు కూడా ఏభై లోపే. కానీ ఇంటిలో వంసపారంపర్యంగా అనాదిగా వచ్చే ఆచారాలను వారసుడు, సనాతునుడు. ఏవైతే నంబూద్రి బ్రాహ్మణ సంప్రదాయ పద్దతులు ఉన్నాయో వాటన్నిటికీ తూచా తప్పకుండా పాటించడంలో నిష్ట గా ఉంటాడు. చెవి మీద జంధ్యం వేసుకుని కాల కృత్యాలు తీర్చుకునే దగ్గర నుండీ భార్య ముట్టు సమయంలో పడగ్గదిలోకే కాదు కనీసం వంటగది లోకి కూడా రానివ్వడంటే నమ్మశక్యంగా ఉండదు. తను ఊళ్ళో ఉన్న సమయంలో భార్యను ఆ మూడు రోజులూ “ముట్టు”కోడు. ఆ మూడు రోజులు ఆయన మట్టుకు ఆయనే వంట వార్పూ చేసుకుంటాడు కూడా, వంట మనిషి సహాయం కూడా తీసుకోడు. వంటమనిషి తో ఆ సమస్య వస్తే అది అతని భార్య చూసుకుంటుంది. ఒకవేళ ఆయన ఆ సమయానికి ఊళ్ళో లేకపోతే పెరట్లో ఒక వొత్తుల స్టవ్వు కిరోసిన్ ఉంటాయి . ఆ స్టవ్వు వెలిగించి ఆమె వంటమనిషి తో వంట చేయించుకుని గడపాలి. అక్కడ గిన్నెలు కూడా వేరే. వంట మనిషి కూడా నలభై లోపు ఉండడం దానికి కారణం. భార్య ఆండాళ్ పిళ్ళై . కృష్ణుడి భక్తురాలు. భర్త ఇంటిలో లేనప్పుడు ఆమె ఇంటిలో ఖాళీ గా ఉన్నప్పుడు భగవత్గీత వింటుంది. మరీ బోర్ కొడితే  మీరా భజనలను వింటుంది. ఆమె చాలా తెలివైన చాదస్తురాలు, అందుకే “మా రిద్దరికీ జోడీ కుదిర్చాడా బ్రహ్మ,” అని మురిసిపోతుంది ఆమె. మూడు ముక్కాల్లో చెప్పాలంటే ఆమె భోజ్యేషు మాత , కార్యేషు దాసి, శయనేషు రంభ ఆ ఒక్క మూడు రోజుల సమయంలో మాత్రం ఆమె అంటరానిది. అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమూ కలిగించే విషయం ఏమిటంటే  ఆమె కూడా విధ్యాదికురాలు. బెంగుళూరులోనే ఒక డీమ్డ్ యూనివర్సిటీలో ఆంగ్ల  ప్రొఫెసర్. వారికి ఒక్కగానొక్క కొడుకు, కార్తీక్ పిళ్ళై . తల్లితండ్రుల ఇద్దరి తెలివితేటలను, వారసత్వం లక్షణాలను నూటికి నూరు శాతం పుణికి పుచ్చుకున్నవాడు. చిన్నప్పటి నుండీ ఆటలలోనూ చదువులోనూ అన్నిటిలోనూ మొదటి రాంకు అతనిదే. ఐ.ఐ.టి అనంతరం ఐ.ఐ.ఎం లోనూ అతడే టాపర్. మంచి ఒడ్డు , మంచి పొడవు చురుకైన ముఖ కవళికలు , చూసిన వెంటనే ఆకట్టుకునే మళ్ళీ చూడాలనిపించే ఆకారం. నేటి తరం అమ్మాయిల కలల రాకుమారుడు, ఆఫీసులో కొందరు తెలుగమ్మాయిలు అతడ్ని గ్రీకు వీరుడని పిలుచుకుంటారు.
          “ ఏమండీ మనవాడికి పెళ్లి వయసు వచ్చిందనుకుంటుంన్నాను., ఏమంటారు ” అంది భార్య బెడ్ రూమ్ లో మంచం ప్రక్కన వారగా తలగడకు జారబడి  తాంబూలం చిలకలు చుట్టి ఇస్తూ .
“నిజమే వాడి స్మార్ట్ నెస్ కి  మనవాళ్ళంతా ఎక్కడికి వెళితే అక్కడ నోళ్లు వెళ్ళ బెడుతున్నారు,  ఆడపిల్లలు వాడి నుంచీ  మొహం త్రిప్పుకోలేకపోతున్నారు , నేనూ గమనించాను...మరెక్కువ కాలం ఆగడం మంచిది కాదు,” అన్నాడు ప్రొఫెసర్ శంకరం పిళ్ళై.
“అల్ రెడీ నాకు బోలెడు సంబంధాలు  సిఫారసులు వచ్చేస్తున్నాయి, తెలుసా ” అంది ఆమె కాస్త  గర్వంగా
“నాకు కూడా చాలామంది ఆడపిల్ల తండ్రులు ఫోనులు చేసేస్తున్నారు, నీవు వాడి పెళ్లి విషయం ఎప్పుడు కదుపుతావా అని ఎదురు చూస్తున్నాను ..” అన్నాడు ప్రొఫెసర్ కాస్త అహంభావం తో .
“అయితే , ఏమి చేద్దాం ?” అంది భార్య
“దేని గురించి “ .......
 “అదే పెళ్లి గురించి ....”
“వాడు ఏమీ మాట్లాడం లేదు. కానీ, అప్పుడే వాడికి ఇరవై ఆరు దాటిపోయాయి.. “అందామె.
“నాకు ఇరవై నాలుగు కే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రాగానే పెళ్లి చేసేసారు మా వాళ్ళు” అన్నాడు ప్రొఫెసర్
“అవును అప్పుడు నాకు పద్దెనిమిదే,  పీ.జిలో జస్ట్  జాయిన్ అయ్యాను ..” అంది భార్య
“సరే,  రేపు బ్రేక్ ఫాస్ట్ టైం లో కదిపి చూద్దాం.. “ అన్నాడు ప్రొఫెసర్
                              *  *             *   *                *  *
            ప్రతీ ఉదయం ముగ్గురూ ఉదయాన్నే ఎవరి గదుల్లో వారు తమ పనులు ముగించుకుని హాల్లో డైనింగ్ టేబుల్ వద్ద కలిసి కాసేపు గడిపి ఎవరి మట్టుకు వారు  అవసరం మేరకు మాట్లాడుకుని పనుల్లోకి వెళ్లి పోతారు. సాయంత్రం వరకూ ఎవరి పేకేజ్ జీవితాలు వారివే . ఊళ్ళో ఉంటే ముగ్గురూ డిన్నర్ కి మళ్ళీ అక్కడే కలుస్తారు. మిగిలినవన్నీ వాట్స్ అప్పులో జరిగిపోతూ ఉంటాయి. కొడుకు కూడా త్వరగానే చిన్న వయసులోనే పెద్ద చదువు చదువుకుని అప్పుడే వారితో సమానంగా సంపాదించడం వారిని ఎంతో గర్వానికి లోను చేస్తూ ఉంటుంది వారిని. నిజానికి ఏ తల్లి తండ్రులకైనా అది గర్వ కారణమే. వారం రోజులకు మించకుండా ఆరు నెలలకొక సారి కంపనీ  డబ్బుతో అఫీషియల్ గా విదేశీ ట్రిప్పులూ, డబ్బు ఖర్చులేకుండా విలాసవంతమైన జీవితం. మంచి పేకేజ్ లో జీతం. ఈ కాలంలో ఉన్నత చదువులకు కార్పోరేట్ ఇచ్చే రెమ్యునరేషన్ పేకేజిల్లో ఉంటుంది. ఆ భాషలో చెప్పాలనే కొడుక్కి ఇరవై ఎనిమిది లక్షలు పేకేజ్ . అన్ని రకాల ఉపకార వేతనాల ఆదాయాలు అందులోనే ఉంటాయి. ఈ పేకేజ్ కల్చర్ ఇప్పుడు ప్రతీ రంగంలోనూ ఒక ఫేషన్. ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క పూజకు ఒక్కొక్క  పేకేజ్. పెళ్లిలలో పురోహితుడికి , వంటకీ, డెకరేషన్ కి, బజంత్రీలకే ఒకో పేకేజ్. చావుకీ, టూర్లకీ, చదువులకి ఈ  పేకేజ్ సిస్టం అమలులో ఉంది.. ఆదాయాలతో సహా ఆచారాలకు ,మూఢ నమ్మకాలకూ నిత్యసరాలకూ కమీషన్ వ్యాపారులకు  ప్రైవటైజేషన్ ఇచ్చిన పరిభాష ఈ పేకేజ్ . కార్పోరేట్ సామాన్య ప్రజలకు  వేసిన ఒకరకమైన మానసిక ముసుగు , ఒక ఆధునిక దోపిడీ సంప్రదాయం ఈ పేకేజ్ .  
            ఉదయాన్నే ఏడూ నలభై ఐదు కల్లా వీళ్ళ ముగ్గురి  పేకేజ్ లైఫ్ ఆరంభం అవుతుంది. ఒక్కొక్కరుగా ఎవరి  గదుల్లోంచి వారు మూడు వైపుల నుండీ  డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు. ఉదయాన్నే వంట మనిషి అనే కంటే బాగా దగ్గర బంధువైన నలభై లోపున్న విధవరాలు ఒకామె వచ్చి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం వంట చేసి కేరేజిలు కట్టి తొమ్మిదికల్లా వెళిపోతుంది, అమెదొక పేకేజీ . ఈ రోజు వేడి వేడి ఊతప్పం , పొంగల్ హాట్ డిష్ లోంచి సర్వ్ చేయబడడానికి తొంగి చూస్తున్నాయి. ఎవరు నీళ్ళ బాటిల్స్ వాళ్ళు ఫ్రిడ్జి లోంచి తీసి తెచ్చు కున్నారు.  ప్రక్కనే మూడు లంచ్ పేక్ లు, మూడు స్నేక్ పాక్ లు కట్టి సిద్దంగా ఉంచడం వంటామె పేకేజ్ లో భాగం.
“ వాట్ కార్తిక్ ? ఈ మధ్య ఏమన్నా ఫారిన్ ట్రిప్ ఉందా, ?” పొగలు కక్కుతున్న పొంగల్ ప్లేట్ లో వేసుకుంటూ అడిగాడు ప్రొఫసర్
“నో డాడ్ , నాట్ థిస్ మంత్,.. ఈ నెల టు డేస్ ముంబై,  వన్ డే ఇండోర్ మిగలిని రోజులు ఇక్కడే...ఉంటాను “ అన్నాడు కొడుకు కార్తీక్
“గుడ్ , నేను ఈ నెల ఆఖరున రెండు రోజులు బ్రేక్ తీసుకుందామనుకుంటున్నాను, ఈ మధ్య నీ పెళ్లి గురించి అమ్మ తెగ ఆలోచిస్తుంది..”
“ఊ ..”
“చాలా మంచి సంబంధాలు కూడా వస్తున్నాయి”
“ఊ ...కే ...”
“ఎప్పుడు చేసుకుంటావో ? చెపితే అ సంగతి మేము ప్లాన్ చేస్తాం..”
“ఊ ... ఓ.కే “
“ఊ... ఒకే కాదు , ఐ నీడ్ యువర్ ప్రోపర్  రెస్పాన్స్, క్లియర్ గా చెప్పు ” అన్నాడు తండ్రి
“ఊ .. అన్నది, రేస్పాన్సే కదా ? డాడ్ !”
“ఊ.,  అన్నది ఒక శబ్దం మాత్రమే, సమాధానం కాదు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్,? ఎలాంటి అమ్మాయి కావాలి..? ఎవరినైనా ఇష్ట పడ్డావా..? లేకపోతే మేము చూడాలా? ” వరసగా అడిగాడు ప్రొఫెసర్, చిన్నగా నవ్వుతూ స్టీల్ గరిటెతో పొంగల్ రెండో రౌండ్ వడ్డించుకుంటూ , ప్రక్కనే తల్లి గ్లాస్ లో నీళ్ళు పోసికుని గుక్కెడు తాగి కుర్చీలో కూర్చుని  డిష్ లోంచి ఉతప్పం వేసుకుంటూ, అన్నది ,
“లుక్ ,నాన్నా! నేను ఒక్కరిదాన్నే మేనేజ్  చేసుకోలేకపోతున్నాను.  నాకు  సహాయం కావాలి, ఐ నీడ్ ఎ హెల్పింగ్ హేండ్ ..., మరొక పనిమనిషి ని పెట్టుకోమని సలహా మాత్రం చెప్పవద్దు.. “ అంది నవ్వుతూ..
“ఊ..సరే.. రేపు సండే కదా?!  మీరిద్దరూ ఫ్రీ అయితే  ఈవెనింగ్ డిన్నర్ కి వెళదామా ?” అడిగాడు కొడుకు
“టాపిక్ మార్చకు...” అంది తల్లి
“ఓహో ... ఇది టాపిక్ మార్చడం కాదు , మా మ్.ఆ టాపిక్ డిస్కస్ చేయడానికే..” అన్నాడు, కార్తిక్  
ఆమె భర్త వైపు చూసింది, అతడు సరే అన్నట్లు బుర్ర ఊపాడు.
                                         ..................................................
                      రెస్టారెంట్ లో లైవ్ బ్యాండ్ సన్నగా వినబడుతుంది. ఆ హోటల్ నగరం పెద్దది, ఖరీదైనదీను. గొప్ప వాళ్ళందరూ అక్కడికే వస్తారు. స్టార్ హోటళ్ళలో బయట లైట్లు ఎంత మిరుమిట్లు గొలుపుతాయో లోపల అంత మసకగా ఉంటాయి, ఎందుకో అర్ధం కాదు . గొప్ప గొప్ప ఒప్పందాలు, లావాదేవీలు సెటిల్ మెంట్లు ఆ మసక చీకట్లోనే , అక్కడే జరుగుతాయి. సినీ తారలందరూ అక్కడే బస చేస్తారు. మసక చీకటి ఏకాంతానికి ప్రతీకగానో, లేదా నల్ల బజారుకో  , నల్ల నోట్లకూ అడ్డగానో, ఒకరికొకరు కనబడకూదడనే ప్రైవసీ కోసమో, తెలీదు కానీ అదొక కల్చరల్ పేకేజ్. అక్కడే కార్తిక్ కు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. అతడి పేరున టేబుల్ రెడీ గా ఉంది . రెస్టారెంట్ ఇన్ చార్జ్ ఎదురొచ్చి దగ్గరుండి టేబుల్ దగ్గరికి తీసుకుని పోయి కుర్చీలు కాస్త వెనక్కి లాగి ముగ్గురినీ కూర్చో బెట్టాడు . ముగ్గురికీ కావల్సినవేమిటో అక్కడ వారు ఏమి ఇష్ట పడతారో వారి ముగ్గురికీ తెలుసు. లైవ్ బాండ్ మంద్రంగా సాగుతోంది. ఆ మ్యూజిక్కి లయగా నెమ్మదిగా ఆండాళ్  ఆమెలో ఆమె పాట పాడుకుంటుంది. “చౌదవీ కా చాంద్ హో....”అంటూ సాగుతోందా పాట . పాటతో పాటూ ఆమె రాగ తీస్తూ  భర్త నీ కొడుకునీ మార్చి మార్చి చూస్తూ మురిసిపోతూ తన్మయత్మం పొందుతుంది. ఇంతలో పాట అయిపొయింది. ప్రాతం అంతా కాస్త నిశబ్దం పరుచుకుంది.
 “డాడ్ నాకు పెళ్లి ఇష్టం లేదు... “ అన్నాడు, నేరుగా విషయానికొచ్చేస్తూ 
రెండు మూడు సెకెండ్లు ఆగి కుర్చీ దగ్గరగా లాక్కుని సర్దుకుంటూ “ నేను పెళ్లి చేసుకోదలచుకోలేదు..” అన్నాడు మళ్ళీ .
కొనసాగిస్తూ “అంటే ?, ప్రస్తుతం చేసుకోవాలని లేదు , నన్ను ఇంకేమీ ఇబ్బంది పెట్టవద్దు..ప్లీజ్  “ అన్నాడు , నేరుగా వారిద్దరి ముఖాల్లోకి మార్చి మార్చి చూస్తూ.
తల్లితండ్రులిద్దరూ మొహాలు చూసుకున్నారు.
“సరే అలాగే ఎంత కాల ఆగుదాం ?!” అన్నాడు  తండ్రి కాస్త తేరుకుని అర్ధం చేసుకున్నట్లు మొహం పెడుతూ
“ఆగడమేంటండీ ? .. .అదికాదు నాన్నా !, మరొక్క సారి ఆలోచించు ,మావైపు నుంచి కూడా  ఆలోచించాలీ కదా ! “ కాస్త నిష్టూరంగా  అంటూ
“మన నంబూద్రి  అమ్మాయల  ఫోటోలు చాలా ఉన్నాయి , చాలా ఆసక్తికరమైన ప్రొఫైల్స్ తో అందంగా ఉన్నారు. ఒక్కసారి చూడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు.. ఎందుకైనా మంచిదని తెచ్చాను..అంటూ హేండ్ బేగ్ లోనుండి ఆల్బం తీసి కొడుకు ముందుకు తోసింది. టేబుల్ మీద కేండిల్ లైట్  వెలుగులో చిన్న హేండ్ ఆల్బంను తన వైపు లాక్కున్నాడు.  సూప్ తర్వాత డిన్నర్  అయింది. ఒకసారి పై పైన తిరగేసి ఆల్బం తిరిగి తల్లికి ఇచ్చేసాడు. ప్రశ్నార్ధకం గా చూసింది ఆమె
“రేపు మాట్లాడదాం లే,  ఈ రాత్రికే నాకు పెళ్లి చేసేస్తావా ఏమిటి?!”  అన్నాడు నిదానంగా
ఎవరినో ప్రేమిస్తున్నాడని తల్లి తండ్రులకి చూచాయగా అర్ధం అవుతుంది . కొడుకు ప్రేమిస్తున్నది, నంబూద్రి అమ్మాయి అయితే బాగుణ్ణు అనుకుంటూ నిద్ర పోయింది తల్లి . లేస్తూనే వంటగదిలో అంత పని హడావుడిలోనూ పూజ గదిలో కెళ్ళి తన కొడుకు నంబూద్రి బ్రాహ్మణ అమ్మాయిని మాత్రమే ప్రేమించేటట్లు ఆశీర్వదించమని దేవుణ్ణి ప్రత్యేకంగా మొక్కుకుంది. టిఫిన్లు సమయంలో. “నేను ఆఫీస్ వర్క్ అయ్యాక అటునుండే ముంబాయి వెళతాను, రెండు రోజుల్లో వచ్చేస్తా  , బుధవారం ఉదయానికి వస్తాను, బై మామ్, బి డాడ్ ..” అని బయలు దేరాడు కొడుకు.
ఆఫీస్ నుండీ తండ్రికి మెసేజ్ పెట్టాడు కొడుకు.
డాడ్..!నాకు పెళ్లి మీద నమ్మకం లేదు, చేసుకోవాలనే ఇష్టమూ  లేదు , బలవంతం పెట్టకండి ప్లీజ్. అమ్మకు చెప్పండి ... అని దాని సారాంశం .
పని ఒత్తిడిలో పడి ఆ విషయానికి అంత ప్రాధాన్యత అవసరము లేదనుకుని, అన్నీ మెల్లగా సెటిల్ అవుతాయలే  వచ్చాక మాట్లాదుకోవచ్చులే అనుకుని మర్చిపోయాడు తండ్రి. భార్య వద్ద  ఆ విషయం కదప లేదు. కొడుకు ఊరినుండీ వచ్చినా ఆ విషయాన్ని మళ్ళీ కదపలేదు. వారం గడిచింది. సడన్ గుర్తుకు వచ్చి కొడుకు నిర్ణయం సంగతి ఆ రోజు రాత్రి  భార్యకు చెప్పాడు. రెండు రోజులు సెలవు పెట్టి ఆ పనిలో ఉండాలనుకుంటూ నిద్రపోయింది. రెండు రోజులు సెలవు పెట్టింది. మొదటి రోజు కొడుకు గదిని జల్లెడ పట్టింది. ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని... కొన్ని సాధారణ గ్రీటింగ్ కార్డులు, సిమ్ కార్డులు తప్ప కొడుకు ప్రేమలో పడ్డ ఆధారాలు లాంటివి ఏవీ దొరకలేదు. సాయంత్రం ఆస్థాన జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళింది. గోడు విన్నవించుకుంది .అతడు వచ్చే మాఘ మాసంలో కల్లా పెళ్లి అయిపోతుంది, కంగారు పడొద్దని భరోసా ఇచ్చాడు. రెండవ రోజు ఉదయం నుండీ ఊళ్ళో ఉన్న అన్ని పేరున్న దేవాలయాల్లో ఆర్చన చేయించి పొద్దుపోయాక మరొక పేరున్న పురోహితుణ్ణి కలిసింది. అతడు మరి కొన్ని  ప్రత్యేక పూజలు, ఒక వ్రతం, ఒక హోమం సలహా ఇచ్చాడు. ఆదివారానికి వాటి ఏర్పాట్లు దగ్గరలోనే ఉన్న గుడి లో ప్రత్యేక పూజలూ, వ్రతం, హోమం, పేకేజ్ మాట్లాడుకుని వచ్చింది. గుడి పురోహితునికీ ఆమె కు సలహా ఇచ్చిన పురోహితునికి ఉన్న పేకేజ్ వొప్పందం తో ఆమె కు సంబంధం లేదు .
                       ఆండాళ్ ఆలోచనలు పరిపరి విధాలుగా తిరుగుతున్నాయి. సంప్రదాయాన్ని ఆధునికత చాలెంజ్ చేయడం ఆమె తట్టుకోలేకపోతుంది.ఆమె కోరికల్లా ఒక్కటే, ప్రేమించడంలో తప్పులేదు, ఈకాలములో పిల్లలు ప్రేమించక ఏమి చేస్తారు. కుటుంబ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైపోయి ఇప్పుడు మరొక అడుగు ముందుకేసాయి,అంతే. ఇళ్ళల్లో పిల్లలకూ తల్లి తండ్రులకూ సమయం లేక ఎవరికీ వారు బయట వ్యాపార లేదా స్వంత సంబంధాలతో బిజీ అయిపోతున్నారు. అండాల్ వరకూ వస్తే తనది కుల గోత్రాలకు ఎంతో విలువనిచ్చే వంశం. నంబూద్రీలు మలయాళీ బ్రాహ్మణులు. కేరళా మలబార్ ప్రాంతంలోని అత్యంత ధనిక అగ్రవర్ణం. వీరిని శ్రౌత బ్రహ్మణులని అంటారు. వీరు శ్రుతులకు అంటే వేదాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కేరళ లోని దాదాపు అన్ని దేవాలయాలకు యజమానులూ, అందులో పురోహితులూ ఈ వర్గం వారే. ద్రావిడ భాష అయిన మళయాళ భాషను సంస్కృతంతో సంకరం చేసింది వీరే. వీరు పరశురాముని వారసులుగా భావిస్తారు. పరశురామున్ని బ్రాహ్మణ క్షత్రియునిగా కొలుస్తారు. కనుక, నంబూద్రి పురుషులు క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకుని వారి ఆస్తులలో కూడా భాగాస్వామ్యులై అంటే ఒక రకమైన దోపిడీ గ భావించవచ్చు, ఆ విధంగా ఈ వర్గం రాజకీయంగా ఆర్ధికంగా బాగా బలపడ్డారు. ఆధునిక సమాజంలో పితృస్వామ్య వ్యవస్థకి ప్రతీకలుగా నిలుస్తారు. నంబూద్రి కుటుంబాలలో ఉన్నా , చాలామందికి తెలియని మరొక సంప్రదాయ ఆచారం ఏమిటంటే ? ఇంటిలో ప్రధమ సంతానానికే యావత్ ఆస్తి చెందుతుంది, కానీ అతడు కేవలం నంబూద్రి కుల అమ్మాయినే మాత్రమే  వివాహమాడాలి, అప్పుడే ఆస్తి దక్కుతుంది . ఆండాళ్ కు ఒక్కడే కొడుకు కాబట్టి ఆస్తి విషయంలో పెద్దగా సమస్య లేకపోయినా కులం విషయం మాత్రం చాలా పెద్ద చిక్కు వచ్చింది. ఎట్టి పరిస్తితుల్లోనూ  కొడుకు నంబూద్రి అమ్మాయినే పెళ్ళాడాలి . దీన్ని జ్యేష్ఠత్వము లేదా జ్యేష్ఠస్వామ్యం అంటారు. అది వారి ఆచారం మరి. అంటే ఎంతమది కొడుకులున్నా పెద్దకొడుకుదే ఆస్తి, పెత్తనం అన్న మాట. పితృస్వామ్య వ్యవస్థలోని తెలియని, కనిపించని మరొక తీవ్రమైన కోణం. ఇది సాధ్యం కాకుండా పోతుందేమోనని ఆమె భయం కాదు .ఆమె భయం అల్లా వర్ణ సంకారం అయిపోతుందేమోనని.  ఆండాళ్ ను తొలిచేస్తున్న మరొక సమస్య కొడుకు అంతర్ముఖత్వ తత్వం. కుటుంబ సభ్యులతో ఎవరితోనూ ఏమీ చెప్పడు, పంచుకోడు.
                అంతే కాదు, కొడుకు ఒకవేళ ఏ నాయర్ కులపు అమ్మాయినో ప్రేమిస్తే కుటుంబ గౌరవం , వంశ పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయి. నాయర్ కుల కోడలు తన నంబూద్రీ కొడుకుతో కాపురం చేయడానికి శాస్త్ర ప్రకారం  అనర్హురాలు. అలాగే వారిద్దరికీ పుట్టిన సంతానం కూడా నాయర్ కులానికే చెందుతారు. తండ్రి కులామ్ సంక్రమించ దన్నమాట. ఎ రకంగా చూసినా  ఆమె వంశం ఎన్నో విధాలుగా  నష్టపోతుంది అదీ ఆమె ఆందోళనకు మరొక  కారణం.
                                           ............................
              కొడుకు కార్తిక్ ఏ సంగతి తేల్చకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. భర్త పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించడం లేదు. ఆమె పూజలూ , వ్రతాలూ,నోములూ ముమ్మరంగా  కొనసాగుతున్నాయి. ఒకరోజు తల్లీ , కొడుకులు రిలయన్స్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తూ తల్లిని కారులో కూర్చోబెట్టి  మొబైల్ కేబుల్ ఏదో కొనుక్కోవడానికి  షాప్ లోని కెళ్ళాడు, కార్తిక్. అటూ ఇటూ చూస్తూ కారులో ముందు సీట్లోనే కూర్చున్న ఆమె యాదృచ్చికంగా డేష్ బోర్డ్ లాగింది . అందులోనుండి రెండు రకాల లిప్ స్టిక్కులూ, రెండు  హెయిర్ బాండ్లూ జారి పడ్డాయి. ఒక్కసారి గతుక్కుమంది. ఆత్రుత ఆపుకోలేక లోనికి చేయిపెట్టి చూస్తే ఒక కాండోమ్ పేకెట్ బయటకు కనిపించింది. ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. తమాయించుకుని అన్నీ గబగబా అన్నీ లోపల సర్దేసింది. ఆమెలో ఏదో తెలియని ఆదుర్ద సన్నగా మొదలైంది. ఒక ప్రక్క దుఃఖం,మరొక ప్రక్క భయం ఒక్కసారిగా ఆమెను ఆవహించాయ్. తమకు తెలియకుండా కొడుకు ఎక్కడో కాపురం పెట్టేశాడనే నిర్ధారణకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె నిర్ధారణకు ఆధారాలు వెతకాలి. ముభావంగానే ఇల్లు చేరింది. కార్తిక్ మీద విపరీతమైన కోపం వచ్చింది .కొడుకు మీద మొదటి సారి మౌన యుద్ధం ప్రకటించింది. భర్తతో కూడా మాట్లాడం తగ్గించేసింది. అతనితో పంచుకోవడానికి కూడా ఆమెకు మనస్కరించలేదు.
                                              ..............................
మరొక వారం తిరిగింది. గమనించి “ఏ మౌతుంది ఈ ఇంట్లో?! ఎందుకు ఏదో స్తబ్థత, ఏదో వెలితిగా అనిపిస్తుంది?, ఈజ్ ఎవ్వ్రీ థింగ్ ఓకే ?”...ఒకసాయంత్రం డిన్నర్ టేబుల్ దగ్గర అడిగాడు ప్రొఫెసర్, ముగ్గురూ ఉన్నప్పుడు .  
“నథింగ్, ఏమీ లేదు” ఇద్దరూ దాదాపు ఒకే సారి అన్నారు.
“లుక్ బాయ్! నువ్వు ఇక నీ పెళ్లి సంగతి తేల్చాలి . ఇట్ ఇస్ టైం నౌ ”.అన్నాడు ప్రొఫెసర్ .
“తేల్చేదేముంది, వాడు పెద్దవాడు అయిపోయాడు, మనకు చెప్పకుండానే ఎక్కడో సంసారం వెలగ బెడుతున్నాడని నాకు అనుమానం, ఇక దాచి లాభం లేదు, ఎవరా అమ్మాయి?“ అన్ని రోజుల అక్కసు కక్కేసింది తల్లి . తన మనసులోని మాటను బయట పెట్టమని వొత్తిడి చేసింది.
“నో.. నో..నో .. నథింగ్ లైక్ దట్..అటువంటిదేమీ లేదు, నువ్వేదో అనవసరంగా ఏదేదో ఊహించుకున్తున్నావ్ మామ్” కార్తిక్ కూల్ గానే అన్నాడు.
“నో ..సంథింగ్ ఇస్ దేర్ .. నువ్వు ఏదోదాస్తున్నావ్.. “ తల్లి హటాత్తు గా గొంతు  పెంచింది
ఆమె స్వరం తీవ్రతకు భర్త ,కొడుకు ఇద్దరూ ఒక్కసారి అవాక్కై తేరుకున్నారు. భర్త కొడుకు వైపు నిరసనగా చూస్తూ భార్య సముదాయించ ప్రత్నిస్తున్నాడు.
“కార్తిక్ ఏదో దాస్తున్నాడు ..” అంది, దుక్ఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ
గ్లాసులో మంచినీళ్ళు పోసి తల్లి నోటికి అందిస్తూ ,తను కూడా గుక్కెడు నీళ్ళు తాగి దూరంగా మరొక కుర్చీలోని కుర్చుని
 “ఓకే.. డాడ్ ! ఇంకా దాచి లాభం లేదు, ఎస్ , నేను ప్రేమిస్తున్నాను...ఐ అం ఇన్ లవ్ ”
“ఎవరు,?! మన అమ్మాయనే? ఎక్కడ ఉంటుంది?బాగుటుందా? నీ క్లాస్ మేటా? కోలీగా?” చిక్కు ముడి వీడిన ఆతృతతో ఒక్కసారి ఊగిపోయింది తల్లి.
కార్తిక్ ని పూర్తిగా చెప్పనీ అన్నాడు ప్రొఫెసర్
“లేదు మామ్.. నేను ప్రేమిస్తున్నది అమ్మాయని కాదు అబ్బాయిని, పేరు రజనీష్ ,నాకు ఐ. ఐ. ఎం లో క్లాస్ మేట్. ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము .” ఇద్దరి గుండె లోతుల్లో ఎక్కడో ఫిరంగు పేలిన శబ్దం. చెరొక శకలమై దూరంగా ఆగాధం లోనికి  విసిరివేయబడ్డ భావన. తల్లి భయంతో కంపించిపోతుంటే ,తండ్రి మొదటి సారి దుఃఖాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. తేరుకుని వెంటనే ప్రొఫెసర్ భార్య ప్రక్కకు వెళ్లి ఆమెను సముదాయించబోయాడు.
“వాట్ . ఏమైంది నీకు?  ఏమి మాట్లాడుతున్నావ్??” అని ఒక్కసారిగా లేవబోయి తమాయించుకుని
మళ్ళీ గబుక్కన లేచి ఒక్క ఉదుటన సింక్ దగ్గరకు వెళ్లి వాంతి చేసుకుని అక్కడే నేల మీద కూలబడిపోయింది. ప్రొఫెసర్ ఆమెను కాస్త పొదివి పట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయుడైపోయాడు. 
“ఒహ్హ షిట్ ,దిస్ ఇస్ టూ మచ్ ..” అన్నాడు మెల్లగా తండ్రి కూడా ఊహించని సమాధానమది
అవమానం, కోపం, నిస్సహాయత దుఃఖం ఒక్కసారిగా ఆ విద్యార్హులైన తల్లితండ్రుల్ని నిర్వీర్యం చేసేసాయి. ఊహించని ఉత్పాతం అది. ఎలా స్పందించాలో తెలియని సందిగ్ధ . స్వలింగ సంపర్కం గురించి వినడం కూడా పాపం అని తలచే వంశం నుంచి వచ్చిన వారసుడు ఈ రీతిగా మారడంతో మనసు కకావికలమై భవిష్యత్ అంతా ఒక్క సారిగా చీకటిగా అనిపించింది ఇద్దరికీ.
                             .....................................................................
          ముగ్గురూ ముభావంగానే ఉన్నారు. మాటల్లేవు. యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి.
     తండ్రి  త్వరగానే కోలుకున్నాడు . భార్యతోనూ, కొడుకుతోనూ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కొడుకు మీద మనసు విరిగి పోయింది అనడం కంటే, తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పని అనివార్యతను త్వరగా అర్ధం చేసుకుని తనకు తానూ సర్దిచెప్పుకున్నాడు. ఎల్. జి. బి. టి. హక్కుల గురించి, చట్టం గురించి  చదివి ఉన్నాడు. ఇప్పుడు ఆ వర్గానికి భాదితుదౌతాడని కలలో కూడా అనుకోలేదు. ఈ మధ్య దేశ వ్యాప్తంగా జరుగుతున్నా చర్చలనూ గమనిస్తున్నాడు. కానీ అతని భార్య లోని బ్రాహ్మణీకం ఆమెను నిలవనీయకున్నది. మరెన్నో ప్రశ్నలు ఆమెలో కలకలం సృస్తిస్తున్నాయ్ . ఇక ఉండబట్టలేక కొడుకు తన గదిలో ఏదో కంప్యుటర్ మీద పని చేసుకుంటూ ఉంటే వచ్చి ప్రక్కన కూర్చుంది. సన్నగా నవ్వుతూ తల్లి మీద చేయి వేసాడు , కార్తిక్
“ఆ అబ్బాయి నంబూద్రి బ్రాహ్మణు కుర్రాడేనా”, అని మెల్లగా అడిగింది..
తల అడ్డంగా ఊపాడు కార్తిక్. అర్ధం కానట్టు చూసిందామే
“నో ...కాదు” అన్నాడు , శాంతం గా
తల్లికి మరొక శరాఘాతం , మరొక అవమానం, ఒకదానిని మించినది ఒకటి .
“ మై గాడ్! మురుగా..!! కొడుకు కులాంతర స్వలింగ వివాహానికి సిద్ద పడుతున్నాడా ?”
“పోనీ , మలయాళీ యేనా ??” మళ్ళీ అమాయకం గా, దీనంగా  నిస్సహాయంగా హీన స్వరంతో అడిగింది.
“అవన్నీ ఎందులే మామ్, అవసరమా!?” అన్నాడు , అవును అవసరం అన్నట్లు తల ఊపింది , ఆమె .
“మలయాళీ యే, కానీ .. పరయ కులస్తుడు “, అన్నాడు కార్తిక్.
పరయ కులమా ?, వీడికేమైనా పిచ్చా?! మరీ ఇంత దారుణమా? నంబూద్రి వంశానికి ఇంత  దుర్దశ వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. కేరళలో నంబూద్రీ బ్రాహ్మణులు, నంబూద్రీలను తప్ప మిగిలినవారినందరినీ సూద్రులుగానో, అంటరానివారిగానో చూస్తారు. ఇంకా చెప్పాలంటే నంబూద్రీలు అంటరానితనాన్నే కాదు, చూడరాని తనాన్నీ, వారి దరిదాపుల్లోనికి కూడా రానీయని, చేరనీయని తనంని  (అన్ అప్రోచ్ బిలిటి) పాటించే అమానవీయ వర్గం. వివేకానందుడు అంతటి వాడే కేరళ లో పర్యటించి కేరళను ఇవన్నీ చూసి ఆ రాష్ట్రాన్ని “ మేడ్ హౌస్ అఫ్ కాస్త్స్ “ (కులాల ఉన్మత్త గృహం ) అన్నాడంటే కేరళలో కుల వివక్ష తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  తోటి బ్రాహ్మణుడైన సరే,  అతడు నంబూద్రి బ్రాహ్మణుడు కాకపొతే స్నానం చేసే పూజకు ఉపక్రమిస్తారు, వీరు . ఒక “నాయర్” కులస్తుడు నంబూద్రి బ్రాహ్మణుడికి దగ్గరగా రావచ్చు, కానీ అతన్ని తాక కూడదు. ఒక “ఇలవ” లేదా “ఇజవా” కులస్తుడు  నంబూద్రీలకు కనీసం ముప్పైఆరు అడుగుల దూరంలో మసలుకోవాలి. “పులియ” కులస్తుడు తొంభై ఆరు అడుగులు దూరలో ఉండాలి. “పరయ” కులస్తులు వీరికి ఇంకా దూరంగా సంచరించాలి. ఇవన్నీ కేరళలోని అస్పృస్య కులాలు. అటువంటి కులోన్మాద ఆచారల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రొఫెసర్ గారి కుటుంబం  ఒక నిమ్న జాతి చెందినా సంబంధమా ?? అదీ కూడా  అమ్మాయికి బదులు అబ్బాయిని స్వలింగ వివాహానికి అంగీకరించడమా?? అంటే యావత్ నంబూద్రి బ్రాహ్మణ  వ్యవస్థే మైల పడిపోతుందనే  ఆలోచన ఆమెను తొలిచేస్తుంది.
                                   ..........................................................
                 మరొక వారం గడిచింది. ఇంటిలో వాతావరణం మరింత భయానకంగా తయారైంది. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒకరి ఎత్తుగడ మరొకరికి అంతుబట్ట కుండా ఉంది. ఆండాళ్ పూజులూ నోములూ, వ్రతాలు పరాకాష్ట కు చేరాయి. ఆమె ఏదో నిర్ణ యానికి వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ, స్వలింగ సంపర్కం అనేది ఒక మానసిక, భౌతిక , రొమాంటిక్ అట్రాక్షన్ అని, ఎన్నో దేశాల్లో అది చట్ట బద్దమేననే, మన దేశం కూడా 2018లో స్వలింగ వివాహాలకు చట్టబద్దత కలిగించిందనీ ఆమెకీ తెలుసు.  “వికృతి యావం ప్రకృతి” అంటే “వికృతమైనది  కూడా ప్రకృతిలో భాగమే” అనే ఋగ్వేద సూక్తీ కూడా ఆమెకు తెలుసు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో కూడా స్వలింగ సంపర్కానికి సంబంధించి పెద్దగా ఆంక్షలూ, బలమైన శిక్షలూ  ఏమీ పెట్టలేదని ఇంకా బాగా తెలుసు. అయినా కూడా ఆమె ఎక్కడా రాజీ పడుతున్నట్లు కనబడడం లేదు.
        రోజూ కాఫీ అక్కడ పెట్టేసి శబ్దం చేసి వెళ్ళిపోయే ఆమె , ఒక రోజు ఉదయమే కొడుక్కి కాఫీ కప్పు అందిస్తూ డైలీ న్యూస్ పేపర్ మాట్రిమొనియల్ పేజి ను తెరచి  కార్తిక్ ముందు పెట్టింది .  ఏమిటి అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసాడు. నీకోసమే , చూడు అన్నట్లు సైగ చేసింది.
తల్లి అడ్రస్ తో ఒక ప్రకటన “ స్వలింగ వివాహానికి నంబూద్రి బ్రాహ్మణ వరుడు కావలెను.” అంటూ కార్తిక్ వివరాలు, అతని  తండ్రి వివరాలు అందులోన్నాయి.
కార్తీక్ స్పందించలేదు, అక్కడ నుండీ లేచి గబగబా తయారై వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిన కార్తిక్ మళ్ళీ ఇంటికి రాలేది.
సంవత్సరం తర్వాత తల్లికి మెసేజ్ పెట్టాడు, “నేను, రజనీష్ ఒక పరయ కుల  అనాధ బాలికను దత్తత తీసుకున్నాం, మనవరాలను చూడాలనిపిస్తే ఈ అడ్రెస్ కు రాగలరు..”
(సుమారు ఆరు నెలల క్రితం “కేరళ లో LGBT వర్గానికి చెందిన హరీష్ అయ్యర్ కు పెళ్లి సంబంధం వెతికినా తల్లి” అనే వార్త ఆధారంగా రాసిన కధ )
                                                                        (  అయిపోయింది )
                                                                 మార్చ్ 2020  సాహిత్య ప్రస్తానం లో ప్రచురించబడింది  





No comments:

Post a Comment