Saturday, 1 June 2019

కుట్ర మించిన కుట్ర


            పూనే దగ్గర ఉన్న భీమా నది కడ్డున ఉన్న ఆగ్రామం  కోరేగాం , దాన్నే భీమా కోరేగాం అంటారు. 

(దీని  చరిత్ర చదివిన వారికి ఈ వ్యాసం సులభంగా అర్ధం అవుతుంది. 200 ఏళ్ల క్రితం బాజీ రావు 2 కు బ్రిటీష్ కు మధ్య  జరిగిన యుద్ధం  మహర్ల పరాక్రమానికి ఉదాహరమనగా నిలిచింది. తర్వాత కాలంలో ఆ సంఘటన ను వెలుగు లోనికి తెచ్చినవారు డాక్టర్ అంబేద్కర్ . మహర్ల సైన్యం బ్రిటీష్ తరపున పోరాడాల్సిన అవసరం ఏమిటి? )




          నక్కకీ నాగలోగానికీ ముడి వేయడం అంటే ఏమిటో? బిజెపి పాలకుల కుచ్చితాలు గమనిస్తే తెలుస్తుంది. ఏ సంబంధమూ లేని రెండు సంఘటనలను ఏకంచేసి మరెటువంటి ఆధారాలను చూపకుండా ఒకే దెబ్బకు రెండు లాభాలుపొందే కొత్త కుట్రకు తెరలేపింది, బి జే పి  రాజకీయం. ఈ ఏడాది జనవరి ఒకటవ తారీఖున భీమకోరేగాం లో జరిగిన దళిత బహుజన మహా జనసమీకరణ అగ్రకులాల్లో, అరెస్ఎస్స్ కేడర్ లో ఏ స్థాయిలో గుబులు పుట్టించినదో గత మూడు రోజులలో దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలు చెపుతున్నాయి. దళితులు(ఈ పదాన్ని రాజ్యాంగ బద్దంగానూ, ప్రభుత్వ ఉత్తర్వులలోనూ, నోటీసుల్లోనూ వాడకూడదని ఈ మధ్య కొన్ని రాష్ట్ర హై కోర్టులు తీర్పునిచ్చాయి. గతంలోఒక  G.0.కూడా వచ్చింది.ఇది మరొక చర్చ. అయితే ఇతరత్రా ఈ సంస్కృత పదాన్ని నిచ్చింత గా వాడుకోవచ్చు) మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకుని తిరగాల్సిరావడం లాంటి  అత్యంత  దౌర్భాగ్య కాలం ఈ దేశం లో ఒకటుండుంది.  చరిత్రలోకి  వెళితే రెండువందల ఏళ్ల క్రితం బ్రిటీష్ పాలకులకు పీష్వాలకూ జరిగిన ఆధిపత్యపు పోరులో పీష్వాలు చిత్తు అయ్యారు. పీష్వా రాజ్యం అంతమైంది. అది జరిగింది 1818లో . వారిని వోడించింది కేవలం బ్రిటీష్ వారైతే ఇప్పటివారికి సమస్య లేదు. కానీ బ్రిటీష్ తరపున యుద్ధం చేసి పీశ్వాలను వోడించింది మహర్లు. మహారాష్ట్రలో మహార్లు దళితులు. ఆ గెలుపు కు కారణం వీరే.  అదెలా అంటే  ఐదు వందల మంది మహార్ సేన సుమారు పాతిక వేల పీష్వా సైన్యాన్ని మట్టికరిపించారు. మహార్లు (అంటరానివారు) బ్రిటీష్ కి  మద్దతు ఇవ్వడానికి  వెనుక ఒక తీవ్ర మనస్తాపం ఉంది. మద్దతు ఇచ్చే ముందు పీష్వా రాజు బాజీ రావు ను సంప్రదించారు. “మేమూ భారతీయులమే మేము మీ సైన్యంలో చేరుతాం. బ్రిటీష్ ని వోడిద్దాం. మాకు ఈ దాస్య విముక్తి కలిగించండి , కనీస మానవ హక్కులివ్వండి, స్వేచ్చగా బ్రతకనివ్వండని”  ప్రాధేయపడ్డారు. బాజీరావు, తనకు మనుధర్మ శాస్త్రమే శిరోధార్యమనీ మీరు ఏ హక్కులకూ అర్హులు కారని, ఒకవేళ మీరు మద్దతు ఇచ్చినా, మేము గెలిచినా మీ జీవనవిధానం మార్చేది లేదని,మీరేప్పత్కీ దాస్యులే అని  ఖరాఖండి గా చెప్పాడు. దళితులను  బాజీరావు  మాటలు ఎంతగా  బాధించాయంటే 24 గంటలు  తిండి లేకపోయినా రాత్రంతా నడిచి భీమా నది వొడ్డున ఉన్న కోరేగాం చేరుకొని పీష్వా సైన్యాన్ని వోడించి బ్రిటీష్ కు గెలుపునిచ్చారు. ఇదొక అత్యంత విలువైన ఆత్మగౌరవ యుద్ధంగా దళితులూ భావిస్తారు. ఆ యుద్దమే భారతదేశంలో పీష్వా సామ్రాజ్యానికి తుది గీతం పాడింది. దళితులకు కనీస హక్కులు లభించాయి. భీమా కోరేగాం  యుద్ధం బ్రిటీష్ వారి గెలుపు కంటే దళితుల స్వాభిమాన ఉద్యమ విజయంగా చరిత్రకారులు చూస్తారు. ఆ  సందర్భాన్ని వందేళ్ళ క్రితం అంటే 1918లో డాక్టర్ అంబేద్కర్  వెలుగులోనికి తెచ్చారు.తన రచనల్లో నమోదు చేసారు. ప్రతీ సంవత్సరం డాక్టర్ అంబేద్కర్ ఆ ప్రదేశాన్ని  సందర్శించడం మొదలు పెట్టారు. అంతే కాకుండా బ్రిటీష్ వారికి మహర్ల త్యాగాన్ని గుర్తు చేస్తూ అక్కడ బ్రిటీష్ వారిచేతే ఒక స్మారక స్తూపాన్ని నిర్మింపచేసి అమరులైన మహర్ల పేర్లను ఆ స్తూపం మీద చెక్కించారు. అప్పటినుండీ ప్రతీ సంవత్సరం జనవరి ఒకటవ తేదీకి దేశం నలుమూలలనుండీ లక్షల సంఖ్యలో దళితులక్కడికి చేరుతారు. ఏ  పత్రిక ఈ వార్త రాయరు,అది వేరే విషయం. అయితే 2018 జనవరి ఒకటిన ఎప్పటిలాగే రెండు  వందల ఏళ్ల ఆత్మగౌరవ విజయానికి ప్రతీకగా లక్షల సంఖ్యలో దళితులూ అక్కడికి చేరారు. ఆ స్తూపం ఉన్న ప్రాంతాన్ని పూనే లోని  శనివార వాడ అంటారు. అది ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలు విరివిగా జరిగే ప్రాంతం. లక్షల్లో దళితులూ అక్కడికి చేరుతారని ముందే సమాచారం ప్రభుత్వానికి పోలీసులకీ ఉంది .ప్రతీ ఏడూ జరిగేదే అనీ తెలుసు. కానీ రెండువందల ఏళ్ళుగా కులోన్మాదం తోనూ అవమానభారంతోనూ ఉడికిపోతున్న మతవాదులు అక్కడ అల్లర్లు సృష్టించడానికి తెగబడ్డారు. దళితులూ కూడా ప్రతిఘటించారు. నాటి వీడియొలను గమనిస్తే నీలి జెండాలను బౌద్ధ జెండాలను ధ్వంసం చేస్తున్న అల్లరి మూకలు మనకు కనబడతాయి. పోలీసులు వాళ్లకి సహకరించడమూ కొన్ని వీడియోల్లో చూసాం. ఒక యువకుడిని బలితీసుకున్నాయి కూడా. వీటివెనుక ఉన్నది, ఇద్దరు అర్  ఎస్ ఎస్ సీనియర్ కార్యకర్తలు. వారే శంభాజీ భేడే ,మిలింద్ ఎక్బోటే లు. శంభాజీ ని అందరూ గురూజీ అని పిలుస్తారు. నరేంద్ర మోడీ కి సన్నిహితునిగా అందరికీ పరిచితుడు . మోదీగారికి గురువు అని కూడా అంటారు. యితడు అల్లర్లకు ప్రధాన కారకుడు. ఇది నిర్దారణ చేసింది కూడా పూనే పోలీసులే. ఇప్పటికే అతడి మీద అనేక మతోన్మాద కేసులు కూడా ఉన్నాయి. అతనికి సహకరించింది మిలింద్ ఏక్ బోటే. వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. ఈ కేసు విషయంలో పూనే  పోలీసులు రెండు వర్గాలైపోయాయి. రూరల్ పోలీసులు ఈ  పై విషయం మీద దర్యాప్తు చేస్తున్నట్లు చెపుతున్నారు. దీన్ని ప్రక్కన పెట్టి పూనే  అర్బన్ పోలీసులు తాజాగా ఐదుగురు సామాజిక కార్యకర్తలను ఎటువంటి ముందస్తు సూచనలు , ప్రకటనలూ, ఆరోపణలూ లేకుండా సోదాలు నిర్వహించి వారి ఫోనులూ పెన్ డ్రైవ్ లూ, ఫేస్ బుక్ అకౌంట్లు, ఇతర పాస్ వర్డ్ లూ బలవంతంగా స్వాధీనం చేసుకుని  అరెస్టు చేయడం తో మొత్తం కధ మలుపు తిరిగింది. ఆ ఐదుగురు విద్యాధికులు,ఆలోచనాపరులు, సామాజిక కార్యకర్తలు.  వీరిలో విరసం ప్రధాన కార్యకర్త వరవరరావు కూడా ఉన్నారు.అంతకు మించి వీరంతా  దళిత బహుజన ఉద్యమ సానుభూతిపరులు. దశాబ్దాలుగా ఆదివాసి హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేస్తున్నవారు. వీరి మీద గతంలో ఎన్నో అభియోగాలున్నాయి. ప్రజాహక్కులకోసం జైళ్లకు వెళ్ళిన సందర్భాలున్నాయి. వీరిపై ప్రస్తుతం ఆరోపిస్తున్న  నేరాలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే? దళితులకు సంఘీభావం ప్రకటిస్తూ ఎల్గార్ పరిషత్ అలాగే కబీర్ కాల మంచ్ తదితరులు ఇచ్చిన పిలుపు మేరకు వారు ఛలో భీమాకోరేగాం కు వీరు  మద్దతు ఇచ్చారు. వీరినే ఇప్పుడు  భీమా కోరేగాం సంఘటనకు, అల్లర్లకు కారణం గా చూపుతున్నారు పూనే పోలీసులు . ఇది అత్యంత  హేయమైన అభియోగం. దీనికి జతగా వీరిని ప్రధాన మంత్రి హత్యకు కుట్రదారులుగా అభియోగం మోపి అరెస్టులు చేసారు. దీనికి మావోలతో సంబంధం ఉందంటూ ఒక  లేఖను ఆధారంగా చెపుతున్నారు.  మహారాష్ట్ర పోలీసులు చూపిస్తున్న సాకు ఏమిటంటే  వీళ్ళందరికీ మావోఇస్టులతో సంబంధాలున్నాయన్నది . అంటే భీమా కోరేగాం సంఘటన మావోఇస్టుల  కుట్ర గానూ, వీరంతా ఆ కుట్ర కు కారకులుగానూ చిత్రిస్తుందన్నమాట. భీమా కోరేగాం సంఘటనకు సూత్రధారులైన శంభాజీ గురునీ , మిలింద్ ఏక్ బోటే లను తప్పించి దళిత సానుభూతిపరులైన వీరిని ముద్దాయిలుగా చిత్రించడం ఒక కుట్ర అయితే, మొత్తం వ్యవహారాన్ని భీమా కోరేగామ్ తో  ముడిపెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా గాయపరిచి మానసికంగా దేబ్బతీయాలనేది మరొక కుట్ర. భీమాకోరేగాం సంఘటనలో ముద్దాయిలు వేరు. ప్రధాని హత్య కుట్రదారులు వేరు. (అసలు కుట్ర జరిగినట్లు ఏ ఆధారాలు ఇప్పటివరకు లేవు.ఇది పోలీసుల లేదా ఆరెసెస్ సృష్టి అనే వాదన కూడా ఉంది.) అరెస్టు అయినవారి కంప్యుటర్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిద్వారా తప్పుడు ఆధారాలను సృష్టించరని భరోసా లేదు. అరెస్టు అయినవారు కూడా ఇదే ఈ అనుమానాన్ని వెలబుచ్చారు. మావోయిస్టుల అజెండా ఏదైనా కావచ్చు, వీరికి వారితో సంబందాలున్డవచ్చు. ఎందఱో దేశ ద్రోహులతో ఉదా;నీరవ్ మోడీ, అర్ఎసేస్ గూండలైన శంభాజీ తో మోడీ గారికీ సంబందాలున్నాయి .  కానీ అరెస్టులు అప్రజాస్వామ్వికం. యావత్ అరెస్టులనూ, ప్రధాని హత్యాయత్నాన్ని,  భీమా కోరేగాం సంఘటనను మావోల కుట్రగా చూపడం కేవల ఆరెసెస్ కార్యకర్తలైన వారిని రక్షించాడంకోసమే అనేది తేట తెల్లమౌతుంది. పత్రికలూ మీడియా కూడా మొత్తం వ్యవహారాన్ని భీమా కోరేగాంతో సంధానం చేయడం అత్యంత  నీతి  మాలిన పని. మొత్తం  వ్యవహారాన్ని భీమా కోరేగాం ఉదంతంగా  ప్రకటించడంలోనే వీరి దుర్మార్గం బయటపడుతుంది. దీని  వలన అర్ధం అవుతున్నదేమిటి అంటే? ప్రభుత్వం ,మతవాద సంస్థలూ , కులవాదులూ దళితుల ఉద్యమ ఊపునూ  ఐక్యతనూ సహించలేక పోతున్నాయని తెలుస్తుంది. జనవరి ఒకటిన జరిగిన అల్లర్లుకు నిరసనగా ఏప్రిల్ ఒకటిన భారత్ బంద్ కు  దళితులూ పిలుపునిచ్చారు. దేశం స్తంభించింది, 11 మరణించారు, ప్రపంచం నివ్వెరపోయింది. మతవాదులు ఉలిక్కిపడ్డారు. మళ్ళీ ఇవి పునరావృత మౌతాయేమోనని,వారి మూలాలు కడులుతాఎమోననీ  భయం తో  పధకం ప్రకారం వ్యవహారం నడిపారు. అరెస్టులు చేసారు. సుప్రీం కోర్ట్ , జాతీయ మానవహక్కుల సంస్థ జోక్యం చేసుకుని అరెస్టులను ప్రస్నించాయి. అరెస్టులను హౌస్ అరెస్తులుగా మార్చి విచారణ జరపమని అదేశించాయి . ఈ విషయం వలన ప్రభుత్వానిది ఏక పక్ష చర్యగా బోధపడుతుంది .నిజంగానే వీళ్ళు ప్రధాని హత్యకు కుట్ర పన్నితే అది దేశ ద్రోహమే. నిరూపించాల్సిన బాధ్యతా పూనే పోలీసులదే. కానీ మరొక అంశానికి ముడిపెట్టడం కొత్త కధలను అల్లడం పురాణాలకాలం నుండీ వీళ్ళకు అలవాటే. గమనించాల్సిన దేమిటంటే  పాలకులు ఇప్పటికీ గత నాలుగేళ్ల లో హిందూ సనాతన సంస్థలు లెక్కకు మించి చేసిన అత్యాచారాలపై , హత్యలపై, హక్కుల ఉల్లంఘన పై, రాజ్యాంగాన్ని అవమానించడంపై, హిందూ కోర్టులు నిర్వాహణ పై నోరు విప్పకపోవడం దేశాన్ని ఫాసిజపు పాలనవైపు, ఎమెర్జెన్సి వైపు నెట్టడమే. రానున్న రాజకీయ పరిణామాలకు భయపడి ఆరెసెస్ ఒక బృహత్తరమైన పధకానికి తెరతీయబోతున్న సంకేతాలు కనబడుతున్నాయి. దళితుల పోరాట స్పూర్తిని నిర్వీర్యం చేస్తూ భీమా కోరేగాం నెపంతో బహుజనులను మానసికంగా బలహీనపరచి విడగొట్టి దళిత  రాజకీయా శక్తి  అడ్డుపడాలని కావచ్చు. లేదా గాంధీ  హత్య  రీతిలో మరేదైనా చేసి దాన్ని మావోల మీదకి నెట్టే ప్రయత్నమో కావొచ్చు. లేదా మోడీని తప్పించేందుకు సనాతన సంస్థలు ఎన్నుకుంటున్న మార్గమో ,ఏమో కాలమే చెప్పాలి. ఏదేమైనా జరుగుతున్నా పరిణామాలు మాత్రం దేశానికి మేలు చేయవని తెలుస్తుంది. అప్పుడు ఆమె ఎమెర్జెన్సీ ప్రకటించి అమలు చేస్తే ఇప్పుడు ఇతగాడు అప్రకటితం గానే అమలులో పెట్టినట్టు ఉంది.                                                                                                             డాక్టర్ మాటూరి శ్రీనివాస్

No comments:

Post a Comment