Friday, 10 April 2020

తెమ్మెర



                                 తెమ్మెర
                                                      డాక్టర్ మాటూరి శ్రీనివాస్
ఎప్పటివో గత స్మృతులను ఇప్పుడే జరిగినట్లు నిత్యం  గుర్తు చేస్తూ
ఎప్పుడు గమనించినా నిండు చూలాలిలా భారంగా చిన్నగా
నొప్పులు పడుతున్నట్టు మెత్తగా అడుగులేస్తూ నిదానంగా
పెదవుల మీది చిరు నవ్వు చెరగ నీకుండా కదులుతూ ఉంటుంది
నా మొహాన్ని తాకినా ప్రతీ సారీ నేను కనులు చిన్నగా మూసి
సన్నగా చుబుకాన్ని పైకెత్తి , ఆ ఆహ్లాదానికి బానిస నౌతూ ఉంటాను
ఒక చిన్న నిట్టూర్పుతో దీర్ఘ శ్వాస తీసుకుని  స్వేద తీరుతాను,
చిన్నప్పటి నుండీ అచ్చంగా ఇలానే జరుగుతుంది.
ఇప్పటికీ అదే అనుభవాన్ని ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నాము  
నాటి గోరంత ఆశల్నీ, కొండంత కోరికల్ని, ఆ రోజుల్లో కలిగిన మంచి చెడు భావనలను
బాల్య స్నేహితునిలా యాది చేస్తూ నిత్యం నన్ను వదలకుండా  అనుసరిస్తూ వస్తుంది.
అప్పుడప్పుడు కన్నీళ్లు తెప్పించడమే కాదు
వోదార్చే బాధ్యత కూడా తనదే అన్నట్లు మళ్ళీ అర్పేస్తుంది
యవ్వనంలో ఉన్నప్పుడు నాలో అసహనపు చిట పటలు
రోజూ ప్రత్యేకంగా తయారై పూసుకున్న పరిమళాలు,
తాజా కనబడాలనే తాపత్రయం
తడి ఆరని పెదవులను తిరిగి తడుపుకుంటున్న నా ప్రాయం
ఏదో కోరుకోవడాన్ని అనుభవించిన తీరు ఆ చిరు గాలికి  తప్ప ఇంకెవరికీ తెలుసు
ఇసుక తిన్నెల మీద మమ్మలిని చూసి ఈర్ష్యతో
సమయాన్ని గుర్తు చేస్తూ చిరాకు తెప్పించడం ఎంత ఇష్టమో దానికి ,
ఉప్పని తడి , సముద్రపు వాసన అదంతా దాని చలువే, అదొక పవన పెన్నిధి
మోటారు సైకిల్, మెలికలు తిరిగే రోడ్డు ,ఆ ప్రయాణంలో దానికి ఆమెకూ పోటీ    
ఆ స్పర్శను నాకు అంకితం చేసి నిస్వార్ధంగా తప్పు కోవడం నాకు గుర్తే
ఎన్నో ఆద్యంత రహితమైన జ్ఞాపకాలన్నీ ఆ దిగంతం లో నిక్షిప్తమై ఉన్నాయి
చినుకుతో మట్టిని జత కలిపి మైమరపించే ఆ ఆహ్లాదానికి బానిస కానిదెవరు
వర్షాకాలం లో కరెంట్ తీగల మీద ప్రాకుతూ నృత్యం చేస్తున్న వాన చినుకలకు
అనిత్యతను బోధించే గురువు కదా? ఆ మంద మారుతం
జ్ఞాపకాల ఆనందం నిస్సహాయతల నిట్టూర్పు రెండూ బలమైనవే
ఇంత కాలం తర్వాత ఈ అస్తమించే దశలో ఈ చిరు గాలితో ఏకాంతంలో  
సంభాషించే టప్పుడు తన ముఖ వైఖరి నా ఒంటరి తనాన్ని
లీలగా తాకి స్వాంతన కలిగిస్తూ  తడుతుంది .. అది చాలు .
కానీ, ఆమె చితిని ఉధృతంగా  విసురుతూ  విడిచిపోయినందుకు
నిరసన ప్రకటించడాన్ని నేను  గమనించాను
అ తిమ్మెర ప్రసవించిన ఉపలాలనలో నేను ఒదిగి పోయాను.
                                                           08-07-19




No comments:

Post a Comment