Friday, 10 April 2020

ఎంతసక్కగున్నాదే ....।

ఎంతసక్కగున్నాదే ....।

చైనా మార్కెట్టు లో తయారైవచ్చింది
ఎంత సక్కగున్నాదే
కరోన ఎంతసక్కగున్నాదే

సిగలో మొగలెట్టి 
దేశాలు దాటొచ్చి
మహారాణి దిగింది
ఎంత సక్కగున్నాదే
కరోన ఎంత సక్కగున్నాదే

మతము లేదు నీకు, మందు లేదు గాని
సందు సందు తిరిగి సందడి చేసింది
ఎంత సక్కగున్నాదే
కరోన ఎంత సక్కగున్నాదే

గబ్బిలాల గబ్బు ,అరగదీసిన సబ్బు 
అంటుకుంటే జబ్బు 
వదలకుందే మబ్బు 
ఎంత సక్కగున్నాదే
కరోన ఎంత సక్కగున్నాదే

మూతి మూసుకున్న 
ముడుచుకు కూకున్న
మూల మూలనుంచి
నక్కి నక్కి వచ్చి నకరాలు చేస్తుంది
ఎంత సక్కగున్నాదే
కరోన ఎంత సక్కగున్నాదే

చప్పట్లు కొట్టిన లైట్లన్ని ఆర్పిన
తుమ్ము తుమ్మినానంటే
తుస్సు మంటారు
ఎంత సక్కగున్నాదే
కరోన ఎంత సక్కగున్నాదే

లుక్ అవుట్ కోసం లాక్ అవుట్ చేసాము
టిక్కు టాక్ లోని జోకులే వేసాము
మడుసులదరము
దూరం దూరం మంటూ
దులిపి కూకున్నాము
ఎంత సక్కగున్నాదే
కరోన ఎంత సక్కగున్నాదే

చేసిన తప్పుచాలు
ఒప్పుకుంటున్నాము
చేసిందంత చాలు
బయలుదేరితే మేలు
ఎంతసక్కగున్నాదే
కరోన ఎంతసక్కగునినాదే

                  డా. మాటూరి శ్రీనివాస్

మంట

నీ అసంటపు ఆధిపైత్యపు మురికి కుంటలో 
నన్నెప్పుడో బానిస బందీని చేసావ్
నిన్న నోట్ బందీని
నేడు ఘర్ బందీని 
మరోమాటలో రోడ్డున పడ్డ చావుకేకని నేను .
నీ దైన శైలి లో అనాదిగా పొదుగుతూనే ఉన్నావ్ సామాజిక దూరాన్ని
నాగు పాములు గుడ్లను పొదిగనట్లు
పెంచుతూనే ఉన్నావ్ అసమానతల భారాన్ని ఖండాంతరాలని
ఇప్పుడు నీ ఆకృత్యాల పాప కార్యంతో 
నా కూలికీ ఆకలికీ తాళం బిగించి
కూటికీ గూడుకీ అపరిచితులను చేసావ్
అయిన వాళ్లకు చార్టెడ్ ఫ్లైట్లు
ఆక్రందన వినబడకూడదని
గొడ్ల చావిడ్లు
మౌనం , నిశ్సబ్దం ఏ ఉత్పాతానికి 
సంకేతాలో తెలుసే ఈ విరగబాటా?!
కొవ్వొత్తులతో పోయేవ కావు మా చీకట్లు
నీ కొవ్వుతో చలి కాచుకోవాలి.
        
డా మాటూరి శ్రీనివాస్
7-7-20

ఎవరి గోల వారిది

ఎవరి గోల వారిది
———————

నాగరాజు కోపంతో ఊగిపోతున్నాడు. అతడు కోపానికి సహేతుకమైన కారణం ఉంది. ఈశ్వర్రావు , అతని కుటుంబం ప్రతీ సంవత్సరం ఇదే మాదిరి గా ఇదే రోజు కొత్త బట్టలేసుకుని హడావుడిగా వచ్చి నాగరాజు శుభ్రంగా మట్టి పేర్చిన ఇంటి పరిసరాలను చిందరవందర చేసి తనను తన కుటుంబాన్ని భయభ్రాంతులను చేసి హింసిస్తున్నారు వెళ్లి పోతున్నారు.
        ఈ హింసను నిలువరించడం చేత కాక ,చెప్పుకునేందుకు దిక్కు లేక , నిలువెల్లా భయంతో ప్రాణాలను పొట్ట కింద పెట్టుకునే ఏదో మూలన నక్కి ఆ రోజంత గడిపి మర్నాటికి ఇల్లు చేరి ఎవరి కంటా పడకుండా మళ్లీ జీవనయానం సాగించడం రోజురోజుకీ దుర్భరం అయిపోతుంది, నాగరాజుకు.
        జీవించడం జీవించనీయడమనే మౌళిక సూత్రాన్ని వీరు ఎప్పుడు గ్రహిస్తారో కదా?! అనేది నాగరాజు డౌటు. నిజమే నీ భక్తి. , నీ ఆధ్యాత్మికత, నీ నమ్మకం అనేవి నీ ప్రాధమిక హక్కులు, ఎవ్వరూ కాదనరు. మరి ఇదే భూమి మీద నివసిస్తున్న మాకు కూడా అవి వర్తిస్తాయి కదా?! అనేది, నాగరాజు ప్రశ్న. పైగా ఎవరివో నమ్మకాలకు మేమెందుక బలౌవ్వాలనేది నాగరాజు వేస్తున్న మరొక ప్రశ్న , మూడవది మరీ అంతగా తమ నమ్మకానికి విలు వివ్వాలనుకుంటే వారు తమ తమ నివాసాల్లో కావాలసిన ఏర్పాటులు చేసుకుని పూజలు చేసుకోవాలి కానీ, టపాసులను కాల్చుకోవాలి, అంతే కానీ ఇలా తన ఇంటి ముందు ఇలా చేయడం ఏమి న్యాయం ? 
నిజమే ,! నాగరాజు వాదనలో వాస్తవం లేక పోలేదు. మన పూజలూ, మన పండగలూ, మన నమ్మకాలూ మనవిగా ఉంచుకుంటూ, మన ఇళ్లల్లోనే జరుపుకుంటే ఎవరికీ పెద్దగా ఇబ్బంది ఉండదు.... ప్రక్క ఎక్కడో ఉన్న పుట్ట దగ్గరకెందుకు??ఏమంటారు?? మీ ఇంటి ద్వారం దగ్గర ప్రక్క వీధి వాళ్లు వచ్చి గోల చేస్తూ ఉంటే సహిస్తారా,??
              డా. మాటూరి శ్రీనివాస్
              31-10-19

ఏమి ? ఇవ్వగలం


ఏమి ? ఇవ్వగలం
వాళ్ళు వాళ్ళ కోసమే అయినా కోల్పోయినదేమిటో
తెలిస్తే ఆ వృషణాలక్కడ లేవని అర్ధం అవుతుంది
ఎప్పుడూ ఎండ వర్షించే జీవితాలు చిగురించే ప్రశ్నే లేదు
ఎండిన గాయాలతో బీడుపడ్డ మనసును కూడా దీసుకుని
పావలాకో పదికో  నిండుగా దీవించడమే వారికి తెలుసు.

ప్లాస్టిక్ పూవుల్లా  ఆ జీవితాలు వాడవు వికసించవు
నివురు గప్పిన రౌరవాగ్ని గుండానికి నిర్వచనంలా
ఆ మానవ శోకాల చెరగని నవ్వుని  చూసే ఉంటావు
కూడళ్ళలో నువ్వు కళ్ళు త్రిప్పుకున్నప్పుడు
ఆ కళ్ళు నిన్ను ప్రశ్నించడం నిన్ను క్షమించడం గమనించావా?

చీరలు కట్టి చీకట్లో కాంతి లేని కళ్ళు చిగురు బోణీల కోసం.
ఆ జీవంలేని కావరాల సంచారం మధ్య
ముందైనా వెనుకైనా ముప్పేనని తెలియక మిణుగురు పురుగుల్లా
కృత్రిమ సింగారాల చుట్టూ బొంగరాల్లా మానవ కీటకాలు         
ఇద్దరూ నేటి మానవ దుఖానికి ప్రతీకలని ఊహించావా?
మదం పూనో మారెమ్మ పూనో కాదు
మనసు అదుపు లేక మమత కొరత పోగా
మగాడిగా బతకు లేక వేసిన  ఆ లంగా వోణీ
చీకటినీ చీప్ సాంపిల్ నీ ఒకేలా ప్రేమిస్తుంది
చిన్నప్పుడు అమ్మ నాన్నలను ప్రేమించినట్టు 

చెల్లీ అని పిలిస్తే తల్లడిల్లిపోయి బుగ్గలు తడిమేసే
తృతీయ ప్రకృతి పరిమళాలు  జీర తప్ప గొంతే లేనోళ్ళు
గుండె కూడా లేనోల్లం ఏమివ్వగలం 
వాళ్ళ జీవించే హక్కుని సైతం
\



నిజంగా ...(HAV-LOCK అనుభవం)


                                నిజంగా........

వినీలాకాశము ఎప్పుడూ అంతగా విచ్చుకోవడం నేను చూడలేదు,
ఆ సునీలాల మాటుకు సాగర శిఖరాల్లోకి మెల్లగా వీడ్కోలు చెపుతూ
సప్త వర్ణాలను విశ్లేషిస్తున్న వెలుగు రేడు అందంగా వెన్నెల రాజును స్వాగతిస్తూ
కంటి ముందు అలా ఆహ్లాదంగా అస్తమించడం నేను ఎప్పుడూ చూడలేదు
చంపాల చాటున దాక్కున్న గులాబీ కూడా సిగ్గుతో మొగ్గై పోయింది
తిరిగి బాల్యం లోనికి అమాంతం పరుగు తీయమని సలహా ఇచ్చింది
కన్ను కొట్టి జల్సా చేసుకొమ్మని చిగురు కొమ్మలను భామల్ని  చెంత చేర్చింది.

ఇంతలో అందని అందం ఏదో తెలియ కుండానే అందర్నీ ఆవహించింది
సంతృప్తికి లోటు అందం,  కానీ ఏ లోటూ లేని తృప్తి ని నీవెప్పుడైనా చూసావా?
అన్నీ ఉన్న ఆ ఆనందానికి కమ్మని  బంధానికి సంకెళ్ళను వేస్తే
అవధుల్లేని ఆప్యాయతలు సాగర సంగమంలా పెనవేసుకు పొతే  
సైకత రేణువులు సైతం తీయగా మీటుతూ నిలు వెల్ల గిలిగింతలు పెడుతుంటే
ఆ పెన్నిధిని ఆసాంతం సొంతం చేసుకుని మనసులో బంధించేసి శాశ్వత తాళం వేసేస్తే
ఆ బంధాన్ని  HAVE- LOCK అని కాక ఎవరైనా మరి ఏమంటారు,?

సుదూర తీరాలలో సంబంధంలేని అనుబంధాన్ని సుభద్రంగా శుభప్రదంగా
ఆవిష్కరించుకున్న మా అన్యోన్య అభిమానం ఎంత ప్రయత్నించినా
ఎంతో లోతైన సాగర గాఢత్వానికి కూడా అంచనాకు అందలేదు
నవ్వుల్ని ప్రాణ వాయువులుగా చేసుకుని మాటల మిఠాయిలు పంచుకుంటూ
పూర్ణ చంద్రున్ని అక్కున చేర్చుకుని చేసిన  మైత్రీ ప్రయాణం అవిరామంగా
 దిగంతాల తీరాలకు అనంతాల పార్శ్వాలకు నిత్యం సాగుతూనే ఉంటుంది.
వెన్నెలలోని అలల మిలమిలలు గొంతుల గలగలలతో స్వేద తీరడాన్ని
కాంతులీను కమనీయ ఉషోదయాలను మేల్కొల్పడాన్ని
తేలుతూ తూలుతూ అరుణోదయ వేళ మాంగ్రూవ్ వృక్షాలు
కల్యాణి రాగాలను ఆలపించాడాన్ని నేను ఇక్కడే చూసాను 

యావత్ జలసంపద కూడా ఒక్క కోహినూర్ తో సరి కాదని తెల్సింది
మరి ఎన్నోకోహినూర్లు ఒక్కచోటే  కలిస్తే మరిక అది  భూతల స్వర్గమే కదా!
శ్రీదేవీ వరలక్ష్మీల కటాక్షం తోడై సోగ సిరులు కురిపిస్తూ ఉంటే  
నిరంతర అప్రమత్తతతో  పద్మపాణీ పరోక్ష్యంగా పలకరిస్తూ ప్రత్యక్షంగా  పలవరిస్తుంటే
నిదురరాని  జోల పాటలెన్ని పాడుకున్నానో ఊహించతరమా?
ఇక గతిలేని జోరుగాలి ఈలపాట నావ బాట మాఘ మాసపు
ముసుగులో జో అచ్యుతానంద అంటూ నిదర నటించక  తప్పలేదంటే నమ్మాల్సిందే .
ఉండబట్టలేని  నిండు చందమామ ఒక్కసారి సంభ్ర మాశ్చర్యముతో తొంగి చూసి
భూమి  వెనుక వయ్యారంగా దాగి సూర్యునితో సయ్యాటలాడింది.
ప్రపంచమే ఒక్క చోట చేరినప్పుడు భూమి సూర్య చంద్రులు ఒకే కక్ష్యలోకి
చేరి దోబూచులాడడం వింతేమీ కాదని పించింది నాకు .

కబంధ పురిలో స్వర్గాన్ని తలపించు అనురాధా నగరిలో
భాస్కర సమ్మోహన వీడ్కోలు ఒక ప్రక్క, కలువ రాయుని
చంద్ర తాపపు కుంచె  చిత్రిస్తున్న కౌముదీ హేల మరొక ప్రక్క
జాపోత లేని మా సుజాతకానికి నేనెంత మురిసిపోయానో
మరపురాని పోత పోసిన నవ్వుల విరిజాతకు నేనెప్పుడూ దాసోహమే,
ప్రశాంతతే ఆభరణంగా  అక్కడా ఆ స్నేహావరణానికి గులాము కానిదెవ్వరు?
నల్లని కురుల  కనుసనలలోంచి తడబడుతూ  శైలు కళ్ళు  ఆ అలల
నురుగల్లో విహరిస్తున్న మీనాలతో కలిసి జుగల్బందీ పాడడం కోసం
 పోటీ పడడాన్ని వోడ్డున  లంగారేసుకుని తీరిగ్గా స్వేద తీరుతున్న నావ
అటూ ఇటూ బుర్ర ఊపుతూ గమనించడాన్ని నేను చూస్తున్నాను  
ఆటు పోట్లు అలవోకగా అందరి కాళ్ళను ముద్దాడి అభినందించ డాన్ని
అందరితో కలిసి అంతర్ముఖుడినై నేనూ ధ్యానిస్తున్నాను
ఆ ధ్యానంలో  మైత్రీ భావనను నిస్వార్ధంగా శ్వాసిస్తున్నాను ...
                                                   మాటూరి శ్రీనివాస్. 03-02=18








విశ్వ యాత్ర


విశ్వ యాత్ర

ఆ మెదడు వేసే గణాంకాలకు అతని శరీర కణాలు తట్టుకోలేకపోయాయి
మృత్యువు సైతం వాయిదాలతో వేనుకడుగేయక తప్పలేదు 
అనిత్యాన్ని అసంపూర్ణాన్ని మొత్తంగా అర్ధం చేసుకున్న ఒక ఆలోచన
సాపేక్షతనూ , క్వాంటం థియరీ నీ అంతరిక్షంతో అను సంధానం చేసింది
రేపటి ప్రయాణాన్ని నిన్నేనే మొదలుపెట్టి ఎల్లుండిలో ముగించేందుకు 
శాస్త్రీయ ప్రపంచానికి క్రొత్త జీవనాడిని నిర్వచించి ప్రసాదించేందుకు 
భూమి మీద సౌరతుఫానుగా వెలసి గ్రహాలను అనుసరించాడు 
చక్రాలకుర్చి చేసిన విశ్వ యాత్ర అది  , కాంతి కాలం రాసిన దీర్ఘ చరిత్ర అది
శారీరక బలహీనతే అద్వితీయ  మానసిక బలమైనప్పుడు
గాల్లో వేళ్ళు కదిలిస్తూ గ్రహాలతో  పాప్ బీట్స్ పాడతాడు .
కాలాన్ని ప్రతిపాదనల కలంతో ముందుకూ వెనక్కి ఆడించిన మాత్రికుడు
విశ్వంతో పోటీ పడి కనిపించనంత ముందుకు దూసుకు పోతూ ఉండడం చూసి 
నల్ల బిళం అలిగి చిన్న బోయింది
 నీకన్నా ఈ విశ్వం పెద్ద గొప్పదేమీ కాదని  ప్రకటించింది ,
దైవత్వపు జోక్యాన్ని నిలదీసిన నీకూ , నీ సింగ్యులారిటీ కీ 
ప్రపంచ గళం నోబుల్ మించిన నివాళితో శ్రద్దాంజలి ఘటించింది .
                                                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (15-03-18 )




వర్తమానం


వర్తమానం
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
కోరికలు అలలై ప్రశాంత కడలి ని అల్లకల్లోలం చేస్తాయి
దుఃఖం సముద్ర గర్భంలోంచి సునామీగా ఉద్భవిస్తుంది
చెల్లా చెదురైన జ్ఞాపకాల శిలాఫలకాలు అస్పష్టంగానే అయినా
నిన్ను నిన్నలోనికి క్రియాశూన్యుడిని చేసి లాక్కు పోతాయి
అనాలోచిత ఆలోచనలు గాలిలో కట్టిన పేకమేడలు
నిన్ను రేపటి సుడిగాలి లోనికి నెట్టేస్తూ కూల్చేస్తూ  ఉంటాయి
ఇక బ్రతుకంతా నిన్న రేపటి మధ్య ఊగే  తూగుడు బల్లే
ఎటో ఒక వైపుకే మొగ్గుతూ నిన్ను మొగ్గులోనికి దింపేస్తుంది
ఇక జీవితమంతా ఏక పక్షాన సాగే తీర్పుల వలయం
నిన్నా రేపుల మధ్య వేలాడుతున్న ఝాంఝాటాల జంజీరం
అంతర్ బహిర్ సంశయ గీతాల డోలాయమాన హిందోలకం
ఇక నీ కోమల దేహధారణ కరుణతో ఉజ్జీవించేదెప్పుడో
ఇక నీ మనోరధంలో వొప్పుదలతో సౌహార్ధత సంభవించే దెప్పుడో
ఇక కుశల చేతనలు ప్రియముగా నిర్వహించే ఉచిత కాలమెప్పుడో
ఇక అకుశలతను పూచికగా సన్యసించే శుభ తరుణ మెప్పుడో
ఇక మరణ కాంక్షకు మనస్పూర్తి మధుర ఆహ్వానమెప్పుడో
ఈ క్షణాన ఈ జగాన మరి నీవు మనగలిగిందెప్పుడో ???





సమ్మోదము


సమ్మోదము
గులాబీలకు ఎవరైనా గులాములవ్వాల్సిందే  కదా !,
ఏ రంగులో పూసినా ఆ  అందాన్ని ఎంతగా గౌరవిస్తాము
ఎంతగా ఆ సుకుమారత్వాన్ని ఆస్వాదిస్తామో  
రకరకాల మనుషులను కూడా అలానే ఎందుకు చూడ లేకపోతున్నాము ?
ఒక్కొక్కరూ ఒక్కో తెలియనితనాన్ని
గుభాలిస్తూ ఉంటారని ఎందుకు ఆశించ లేకపోతున్నాము?
 ద్వేషించడానికి కారణం ఉండాలేమో,’
మానవ పరిమళాన్ని ఆస్వాదించడానికి అక్కర్లేదు
నిద్రావస్థ లోనున్న  ప్రేమతత్వాన్ని మేల్కొలిపితే చాలు
కనిపించే ముళ్ళు గుచ్చుకుంటాయని తెలుసు
అయితేనేం రోజాలని రోజూ ఆస్వాదించడం లేదూ!
కనిపించనివన్నీ చిక్కు ముళ్ళేనని ఎందుకు భావించాలి?
మానస సరోవరాలు ఎందుకు కాకూడదూ?
పూలకు కూడా సొట్టదీ గుడ్డిదీ అని పేర్లు పెట్టే నైజాన్ని
 ఎప్పుడు ఉదల్చుకుంటామో అప్పుడు
సహజంగానే మానవతా మంజరిగా గుభాళిస్తాము ....
                                                           డాక్టర్ మాటూరి శ్రీనివాస్ .


శోధన


శోధన
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
అదొక అంతులేని అతి సాధారణ  ప్రయాణం
అనంతాకాశంలోని మబ్బుతునకల విహారం 
మనసు శరీరాదుల పదనిసల సాలెగూడులో
దిక్కుతోచని  తీరానికి  నిరంతర ప్రయాసం
క్షణక్షణమూ వెతలతోనే  జతకట్టిన జుగల్ బందీ
వెతుకుతున్నది దొరికినా వెతుకుతున్నదదేనని
తెలియని సందిగ్ధలు ముసిరిన  మజిలీల యాత్ర
కృత్రిమ జీవిత అరాటాల పరంపరాల దొంతర ఏదో
దొరకబోతున్నదాని కోసం ఉబలాటపడుతుంది
 అది ఎలా ఉంటుందో అర్ధం తెలియని అజ్ఞానం
కుహనా ఆశయాలను అనర్గళంగా వల్లిస్తుంది  .   
నిరాశ దుఃఖం అది తొందరగా సిద్దించాలని పూజలు  చేస్తాయి
అనుమానాలు అపోహలూ రాత్రీ పగళ్ళు గా మారి
అత్యాశ స్వార్ధం గడియారపు ముళ్ళై  కాలచక్రాన్ని శాసిస్తుంటాయి
బాల్యంలో అడక్కుండానే వెతక్కుండానే ఎక్కడపడితే అక్కడ
ఎప్పుడు పడితే అప్పుడు దొరికే అమ్మ వోడిలా అది
ఇప్పుడేంటి ఇలా అందని తియ్యని  ద్రాక్ష అయింది
దాన్నేమి పిలుస్తావో ఏమో ? నీ ప్రయాణం మాత్రం
సుఖప్రదమౌవ్వాలని కోరుతూ , హేపీ జర్నీ .......



















మయ సభ


                                    మయ సభ
                                                                                         డాక్టర్ మాటూరి శ్రీనివాస్

అక్కడ సమానత్వం శాస్త్రీయత చిలుకా గోరింకల్లా చెట్టా పట్టాలేసుకుంటూ
పాలూ నీళ్ళలా మమేకమై తమ ఉనికిని ఉత్సాహంగా పంచుకోవాలి
చట్టాలు స్వచ్చమైన వాన చినుకుల్లా మెరవాల్సిన చోటది
అక్కడే అంతరాలు గాల్లో దొంతరలు దొంతర్లగా పేరుకుని పాచి కంపు కొడుతున్నాయి
వినియోగదారుడైన సామాన్యుడు  నాణ్యత కోసం నిత్యం అటుగా ఎదురు చూస్తుంటాడు
అక్కడే మందిరానికి మసజీద్కు అనంతమైన దూరం ఏర్పడింది
ఒక మనిషి కి ఒక వోటు  ఒక విలువ ఉండాల్సిన చోటది
భిన్నంగా ఆర్య పితృస్వామ్య అమానుష భావజాలం
అర్ధాంతరంగా ఆ గాలరీలో పురాణ పురుషుని రూపంలో ప్రత్యక్షమైయింది
ఆ నామమే ఇప్పుడు పాలకులకు ప్రాణవాయువు .
దైవం పేరు మీద నినాదాల వారసత్వం
మారణాయుధం గా మారి ఉన్మాదానికీ  ఉన్నవాడికీ ఉనికికై
ఊర్ధ్వగతి  అందలం మీద కూర్చుని  కలకలం సృష్టిస్తోం ది
పోరాడి తెచ్చుకున్న హక్కుల రాజ్యం పరాన్నభుక్కుల పాలౌడంతో
సన్నాయి నొక్కులతో పగటి వేషగాళ్ళయిన స్వాముజీలకు చిత్తౌడం తో
 ఆ అపశ్రుతులు ప్రజాస్వామ్య గుండెల్లో బాకుల్లా దిగిబడి
 తీవ్ర క్షతిని మిగిల్చడం దేశ దురదృష్టానికి పరాకాష్ట
 అ నినాదాలిప్పుడు అల్పజీవుల చెవులలో  మరణ మ్రుదంగాలై ఘోషిస్తున్నాయ్
 పీనుగు ముందు బాజాలూ భజంత్రీల్లా వినబడుతున్నాయ్ 
రాజ్యాంగానిదిప్పుడు గాలికి చిరిగిపోయే  అరిటాకు బ్రతుకు ,
సహోదరత్వం ఎంత పిండినా కారని బూడిదపాలైన  పన్నీరు
రాజ్యాంగ పీఠిక సంక్లిష్టతల కుడితిలో పడ్డ సామ్యవాదపు ఎలుక
లౌకికానికీ అలౌకికానికీ తేడా తెల్సి కూడా తెలియనట్లు
నటించే  తేడా గాళ్ళ  చేతిలో పెనుగులాడుతున్న  పరాభవాల పరంపర.
ఇక చట్ట సభ ఈదేశ ప్రజలనెప్పటికి మభ్యపెట్టే  మయ సభే.....
                                                                                                                   02 -07-19.