Saturday, 1 June 2019

ఇదొక అక్టోబర్ విప్లవం




సముద్రం ఎప్పుడూ ఎవ్వరితోనూ పోటీపడదు తనకేదీ సాటి రాదనీ తెలుసు
స్తబ్దంగా ఉన్నట్టు ఉంటుంది.అణకువ చేతకానితనము కాదు
అలలు వాటి ఉనికీ కాదు, సునామీ ఉదృతం తెలియనిదెవ్వరికి?
అంతరంగం, తన ప్రశ్నలను ఎప్పుడూ కెరటాల రూపంలో ప్రశ్నిస్తూనే ఉంటుంది
లోతును ఊహించుకోలేము , నిజం - ఆ మహానుభావుని మేధ కూడా అంతే.
జ్ఞానానికి కొలమానం లేని అంచనా ఏదైనా ఉందంటే అదే అతని మూర్తిమత్వం
మత కాలుష్యము విరజిమ్మే దుర్గంధపు పరాకాష్ట కులాన్నీ
మర్మమెరుగని మనసుల్లో నాటిన ఆధిపత్యపు రాకాసి నీడ జాడనూ
పసిగట్టిన బహుముఖ ప్రజ్ఞ, తన వివేకంతో వివేచనలేనితనపు పునాదుల్ని కదిపింది .
జన్మ జన్మలకూ అదే నీ ఖర్మ అన్న కర్మ భూమిని నిలదీసింది

ఎప్పుడూ చిన్నగా పొగలు చిమ్మే కొండ కుహరాన కొలిమిలో
నిత్యం మేగ్మా రగులుతూనే ఉంటుంది, లావాను పొదుగుతూనే ఉంటుంది
అనాదిగా అవమానించబడ్డ ఆత్మాభిమానానికి కూడా అంతే
మగాడికి - అదీ, రెండుసార్లు పుట్టినట్లు ప్రకటించుకున్న పురుషాధిక్యాన్నీ
ఎన్నో అపశృతులను స్మ్రుతులుగా ప్రకటించే ఢంకా వాయిద్యగాళ్ళనీ
వక్రీకరణల ఆయుధాలతో దేవతలను అలంకరించిన ఆషాడభూతుల
అజ్ఞానలీలలను దహించి సమతా మమతల బుద్ధి బలం సంస్కరింప దలచింది
అనార్యుల చెవుల్లో పోసిన సీసమే భూతమై వాళ్ళ అల్పబుద్దికి గ్రాసమైంది
నిర్వేదపు మీమాంసల మాయావాద వేద భూమిని నియంత్రించింది

నాగుల వాసంలో మనమెరిగిన ఒకే యుగంలో ఒక మహా ప్రవక్త
విద్యాధిష్టాధరుడు అన్ని యానాలకూ అతీతంగా చేసిన దమ్మ ప్రయాణమది

గతి తాత్విక ఆధ్యాత్మిక వాదపు కరుణామయ మార్గమది
మనసున్న వాడిచ్చిన సామాజిక స్వాతంత్య్రతా బహుజన అక్టోబర్ విప్లవమది
ప్రపంచమే సహృదయంతో ఆహ్వానించగ, ఎగసిన ధార్మిక దావానలమది

మానవాళి మౌలిక జీవన విధానానికి అవసరాల ఆలోచనతడు
సమభావం సమధ్యేయం ఎగసిన సర్వమానవ సమానత్వపు శిఖరమతడు
అతడెలిగించిన ఉద్యమ దీపం శాంతి బాటకు వెలుగైయింది
అతడందించిన ఆశయం మనిషన్నవాడికి ఊపిరైయింది
అతడు చరించిన ఈ నేల బుద్ధభూమిగా పునర్భవించింది...

తనను తానూ గెలుచి, మౌర్యాశోకుడు చేసిన అస్త్ర సన్యాసపు
బౌద్ధ చింతనామయ మూల్యాంకమే , మన విజయదశమి
జారులను జయించిన ఆ ఎర్ర విప్లవం పతనమైందేమో గానీ,
కుల మతాలను జయించిన ఈ నీలి విప్లవం ఆద్యంతరహితమైనది
దీనికి అంచుల్లేని ఆకాశమే హద్దు , సముద్రమే దీని అవధి
అతని మాటే మతాలన్నిటినీ మంత్రాలన్నిటినీ మసకబార్చింది
ఒక్క ఆజ్ఞాపనే మహోదయ మానవీయ విప్లమైంది

బహుజన సాంస్కృతిక పరివర్తనమే దమ్మ చక్ర ప్రవర్తనమైంది
అదే ఆ అభినవ తధాగతుడందించిన నవయాన మార్గమైంది.


                                                               డాక్టర్ మాటూరి శ్రీనివాస్
..........................................................................................................

No comments:

Post a Comment