Saturday, 1 June 2019

అడవి రంగి - లంబసింగి



                       లంబసింగి
                                                 
ఆకాశ పల్లకిలో మంచుపూల నద్దుకుని
శిశిరం వన వాసానికొచ్చినట్లుందక్కడ  
హిమగిరి సొగసులే మల్లెల తెరచాపలతో జట్లు జట్లుగా
అవనీతల విహారానికొచ్చి నట్లుందక్కడ
భూమ్యాకాశాలను జమిలిగా సీతలాన్ని సింగారించుకున్నాయి  
మన్యానికి మొక్కుతూ మర్మ ధూపాలతో  
సృజన సృష్టికి సమస్తం  దాసోహమన్నట్లుందక్కడ
అదొక ఎంతకీ తనివి తీరని రజనీ జల సువాసనల తెల్ల సంపెంగి
పరువాల పచ్చల  వజ్రాంగి, గిలిగింతల భంగి  లంబ సింగి
  
బారులు తీరిన చెట్లను మంచు గుబ్బలి గుప్పెట్లో  దాచేస్తుంటే
 కొండలను మంచుగాలపు గుండెలు అమాంతం  దోచేస్తుంటే  
ప్రస్తుత ప్రక్రుతి ఋతువుల పోటీలో ప్రధమ బహుమతి నీదే,  
అల్లరి మనసులను చల్లని తుషార గాలితో కప్పేస్తున్న  తాజంగీ!
 తిమ్మిరెక్కిస్తూ వాయిస్తున్నావు చలితో ఎద అదిరేలా సారంగీ .
నీ రుతురాగాలకు  అన్ని వయసులూ సలాము చేస్తున్నాయ్
నీ చెంతనే చేరి సుప్రభాతాలకు స్వగతాలు చెపుతున్నాయి.

కానీ , ఆ మోజే  స్వచ్చతనూ సంయమనాన్ని తాకట్టు పెడుతుందే    
నిలువునా దహించేస్తూ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ ఉందే
నువ్వు నీ వొడిలో లాలించినవారే భాద్యతారాహిత్యులౌతున్నారు
నిన్ను ప్రేమిస్తున్నవారే నిన్ను నిలువునా కరిగించేస్తున్నారు  
మోహించి ఎందఱో నిలువెల్లా తరిగించి తరలించేస్తున్నారు  
 కాపాడుకోలేని అసమర్ధత మాయపొరలను మాటుగా కప్పి  
మంచు తెరలను గుత్తంగా చుట్టేసి కొండల్లెక్కన వేలం వేసేస్తుంది  
సరదాలు శృతి మించి  అడుగుకొక బూడిద మడుగును సృష్టిస్తున్నాయి    
పర్యాటన పేర డబ్బు మంటల చిట పటలలో
నునులేత పరిసరాలు, పసరికల ఆర్తనాదాలూ ఆవిరులైపోతున్నాయి

ఇప్పుడక్కడ ఆకలి ప్రేగులే ఎరువులుగా ఎదుగుతున్నయి  ఆపిల్ తోపులూ
అడవి రక్తాన్ని పీల్చేస్తూ ఎర్రదనాన్ని నేలపై
కుమ్మరించుకుంటున్నాయి  స్ట్రాబెర్రీ తోటలూ
అస్త్ర సన్యాసం చేసిన బృహన్నలను గుర్తు చేస్తూ నువ్వు
పరిశోధనల పేరుతో  డ్రాగాన్ పళ్ళతో వాళ్ళు
అందాలకు రంగుల అర్చిడ్లతో అరదండా లేస్తూ బహుళ నీతి
నిర్భీతిగా చేస్తున్న కుహనా హరిత విప్లవం
 మాన్యలపై  విచ్చలవిడి సామూహిక  మానభంగం   
ఫుడ్ కార్ట్లూ, బహిరంగ బలాదూర్ మద్య జూద విన్యాసాలూ
నీవిప్పుడు చీకటిలో చిందులేస్తున్న లాస్వేగాస్లా ఉన్నావ్ , లంబసింగి 

నీ దైన్యానికి పట్టిన మాలిన్యాన్నిమట్టుబెట్టాలని ఉంది  
మరొక మావోనో  , మళ్ళీ  బిర్సాముండానో  రావాలేమో
మల్లు గంటన్న దొరలు తిరిగి విల్లు ఎక్కుపెట్టాలేమో  
నిను నిన్నుగా నీవు నిలుపు కోవడానికి, ఇక   
మబ్బులు  వీడి  పచ్చదనం నీలాకాశంతో జట్టుకట్టాలేమో ,
తూరుపు సూర్యోదయాన్ని నీ మదిలో నీవే ఎగరేసుకోవాలేమో ....
 డాక్టర్ మాటూరి శ్రీనివాస్ ,9849000037
...........................................


  మంచు కురిసే వేళ లంబసింగి అందాలను, అత్యల్ప ఉష్ణోగ్రతల అస్వాదిద్దామని వెళితే అక్కడ పరిస్తితికి మనసు చెదిరిపోయింది. ఒకప్రక్క కబ్జాల పరాకాష్ట లో మరొక ప్రక్క పర్యాటకుల ఉన్మాద విన్యాసాలు  మన్యం చిదిగిపోతుంది. 
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
విశాఖపట్నం 
ఫోన్;  9849000037
…………………………………………………………………………………………………………………………………………………………
 

No comments:

Post a Comment