Saturday, 1 June 2019

ప్రణయం



ప్రాణం కన్నా మానం కన్నా కులమే ముఖ్యమనుకునే మానవ మృగాల సమాజం లో ప్రేమకు చిరునామాగా నిలిచిన  వారందరికీ అంకితం . పరువు హత్యలను ఖండిద్దాం ,మానవతను కాపాడుదాం !!



 మానవ సమాజ వినాశనానికి ఒక ఖూనీ కోరు
అహాన్ని అమాయకపు ముసుగుగా కప్పుకుని బయలుదేరాడు
వాడితో కుల అహంకారపు హీనమైన బ్రతుకొకటి నడిరోడ్డుకెక్కింది
కడుపు తీపి వంకతో మరొక కడుపు కోయమని
కిరాయిల కసాయి కత్తులకు కనికరం లేకుండా పురమాయించిది.
మనం కలలను మాత్రమే కనగలం అంత వరకే, సుపారీ ఇచ్చి
మనవి కాని కలలను సొంతం చేసుకోవాలనుకోవడం నిరంకుశత్వమే
డబ్బే హక్కు ,కులమే దిక్కనుకుని
తనకు అన్నీ కావాల్సిన బిడ్డకు అడ్డంగా ఆమె భర్తనే బలిచ్చాడు
ప్రేమను పరువు పేరుతో మనువుకు తాకట్టు పెట్టాడు
స్వేచ్చాలోకంలో ఒకరి జీవితాశను మరొకరు హరించడం ఉన్మాదమే.
దేవుని వారసులమనుకునే పరాన్నభుక్కుల కక్కుర్తి ,
దేశం పరువు తీసే పాచి పాటే కదా! ఈ కంపుగొట్టు కులం
హంతకులను సైతం నిర్దోషులుగా ప్రకటించే గాడ్సే వారసులు
గాంధీ తమ వాడను చెప్పుకునే కుల హింసా వాదుల రాజ్యంలో
ఏ కన్నీళ్ళు వీరిని కరిగించగలవు?, పాపాలను కడిగేయ గలవు?,
అయినా మనిషి విలువ ఏమిటో వీరికి తెలియాలి కదా!
ఎవరి కడుపు శోషా అయినా ఈ బనియాలకు బలాదూరే ,
కరుణ వారి ప్రధాన శత్రువు కదా !
ఈ ఆధునిక మనువుల కావరానికి కపటత్వం గొప్ప ఆభరణం
ప్రేమనిచ్చిన ప్రేమ చచ్చునని ప్రకటించే అమృత తండ్రులలూ !,
వినండి.. కూలి కనుబొమల అంచుల నుండీ కారిన చమటతో
అల్లారుగా ముద్దుగా పెరిగినవాడు ప్రణయుడు కాక ఎమౌతాడు?

వినయం విశ్వాసానికి బీజ వేస్తే కులాంతరాన్ని వోర్వలేనితనం కాటేసింది
మానాన్నీ ప్రాణాన్నీ ప్రేమించలేని మలిన పడ్డ ఆర్య కులోన్మాదీ !!
నరకు, నరికే కొద్దీ ప్రేమిస్తాను . చంపు , చంపే కొద్దీ క్షమిస్తాను ,
కోర్టులన్నీ మీ చుట్టాలేనని తెలియనిదెవ్వరికి ?
అవి తీర్పునిస్తాయేమో గానీ, న్యాయాన్ని ఎప్పటికీ ఇవ్వలేవు.
తల్లి పాలు త్రాగినోడి వైతే ముసుగులోంచి బయటకు, రా!
మానవీయతంటే ఏంటో రుచి చూపిస్తాను
ఆ కులం కళ్ళ జోడు తీసి ప్రేమించు చూడు
ప్రాణం తీయడం కాదు ఇవ్వడంలో ఉన్న మజాని నిరూపిస్తాను ....


డాక్టర్ మాటూరి శ్రీనివాస్(05-10-18)

No comments:

Post a Comment