Saturday, 1 June 2019

“గురి” చూసి కొట్టిన కధలు


“గురి” కధల సంపుటిపై విశ్లేషణాత్మక సమీక్ష

తెలుగు కధ పరిపుష్టికి డోకా లేకుండా మనకు తెలుగులో కధకులున్నారు. వారి
సరసన కూర్చోబెట్టగల వర్ధమాన కధకుడు మల్లిపురం జగదీశ్. రాయాలని రాయడమో,
వృత్తి గానో ప్రవృత్తి గానో రాయడమో కాకుండా ఒక లక్ష్యంతో రాసిన కధల
సంపుటి “గురి”. వాస్తవాల చిత్రీకరణ చేసాడనడం ఈ కధలకు చిన్న మాటే అవుతుంది.
“నేలంతా తాత ముత్తాతల మానవ అస్తికల్లోంచి పుట్టుకొచ్చిన పువ్వు”, “మనిషి
నేలకు చెందినా వాడు, నేల మనిషికి చెందినది కాదు ”, ఆకాశాన్ని కొనగలవా, పోనీ
అమ్మగాలవా? నేల వెచ్చదనానికి వేల కట్టగలవా?”, “నాకేటి కావాలో నాను
సెప్పాల, నాకు సుకమేటో నాకు తెలుసని నువ్వు ఎప్పుడు తెలుసుకున్తావో?” అని
సూటిగా వ్యవస్థని ప్రశ్నిస్తుంది ఒకొక్క కధలోని ఒక్కొక్క పాత్ర. ఒకప్పుడు
ఆదివాసుల గ్రామాల్లో సంత అంటే గోరేటి వెంకన్న సంత పాట గుర్తుకొచ్చేది.
కానీ. ఇప్పుడు అక్కడ సంతల్లోకి ఆదివాసులు ఉత్పత్తులు అమ్ముకోవడానికి కాదు
పాశ్చ్యతీకరణను కొనుక్కోవడానికి వస్తున్నారు. అక్కడ అనేక దుకాణాలూ
డిపార్టుమెంటల్ స్టోర్స్ , బట్టల షాప్లూ, మోటార్ సైకిల్ షో రూమ్లూ
వెలిసాయి. అవేవీ స్థానికులవి కావు. మరి అక్కడకు ఎలా వచ్చాయి? 1/70 చట్టం అసలు
ఉందా ? ఉంటే ఏమైయ్యింది? దోపిడీ ఎక్కడైనా దోపిడీయే అంటూ గతంలో యూరప్
నుండీ వచ్చిన అమెరికన్లు రాజధాని కట్టడానికి అక్కడి మూల్నివాసులైన రెడ్
ఇండియన్లను తరిమేసినప్పుడు వారు పడిన ఆవేదన నాటి వారి చీఫ్ సీటెల్ తమ
ఉద్వేగ భరితమైన చివరి ప్రసంగం చేస్తాడు. భూమిని వదిలేయాలా వద్దా? అని
సందిగ్ధలో “ప్రవాసము కూడా ఒక యుద్ద రహస్యమే” అని సాటి వారిని
వోదారుస్తాడు. ఇక్కడ ఒక స్కూల్ టీచర్ నేడు వారి ఉనికినీ,భూమినీ దోపిడీ
చేస్తున్నవారిని నిలువరించాలా,వద్దా ? అని ప్రశ్నిస్తాడు, మా నేల మీద మేము
బ్రతకడం కోసం ఉద్యమం చేయాల్సిరావడాన్ని ప్రశ్నిస్తాడు ,“గత
వర్తమానం”అనే కధలో. లిబెరలైజేషన్ ఎక్కడకు వెళ్ళకూడదో అక్కడకు ఎలా
వెళ్ళిందని,దాని పర్యవసానంగా ఒక తరం ఎలా నిర్వీర్యం అయిపోయిందో చెప్పే
కధ మరొకటి . అవగాహన లేని అనుభవం లేని ఆదివాసి యువత టీవీ కీ, మొబైల్ కీ ,
మందుకూ, ఫేషన్ కూ ఎలా బానిసై భవిష్యత్తు ను ఎలా నాశనం చేసుకుంటున్నారో
కొన్ని కధలు చెపుతాయి. ప్రతీ కధ స్థానికతకూ, నేటివిటీ కీ అద్దం పడతాయి. డప్పు
దరువూ, తుడుం మోతా , గోగోయ్ రాగం వినిపిస్తాయ్. ఎన్నో స్థానిక పదాలను ఆచార
అలవాట్లనూ చూపిస్తాయ్ . ఇప్పుడు ఇప్ప సారా పోయి, జీలుగు కల్లు పోయి, కాచిన
సారా కూడా పోయి “నీ బ్రాండేదో సెప్పు గురూ..” అని ఒక యువకుడు అడగడం చూస్తే
ఆదివాసి గ్రామాల్లో బెల్ట్ షాపుల హవా అర్ధం అవుతుంది. కొన్ని ఊర్లలో జనం
వోటేస్తారు గానీ అవి అన్నీ దొంగోట్లు. ఎందుకంటే వారికి వోట్లు
ఉండవు,ఉన్నాఎవరో వేసేస్తారు. ఎన్నికల విలువ వోటు విలువ వారికి ఇప్పటికే
తేలలేదు. దొంగోటు వ్యవహారం పై వచ్చిన సినిమా ఇప్పుడు దేశాన్నే
కుదిపేస్తుంది. ఎవరో వేసేసిన తన వోటు ను తిరిగి ఎలా సంపాదించుకోవాలో

చట్టములో ఉందన్న విషయం ఉన్న సెక్షన్ 49(p) చదువు కున్న వాళ్ళకే తెలియదు,
మురుగదాస్ మొన్న “సర్కార్” సినిమాలో చూపించేదాకా. ఇక, స్వాతంత్ర్యం వచ్చి
70 ఏళ్ళు అయినా అక్కడ చాలా గ్రామాలలో ఆదివాసి పాఠశాలలలో ఇంకా జాతీయ జెండా
కూడా ఎగరడంలేదు. ఎగరేద్దామని ఒక బడిపంతులు ఉత్సాహపడినా ఆ కల సాకారం అవ్వదు.
అక్కడ జెండా ఎందుకు ఎగరలేదో “నల్ల జెండా” కధ చెపుతుంది. అమాయక ఆదివాసికి
పేరు మార్చి, ఉద్యోగం ఇచ్చి, మాటి మాటికీ పోలీసు స్టేషన్కు రప్పించుకుని అటు
అన్నలకు ఇన్ఫార్మర్ అన్న అనుమానం కలిగిస్తూ ఇటు పోలీసులూ హింసిస్తూ , అటు
అన్నలలో అసహనాన్ని సృష్టిస్తూ కదా నడిపిస్తారు. అనుమానపు అన్నలు కూడా ఆ
అమాయక ఆదివాసిని అనుమానిస్తారు. కుట్ర పూరిత ఆటవిక పోలీసు రాజ్యాన్ని
చూస్తాం,చంద్రన్న కధలో. తీవ్రవాది చంద్రన్న పట్టుకోలేని పోలీసులు ఈ
అమాయకుడికి చంద్రన్న పేరు పెట్టి లొంగిపోయినట్లు, పునరావాసంగా
కల్పించినట్లు ప్రకటించుకుంటారు. చివరకు చంద్రన్న ఎన్కౌంటర్ లో చనిపోతాడు.
ఏ చంద్రన్న? అమాయక చద్రనా? తీవ్రవాది చంద్రన్నా?. “అడవితనం” కధ నవలాకు
సరిపడ్డ ఇతివృత్తం. ఒక ఆదివాసి జంట పట్నంలో స్థిరపడతారు. అతడికి పుట్టి
పెరిగిన ఊరంటే వెగటు. ఆమెకు ఆ ఊరంటే ప్రాణం. ఊరొదిలి వలస పోయిన ఆమె
బాల్య స్నేహితుడు ప్రమాదంలో చెయ్యి కోల్పోతాడు. అతనికి సాయం
చేయడానికి పూనుకున్న ఆమెను, భర్త నిరాకరించి అపనింద వేస్త్తాడు. ఆమె
ఆశ్చర్య కరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఒక ప్రక్క భర్త చదువుకుని అపోహలతో
ఎలా గాయపడి ఊరికి దూరంయ్యాడో, మరొక ప్రక్క చదువులేని నాగడు కూలికి
వలసపోయి ఎలా గాయపడ్డాడో తెలియచేస్తుంది , “అడవితనం”. జగదీశ్ రాసిన ఈ
సంపుటిలోని 13 కధలున్నాయి. ఇది అతని రెండవ కధా సంపుటి. మొదటిది “ శిలకోల”
ఇప్పటికే విమర్శకుల మన్ననలు పొందింది. ఇక “గురి” లోని ప్రతీ కధా సన్నగా
చిన్నగా మొదలౌతుంది. అంతలోనే తన భావుకతతో అడవినీ ఆదివాసి తండాలను, వారి
సంస్కృతి,వారి భాషనూ పరిచయం చేస్తాడు. సమస్యను మన ముందు పెడతాడు.
సమస్యనూ, కారణాలనూ, బాధ్యులనూ, వ్యవస్థ నూ ప్రశ్నిస్తాడు. ముందు
కధల్లో కొంత కంప్రమైజ్ ధోరణి, సర్దుకుపోయే తత్వాన్ని ప్రదర్శించిన
ఆదివాసులు, తరువాత సాగినా కొన్ని కధల్లో ఉద్యమ రూపానికి పునాది వేసేవిగా
ముగిస్తాడు. కొన్ని కధలు దిగులుగా ,కొన్ని కధలు గుబులు గా మరికొన్ని
ఉత్సాహంగానూ ముగుస్తాయి. అన్నీ ఓపెన్ ఎండింగ్ తో దాదాపు ప్రధమ పురుషలో
సాగుతాయి. చదుకున్న నిరుద్యోగులు ఎలా తప్పు దారి పట్టి పాస్తర్లుగానో,
దళారులుగానో, ఉపాది హామీకి బానిసలుగానో మారిపోవడాన్ని తన అనుభవాలను జోడించి
అందిస్తాడు . ITDA (integrated tribal development agency) లో అప్పు తీసుకుని ఆ అప్పు
చాలక షావుకారు దగ్గర మరికొంత అప్పు చేసి రెండు అప్పులూ తీర్చలేక కొన్న
ట్రాక్టర్ ను కోల్పోవడం, నాణ్యతలేని డిగ్రీ లను ఇచ్చి వారి భవిష్యత్తు ను
నిర్వీర్యం చేయడం ,చివరకి చదువుకుని డిగ్రీలున్నవారు కూడా కూలి పనికి వలస
పోవడాన్ని “తార్రోడ్డు” కధ చెపుతుంది. ఒక్కొక్క కదా ఒక నిరసన. ఒక అభియోగం , ఒక
ఆర్తనాదం. ఆదివాసుల జీవిత సంక్షోభాలను , జీవన సంక్లిష్టతలనూ, సంఘర్షణ లనూ
అనవసర కల్పితాల జోలికి పోకుండా సున్నితంగా డీల్ చేసి సంయమనంతో ప్రజెంట్
చేయడంలో రచయిత కృషి, క్రమశిక్షణ కనబడుతుంది. అన్ని ప్రభుత్వ శాఖలనీ
చూచాయిగా స్పృశిస్తూ , వాటిలోని లోసుగుల్నీ ఎత్తిచూపుతూ, సమయానుకూలంగా
స్పందిస్తూ రాజకీయాలనీ ఎండగట్టే ప్రయత్నం కనిపిస్తుంది. వైద్య శాఖ లోని

బ్యూరోక్రిసీ ప్రభుత్వ నిర్లక్షాన్ని “డోలి” కధ చెపితే, అబ్కారి శాఖ
అమానుషాలను “సింగిడి” చెపుతుంది . 50 % కన్నా అధిక జనాభా ఉన్న ప్రాంతాలను ITDA
పరిధిలోనికి తెచ్చి వారి ఆర్ధిక సామాజిక సాధికారత కోసం పనిచేయాలి. 1856
సొసైటీ చట్టం ప్రకారం 1956 ఏర్పడి ఈ సంస్థ ,ఆదివాసులకు ఉపాధి కల్పించడం
కోసమూ , ఇన్ఫ్రా స్ట్రక్చర్ అభివృద్ధి ప్రోగ్రాం లను నిర్వహించడం కోసమూ
మరీ ముఖ్యంగా బడాబాబుల దోపిడీల నుండి వీరిని రక్షించడం కోసమూ ఏర్పడింది. అదే
విధంగా దీనికి తోడుగా దాదాపు అదే ఏడాది ఏర్పడిన గిరిజన కో ఆపరేటివే
కార్పోరేషన్ (GCC) కలప మినహా ఇతర అన్ని ఆదివాసి ఉత్పత్తులకూ గిట్టుబాటు
ధరను నిర్ణయిస్తూ వారిని దళారుల బారి నుండీ కాపాడాలి. తగిన మార్కెట్టు వసతిని
కల్పించి ఆదివాసుల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ వారికి కష్టానికి తగు
ఫలితాన్ని అందజేయాలి. ఈ రెండు ప్రధాన సంస్థలూ కూడా ఐ ఏ ఎస్ అధికారుల
కనుసన్నలలో వారే చైర్మన్లు గా పనిచేస్తాయి. పని వొత్తిడి, అవగాహనా
రాహిత్యం, వివక్ష ధోరణీ, రాజకీయ వోత్తిడీ వీరిని వీరి విధుల్లో అడ్డుకోవడం
పరిపాటి. ఈ సంస్థల గవర్నింగ్ బాడీల్లో ఆదివాసుల ప్రాతినిధ్యం ఖచ్చింతంగా
ఉండాలని చట్టం చెపుతుంది. అది నామమాత్రంగానైనా కనబడకపోవడం వారి ఈ హీన
స్థితికి ఒక కారణంగా కనబడుతుంది. “నా అనే వాడొక్కడూ లేదు ఈ ఆపీసుల్లో..” అని
వాపోతుంది ITD A చుట్టూ తిరిగి అలిసిపోయిన ఒక పాత్ర. మరొక వైపు వారికి
నిర్దేశించబడిన సబ్ ప్లాన్ బడ్జెట్ ఎక్కడికి పోతుందో తెలియడం లేదు.
ట్రాక్ట ర్లూ, మొటార్లూ, విద్యుత్తూ,బస్తి అందచేయాల్సిన సబ్ ప్లాన్
డబ్బుతో బస్ షెల్తర్లూ, పోలీసు స్టేషన్లూ రోడ్డులూ నిర్మించి అభివృద్దిగా
చూపిండం ఎవరి అభివృద్ది కి సహకరిస్తున్నాయో ఎవరిని మరింత పేదరికంలోనికి
ఆణిచేస్తున్నాయో చెప్పాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఏర్పడింది. పోలవరం,
ఝాంఝావతి డాముల పేరుతో ఎన్ని వేల ఆదివాసి కుటుంబాలు , పవర్ ప్రాజెక్టుల
పేరుతొ మరిన్ని గ్రామాలు గాలికి కొట్టుకుపోయాయో వారి వెతలు ఎ స్థాయిలో
ఉన్నాయో ఊహించడం అంత సులభం ఏమీ కాదు. ఈ కధలు చదివితే కనీసం మనకు ఒక అంచనా
వస్తుందని మాత్రం చెప్పగలను. దిగజారుతున్న ఆదివాసి జీవన ప్రమాణాలు ,
జటిలమౌతున్న పరిణామాలూ ,కుంచించుకుపోతున్న వారి భౌతిక భౌగోళిక పరిమాణాలూ
కలబోస్తే ఈ కధల సంపుటి. గతంలో అడపాదడపా ఆదివాసి కధలు ముఖ్యంగా తెలంగాణా
నుండీ వచ్చాయి. కానీ ఈ తరానికి పూర్తి స్థాయిలో ఒక సంపూర్ణ సమగ్ర సంపుటి
బహుసా ఇదే మొదటిది. “ఆదివాసి కధలు” అనే నూతన అస్తిత్వవాదానికి ఒక బలమైన,
విశాలమైన పునాదిని రచయిత వేశాడని చెప్పవచ్చు. ఇందులో కవిత్వం గురించి ఒక మాట
రాయక తప్పదు. కధకుడు కవి కూడా ఐతే ఆ కిక్కే వేరు. తన కధలకు కల్పితాన్ని ప్రక్కన
పెట్టి ఉన్న విషయాన్నే కవిత్వీకరించి భావుకతతో చెప్పడం ఈ కధల్లో ఒక
ప్రధాన ఆకర్షణ. “కవిత్వమంటే కళాత్మకంగా చెప్పడమొక్కటే కాదు, నిజాన్ని
నిర్భయంగా చెప్పడం కూడా”, అని తన స్పృహను ఒక కధలో వ్యక్తపరుస్తాడు. పేసా
చట్టం, షెడ్యుల్ 5 రెండింటినీ ఎలా జన సామన్యం చేయాలో వారి హక్కులను ఎలా
తిరిగి అందజేయాలో అనే ధ్యేయంప్రతీ కధ లోనూ అంతర్లీనంగా కనబడుతుంది.
పేసా(pesa) అంటే “పంచాయత్ ఎక్క్లూజన్ షెడ్యుల్ ఎజెస్సీ“ ఏక్ట్ . గ్రామాల
స్వయం పరిపాలనా, గ్రామ సభల నిర్వాహణకు సంబంధించింది. ఈ చట్టం ప్రకారం
ఆయా గ్రామాల పరధిలో ఉన్న, ఆ సరిహద్దుల్లో ఉన్న పంట ,వనరుల మీద హక్కు
అక్కడ నివసిస్తున్న స్థానిక ఆదివాసులదే . దీనికి 1 /70 తోడైతే గిరిజనేతరులకు

ఆయా ప్రాంతాల్లో ఎటువంటి క్రయ విక్రయాలు అనుమతించబడవు. స్థానికుడు
కానివాడు అక్కడ వ్యాపారాలు చేయలేడు. ఈ చట్టం నేపధ్యం లోనే దొంగ ST
సరిఫికేట్లు వ్యవహారాన్ని, ఆదివాసి ఆడపడుచులని బలిసిన అగ్రకులస్తులు
ఉంచుకోవడాల్లాంటి ఎన్నో విషయాలు చూడాలి . “షెడ్యుల్5” గా పిలవబడుతున్న ఈ
ఏజెన్సీ ప్రాంతాలన్నీ దేశ రాష్ట్రపతి అధీనంలో ఉంటాయి. సాధారణ పంచాయితీ
రాజ్ కార్య నిర్వాహక పరిధిలోనికి రావు. ఆదివాసీ హక్కులకోసం పోరాడే వారికి
చత్తీస్గడ్ లో జరుగుతున్నా “పత్తల్ గడీ” ఉద్యమం స్పూర్తిగా నిలుస్తుంది.
ఆదివాసులు చనిపోయిన తమ పూర్వీకులకు గుర్తుగా సమాధులపై నిలబెట్టే రాళ్ళను
“పత్తల్ గడీ” అంటారు. ఇప్పుడు చత్తీస్ గడ్లోని సుమారు 35 వేల గ్రామాల్లోకి ఈ
ఉద్యమం వ్యాపించింది . గ్రామ పొలిమేరల్లో ఈ “పత్తల్ గడీ” పేర 15 x 4 అడుగుల
పొడవున్న రాళ్ళకు ఆకుపచ్చ రంగు వేసి వాటిమీద రాజ్యాంగంలోని షెడ్యుల్ 5,
పీసా అంశాలను చెక్కించి ,అక్కడికి వచ్చిన అధికారులను,నాయకులను వాటిని చూపించి
అమలు పరచమని స్థానికులు నిలదీస్తున్నారు. ఆదివాసీ యువకులు బాణాలతో గ్రామ
సరిహద్దుల్ని కాపలా కాస్తూ దోపిడీ దారులని వారి గ్రామాల్లోకి కాలు
పెట్టనివ్వడం లేదు. పోలీసులకూ అనుమతిలేదు. “మేమే మా ప్రభుత్వం” అనేది వారి
నినాదం. ఇప్పుడు పోలీసులకు వీరికి యుద్ధం తారా స్థాయికి అందుకోబోతుంది. యధా
ప్రకారం వీరికి మావోలతో లింకు పెట్టేసారూ పోలీసులు, అది వేరే కదా
అనుకోండి..కానీ, త్వరలోనే ఆ ఊపు ప్రతీ ఆదివాసి గ్రామానికి ఊపిరినిస్తుందని
ఆశిద్దాం. వీరికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడమో లేదా కేంద్ర పాలితంగానో
ప్రకటించమో చేయ వచ్చనే కొందరు మేధావులు చేస్తున్న ప్రతిపాదనకు వారి
జనాభా, దాని కేంద్రీకరణ , వారి అనేక భాషలూ , వివక్షలూ కొన్ని తెగల అనాగరికత,
కొన్నింటి పట్టణీకరణ లాంటి అంశాలు అనుకూలించవు . రాజ్యాంగంలోని చట్టాలను
చిత్తసుద్ధితో అమలు పరిస్తేనే వారికి రావాల్సినవీ వస్తాయ్ , వారికి
చెందాల్సినవి చెండుతాయ్. ఈ దేశ మూల్నివాసుల సంస్కృతీ సంప్రదాయాలను
నిలబెడతాయి. అప్పుడే ఈ “గురి” కధలనబడే జీవన వ్యధలకు పరిష్కారం లభించినట్టు.
ఇక విమర్శించాల్సి వస్తే కధలన్నీ ఒకే మూసలో సాగినట్లు అనిపిస్తాయి.
ఇతివృత్తాల్లో వైవిధ్యం ఉన్నా కధనాలన్నీ దాదాపు ఒకేలా సాగుతాయ్. ఒకటి
రెండు “గత వర్తమానం” లాంటి కధలు తప్ప. కవిత్వం పాలు విషయంలో కాస్త జాగ్రత్త
తీసుకోవాలి. లేకుంటే కధ యొక్క సీరియస్ నెస్ ను మింగేసే అవకాశం ఉంది.
అనుభవంతో వీటన్నిటినీ అధిగమించే విజ్ఞత ఉన్నవాడు కాబట్టి సమస్యలేదు.
“మైల్స్ టు వాక్ , బిఫోర్ ఐ స్లీప్ ....” అని రాబర్ట్ ఫ్రాస్ట్ అన్నట్లు ఈ
కధలద్వారా ఒక బృహత్తర బాధ్యతను తన నెత్తిన వేసుకున్నట్లు అంగీకరిస్తాడు,
ప్రకటిస్తాడు కూడా...                               డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (12-11-18)



published in Sahitya prasthanam, monthly  magazine december issue
a review article on Mallipuram Jagdish's short stories anthology "Guri"

No comments:

Post a Comment