Sunday, 31 May 2020

వసంతం


                                    వసంతం

వచ్చినదే మళ్ళీ వచ్చిందా ?  తెచ్చిందాన్నే మళ్ళీ తెచ్చిందా?
లేదా, మళ్ళీ మళ్ళీ తనకు తానుగా అదే వచ్చిందా?
వస్తూ వస్తూ మళ్ళీ మళ్ళీ దాన్నే తెచ్చిందా?
ఇంతకీ ఎవరు ఎవరిని తీసుకుని వచ్చారు?
నిన్నటిని మొన్న తీసుకుని వచ్చిందా? రేపుని నేడు మోసుకొస్తుందా ?
కాలచక్రాన్ని భవ చక్రంతో సన్నిధానం చేసి ఋతువుల పరంపరను
ఎవరు ఎక్కడ నుండీ మోసుకొస్తున్నారు?
మనిషా? మమతా? రుతువా? క్రతువా?
ఆశయమా? ఆలోచనా ? క్రమ క్రమ పరిణామక్రమమా?
క్రమ విన్యాసమా ? ఆవిర్భావమా? పునర్భావమా ?  
దుఖం సుఖానికి దారి వేసి తీసుకుని వస్తుందా ?
సుఖమంతా దుఖమయమని గుర్తు చేస్తుందా?
ప్రశ్నల వర్షం ముగుస్తుందా ? గ్రీష్మం వసంతాన్ని తెస్తుందా ?
ప్రతీత్య సముప్పాదం శాంతి వసంతాన్ని కురుపిస్తుందా?

సింధులో వికసించిన హరప్పా కాలిబంగన్ పుష్పాలు
ఎవరు పుష్పింప చేసారు?
మొహంజదారో మనోహరాలు తిరిగి వికసిస్తాయా ?
వలస ధూర్తుల వరస దాడులు వర్ణ వంచనల పన్నాగాలు
ధ్వంస రచనల హింసాపూరిత పెత్తనాలు  వికటిస్తాయా?
 నాటి నాగరికతా వైభవాలు మూల పురుషుల ప్రభోదాలూ
తమ తమ సామర్ధ్యాన్ని తిరిగి ప్రకటిస్తాయా?
నిరుడుకురిసిన శుద్ధ శ్రమన జైన బౌద్ధ వసంతాలు
తిరిగి శాంతి అనుగ్రహ తొలకరులై వర్షిస్తాయా ?

కార్యాకారణ అనుబంధంగా చావు పుట్టుకుల పరిణామం
భవం ఎప్పటికైనా తన భావచ్చేదాన్ని ప్రకటిస్తుందా?
శాక్యముని సంవిధానం మౌర్య సామ్రాట్ ధమ్మరాజ్యం
పునరావృతమై ఎప్పటికైనా స్థిరపడి సుస్థిరతను  ప్రభవిస్తుందా?
మానవాళి మనుగడకి మరల బౌద్ధ వసంతం ప్రసరిస్తుందా?  

అనగారికుడు అవిరాళుడు  అత్యంత ఆధునిక నాగరికుడు
ప్రతిభా చిరునామా దయాళువు భవిష్యద్వాచాకుడు  
రాజ్యాంగ శాసన కర్తవ్య పాలకుడు భీమరాయుడు  
విరచించిన విఖ్యాతం ఉజ్జ్వలాగ్ని సిఖయై వెలుగుతుందా ?
పొద్దు తిరుగుడుల సమతా వసంతం ఆ సూర్య కిరణాలకు
దుఃఖ కారణ నివారణా మార్గమే  షడ్రుచుల సమాహారమై
 సమ్యక్ సంకలపమై మనలో ప్రసరిస్తుందా ?
నిరుడు ఏమో గానీ నేడైనా రేపైనా
ఆమని ప్రతీ మధు మాసపు తేనె చినుకూ  
మానవత్వం చిలకరించి సమసమాన వైశాఖ రాగం ఆలపిస్తుందా ?
సంఘీవభావ ఉజ్జీవానికి ప్రాణం పోస్తుందా ?
శిశిరంతో  జతకలిసి వసంతానుకంప మానవాలోచనకు  
మమకారంతో మాతృత్వాన్ని అందిస్తుందా ?
సమతను సాధికారతతో ప్రవర్ధమానం చేస్తుందా ??
                                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్ 

No comments:

Post a Comment