నేనెందుకొచ్చా ?
ఆఫ్ట్రాల్ జీవకణంలో సంగోరంతైనా , ఎంతో సొగసైన దాన్ని నేను
మీ విశ్వ మానవ సముద్రాన ఉప్పుకణికలో చీమతలంత నేను ,
నేనెంత? , నా ఉనికెంత ? నా బ్రతుకెంత?
భూ మండలం లో ఎన్నిటినీ జయించినోడివి నీవు,
కానీ ,నా తలంపే నీకు వెన్నులో వణుకు పుట్టిస్తుందే
ఎందుకో ,అర్ధమైందా !?
నేడిలా నేనిలా ఇంతలా ప్రపంచాన్ని భయపెట్టే ధైర్యం నాకు నీవిచ్చిందే
నీ నిరంతరం స్వార్ధపు ప్రాకులాటే కదా? ఈ ప్రకృతిలో ప్రతీ ఉత్పాతానికీ నాంది
సునామీలూ దావానలాలు భూకంపాలూ తుఫానులూ
కరువులూ కలరాలూ ప్లేగులూ సార్సులూ మెర్స్లూ
అన్నీ మానవ తప్పిదాలిచ్చిన ఆహ్వానాలే, నిర్లక్ష్యపు ఆకృత్యాలే పరిణామ అక్రమాలే
నీ స్వార్ధ లక్ష్యాలకు కాస్త బుద్ధి చెబుదామనే వస్తాయి, నేను కూడా అంతే
ఏదో భయం చెప్పి మిమ్మల్ని ఓ చూపు చూసిపోదామనుకుని వచ్చా
మీరు నన్నిప్పుడు సర్వాంతర్యామిని చేసేసారు, థాంక్స్ .
మీ మనుషుల ముఖాలన్నీ కనిపించని స్వార్ధపు మేలి ముసుగులే
ప్రతీ ఒక్కరికీ లోపలొకటీ బయటొకటి ఛద్మ ముఖం
అవసరానికొక ధోరణి అనవసరానికి ఒక వైఖరి మీ దారి
ఆ రంగుల పార్శ్వం ఇప్పుడు ఈ ఈస్టమన్ రంగుల మాస్క్ తో
తప్పించుకోవడానికో తమను తాము బ్రతికించుకోవడానికో
పడే తాపత్రయం భలే రంజుగా ఉంది, దొరలు దొంగలుగా మారిపోతున్నారు
జరా భద్రం ,ఆగమంటుంటే, మూర్ఖపు రెక్కలు విచ్చుకుని ద్వారం దాటి ఎగిరిపోతున్నారు
ప్రక్కవాడికి నన్ను కాస్త పంచుతూ ఎప్పుడూ లేని గుప్తదానాన్ని తెగ ప్రదర్శిస్తున్నారు
మీ మనుషుల యాతన చూస్తుంటే బాధగా సంతోష మేస్తుంది
ఎవడికి తోచింది వాడు వాట్సప్పుల్లో తోసేస్తుంటే గర్వంగా జాలేస్తుంది
మీ ముసుగులు వల్లిస్తున్న మంత్రాలకు భయపడి దేవుళ్ళు
కూడా తలుపులు వెనుక సానిటైజేర్ రాసుక్కూచున్నారు
సర్వరోగ నివారిణి గో మూత్రం తాగినోల్లు కూడా ఎక్కడికక్కడ
చప్పున సొమ్మసిల్లి తలో మూల చతికిలబడి పోయారు
అదిగో , అక్కడ చూడు... వాళ్ళే నా దృష్టిలో నిజమైన పూజార్హులు
ఆ ఒక్క దేవాలయానికి సెలవు లేదు, అదొక నిరంతరాయ అమ్మ వొడి
అక్కడ దైవత్వం మానవత రూపంలో నిత్యం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది .
మనిషి ఆశలను వారు తమ ఆశయాలతో బతికిస్తారు.
మానవ తృష్ణకు తమ ప్రాణాలర్పిస్తూ జీవం పోస్తుంటారు .
సర్వాన్ని వదులుకోవడమంటే ఏమిటో రుచి చూపిస్తారు ,
అందుకే వారంటే నాకు గౌరవంతో కూడిన భయం ,
దేన్నైనా శాస్త్రీయతే ఊపిరిగా పరిశోధనలతో వైజ్ఞానికంగా జయిచడం వారి నైజం
మీ మానవజాతి అంతఃకరణతో ఆదరించాల్సిన అర్హత ఉన్నవారు
నన్ను నిలదీసి నిలువరించే సత్తా ఉన్న వారూ , వాళ్ళే
ఇక నైనా మీ మెదడును బారుగా తెరవండి ,
వారిని కాదంటే ముప్పేనని తెలుసుకోండి ,
నేను వచ్చిన పని అయ్యింది, మీకు బుద్దొచ్చిందనుకుంటా ?
నేను పేరులోనే కిరీటాన్ని పొదుగుకున్న విశ్వ విజేతను,
ఎలాగా వచ్చాగా కదా..! , అలా నాలుగు దేశాలూ తిరిగి పోతా ,
విర్రవీగితే మళ్ళీ వస్తా మరో రూపంలో మరో దేశంలో బయలుదేరి , బై, బై ....
No comments:
Post a Comment