Sunday, 31 May 2020

తల్లి

నా తల్లి త్యాగాల మల్లి నా స్వాభిమాన బలం నీవు 
అపురూపం నీవంటే, ఆశీర్వదించే అనురాగం నీవుంటే , 
నీడనై ఉంటా నేనెప్పుడూ నీ వెంటే
అమ్మా ! నన్ను కని నీ మాతృత్వం ఇచ్చినందుకు  నీకు  వేన వేల వందనాలు
నీ ఉపకార స్మృతులకు నా జీవితమే కృతిగా ఋణం తీర్చుకోవడం నా సహజ ధర్మం  
నా ఉన్నతినే కోరుతూ   నీ శ్వాసనే ఆశయంగా పునాదులెన్నో వేసావు
నీ భాషనే నా తప్పటడుగులకు ఆలంబన చేసి
తల్లి వేరువై నన్నెంతో ఎత్తుకు తీసుకుపోవడానికి నీవెంతో లోతుకు వెళ్లావు
నీవు బలపడుతూనే నను ప్రామాణికముగా పెంచావు
నీ త్యాగఫలమే మే కదా, నన్నింతగా విస్తరింప చేసింది
నిను నేలలో విడిచాకే కదా ?! నేనాకాశములో వేన్నూల్లుకున్నాను
మరి..! వీళ్ళ గోలేమిటి??
నిను చంపుతున్నానంటున్నారు, బతికించ మంటారు ...
హంతకులే న్యాయమూర్తులు గా ప్రవర్తిస్తున్న నా దేశంలో
మనువాదం ముసుగేసి ముసలం పుట్టిస్తుంది తల్లీ !
మన పేదరికం వారి వ్యాపార వస్తువైందమ్మా
భాష మిషతో  నా గమనాన్నీ అడ్డుకోవాలని చూస్తున్నారు  
విత్తు పేరుతో  పైరునీ ఫలాలను  చిదిమేయాలని కుట్ర పన్నుతున్నారు  
నీ చావు పేరుతో అధికరించనీయకుండా  బ్లాక్మయిల్ చేస్తున్నారమ్మా
దారి కాచి  బందిపోటుల్లా మా బతుకుల్ని బుగ్గిపాల్జేయచూస్తున్నారు
గో హత్యలూ, మాతృ హత్యలూ వాళ్ళ సంస్కారం కదా?!
మరీ ఆ చోద్యం మాకు అంట గడతారేమిటి ?
తల్లి ఇంటికి దీపం ...మా భవిష్యత్తు దేశానికి రూపం
అంతా తెలిసే కదా , ఈ ఆత్మ వంచక కపట ప్రేమ
మొన్న దేవ భాషపై మోజు చూపి మోసినోళ్ళు
నేడు వాడుకను వాడుకోవడానికి  మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు
అకల్ లేనోళ్ళతో వేగవచ్చు,
స్వార్ధపూరిత విష త్రాచులను ఎలా వోర్చ మంటావమ్మా?!
మానవీయత మచ్చు కైనా లేని  ముసాఫిర్లు
అసత్య కృత్రిమ చేసే మిధ్యా వాదనలు ఎలా తుంచ మంటావమ్మా ?!
నిను బతికించు కోవడానికి ఏమేమి సమకూర్చాలో మాకు తెలీదా?
 నే బయటకెళ్ళి గోప్పోడివనైతే నీకే కదా? గొప్ప
నీ పేరు నిలపడానికే నిను విడిచి వెళుతున్నా
 నీ వెంటే ఉంటే అది సాధ్యం కాదని వారికి కూడా తెలుసుగా   
నేనెక్కడున్నా నిను మరువ, నీ కంట కన్నీరు రానివ్వను
నీ స్వస్థత నా బాధ్యతా ,
అత్యాధునికతో నిను వేల ఏళ్లు బ్రతికించు కుంటాను.
ఇప్పటివరకూ అణాకాణీ గాళ్ళని తెలియక అణిగి మణిగి ఉన్నాను
ఎదగ వద్దన్నవాడిని ముద్దాయిని చేసి  బోనులోకి పంపుతాను
అనివార్యం ఆశయానికి తోడైనదిలే ,ఇక తిరుగులేదు  
ఎప్పటికీ నాలో ఉన్నది నీ వేరులోని జీవమే తల్లి
త్యాగాల మల్లి,  నా తెలుగు కల్ప వల్లి !!

                                               డాక్టర్ మాటూరి శ్రీనివాస్

No comments:

Post a Comment