ఇంగ్లీషు తెలుగు అనువాదాలు – అనుభవాలు
Translation of Telugu literature; Trends and Techniques
(కేంద్ర సాహిత్య అకాడమీ విశాఖలో
21-8-2016న నిర్వహించిన అనువాదాలపై సదస్సు
లో సమర్పించిన పత్రం)
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
“అనువాదాలలో కవితాత్మ కుంటుపడుతుంది” ప్రముఖ ఆంగ్ల కవి రాబర్ట్ ఫ్రాస్ట్.
“మూలానికి దగ్గరగా ఉండాలా లేదా అనువాదకుని ముద్ర ఉండాలా?” అని ప్రశ్నిస్తాడు, డేనియల్ హాన్
అనువాదం అనేది మాతృకకు కట్టుబడి,
దాని పరిధిలోనే ఉండాలి. అలాగే తనదైన
శైలిలో భిన్నంగానూ ఉండాలి. కచ్చితంగా ఉండాలి . ప్రతీ అనువాదమూ ఒక సృజనతో కూడిన
వ్యాఖ్యానంగా భావించాలి. ఏ ఏ పదాలను తేలికగా తీసుకోవాలో, వేటిని నొక్కి
ప్రస్తావించాలో,వేటిని త్యాగంచేయవచ్చో
తెలియాలంటే భాషమీద పట్టు,పరిజ్ఞానమూ తప్పదు. ఏ
భాషలోనైనా శైలి జాతీయత,అస్పష్టత, ద్వందార్ధాలు, అనిర్దిష్టత, అక్షర సమత లోని
భేదాలు తప్పవు.
తెలుగు
సాహిత్యంలో ఎక్కువ అనువాద కావ్యాలు రచించిన శ్రీనాధుడు తన రచనా వ్యూహాన్ని - ''శబ్దంబను సరించియు, అభిప్రాయంబు
గురించియు, భావంబు
పరీక్షించియు, రసంబు పోషించియు, అలంకారంబు
భూషించియు, ఔచిత్యం
బాదరించియు, అనౌచిత్యంబు
పరిహసించియు మాతృకాను
సారంబున చెప్పబడి'' అని
స్పష్టంగా లోకానికి చాటాడు,తన శృంగార నైషధం ద్వారా. భారతీయ భాషలలోని సాహిత్యాలలో మొట్టమొదట వెలువడ్డది అనువాద సాహిత్యమే.
మాక్సీమ్ గోర్కీ 'అమ్మ' నవల చదివి మార్క్సిజానికి ఆకర్షితులైనవారు
ఉన్నారు. రవీంద్రుని 'గీతాంజలి' చదివి ఉత్తేజితులయినవారున్నారు. బెంగాలీ
సాహిత్యానువాదాలు చదివి శరత్, ప్రేమ్‌చంద్‌ల సాహిత్యానికి ముగ్ధులయినవారు అనేకులు. ప్రపంచ
సాహిత్యం తెలుగులోనిక రావడానికి ముఖ్య వాహిక అంగ్లమేనని మనకు తెలుసు. అనువాదసాహిత్యం
ద్వారా ప్రజల మేలును తలపోసే
అభ్యుదయోద్యమాల పథం
తొక్కించిన సృజనశీలురు ఎందరో! గోర్కీ,
పుష్కిన్, దొస్తవిస్కీ, లెర్మంతోవ్, టాల్‌స్టాయ్ లాంటి సోవియట్ రష్యా రచయితల రష్యా
సాహిత్యం, లూసన్, టావ్‌చెంగ్ రచనలు ద్వారా చైనీస్ సాహిత్యం కూడా తెలుగు పాఠక హృదయానికి
దగ్గరగావచ్చి చైనీస్ సాహిత్య అనువాదాలు ఉత్తేజపూరితమైన వాతావరణాన్ని
ప్రోదిచేశాయి. చైనా సాహిత్యం కూడా ఇంగ్లీషు అనువాదాలద్వారానే మనకు పరిచయం.
ఆ తర్వాత ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ సాహిత్య అనువాదాల్ని
ఆత్మీయంగా స్వీకరించారు.
ఈ దేశ, ఈ
ప్రాంత వాస్తవికతకు మనకు దగ్గరగా ఉండడమే దీనికి మూలం. గూగీ,
చినువా అచెబి, టోనీ మారిసన్ రచనలు ఇందుకే నచ్చుతాయి.
ఫ్రెంచి సాహితీవేత్త మపాసాను
కూడా మనకు ఆంగ్లము నుండే అందింది. అధివాస్తవిక
ధోరణిలోని జేమ్స్‌జాయిస్, వర్జీనియా వుల్ఫ్ రచనలు, కాఫ్కా, అల్బర్ట్ కామూ వంటి వారిని కూడా ఆంగ్లానువాదాలే
మనకు పరిచయం చేసాయి. కనుకనే అనువాదాలు చేసే మేలు అనంతం. తెలుగు
సాహిత్య వికాసంలో,
విభిన్న ప్రక్రియల విస్తరణలో అనువాదానికి
తగినంత ప్రాధాన్యం వుంది. అందువల్లనే కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాదాలకు కూడా పురస్కారాలు
అందిస్తోంది.
అనువాదకుని
కలంలోనుండి వస్తున్న సాహిత్యం క్రొత్తదే,
సృజనే కాబట్టీ దానికి ఆ క్రొత్త దానన్ని
(ట్రీట్మెంట్) ఇవ్వాలి. భాషే మాత్రమె మారాలి, దాని ప్రభావం మారకూడదు. మనకు బాగా తెలిసిన భాషలోనే రాయాలి. భాష
తెలియటం అంటే ఏమిటో ఆలోచిద్దాం. నాగరికత పరిణామక్రమలో భాష ఆ భాషను మాట్లాడే ప్రజల
సంస్కృతిలో ఒక ప్రధానమైన అంశం. అంతే కాదు భాష
ఆ సంస్కృతికి మాధ్యమం కూడా. కాబట్టి రెండు భాషలు తెలిసి
ఉండటం అంటే రెండు సంస్కృతులు తెలిసి ఉండటం. రెండు జీవిత విధానాలు తెలిసి ఉండటం.
భాషకు జీవం నుడికారం. ఏ భాష నుడికారం, ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతి లోనుంచీ, భౌగోళిక
పరిస్థితుల్లోంచీ, ఆ ప్రాంత ప్రజల ఆచార
వ్యవహారాల్లోంచీ, ఆట పాటల్లోంచీ
ఉద్భవిస్తుంది. భాషను తెలుసుకోవటమంటే దాని నుడికారం యొక్క మూలాలను తెలుసుకోవటం.
వీటిని తెలిసి ఉండటం లేదా తెలుసుకోవాలని ఉండటం
అనువాదకుని మొదట అర్హత.
అనువాదకుని
ఉండాల్సిన రెండవ అర్హత మూలగ్రంధంలోని విషయాన్ని గురించి నిజమైన ఆసక్తి ఉండటం. అందరూ అన్ని విషయాలనూ అనువదించలేరు. ఆసక్తి లేని
విషయాన్ని అనువదిస్తే, అది యాంత్రికంగా, నిర్జీవంగా ఉండక తప్పదు.
వస్తువుకు సంబంధించిన మరొక ప్రధానమైన అంశం కూడా ఉంది. ఒకే వస్తువును అనేక
దృక్పధాలనుంచీ చర్చించ వచ్చు. ఉదాహరణకు భారతీయ తత్వ శాస్త్రాన్ని గురించి గోళ్వాళ్కర్ లాగా రాయవచ్చు.
రాధాకృష్ణన్ లాగా రాయవచ్చు. దేవీ ప్రసాద్ ఛటోపాధ్యాయ లాగా
రాయవచ్చు. మూలగ్రంధ రచయిత అందులోని విషయాన్ని తనకు నచ్చిన, తాను నమ్మిన భావజాల ధృక్పధం నుంచి
చర్చించి వుంటాడు. మూలగ్రంధ రచయిత భావజాల ధృక్పధం మీద కనీసం సానుభూతి కూడా
లేకుండా ఆ గ్రంధాన్ని అనువాదం చేయటానికి సాహసించకూడదు.
అనువాదకుడు
తాను చేయబోతున్న అనువాదంలో వాడదల్చుకున్న భాషాస్థాయిని గురించి ముందుగానే ఒక ఖచ్ఛితమైన నిర్ణయానికి రావాలి. ఒకే భాషను అనేక
స్థాయిలలో రాయవచ్చు. ” భాషాస్థాయి ” పదజాలానికి మాత్రమే కాకుండా వాక్యనిర్మాణానికి కూడా
సంబంధించిన విషయం. భాషా స్థాయిని గురించి నిర్ణయం
తీసుకోటానికి పూర్వం, మూలగ్రంధంలోని విషయాన్ని గురించి, మూలగ్రంధం ఎవరికోసం ఉద్దేశించబడిందో ఆ పాఠకుల్ని గురించీ, అనువాదం ఎలాంటి పాఠకుల కోసం చేయబడుతోందీ వారిని గురించీ, అనువాదకునికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇంగ్లీషు నుంచి
శాస్త్ర గ్రంధాలను అనువదించేటప్పుడు ఇది మరీ చిక్కు సమస్యగా మారుతుంది. దాదాపు ఆరులక్షల పదసంపద ఉన్న ఇంగ్లీషు నుంచి పాతికవేలు
వ్యావహారిక పదజాలం కూడా లేని తెలుగులోకి శాస్త్ర గ్రంధాలను
అనువాదం చేసేటప్పుడు, అనువాదకుడు అనేక పదాలనూ, పద బంధాలనూ సృష్టించుకోవలసి
వస్తుంది. అవి తాను ఎన్నుకొన్న భాషాస్థాయిలో ఉండేలా జాగ్రత్త పడటం కూడా క్లిష్టమైన పనే .
భాషకు సంబంధించిన మరొక ఇబ్బంది కంఠస్వరం. సమర్ధుడైన
రచయిత శైలికి ఒక ” కంఠస్వరం ” ( Tone ) ఉంటుంది. అది రచయితకూ, విషయానికీ మాత్రమే కాకుండా, రచయితకూ, పాఠకునికీ మధ్య ఉన్న సంబంధాన్నికూడా వ్యక్తం చేస్తుంది. గొప్ప
గాయకుని గొంతులో ఎన్ని భావాలు పలుకుతాయో, సమర్ధుడైన రచయిత శైలిలో అన్ని భావాలు పలుకుతాయి.
అందులో కోపం ఉండవచ్చు, కసి ఉండవచ్చు, హాస్యం ఉండవచ్చు, వ్యంగ్యం ఉండవచ్చు.ఇంకా ఎన్నో భావాలూ, భావమిశ్రమాలూ ఉండవచ్చు.మూలరచయిత కంఠస్వరాన్ని, పొరపాటు
పడకుండా గుర్తించి , దాన్ని లక్ష్య భాషలో వ్యక్తం చేయగలిగిన
రంగు, రుచి,వాసన ఉన్న పదాలనూ, వాక్య విన్యాసాలనూ జాగర్తగా ఎన్నుకోవాలి.
అనువాదకుని
చివరి అర్హతను గురించి ఒక మాట
చెప్పాలనుకుంటున్నాను. సృజనకు భావోద్రేకం, Inspiration అవసరమేమో కానీ అనువాదానికి పరిశ్రమే
ప్రాణం. పరిశ్రమ చేసే ఓపిక లేనివాడు మంచి అనువాదకుడు కావటం అసాధ్యం.
వచనం కంటే కవిత్వం అనువాదం కష్టం. అర్ధం భావం
రెండూ ప్రతిబింబించాలి. రచన కత్తి మీద సామైతే, అనువాదం రెండు కత్తుల మీద సాము. ఎలా
అయితే ఒక భాష వచ్చిన ప్రతీవాడూ రచయిత
కాలేడో అలాగే, రెండు
భాషలు వచ్చిన ప్రతీవాడూ అనువాదకుడు కాలేడు.
అనువాద
కళను గురించి ఇంగ్లీషులో కొన్ని మంచి పుస్తకాలు వచ్చాయి. 1791లోనే అలెగ్జాండర్ ఫ్రేటర్ టైట్లర్
అన్న వ్యక్తి “Essays on the principles of Translation ” అన్న గ్రంధాన్ని ప్రచురించాడు. ఆ తరువాత థియొడర్ సేవరీ, రెనెటో సోగియోలీ వంటి విద్వాంసులు కొన్ని
గ్రంధాలు రాసారు. ఈ శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పాశ్చాత్యదేశాల్లో
భాషాశాస్త్రం ప్రతిష్ట బాగా పెరిగింది. దీని ప్రభావం అనేక పరిసర రంగాలమీద ప్రసరించటం ప్రారంభించింది.
జె. సి. కాట్ ఫోర్డ్ లాంటి భాషాశాస్త్రవేత్తలు ఈ
రంగంలో చాలా కృషి చేసారు. అంతవరకూ ” కళ ” అని అందరూ భావిస్తున్నఅనువాదం ప్రక్రియ ఒక ” శాస్త్రం ” గా పరిణామం చెందటం ప్రారంభించింది. కానీ తెలుగులో అనువాదం మీద మంచి గ్రంధాలు ఇంతవరకూ రాలేదు. రా.
రా. రాసిన ” అనువాద సమస్యలు “, పత్రికల వారూ, పత్రికారచయితలూ తయారు చేసిన కరదీపికలూ తప్ప తెలుగులో అనువాదాన్ని గురించి సమగ్రమైన, సాధికారమైన గ్రంధం రాలేదు.
అత్యంత
ప్రాచీనమైన గ్రీక్ , సంస్కృతం,లాటిన్
సాహిత్యాలవంటివి తప్ప ఇతర దేశ భాషా సాహిత్యాలలో చాలా భాగం అనువాదాలతోనే ప్రారంభమయ్యాయి.
20వ శతాబ్దంలో తెలుగు వారు అనువాదం
పట్ల గొప్ప శ్రద్ధను,చొరవను,ఆసక్తినీ చూపించారు. ప్రేంచంద్ , టాగోర్ , శరత్ ,గోర్కీ, రాహుల్ మొదలైన ఎందరో మహా
రచయితలు తెలుగువారైపోయారు. 1930లలో అభ్యుదయ సాహిత్యోద్యమంతో
ప్రారంభమైన శాస్త్రగ్రంధాల అనువాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహా
సముద్రంకన్నా లోతైన సువిశాల తెలుగు సాహిత్యంలో 'అనువాద సాహిత్యం' విలక్షణమైన, విస్తృతమైన శాఖ. దాని పరిధి అనంతమైనది. మరే ఇతర కళ లాగే సాహిత్యం కూడా భాషా భేదాలకు అతీతమైనది. తెలుగులో అనువాద సాహిత్యానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది.
తెలుగులో అనువాద
సాహిత్యం అధ్యయనం చేయటమనేది సముద్రంలో ఈదటం లాంటిది. పౌరాణిక, ఐతిహాసిక సాహిత్యం
మొదలుకొని కావ్య, ప్రబంధ
సాహిత్యం, భక్తి కవుల
సాహిత్యం, భావ
కవిత్వం, ఆధునిక
కవిత్వ శాఖలు సమస్తం తెలుగు సాహిత్య వటవృక్షంలోని 'అనువాద సాహిత్యం' అనే విభిన్న శాఖలే.
1720 ప్రాంతంలో
క్రైస్తవ మిషనరీలు బైబిల్ ను తెలుగీకరించి ఆంగ్ల నుడికారాన్ని తెలుగులో
ప్రవేశపెట్టారు. అదొక ప్రత్యేక లేదా విపరీతమైన తెలుగుగా మనం పరిగణించాలి. అనువాదం
అనబడే తెలుగు బైబిల్ను చదవడం తెలుగు పండితులకు కూడా కష్టంగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపనీ 1884ప్రాంతంలో భారతదేశంలో
అంగ్ల పాఠశాలలు స్థాపనకు నిర్ణయించుకున్నాయ్. ఆ నేపధ్యంలో యురోపియన్ భాషా
సంస్కృతినీ , వారి ప్రగతినీ భారత్లోని అన్ని వర్గాల ప్రజలకు అందించాలని ప్రయత్నాలు
ఆరంభించారు. 19 శతాబ్దపు మధ్యకాలానికి భారతీయ సాహిత్యంపై, రచయితలపై ఆంగ్ల సాహిత్యం తన ప్రభావాన్ని విపరీతంగా
చూపనారంభించింది. ఆ ప్రభావంతో తెలుగులోనికి
వచ్చిన మొదటి ఆంగ్ల నవలగా ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘ది వికర్ అఫ్ వెక్ ఫీల్డ్
‘గా చెపుతారు. దీనినే కందుకూరి వీరేశలింగం
గారి ‘రాజశేఖర చరితం’కి మూలం అని
చెపుతారు. వీరేశలింగంగారి మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం చాలా ఎక్కువగా ఉందనేది
వాస్తవం. ప్రొ. హక్సలీ రాసిన శరీర శాస్త్రాన్ని వీరేశలింగంగారు ఇంగ్లీషు నుండీ
అనువదించారు. ఆయన స్వీయచరిత్రము లో తనదైన శైలిలో ఎన్నో ఆంగ్లం నుండీ అనువదించి
రాసారు. వాటిని చదివితే ఎన్నో అనువాద దోషాలు ఆయన తెలియకో తెలిసో చేసినవి మనకు పాఠాలుగా
కనబడతాయి. రోమియో జూలియట్ ‘మాలతి మధుకరం’
గా, కింగ్ లేయర్ ‘చిత్రకేతుగా’ , కామెడీ అఫ్ ఎర్రర్ ‘చమత్కార రత్నా’గా అనువాదం
చేయబడ్డాయి. నాటినుండీ విశ్వ
విద్యాలయాల్లో భోధనాంశాలుగా షేక్స్పియర్ నాటకాలు అనివార్యమయ్యాయి. 1876లో వి. వాసుదేవ
శాస్త్రి షేక్స్పియర్ జూలియస్ సీసర్ను పాత్రల
పేర్లు మార్చి స్వేచ్చగా అనువదించే
ప్రయత్నం చేశారు. అందులో చాలా మార్పులను,చేర్పులూ తప్పులూ ఉన్నట్లు
విమర్శలొచ్చాయి. 1880 గురుజాడ శ్రీరాం
మూర్తి ‘మర్చంట్ అఫ్ వెనిస్’ తెలుగు ప్రేక్షకులకు అనువుగా మార్చి తర్జుమా చేసారు. 20శతాబ్దానికల్లా షేక్స్పియర్ రచనలన్నీ
తెలుగులోనికి వచ్చేసాయి. అవన్నీ అనుకరణలో అనుసరణలో తప్ప అనువాదాలుకాదని వెరే
చెప్పనవసరం లేదు. అనువాద సమస్యలే ఈ ప్రక్రియలకు కారణమై ఉండవచ్చు. సాహిత్య అకాడమీ
ప్రచురించిన షేక్స్పియర్ చనలనే అనువాదాలుగా పరిగణించాలి. తరవాత కాలంలో ఎందఱో
షేక్స్పియర్ రచనలను తెలుగులోనికి అనువదించారు. కానీ చాలామంది షేక్స్పియర్ రచనలకు
భారతీయతను అద్ది వాటి యొక్క మూల పరిమళాన్ని,ఆత్మనీ హరిం చారని విమర్శ ఉంది. దీనికి కారణం కూడా లేక
పోలేదు. షేక్స్పియర్ కు తెలుగు పాఠకునికీ మధ్యగల సంప్రదాయ సంస్క్రుతికవ్యత్యాసమే
కారణం తప్ప మరేమీ కాదు.
తెలుగులో
షేక్స్పియర్; తెలుగు సాహిత్యంలో షేక్స్పియర్ ప్రభావాన్ని తెలుసుకోవడానికి
కొలమానాలు లేవు. కేవలం అనువాదాలో అనుకరణలో కాదు అంగ్ల సాహిత్య ప్రత్యక్ష ప్రభావమే
దీనికి కారణం. దాదాపు అందరు తెలుగు నాటక కర్తలూ షేక్స్పియర్ ప్రభావానికి
లోనైనవారు. టాగోర్ ప్రభావంతో ఆంగ్ల రచనలు,అనువాదాలు ఎన్నో చేసారు,గురజాడ
అప్పారావు. వీరి ప్రభావంతో కొన్ని ఆంగ్ల రచనలు,అనువాదాలు శ్రీ శ్రీ కూడా చేసారు.
గురజ అప్పారావుగారి దేశభక్తి గీతాన్ని శ్రీ శ్రీగారు తెలుగీకరించారు. గురజాడ చేసిన
ఆంగ్ల రచనలూ తక్కువేమీ కాదు. అవన్నీ తెలుగులోనికి అనువాదం చేయబడ్డాయి. ఇక్కడ అను
వాడకుడిగా అవసరాల సూర్యా రాగారిని చెప్పుకోవాలి. 19 శతాబ్దంఆరంభం నుండీ బెంగాలీ
హిందీ సాహిత్యం ఆంగ్లం నుండీ తెలుగులోనికి
విపరీతంగా వచ్చింది.
ఇక అనువాదాలు సమస్యలు విషయానికొస్తే పదాలు,వాటి కూడిక, అమరిక అన్నీ భిన్నముగా ఉంటేనే
అనువాదం కూడా మాత్రుకలా రక్తికట్ట
గలుగుతుంది. మూలాన్ని చెడపకుండా చిన్న చిన్న మార్పులూ చేర్పులూ చేయవచ్చు అంటే
చాలామంది అనువాదకులు వోప్పుకోకపోవచ్చు. ఇవన్నీ అన్ని భాషానువాదాలలో ఉన్నవే.
translatipon అనే ఆంగ్ల
పదానికి మూలం గ్రీకు పదం. దీని అర్ధం ; ‘అడ్డంగా మాట్లాడడం’ లేదా ‘అటు నుండీ ఇటు
మాట్లాడడం ’అని అర్ధం . అనువాదం చేసి
మాట్లాడడాన్ని ఆంగ్లంలో interpretation అంటారు. మరి అనువాదం
అనే తెలుగుపదం అర్ధం ఏమిటి? నిజానికి అసలైన అర్ధం భాషాంతీకరణ లేదా తర్జుమా అంటారు.
ఇతర భాషల నుండీ తెలుగులోనికిచేస్తే తెలుగీకరణ లేదా ఆంధ్రీకరణ అనవచ్చు. ఈ పదాలను అర్ధం చేసుకున్నప్పుడు ఒకే భాషలోనున్న
నియమాలు,సంప్రదాయాలూ మరొక భాషలో ఉండవని అర్ధం చేసుకోవాలి. మొదటి భాషని మూల భాష అనీ,
తర్జుమా చేయబడుతున్న రెండవ భాష ని లక్ష్య భాషని అంటారు. చిత్రం ఏమిటంటే ఈ రెండు
పదాలు ‘ మూల భాష ‘,’లక్ష్యభాష’ కూడా
తెలుగు పదాలు కాదు. Source language ,
target language పదాలకు అనువాదంగా మనం తెలుగులో
సృష్టించుకున్న పదాలు . దీని బట్టే మన మీద
మన భాషమీద ఆంగ్లభాష ప్రభావం ఎంతున్నదో తెలుస్తుంది. అలాగే మన భాష పద సంపద వెలితి
కనిపిస్తుంది. దీనికి కారణం సుమారు రెండు
వందల ఏళ్లుగా అనువాదమ అంటే ఏమిటి?అనువాదం ఎలా ఉండాలి? అనే సమస్యల మీద
చర్చలూ,పరిశీలనలూ,పరిశోధనలూ జరుగుతున్నాయి. కనుక వాళ్ళు ఇప్పటికే ఎన్నో పదాలు
సృష్టించు కున్నారు. వారు సృష్టించుకున్న సాంకేతిక పదాలను తెలుగులోనికి అనువదించుకోవడంలో
తప్పేమీ లేదు.
ఇక అనువాదమంటే ఏమిటో వివరించడమంటే
దారీ డొంక లేని కీకారణ్యంలో మన కాలి బాటను మనమే నిర్మించుకుంటూ ముందుకు సాగి పోవడం
. కంపలూ,చిక్కు పొదలూ విడిపించుకుంటూ సూటి బాట సాధ్యం కానప్పుడు అటూ ఇటూ మలుపులూ మెలికలూ తిరుగుతూ తప్పించుకు
పోవడం. కానీ చివరకు మూల భాషలో ఉన్నదాన్ని లక్ష్యభాష లోనికి మార్చాలి, అదీ
అనువాదానికి స్థూల నిర్వచనం. అయితే ప్రపంచంలోని భాషలన్నిటికీ ఒకే స్వభావం, ఒకే
సంప్రదాయం ఉండదు. ఒక భాష కు వర్తించే నియమాలు మరొక భాషకు వర్తించవు.
ఎన్నో పదాలను ఆంగ్లం నుండీ అరువు తీసుకున్నాం. గౌన్,కర్చీఫ్,టై, స్కర్ట్ మొదలైనవి. ఈ
ఆంగ్ల పదాలకు తెలుగుపదాలు లేవు. వీటినే
తెలుగు పదాలుగా స్వీకరించి
వాడుకుంటున్నాం. అక్కడ నుడికారాలు, సంప్రదాయాలు ఇక్కడ లేవు కదా!. అలాగే వాళ్ళుకూడా ఎన్నెన్నో పదాలను ఎప్పటికప్పుడు అరువు తీసుకుని అవసరానికి సృష్టించుకుని వారి పద సంపదను విరివిగా పెంచుకున్నారు. చీర పైటను ‘షోల్డర్ ఎండ్ అఫ్ ది సారీ’ అని, నులక మంచాన్ని
‘స్త్రింజి బెడ్ అని, థ్రెడ్ బెడ్’ అని కల్పించుకున్నారు. నిజానికి ఏ ఒక భాషలోను , ఏ ఒక
పదానికైనా నూటికి నూరు పాళ్ళు సరైన సమానార్ధం ఉన్న పదాలు దొరకవు. ఉదాహరణకు ఆంగ్లంలో ‘పిటీ’ అనే పదం ఉంది. తెలుగులోని అనువదించినప్పుడు దాని అర్ధం ఒకే రీతిలో ఉండదు. ఒక సందర్భంలో ‘జాలి’ అని, మరొక సారి ‘దయ’ అని మరొక సందర్భంలో ‘విచారకరమైన’ అని అర్ధాల్లో వాడాల్సి వస్తుంది.( It’s a pity, I pity your ignorance, he
is in pitiable condition) అంటే పిటీ అనే ఆంగ్ల పదానికి సమానమైన సమానార్దాన్నిచ్చే తెలుగు పదం లేదనే కదా. మూడు సందర్భాల్లో మూడు అర్ధాల్లో వాడుకుంటున్నాం.
అలాగే “లవ్” చేసి చూడండి. ‘ఐ లవ్ కాఫీ’ అన్నా, ‘ఐ లవ్ కత్రీనా’ అన్నా ఒకటేనా
? ఖచ్చితంగా కాదు. కాఫీ అంటే నాకు ఇష్టం. కత్రీనా అంటే నాకు అభిమానం అనే కదా అర్ధం. అలాగే మరొక ఉదాహరణ ‘లవ్ ఫర్ మనీ’ అంటే డబ్బుకోసం ప్రేమ నో ,డబ్బంటే ప్రేమనో అంటే తప్పుడు అనువాదం అవుతుంది. దానికి తెలుగు నుడికారం ధనాపేక్ష లేదా ధన కాంక్ష అనాలి. అంటే లవ్ అనే ఆంగ్ల పదానికీ నూటికి నూరుపాళ్ళు
సమానార్ధం తెలుగులో లేదన్నమాట. దీనిని బట్టే తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక ‘లవ్’
అనువదించడానికి ఎంత దీర్ఘాలోచన అవసరమో, ఆ మాటకు గల వివిధ అర్ధచ్చాయలనూ,ఆ మాటలో ఉన్న సూక్ష్మ భావాలను,నిశితంగా పరిశీలించాలని భోధపడుతుంది. మరొక పదం ఉంది ఇంగ్లీషులో.అదే “సీరియస్”. ఎన్నో సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతాము. అన్ని సందర్భాల్లోనూ దీనికి
ఒకే అర్ధం గానీ, సరైన తెలుగు పదం లేదు. Serious
subject, serious discussion (గంభీరమైన ),
serious problem (జటిలమైన ), serious offence(ఘోరమైన)
, serious injury(ప్రమాదకరమైన) ఇలా ఆ పదం యొక్క అర్ధాన్ని మార్చుకోవాలి. “ఆర్ యు సీరియస్?” అనే ప్రశ్నను ఎలా అనువదిస్తాం? “నిజంగానేనా ? నిజమేనా ?”అని అనొచ్చా? అది సరైన అనువాదమేనా? మరి ఏమనాలి? ‘నీవు హాస్యమాడడం లేదుకదా ? నీవు హాస్యానికి అనడం లేదు కదా?’ అని తెలుగులో చెప్పాలి. అంటే
serious అనే ఆంగ్ల పదానికి వ్యతిరేక పదమైన
హాస్యం ను తెలుగులో వాడుకుంటున్నాం.
వ్యతిరేక పదం తో తెలుగులో భావాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇలా వ్యతిరేకపదాలతో భావాన్ని వ్యక్తపరచడమంటే,ఆ
పరిస్థితి నేటికీ ఉందీ అంటే అది తెలుగు భాషలోని బలహీనతని వోప్పుకోవాలి. దీన్ని బట్టీ అర్ధమౌతున్నదేమిటంటే అనువాదాలు చేసినప్పుడు ఒకోసారి ఇటునుండీ దారి కనబడకపోతే అటునుంచి నరుక్కు రావాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీషులోని భావానికి అనుగుణమైన తెలుగుపదం సూటిగా దొరక్కపోతే,అప్పుడు దాని వ్యతిరేక పదాన్ని పట్టుకుని అటునుంచి ముందుకు సాగాలి. ఇవన్నీచాలా అల్పమైనవి. పైపైకి కనిపించే అతి చిన్న ఉదాహరణలు.
అనువాదమంటే ఎంత క్లిష్టమైనదో,ఎంత కష్టమైనదో,దానికి ఎంత విశాల లోక జ్ఞానమూ,ఎంత విస్తార గ్రంధపఠనమూ ,ఎన్ని సిద్ధాంతాలతో,మతాలతో,విజ్ఞాన శాస్త్రాలతో ఎన్ని దేశ చరిత్రలతో పరిచయము అవసరమో అర్ధం అయితే తప్ప , అనువాదకుని మనుసులో నాటుకు పొతే తప్ప, అనువాదమంటే ఏమిటో, దాని సమస్యా తీవ్రత ఎంతో , అర్ధం కాదు. ఒక భాషకు ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో తెలుసుకుంటే తప్ప అనువాదాలు సాధ్యం కాదు. ప్రతీ దేశ భాషతోనూ ఈ సమస్య ఉంటుంది. అయితే భారతీయ దేశ భాషల్లో ఒకదాని నుండీ మరొక భాష లోనికి అనువదించినప్పుడు సమస్యలు వేరే రూపాల్లో ఉంటాయి. మూల రచయితా యొక్క భాషా పాండిత్యం బట్టీ
అనువాదకుని సమస్యలుంటాయి. ప్రస్తుతం భారతీయాంగ్ల సాహిత్యం కుప్పలుగా వచ్చిపడుతున్న
కాలం. వీటి అనువాదాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఇండియన్ ఇంగ్లీషుని విస్మరించి అమెరికా ,ఇంగ్లాండ్
ఇంగ్లీషులోని రచనలు చేయడమే కారణం.
ఇంగ్లీషు ప్రపంచ భాష కావడం చేత వాళ్ళ నివాస ప్రాంతాల వారిగా ఆయా ప్రాంతీయ
బేధాలను ననుసరించి నిత్యం క్రొత్త పదాలు పుడుతూనే ఉంటాయి. అమెరికా,కెనడా,ఆస్ట్రేలియా,
న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికాల ప్రజల మాతృభాష ఇంగ్లీషే అయినప్పటికీ ఒకోక్క దేశ ఇంగ్లీషు ఒకొక్క రీతిలో , ఉచ్చారణలో,
పలుకుబడుల్లో భిన్నంగా ఉంటుంది. ; “England and USA are two countries divided by same language” అంటాడు, జార్జి బెర్నార్డ్ షా. అదే విధంగా
గమ్మత్తుగా భారతీయ ఇంగ్లీషుగా కూడా ఒకరకమైన ఇంగ్లీషు మనుగడలోఉందంటే ఆశ్చర్యం
వేయకమానదు. ఆ భాషతో మనకున్న అనుబంధం రెండు
వందల ఏళ్ళు కావడమే దీనికి కారణం. అదీ కూడా
బ్రిటీష్ ఇంగ్లీషు మాత్రమే మనకు అలవాటు.దీనినే ఆ రోజుల్లో వ్యంగ్యంగా
బట్లర్ ఇంగ్లీషనేవారు. ఇప్పుడిప్పుడు అమెరికా ఉన్నత విద్యల ఫలితంగా అమెరికన్
ఇంగ్లీషు సంప్రదాయాలు కూడా మనవాళ్ళు వంట పట్టించుకుంటున్నారు. కొనదరు అమెరికన్
ఇంగ్లీషులో రాస్తున్నారు. ఫలితం మరింత గందరగోళం . ఎందుకంటే పదాలు అవే అయినా
పలుకుబడి, అక్షరాల అమరిక, వ్యాకరణ భిన్నంగా ఉండడమే కారణం. ఏది ఏమైనా ఇంగ్లీషు
ప్రపంచంలో అత్యున్నతంగా అభివృద్ధి చెందిన భాష. అంటే ఏంతో విస్తృత పదజాలం ఉండడమే
కాకుండా, ఎంత సున్నితమైన భావమైనా,ఎంత నిఘూడమైనా,ఎంత విశిష్ట సందర్భ మైనా దాన్ని
వ్యక్తం చేయడానికి సరిగ్గా తగిన మాట ఉండడం అనే గుణం ఏ ఇతరభాషలకు లేనంతగా ఇంగ్లీష్
భాషకుంది. అందుకే ఇంగ్లీషును the most idiomatic language అంటారు.అంటే ఆ భాషలో ఉన్నన్ని జాతీయాలు మరే
భాషలోనూ లేవని అర్ధం. ఇదే అనువాదకులకు పెద్ద తలనొప్పిగా పరిగణిస్తుంది. దీనికి తోడూ మన ఇండియన్ ఇంగ్లీషు ఒకటి.
బ్రిటీషు కాలంలో ఆంగ్ల ఉర్దూ హిందీ
సంకర పదాలు విరివిగా పుట్టుకొచ్చాయి. ఇంగ్లీష్ లో వాడుకలో నేటికీ ఉన్నాయి. ఉదా; జింఖానా(పర్షియా; సామాజిక మైదానం)
,టీ పాయ్(మూడు కాళ్ళ టేబుల్ ), డాక్ బంగాళా(ప్రభుత్వ విశ్రాంతి గృహం ) లాటీ చార్జ్
ఇలా చాలా ఉన్నాయి. ఉదయం చేసే అల్పాహారాన్ని టిఫిన్ అంటాం. టిఫిన్ అనేది ఇంగ్లీషు పదమే. అయితే ఇది భారతదేశంలో
పుట్టింది. దీని అర్ధం భారతీయులకు తప్ప మరే ఇతర ఇంగ్లీషు మాట్లాడే దేశాలవారికి
తెలీదు, వడరు కూడా.
అనువాదాలు చేసినప్పుడు ఎదురైయ్యే
సమస్యలు ఒకవిధంగా ఉంటాయని చెప్పలేము. ప్రతీపదాన్ని ప్రతీ వాక్యాన్ని ఒకటికి ఆరు
సార్లు చూడాలి. మనకు తెలిసిన అర్ధమూ అక్కడ భావానికి సంబంధించిన అర్ధమూ ఒకలాగా
ఉండదు. తీరా దగ్గరగా ఉన్న సమానార్ధం ఇచ్చే పదం దొరికినా అక్కడ వాక్య నిర్మాణానిక
పొసగదు. ప్రధానంగా ఆంగ్లానువాద సమస్యలు రెండు వర్గాలుగా చూడవచ్చు.
- మొదటిది ;వాక్య నిర్మాణానికి సంబంధించినది,
-రెండవది ; పదాలకు సంబంధించినది. పదాలకు
సంబంధించిన సమస్యలంటే మామూలు పదాలతో పాటూ జాతీయాలూ ,ఇతర పదబంధాలు, నుడికారాలూ
అన్నీటికీ సంబంధించినవి,అన్నమాట.
ఇంగ్లీషులోని ఒక వాక్యాన్ని తీసుకుంటే, అందులో ఉన్న అన్ని
పదాలూ మనకు తెలిసినవే, సులభంగానే అర్ధం అవుతాయి. కానీ అన్ని మాటలనీ కలిపి వాక్యంగా
రాయాలంటే కష్టమౌతుంది. ఎందుకు? ఎందుకంటే, ఇంగ్లీషు వాక్య నిర్మాణానికీ ,తెలుగు
వాక్య నిర్మాణానికీ చాలా భేదం ఉంది. ఇదే అనువాదకునికి నిరంతర సమస్య. వివరంగా చెప్పాలంటే రెండు భాషల్లోనూ
వాక్య నిర్మాణాలలో కర్త, కర్మ, క్రియ వేరు వేరు క్రమాల్లో వస్తాయి. మూల ఆంగ్ల భాషలో
ఉన్న క్రమం లో రాస్తే అనువాదం అర్ధం అయ్యే
ప్రసక్తే లేదు. ఒక చాలా చిన్న ఉదాహరణ చూద్దాం. ‘రన్ ఫాస్ట్’ అనే ఇంగ్లీషు పదాన్ని
అనువదిస్తే ‘వేగంగా పరిగెత్తు’ అని రాయాలి. ఇంగ్లీషు లో ‘రన్’ అనే క్రియ ముందు
వస్తే, తెలుగులో ‘పరిగెత్తు’ అనే క్రియ తరవాత వస్తుంది. అలాగే ‘టు సీత’ అనే పదాలను
‘సీత కు’ అని రాస్తాం. విభక్తి ప్రత్యయం (preposition), తెలుగులో విశేష్యానికి(నామవాచకము ) అంటే
nounకు ముందు వస్తే ఇంగ్లీషులో తరవాత
వస్తుంది.
అయితే అంతకంటే పెద్దదీ,ముఖ్యమైన భేదం ఏమిటంటే ఇంగ్లీషు వాక్యం ఎంత పొడవైనా
రాయవచ్చు. కానీ తెలుగులో అంత పెద్ద వాక్యం కుదరదు. ఒక వేళ కుదిరినా ఖచ్చితంగా అర్ధం కాదు. అంతేనా?
అన్నిటికంటే ముఖ్యమైన భేదం మరొకటి ఉంది, అదే ఉప వాక్యాల సమస్య. ఇంగ్లీషులో పదాలకు సంబంధిచిన
చిన్న చిన్న సర్వనామాలతో (pronouns), చిన్న చిన్న
విశేషనాలతో (adjectives), క్రియా విశేషనాలతో(adverbs) అనేక ఉపవాక్యాలు నిర్మించి అన్నిటినీ ఒకే
వాక్యంగా ప్రోది చేయవచ్చు.
ఆంగ్లంలో సర్వనామాలు,
విశేషనాలు, క్రియావిశేషనాలంటే ఏవేవో who, which, what, when, where, why మొదలైనవన్నమాట. ఇలా పొడవైన వాక్యాల నిర్మాణం యురోప్
భాషలలోనూ ఉంది. సంస్కృతంలోనూ దాని నుండి పుట్టిన ఉత్తర భారత భాషలలోనూ ఉంది.
కానీ ద్రావిడ భాషలలో లేదు. ఒకవేళ ప్రయత్నించినా చాలా కృత్రిమంగా ఉంటుంది. కనుక వాక్యం మరీ
పెద్దగా ఉందనుకుంటే దాన్ని రెండు మూడు చిన్నచిన్న
వాక్యాలుగా విడగొట్టి అనువాదం చేయడం మంచి
ప్రక్రియ.దీనిని అలవర్చుకోవడం మంచిది. కానీ ఒకోసారి వాక్యమంతటా ఒకే భావంతో ఏక సూత్రంగా
ఉంటుంది. అలాంటప్పుడు వాక్యాన్ని ముక్కలు చేస్తే భావం చెడి, సారహీనం కావడానికి, విరూపం
చెందడానికి అవకాశము కూడా ఉంది. అంటే ఆ పొడవైన వాక్యాన్ని ముక్కలు చేయకుండా రాస్తే ఆ వాక్య కృత్రిమంగానూ ,అన్వయ
క్లిష్టంగానూ, దుర్భోధకంగానూ ఉంటుంది. ముక్కలు చేసి రాస్తే అర్థానికి నష్టం కలిగే
అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని
వాక్యాలు అరపేజీ నుండీ పేజి వరకూ ఉంటాయి.
“dont let him beat children”అనే వాక్యాన్ని ఎలా
అనువదించాలి?(పిల్లలని కొట్ట వద్దని అతనికి చెప్పాలి-అదీ ఉద్దేశం ) చదవడానికి
సుభంగానే ఉంది. సులభంగానే అర్ధం అవుతుంది. మరి అనువాదం చేస్తే “అతన్ని పిల్లలను
కొట్టనివ్వవద్దు” అంత సులభంగా అర్ధం కావడం
లేదు కదా? ఈ వాక్యం లో రెండు భాషల్లోనూ రెండు క్రియలు,రెండు కర్మలు ఉన్నాయి.
ఇంగ్లీషులో మొదటి క్రియ తర్వాత కర్మ అనంతరం రెండవ క్రియ తర్వాత కర్మ వచ్చేయి . మరి
తెలుగు లో కర్మలు రెండూ ఒకదాని వెంట తర్వాత క్రియలు రెండూ ఒకదాని తర్వాత వచ్చాయి.
రెండు కర్మలూ (అతన్ని,పిల్లలని) ప్రక్కప్రక్కన రావడమే గందరగోళానికి కారణం.
అలాంటిదే మరొక చిన్న వాక్యం. “let her marry him”, దీన్ని ప్రయత్నించి చూడండి. ఇంగ్లీషు
వాక్యం వెంటనే అర్ధం అయిపోతుంది.మరి,అనువాదం చేస్తే “ఆమెను అతన్ని పెళ్లి
చేసుకోనివ్వండి” అని రాయాలి. అర్ధం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది.
తెలుకోవాల్సింది ఏమిటంటే ఇంగ్లీషు క్రమం ప్రకారం రాస్తే తెలుగు వాక్యం వికారంగా
తయారు కావచ్చునన్నమాట. ‘చేసుకొనీ ఆమెను పెళ్లి అతన్ని’ కృతకంగా ఉంది కదా. ఇవి
కేవలం రెండు మూడు పదాల వాక్యాలు మాత్రమే. కాస్త లోతుకు వెళ్లి అయిదారు పదాల
వాక్యాలు, అవి ఒకటి రెండు విశేషణా లతో
కలిపి రాస్తే ఆ వాక్యాలను అనువాదం చేయడంలో ఉంటుంది అసలు శ్రమంతా .
వాక్యాల సమస్య
చూసాం. రెండవ సమస్య పదాలది. పదాలు, పదబంధాలు, జాతీయాలు, నుడికారాలు అన్నీ ఇందులోనికే వస్తాయి. ఇదే సమస్యలో ప్రధాన సమస్య. మన దురదృష్టం కొద్దీ చాలా ఇంగ్లీషు
మాటలకు తెలుగు సరైన మాటలు లేవు. అలాగే తెలుగులో ఉన్న కొన్ని పదాలకు ఇంగ్లీషు మాటలు
లేవు. ఉదాహరణకు అన్న, తమ్ముడు, అక్క,చెల్లెలు,మేనత్త,పెద్దమ్మ, పిన్నమ్మ వీటికి
ఆంగ్ల పదాలు లేవు కానీ వారు సృష్టించుకున్నారు. అంటే ఒక భాషలో ఉన్న పదాలు మరొక
భాషలో ఉండవన్నమాట. ఎందుకు ఉండవు?
భాష అనేది ఒక జాతి జనం సృష్టించు కునేది. ఆ
జాతి నివసించే భూభాగపు శీతోష్ణ స్థితులనుబట్టీ ,భౌగోళిక పరిస్థితులను బట్టీ దాని
జీవిత విధానం ఉంటుంది. ఆ జీవిత విధానాన్ని బట్టీ దాని భాష ఉంటుంది. ఐరోపా దేశాలకు
మన దేశానికీ భౌతిక , భౌగోళిక పరిస్థితులలో
చాలా భేదం ఉంది. కనుక రెండు చోట్ల జీవన విధానాలలో వ్యత్యాసం ఉంది కనుక భాషల
మధ్య బెదాలున్నాయి. మరొక కారణం ఏమిటంటే జాతులు నాగరిక మయ్యే కొద్దీ ,జీవిత విధానాలలో
మార్పులు వచ్చే కొద్దీ, ఆయా భాషలు వికసిస్తూ వృద్ధి చెందుతూ ఉంటాయి. గత నాలుగు శతాబ్దాలుగా ఐరోపా
జాతులు వృద్ధి చెందినంతగా ప్రపంచంలో మరే జాతులూ వృద్ధి చెందలేదు. మరే భాషలూ
వికసించలేదు. “మామిడి పండు” అనే మాటకు సమాన మాట భారతదేశ అన్ని భాషల్లోనూ ఉంది.
కానీ యూరోప్ లోని ఏ భాషలోనూ లేదు. ఎందుకంటే అక్కడ మామిడి పండు లేదు,కనుక.
ఇంగ్లీషువారు మన దేశానికొచ్చి మామిడి పండును చూసి ,తమిళంలో దాని పేరు ‘మాంగాయ్’
అని తెలుసుకుని “మాంగో” అనే పదాన్ని సృష్టించుకున్నారు. ఇలా తెలుగులో మంచు అనే పదం
ఉంది. లేదా పొగమంచు, మంచు గడ్డ అంటాం. యూరోపియాన్లకు సుమారు పది పేర్లు ఉన్నాయి.
mist, dew, fog, frost, snow, ice, slush, sleet, smog ఇలా. వారికి ఈ తొమ్మిది రకాలు మంచుకు సంబంధించిన ప్రత్యక్షంగా తెలుసు. ఇవి ఒకదాకికొకటి పర్యాయ
పదాలు కావు.ఒక్కొక్క పదానికి అక్కడ ఒక్కొక్క అర్ధంలో వారు వాడతారు. ఒకే
పదార్ధం రూపం మారి ఇన్ని పేర్లను సంతరించుకోవడంలో తెలుస్తుంది, ఆంగ్ల భాష
ఎంత పరిపుష్టిగా ఉందో. దీనికి కారణం అక్కడ భౌగోళిక పరిస్థితి.
నాగరికత
అభివృద్ధి చెందే కొద్దీ కొత్త కొత్త భావాలు సూక్ష్మమైనవీ ,సంకీర్ణమైనవీ
,ప్రౌఢమైనవీ, నిఘూడమైనవీ మనుషులకు పరిచయం అవుతూ ఉంటాయి. వాటికి తగినట్లుగా భాష
కూడా అభివృద్ధి చెందుతుంది. సమాజం పురోగమించే కొద్దీ కొత్త అలవాట్లు, కొత్త
ఆచారాలు, వాటితో పాటూ కొత్త పదాలు
పుట్టుకొస్తాయి. ఇంగ్లీషువాళ్ళ నాగరికత మన నాగరికత కంటే బాగా వికసించినందువల్ల వాళ్ళ
భాషలో ఉన్న అనేక పదాలకు మన భాషలో సమానార్ధకాలు లేవు. sabotage, బ్లాక్ మెయిల్
,కెరీర్ లాంటి పదాలు అలాంటివే. పబ్లిక్ ,ప్రైవేట్ లాంటి పదాలకు నేటికీ మనం సాధారణ
సమాన అర్దాలున్న పదాలను సృష్టించు కోలేకపోయాం. కారణం మన నాగరికత లోపమే అనాలి. ఆ
లోపమే మన అనువాదాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సరే అనువాదకుడు
వాటికి సమాన అర్ధాన్నిచ్చే కొత్త పదాన్ని సృస్టించాడు అనుకుందాం. సృష్టించినా పాఠకుడికి
అర్ధం కాకపోవచ్చు. దరిమిలా ఆ అనువాదాన్ని, ఆ పదాన్ని ఆదరించకపోవచ్చు. అనువాదకును
ప్రతిభ వృధా కావచ్చు. ‘విండో’ అనే ఇంగ్లీషు పదానికి నేటికీ తెలుగు పదం లేదంటే
ఆశ్చర్యమే కదా! అదేంటి ‘కిటికీ’ అంటాం కదా అంటారా? అది ఉర్దూ పదం. ఇక రెండేసి
అర్దాలున్న ఈ ఆంగ్ల పదాలను గమనించండి. ‘రూఫ్,సీలింగ్’ రెండు పదాలకు తెలుగు
పదాలేమిటి? ‘మేరేజి ,వెడ్డింగ్’ పదాలకు తెలుగులో రెండు పదాలున్నాయా? ‘డిస్కవరీ ,
ఇన్వేంట్’ పదాలకు రెండు అర్దాలున్నాయి ఇంగ్లీషులో. మరి తెలుగులో ఉన్నాయా? పోనీ, ‘air’ అంటే ఏమిటి? ‘బ్రీజ్’
, ‘విండ్’ అంటే ఏమిటి? మీరు అనుకుంటున్నట్లు గాలి, వాయువు, పవనం, మారుతం ఇవన్నీ పర్యాయ పదాలు
తప్ప ఆ మాటలకు అర్ధాలు కాదు. ఇటువంటి రెండు పదాలు ఒకే వాక్యంలో ఉంటే ఎలా
అనువదించాలి? ఇవన్నీ సమస్యలే.
అనువాద సమస్యలను వివరిస్తూ Alexander fraser
tytler అనే ఆయన 1791 లో ‘essays on principles
of translation’ అనే గ్రంధం రాసాడు. అనువాదం మీద ఇంగ్లీషులో
వచ్చిన మొదటి పుస్తకం ఇదే. ఆయన మంచి అనువాదాలేలా ఉండాలో వివరించాడు. ఈ
అభిప్రాయాలకు కారణాన్ని కూడా ఆయనే చెప్పాడు. భాషలన్నీటికీ ఒకే స్వభావమూ ,సమామైన
సామర్ధ్యమూ ఉంటే అనువాదాలు చాలా సులభంగా ఉండేవి. కానీ వివి ధ భాషల సామర్ధ్యాలు
విభిన్నంగా ఉన్నాయి, కాబట్టీ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి .
-అనువాదకుడు
మూల రచన యొక్క అర్ధాన్ని ,తాత్పర్యాన్ని శ్రద్దగా గమనించి, గ్రహించి తద్వారా మూల
రచయిత భావాలను నిర్దుష్టంగా, సమగ్రంగా, అవగాహన చేసుకుని ఆ
భావాలను అత్యుత్తమంగా వ్యక్తం చేయగల పదాలను వెల్లడించాలి. ఇదొక అభిప్రాయం. దీన్ని
అనుసరిస్తే అనువాదకునికి కాస్త వెసులుబాటు, స్వేఛ్చ ఉంటాయి. అనువాద రచన రక్తి కడుతుంది.
-
అనువాదం శ్రాష్టంగా ఉండాలంటే మూల రచయితా భావాలను, అనుభూతులను వ్యక్తం చేయడమే కాకుండా అతని శైలినీ, రచనా
విధానాన్నీ కూడా వ్యక్తం చేయగలగాలి. ఆ పని చేయాలంటే అతని వాక్యాలపొందికను, వాక్యాల
నిర్మాణాన్ని అనువాదకుడు శ్రద్దగా గమనించాలి. ఇది రెండవ అభిప్రాయం. దీన్ని
అనుసరిస్తే మూల రచనను అణువంత కూడా మార్చే అవకాశం ఉండదు. పైగా మూలం లోని లోపాలూ, దోషాలూ
యధావిధిగా అనువాదంలోనూ కొనసాగించాలి. ఇలాంటి అనువాదాలు సరళంగా,సాఫీగా ఉండవు. కరుకుగా
ఉంటాయి అని వేరే చెప్పక్కర లేదు.
అయితే పై రెండు అభిప్రాయాలూ రెండు విపరీత
రీతుల్లోనున్నాయి. ఒకటి ఈ కొసకు మరొకటి ఆ కొసకు
ఉన్నాయి. ఈ రెండింటికీ మధ్యే మార్గంగా అనువాదాలు ఉండవచ్చనే మూడవ అభిప్రాయం కూడా ఉంది. దీన్ని చూద్దాం.
-
మూలభాష, మాతృభాషగా గలవానికి మూలరచన లోని సారాంశం
ఎంత స్పష్టంగా అర్ధమై ,ఎంత ఘాడమైన అనుభూతిని కలిగిస్తుందో – లక్ష్యభాష, మాతృభాషగా
కలవానికి అనువాదంలో సారాంశం అంత స్పష్టంగా
అర్ధమై అంత ఘాడమైన అనుభూతిని కలిగిస్తే ,అది అంత మంచి అనువాదంగా చెప్పుకోవచ్చును.
పై నిర్వచనాన్ని బట్టీ అనువాదానికి కొన్ని
నియమాలను అనుసరించవచ్చు. మొదటిది; అనువాదం మూలరచన లోని భావాలను సంపూర్ణంగా వ్యక్తం
చేయాలి. రెండవది; శైలీ, రచనా విధానము మూలంలో ఉన్నట్లే అనువాదం లోనూ ఉండాలి.
మూడవది; మూల రచన ఎంత సాఫీగా ఉందో, అనువాదము కూడా అంతే సాఫీగా ఉండాలి. అంటే మూల రచనని ఆ భాషలో చదివే వానికి ఎంత స్పష్టంగా,సుభోధకంగా
ఉందో ,అనువాదం ఈ భాషలో చదివే వానికి అంతే స్పష్టంగానూ, సుభోధంకం గానూ ఉండాలి. మొదటి రెండు
నియమాలూ చాలా ముఖ్యమైనవి. కానీ మూడవ నియమం అత్యంత కీలకమైనదీ, కష్టమైనది. ఈ మూడు
నియమాల మధ్య ఎక్కడ తులనాత్మకత బెడిసి కొట్టినా అనువాదం బెడిసి కొడుతుంది . ఏ కారణం
చేతనైనా ఏదో ఒక నియమం త్యాగం చేయాలంటే రెండవ నియమాన్ని త్యాగం చేయవచ్చు. అంటే
శైలినీ, రచనావిధానాన్ని కాస్త త్యాగం
చేయవచ్చునన్న మాట. అనువాదం మాత్రం సుభోధకంగా ఉండాలి. కాని కొందరు అనువాదకులు
దీనితో ఏకీభవించకపోవచ్చు. శైలి అనేది ,భావాలకు సౌకుమార్యాన్నో,సౌందర్యాన్నో
,పటుత్వాన్నో,ఆవేశాన్నో సమకూర్చే సాధనం అని గుర్తుంచుకోవాలి.
ఇంగ్లీషు మాటలో ఖచ్చితంగా ఏ అర్ధం
ఉందో ,ఎంత అర్ధం ఉందో తెలుగు మాటలోనూ అదే అర్ధం ఉండాలి. అంటే అర్ధం లవలేసం కూడా
ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలి. ఇంగ్లీషు వాక్యం ఏ భావాన్ని ఎంత స్పష్టంగా ,ఎంత
ఖచ్చితంగా వెల్లడిస్తోందో ,అదే భావాన్ని అంత
స్పష్టంగానూ,అంత ఖచ్చితంగానూ
తెలుగు వాక్యం వెల్లడించాలి. సూటిగా సరళంగా ఉన్న మూలాన్ని అనువదించడంలో కష్టమంతా ఇదే .
అనువాదాలమీద
అనువాదకులకే అనేక భిన్నాభిప్రాయాలున్నాయని అర్ధం అవుతుంది కదూ,నిజమే .
Theodore savory అనే పెద్దాయన ఒక
చిత్రమైన, పరస్పర విరుద్దమైన ప్రతిపాదన
చేసాడు, తన “అనువాద కళ” (The Art of Translation ) అనే గ్రంధంలో. ఆ గ్రంధంలోని
తన అభిప్రాయాలను ఇలా క్రోడీకరించాడు. మూలభాషలోని
మాటలను అనువదించాలని ఒకరు. మాటలను కాదు, భావాలను అనువదించాలని ఒకరు. అనువాదం మౌలిక
రచనలా ఉండాలని ఒకరు, లేదు అనువాదం అనువాదం లాగే అనిపించాలని ఒకరు. అనువాదంలో మూల
రచన యొక్క శైలి ప్రతిబింబించాలని ఒకరు, లేదు అనువాదకుని శైలిని వ్యక్తం చేయాలని ఒకరు. అనువాదం ఏ కాలం
నాటిదో ఆ కాలం నాటిదిగా కనిపించాలని ఒకరంటే, లేదు అనువాదకుని కాలంనాటిదిగా
కనిపించాలని ఒకరంటారు . మార్పులూ,చేర్పులూ చేయవచ్చని ఒకరు, కుదరదని ఒకరు. మూలం
ఛందోబద్దంగా ఉంటే అనువాదం కూడా అలాగే
ఉండాలని ఒకరు, వచనలో ఉండాలని మరొకరు. ఇలా ఎవరికీ తోచిన సూచనలు, సలహాలు, నియమాలతో
ఆఖరికి అనువాదం అంటే అనువాదకులకు ఒక పీడ కల అనిపించేటంతగా భయపెడుతున్నారు. ఇవన్నీ
ప్రక్కన పెట్టక తప్పదు.
ఎందుకంటే అనువాదాలను చదివేవారు కూడా నాలుగు రకాలుగా ఉంటారు. 1 .
బొత్తిగా మూలభాష తెలియనివారు, 2. మూలభాష నేర్చుకునే విద్యార్థులు, 3. మూలభాష బాగా
తెలిసి మరిచిపోయినవారు, 4 మూలభాష బాగా ఎరిగినవారు. అంటే అనువాదాలు నాలుగు రకాలుగా
ఉండవచ్చన్నమాట. మొదటి రకం వాళ్లకు స్వేచ్చానువాదం సరిపోతుంది. సులభంగా అర్ధమై ,
అనువాద ప్రయోజనం తీరుతుంది. మూలభాష తెలిసినవారికి అత్యంత శాబ్దికమైన అనువాదం literal
translation అవసరం. అంటే వీలైనంత వరకు మూలంలోని శబ్దాలను –మాటలను అన్నిటినీ
తెలుగులోనికి మార్చడం అన్న మాట. ఒకే మూలగ్రంధానికి అనేక అనువాదాలు రావడానికి ఇన్ని
రకాల పాఠకులే కారణం కావచ్చు .
ఇక అనువాదాల్లో తప్పులు ఎక్కడ ఎలా
జరుగుతాయనే విషయానికొస్తే ప్రతీ పదం, ప్రతీ వాక్యం అనువాదం లోనూ తప్పులు ఎంచవచ్చు.
దీనికి అనువాదకుని అనువాద లోపం కావచ్చు, భాషా లోపం కావచ్చు ,లేదా రెండూ కావచ్చు. ఇంగ్లీషు లోని భావం అర్ధమై కూడా,
తెలుగులో దాన్ని ఎలా చెప్పాలో తెలియక లేదా ఆభావాన్ని సరిగ్గా వ్యక్తంచేసే తెలుగు నుడికారం తెలియక , అనువాదకుడు చేసే
తప్పులు ఒక రకం . మక్కి కి మక్కి అనువాదాలు ఈ కోవలోనికి వస్తాయి. ఇంగ్లీషులో ఉన్న
భావాన్ని సరిగా అర్ధ చేసుకోలేక అనువాదకుడు చేసే తప్పులు రెండవ రకం. ఎందుకంటే 90
శాతం ఇంగ్లీషు పదాలకు నానార్ధాలు ఉంటాయి. ఒకే అర్ధం ఉన్నపదాలు ఆగ్లంలో ఉన్నవి
కానీ సందర్భోచితంగా వాటి మారిపోతూ ఉంటాయి. భాష తెలుసనే అతినమ్మకం వలన , మితిమీరిన ధీమా వలన ఈ తప్పులు
జరగవచ్చు. మూడవరకం తప్పులు వాక్యాలకు సంబధించినవి . ఇంగ్లీషు వాక్యంలోని మాటలన్నీ
అర్ధమై కూడా ఆ వాక్యం దీర్ఘంగా,క్లిష్టంగా అనేక ఉపవాక్యాలతో కూడి ఉన్నప్పుడు వచ్చే
సమస్య. ముఖ్యంగా కర్తలూ, కర్మలూ ఉపవాక్యాల రూపంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అర్ధం
చేసుకోవడంలోనే అనువాదకుడు పొరపాటు పడవచ్చును. ప్రతి వాక్య నిర్మాణాన్ని ఎంతో
మెలకువతో, ప్రజ్ఞతో నిర్మించాలి. ప్రతీ క్షణం పదాలకు సమానార్దాలకోసం శ్రమ ఉండనే ఉంటుంది.
పాఠకునికి అర్ధం అయ్యేలా చెప్పడం
అనువాదకుని బాధ్యత . కనుక అతడు సృష్టించిన కొత్త నుడికారాలూ, కొత్త పదాలను
బ్రాకెట్లలోగానీ లేదా పాద వివరణగా (ఫుట్ నోట్) గానీ వివరించాలి. లేదా చివరన ఒక
పదకోశం రూపంలో తెలపాలి. పాఠకునికి అర్ధం కావనే నెపం తో కొత్త పదాల సృష్టిని వ్యతిరేకించేవాళ్ళు
భాషకు శత్రువులే. ఎందుకంటే జీవభాషలు మారకుండా పెరగకుండా అభివృద్ధి చెందకుండా ఉండవు. ఇప్పటికే వేల పదాలను మనం
సంస్క్రుతం నుండీ, ఉర్దూ నుండీ,ఇంగ్లీషు నుండీ అరువు తెచ్చుకున్నవి చెలామణి లోనున్నవి.
fire
service ను అగ్నిమాపకం అంటాం. మాపకం(సంస్కృతం) అంటే ఒక పరికరం అని, వాషింగ్
సోప్ ను బట్టల సబ్బు అంటాం గానీ, ఉతుకుడు సబ్బు అనం. అలా , దగ్గరగా ఉన్నపదాలను
సృష్టించుకున్నాం.
ఔత్సాహిక అనువాదకులను ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఆంగ్లవ్యాకరణము లోని కాలాలు. అంటే భూత
భవిష్యత్ వర్తమానకాలాలు, అలాగే పురుష లు . వ్యాసాలూ కధలు అనువదించినప్పుడు అనువాదకునుకి
ఇవి కనిపించని శత్రువులు . 1st person
,2nd person ,3rd person అంటే ఉత్తమ ,మధ్య, ప్రధమ పురుషాలని అర్ధం. తేడా
గమనించండి. 3rd person ఇక్కడ ప్రధమ పురుష అని అర్ధం. అలాగే శబ్ద చమత్కారాలు, శ్లేషార్ధాలు,శబ్దాలంకారాలు
ఏ భాషనుండైనా ఏ భాషలోనికైనా అనువదించడం అసాధ్యమని గుర్తుంచుకోవాలి. వీటికి
ఉదాహరణలు శ్లోకాలు .
చివరగా ఒక క్లిష్టమైన,గమ్మత్తైన ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవాలి. లెనిన్ జీవితచరిత్రను
ఆంగ్లం నుండీ తెలుగులోనికి ఒక కమ్యునిస్ట్ అనువాదకుడు అనువాదం చేసారు. లెనిన్ జైల్లో ఉన్నప్పుడు చెప్పాల్సిన ఒక వాక్యం, “writing messages in milk from ink stand of
black bread” అనే వాక్యాన్ని-“మాడిపోయిన రొట్టె పై పాలతో సూచనలు రాస్తూ ...”.
బ్లాక్ బ్రెడ్ అంటే ధాన్యం తో చేసిన
ఒకరకమైన రొట్టె. జైల్లో ఆ బ్రెడ్డుకు గుంత చేసి దానిలో పాలు పోసి ఇంకు స్టాండ్ గా
తయారుచేసుకుని ,పుల్లను పాలలో ముంచి ,తెల్ల కాగితాలమీద తన సందేశాలు రాసి బయటకు పంపే వాడు,లెనిన్ . ఎవరైనా చూసిన
తెల్లకాగితం మీద తెల్ల అక్షరాలూ కనబడవు. ఆ
కాగితాన్ని కాస్త వేడి చేస్తే పాల కుంచెతో రాసిన అక్షరాలూ కనబడతాయి. ఇదంతా మనకు అతని అనువాదం లో అర్ధం అవుతుందా?
స్థానికి సంస్కృతీ సంప్రదాయాల పై అవగాహన
లేకపోతే జరిగే అనర్ధాలివి .
ఇక, కవిత్వానువాదంతో సమస్యలు
చెప్పడానికి సమయము ,స్థలమూ చాలవు. మనం ఎక్కువగా అనువాదాలు చేసేది వచన వాజ్ఞ్మయమే.
అంటే నవలలు,కధలు,వ్యాసాలు. ఇంగ్లీషు కవిత్వాన్ని తెలుగీకరించేవారు చాలా అరుదుగా
తారాసపడతారు.శ్రీ.శ్రీ గారు ఇంగ్లీషు స్పానిష్ ఫ్రెంచ్ కవిత్వాన్ని అనువదించారు.
టాగూరు కవిత్వం తెలుగులోనికి బెంగాలీ నుండే కాక ఇంగ్లీషు నుండీ కూడా వచ్చింది.
కవిత్వంలో మనోహరత్వం ఉంటుంది. కవిత్వంలో కరుకుదనం ఉంటుంది. భక్తీ , ప్రేమ, నిరసన, వివక్షలాంటి
అనేక అనుభూతులుంటాయి. ఇవన్నీ అనువాదకుని
కంఠస్వరంలో కలం ద్వారా ప్రతిఫలించాలి . అన్నిటికీ మించి ఒక కవితాత్మ ఉంటుంది. అది
స్వయం వ్యక్తీకరణ కోసం తహతహలాడుతుంది. దానిని అనువాదకుడు వ్యక్తం చేయగలగాలి.
ఇవన్నీ రూబెన్ బ్రోవెర్ సంపాదకీయంలో వెలువడిన ‘On Translation’ అనే హార్వర్డ్ యునివర్సిటీ వారు ముద్రించిన గ్రంధం లో ఉన్నాయి.
అంతే కాకుండా కవిత్వానువాదంలో పైన చెప్పుకున్న
సమస్యలతో పాటుగ ఛందస్సు, లయ, నడక, మాటలకు గల అనుభూతి, నేపధ్యమూ, స్వరమూ ఉంటాయి.
వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
పికాసో గారిని ఆయన వేసిన బొమ్మనే మళ్ళీ వేయమంటే ఆయన ఖచ్చితంగా మక్కికిమక్కి
గీయలేదు. హెచ్చుతగ్గులో,సృజనలో
మార్పో తప్పనిసరిగా ఉంటుది. ఎవరైనా ఒక బొమ్మను
చూసి అలాగే కాపీ చేయడం అంటే అంత సులభం ఏమీ
కాదు. పొరపాట్లు సహజం. అనువాదామూ అంటే. వీలైనన్ని తక్కువ దోషాలతో , వీలైనన్ని
తక్కువ స్వంతపైత్యాలతో, వీలైనంత సరళంగా చేస్తే అనువాదాలు రక్తి కడతాయి.
స్వంతనిర్ణయాలకు, అనవసర భేషజాలకు పోకుండా
వీలైనంతగా తోటి అనువాదకులతో చర్చిస్తే వీలైనంత మంచి అనువాదాలను సమాజానికి
ఇవ్వగలుగుతాం.
.................................
References;
అనువాదాల సమస్యలు- రాచమల్లు రామచంద్రారెడ్డి
అనువాదాలు-అపవాదాలు- వెల్చేరు నారాయణరావు
Essays on the principles of Translation -అలెగ్జాండర్ ఫ్రేటర్ టైట్లర్
The Art Of
Translation- థియొడర్ సేవరీ
రెనెటో సోగియోలీ and జె. సి. కాట్
ఫోర్డ్
No comments:
Post a Comment