Friday, 10 April 2020

బెస్త వాని నీతి


బెస్త వాని నీతి
                                                                                                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్

ఏమండీ , !మా తమ్ముడూ , మరదలూ వస్తానన్నారు, ఇక్కడ దగ్గరలో బాంకులో  ఏదో పని ఉందట, ఆ పని చూసుకుని మధ్యాహ్నం వేళకు కు ఇంటికి వస్తానన్నారు, కాస్త కూర తెచ్చి పెట్టరూ... ప్లీజ్ ...”అంది ఆది వారం ఉదయం నాకు ఎంతో విలువైనది అని తెలిసి కూడా ..కాస్త గోముగా.
అలా అడిగేటప్పటికీ కాదనలేక పోయి  నా ముఖంలోని చిరాకుని బయటకు కనబడనీయకుండా “అలాగే, ఏమి కావాలి?” అన్నాను .
“వాళ్ళిద్దరికీ చెరువు చేప అంటే చాలా ఇష్టం, వాళ్లకి అక్కడ అవి  దొరకవట,. ఏదైనా మంచి  చెరువు చేప తీసుకు రండి...చాలు”
“అలాగే పది నిముషాల్లో వెళతానులే,”అని పేపర్ మడత పెడుతుంటే
“త్వరగా వెళ్ళక పోతే మంచివి అన్నీ అయిపోతాయి, అప్పుడే ఎనిమిది అయిపొయింది, ”అంది,  నా వోప్పుకోలును కాస్త అలుసుగా తీసుకుంటూ ..
“నేనూ వస్తాను నాన్నా,! “ అంటూ హాల్లోకి వచ్చాడు , నోటి నిండా పేస్టూ నురగతో ముద్ద ముద్దగా మాట్లాడుతూ  “నువ్వెందుకూ చదువుకో, మనకు నెక్స్ట్ వీక్ నుండీ పరీక్షలున్నాయి..”  అంది వాడి ఏడేళ్ళ చెల్లి. వీడి కంటే మూడేళ్ళు చిన్నది .
“నువ్వే చదువుకో , నువ్వే లెక్కల్లో వీక్,” అన్నాడు , వెళ్లి పేస్టూ నురగ ఉమ్మేసి గబగబా తిరిగి వచ్చి
“నాన్నా నేను వస్తున్నానంతే” అని, డిసైడ్ అయిపోయాడు
“సరే, కానీ! ఈ సారి నీకు ఉల్లి కాడలు మాత్రం కొనను” అని ముందే వార్నింగ్ ఇచ్చాను 
వాడు ఎప్పుడు బజారుకి వచ్చినా  ఒక కట్ట ఉల్లి కాడలు కొని పించుకుంటాడు. వాటితో పొడవైన గోట్టాలుగా చేసి టెలిఫోన్ ఆట,పుల్లల ఆధారంగా రకరకాల బొమ్మలు చేయడం , గ్లాస్ లో నీళ్ళు పోసి ఊదడం లాంటి అనేక చిలిపి ఆటలతో ఆ రోజంతా ఇల్లంతా ఉల్లికాడలతో ఉల్లి వాసనతో నింపేస్తాడు.
“అక్కర్లేదు నాన్నా ! అయినా ఇది ఉల్లికాడల  సీజన్ కాదులే వర్రీ అవకు,” అన్నాడు .వాడి తెలివికి ఆశ్చర్యం వేసింది.
                             ..............................................................
              చేపల మార్కెట్ రద్దీగా ఉంది. అన్ని దుకాణాలను ముందు సర్వే  చేసాం ఇద్దరం. ఎవరి దగ్గర తక్కువ మంది జనం ఉంటే  అక్కడ కొనడం నాకు అలవాటు. అక్కడున్నవాటిలో మంచివేవో ఏరి కొంటూ ఉంటాను. లేకపోతే  వారి దగ్గరున్నవి ఎవరూ కొనకపోతే రేపటికి అవి ఇంకా పాడైపోయి వాడి ఇంకా నష్టం వస్తుందేమో నని నా అనవసర ఆలోచన. కానీ అక్కడ ఆపరిస్థితి లేదు . అందరి దగ్గరా జనం నిండుగా ఉన్నారు.ఒకచోట ఆగాము ఇద్దరమూ. ఇంతలో  అక్కడ బేరమాడుతూ ఒకాయన జనంలోంచి బయటకొచ్చి నా వంక చూస్తూ..
 “మాస్టారూ! మంచి చేప , బంగారు తీగ . చాలా ఫ్రెష్ ఉంది, రెండు వాటాలు వేస్తే చెరో మూడొందలు పడుతుంది. మూడు పూటలకి సరి పోయేంత వాటా వస్తుంది., వాటాకి వస్తారా..?’ అని అడిగాడు.
“ఏదీ చూడనీయండి, “ అని నేనూ అతనితో పాటూ  జనంలోనికి చొరబడ్డాను కాస్త చొరవగా . నిజంగా చాలా  ఆరోగ్యంగా ఎర్రని ఛాయతో నిగ నిగ లాడుతోంది, బంగారు తీగ. సుమారు ఆరో ఏడో కేజీ బరువు ఉంటుంది. నాతో పాటూ కాళ్ళ మధ్యలోంచి నా కొడుకు కూడా లోపలి చొచ్చుకొచ్చాడు. వాడు చేయి చాచి ఆ చేప మోప్పలను ఎత్తి చూసి
“ అబ్బా ఎంత రెడ్ గా  ఉన్నాయో ..? బాగుంది నాన్నా ఫ్రెష్ గా ,”అన్నాడు. చేపలను ఎలా పరీక్షించాలో  వాడికి గతంలో ఎప్పుడో చెప్పినట్టు గుర్తు.
బేరమాడిన అతనితో సరే  అని ఒప్పుకున్నట్టు తలూపాను. వెంటనే చేయి చాపాడు. జేబులోంచి మూడు కొత్త వంద రూపాయి నోట్లు తీసి అతని చేతిలో పెట్టాను. అతని డబ్బులూ నావీ కలిపి  చేపలమ్మికి చేతిలో చెయ్యి వేస్తూ నొక్కి  ఇస్తూ “త్వరగా బాగు చేయించి ఇచ్చేద్దూ, రెండు వాటాలు.. బేగా ఎల్లాల ”  అంటూ అడిగాడు. అతడలా చేయడం నాకు నచ్చలేదు.
ఆమె డబ్బులు చిక్కంలోకి తోస్తూ చేప మీద నీళ్ళు చిలకరించి ఆప్యాయంగా నిమిరి  పక్కకి తోసింది. ఆమెకు ఎడంగా కూర్చుని చేపల పొలుసు వోలుస్తూ కట్టి పీటను  ఒకపక్క, పదునైన చేతి కత్తిని ఒకపక్క వొడుపుగా మారుస్తూ, మరొక చేత్తో తలతీసిన మేకులతో తయారుచేసుకున్న బ్రష్ తో పోలుసును గీకుతూ  ఎంత పెద్ద చేపనైనా సునాయాసంగా సరిసమానంగా  వాటాలేస్తూ మత్స్యావధానం చేస్తున్న అతడ్ని చూస్తే ముచ్చటేసింది. అతడు అంత  బిజీ లోనూ మా ఇద్దరి  వంకా మార్చి మార్చి చూస్తూ “వాటా కి పది రూపాలౌవుద్ది” అని తన పనిలో మునిగిపోయాడు. మా చేప అతడి పక్కన ఉన్న రెండు చేపల తరవాత  క్యూ లో పెట్టాడు మరొక జూనియార్ బెస్తవాడు. నాకు వాటా ఇప్పించిన వ్యక్తి ఏదో  చేపలకు సంబంధించిన విషయాన్ని చుట్టుపక్కలున్నవాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. మా చేప వంతు వచ్చింది. నిలువుగా, అడ్డంగా ప్రక్కగా తరుగుతూ లోపలి పేగుల్ని, బయట పొలుసునూ ఏక కాలంలో శుభ్ర పరుస్తూ తోకనీ తలనీ కూడా సమాన వాటాలుగా చక చకా పేర్చాడు. నేనూ  నా కొడుకు విస్మయంగా చూస్తూ ముగ్దులమైపోయాం,అతడి కళాత్మకతకు.
తేరుకుని మా వాటా సంచిలో వేసుకుని అతనికి పది రూపాయిల కాగితం తీసి ఇవ్వబోతుంటే ,
“మరొక పది  వస్తది “,, నేనిచ్చింది అందుకోకుండానే విసురుగా నా వంక చూస్తూ అన్నాడు.
“అదేమిటి నా వాటా పది రూపాయిలే కదా ?! “అన్నాను
“నాకు తెల్దు ..ఇద్దరివీ కలిపి ఇరవై  ఇచ్చుకో “అన్నాడు
“అదేమీ కుదరదు, అతని వాటా డబ్బులు అతడే కదా ఇవ్వాలి నన్నెందుకు అడుగుతావు?” నేనూ కాస్త దబాయించాను .
“ఆయన్ని అడిగివ్వు ,ఏడాయనా ? ఎటికాసి చెక్కేసాడు? ”అంటూ నన్ను దోషిని చేసే ప్రయత్నం చేసాడు,ఎదో నేనూ అతడూ తోడూ దొంగలన్నట్టు .
“నాకేం తెలుసు, ఆయనకు నాకు సంబంధంలేదు, ఆయనెవరో, నేనేరో ..”అంటూ ఇద్దరం చుట్టూ కలియ చూసాం అతడు ఎక్కడా కనుచూపుమేర కనబడలేదు. బెస్తవాడు చిరాకుతో ఏదేదో అంటున్నాడు, నాకు అర్ధ కాలేదు.
తిరిగి తేరుకుని “నాకేం తెల్దు  ఇద్దరూ ఇరవై ఇయ్యాల “ అన్నాడు ఖచ్చితంగా.
నేను ససేమిరా కుదరదు, నా వాటాకి సంబంధించిన పది తీసుకోమని  ఇంతే ఇస్తానని మొండి కేసాను.
“అక్కర్లేదు ...ఎలిపో..” అన్నాడు ఒక్కసారిగా.
ఇప్పుడు తీసుకోమని బతిమాలడం నా వంతు అయ్యింది. ఎంత బతిమాలినా అతడు పది  రూపాయిలు తీసుకోవడానికి సిద్దంగా లేడు. సరే ఇంద పదిహేను రూపాయిలు  ఇస్తున్నాను అని మరో ఐదు  రూపాయిలు కలిపి  ఇవ్వబోయాను. దానికి కూడా అతడు సుముఖంగా లేడు. నాకు చిరాకు వచ్చింది. ఈ సంగతిని నన్నే తేల్చుకోమన్నట్లు తన పని తానూ చేసుకు పోతున్నాడు. బహుశా  నన్ను గమనిస్తూనే ఉన్నాడేమో,  ఏమో..?. నా ప్రక్కన నా  కొడుకున్నాడు అంతా గమనిస్తున్నాడు. వాడి ముందు నేను చులకన అవ్వడం ఇష్టం లేక అక్కడే రెండు  నిమషాలు నిలబడి తప్పదన్నట్లు మొత్త ఇరవై  రూపాయిలు తీసి ఇచ్చాను.
  “అక్కర్లేదు, బావూ, సేప వొట్టు కెల్లు.. డబ్బులూ , వొట్టు కెల్లు..నాకొద్దు ” అతని మాటల్లో నిష్టూరం కనబడలేదు. అని వెంటనే తన పనిలో తానూ మునిగి పోయాడు. అతడలా అనడం లోని అంతరార్ధాన్ని పట్టుకోలేకపోయాను. మరో రెండు నిమిషాలక్కడే నిలబడి బయలుదేరాను.  అపరాధ భావనతో చేప చాలా బరువుగా తోచింది.
                               ..........................................
“చెల్లీ నీకు తెలుసా? ఉదయం చేపలమ్మేవాడు నాన్న  మీద అలిగాడు... “అన్నాడు హోమ వర్క్ చేస్తూ మధ్యలో ఆపేసి    . అప్పుడే చుట్టాలు వెళ్ళారు. నలుగురమూ అక్కడే కూర్చున్నాం.  అదేమిటి అన్నట్లు భార్య, కూతురూ ఆసక్తిగా వాడ్ని చూసారు. ఉదయం నాకూ చేపలు వాటా వేసిన బెస్తవానికి జరిగినది మాట పొల్లు లేకుండా వివరించాడు.
“అయ్యో! ముందే వాడికి ఆడబ్బులేవో ఇచ్చేవచ్చుగా..” అంది భార్య నిష్టూరంగా.
“ చేప అమ్మినవాడే ఉచితంగా అన్నీ చేయాలి, వేరేగా  డబ్బులు తీసుకోకూడదు అంతే గానీ కొన్నవాడు ఎందుకిస్తారు, అంటూ లీగల్ పాయింట్ లాగాడు,” కొడుకు.
“చేపలకూర చాలా బాగుంది, ఇంకా ఉందామ్మా? “అని తన జిహ్వను ప్రకటించింది కూతురు
ముగ్గురూ నా వైపు చూసారు...
“అమ్మ అన్నట్టు  ఆడబ్బులేవో వాడికి ముందే ఇచ్చేయవచ్చు కానీ , నాచేత చేపను కొనిపించిన అతడు చెప్పాచెయ్యికుండా డబ్బులు ఇవ్వకుండా వెళ్లి పోవడం మోసం కదా?,అవునా ? కాదా??”,అడిగాను , అవునన్నట్లు తలూపారు ఇద్దరూ.
“ ఆ మోసాన్ని గమనించాడు, బెస్తవాడు. నేను మొదట నా వాటా డబ్బులు ఇస్తున్నప్పుడు బెస్తవాడు ఇద్దరి వంతూ ఇవ్వమని అడగడంలో అతడి లౌక్యం కనబడుతుంది. అయితే తానూ మోసపోయినది నిజానికి అతనికి రావాల్సిన సొమ్ము కాదు. అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు చేపను ఉచితంగానే కోసి వాటా వెయ్యాలి. వేరేగా డబ్బులు అడగ కూడదు. అందుకని మొదటివ్యక్తి  మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు కనుక నా దగ్గర నుండి కూడా డబ్బులు తీసుకోకూడదనేది బెస్త వాని ఆలోచన. ముందతను ఇవ్వనప్పుడు నా దగ్గర తీసుకోవడంలో నిజాయితీ లేదని నా దగ్గర డబ్బులు తీసుకోలేదు. నేను మొత్తం ఇస్తానని ముందుకు వచ్చినా కూడా ఆ బెస్త వాడు నా డబ్బులు ఆశించలేదు. బెస్తవాడు మోసపోయాడు కాని నష్ట పోలేదు.  బెస్తవాడి నన్ను మోసం  చేయదలచుకోలేదు. నాకు నష్టాన్ని కలిగించ దలచుకోలేదు. అతడెవరో తెలీదు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు, నా ఒక్కడి దగ్గరే డబ్బులు తీసుకోవడం అంటే  నన్ను మోసం  చేసినట్లుగా అనుకున్నాడు. “ అంటూ ఇద్దరి మొహాలూ చూసాను. పిల్లలిద్దరూ ముందుకు ఒంగి నేను చెప్పింది అర్ధం చేసుకోవడాని ప్రయత్నిస్తున్నారని అనిపించింది.
“తనది కానిది ఏదైనా తనవద్దకు అనుకోకుండా వస్తే దాన్ని స్వీకరించవచ్చు తప్పు లేదు . కానీ,  తనది కాని దాన్ని బలవంతంగానో  దబాయింఛి  లాక్కో కూడదు . అలాగే పక్కవాడు మోసం చేసాడనో లేదా లంచం తీసుకున్నాడనో వాడికి పోటీగా  మనం కూడా అలా చేయడం నీతివంతమనిపించుకోదు.
  బెస్తవాడు పరుల సొమ్ము ఆశించకూదడనే అనే సత్యాన్ని తన స్థాయిలో ప్రకటించుకున్నాడు.  మంచి శీలాన్ని పాటించడానికి చదువుతో సంస్కారంతో పనిలేదనే ఆలోచన నాకు స్వాంతన కలిగించి అతడి మీద గౌరవం పెంచింది.ఆ విషయాన్నే నాకు తోచిన వివరణతో పిల్లలకు చెప్పాను  .
                                                                                             (అయిపోయింది )





No comments:

Post a Comment