ఎవరికోసమో తెలియకపోయినా వాళ్ళు కోల్పోయినదేమిటో
కనీసం నీ ఊహకు అంద గలిగితే చాలు
ఎక్కడ ఉండాల్సిన అక్కడ లేవని అర్ధం అవుతుంది
ఎప్పుడూ ఎండ వర్షించే జీవితాలు చిగురించే ప్రశ్నే లేదు
ఎండిన గాయాలతో బీడుపడ్డ మనసును కూడ దీసుకుని
పావలాకో పదికో నిండుగా దీవించడమే వారికి తెలుసు.
ప్లాస్టిక్ పూవుల్లా ఆ జీవితాలు వాడవు వికసించవు
నివురు గప్పిన రౌరవాగ్ని గుండానికి నిర్వచనంలా
ఆ మానవ శోకాల రంగుల పెదాల మీద ముతక నవ్వు
తరచూ మనకు తారాస పడుతూ ఉంటుంది
కూడళ్ళలో మనం కళ్ళు త్రిప్పుకున్నప్పుడు
ఆ కళ్ళు మనల్ని అదే పనిగా ప్రశ్నించడం
అలాగే క్షమించడం కూడా మనమెప్పుడైనా గమనించామా ?
చీరలు కట్టి చీకట్లో కాంతి లేని కళ్ళు చిగురు బోణీల కోసం
చిటికలేస్తూ మాయమై మెరుస్తూ ఉంటే
ఆ జీవంలేని కావరాల సంచారం మధ్య
ముందైనా వెనుకైనా ముప్పేనని తెలియక మిణుగురు పురుగుల్లా
కృత్రిమ సింగారాల చుట్టూ బొంగరాల్లా మానవ కీటకాలు,
ఇద్దరూ నేటి మానవ దుఖానికి ప్రతీకలని మనమెప్పుడైనా ఊహించామా ?
మదం పూనో మారెమ్మ పూనో కాదని తెలుసా?
మనసు అదుపు లేక మమత కొరత పోగా
మగాడిగా బ్రతకు లేక బ్రతుకలేక వేసిన ఆ లంగా వోణీ
చీకటినీ , చీప్ సాంపిల్నీ ఒకేలా ప్రేమిస్తుంది
చిన్నప్పుడు అమ్మ నాన్నలను ప్రేమించినట్టు.
చెల్లీ అని పిలిస్తే తల్లడిల్లిపోయి బుగ్గలు తడిమేసే
తృతీయ ప్రకృతి పరిమళాలు జీర తప్ప గొంతే లేనోళ్ళు
గుండె కూడా లేనోళ్ళను బావా అని పిలుస్తారు
అలంకారాలే తప్పసంస్కారం లేనోళ్ళ ను అక్కా అని పిలుస్తారు
వాళ్ళ జీవించే హక్కులతో సైతం స్వేచ్చా వ్యాపారం చేసే
సామ్యవాద సోషలిస్టు దేశాల రివల్యూషనరీలు
ఎండమావుల్లో పెన్షన్ల గులాబీలు పూయిస్తారట
థర్డ్ ఎస్టేట్ లో థర్డ్ క్లాస్ శోక నిలయాలవి
ఫోర్త్ ఎస్టేట్ లో పేరాకు కు కూడా నోచుకోని టాయిలెట్ పేపెర్లవి
పెళ్లి మంత్రాలో తద్దిన మంత్రాలో తెలియని పాలకుల పధకాలు
వాళ్ళ ఆకలిని తీరుస్తాయేమో గానీ ఆత్మగౌరవాన్నిస్తాయా
చదువులూ ఉద్యోగాలే బానిస సంకెళ్ళను ఛేధిస్తాయ్.
published in 2017 vizagfest poetry year book
No comments:
Post a Comment