Friday, 10 April 2020

వృత్తి ధర్మం


వృత్తి ధర్మం                   
                                                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్ ((18-6-19)
ఊహ తెలిసిన దగ్గర నుండీ కలలు  కనాల్సిన రంగుల  ప్రపంచాన్నే
 త్యాగం చేయడానికి సిద్దపడిన  కారుణ్యం
 దయాళు హృదయం  ఆ చిన్న ప్రాణం,
ఆకలా ,దాహామా, ఆటా , పాటా, ఏమి త్యాగం చేయలేదని చెప్పాలి ?
అహరహమూ ఏదో వెలితిని తోడుకోవాలని
జిజ్ఞాసను పెంచుకుని పంచుకోవాలని లైబ్రరీలో పుస్తకాలను ధ్యానిస్తూ
నీళ్ళు త్రాగి క్షుద్భాదను చంపుకున్న ఆశయాల అమాయకత్వం ఆ ప్రాణం
రోగికీ  రోగానికీ అడ్డుగోడ కట్టాలని
జీవానికీ మరణానికీ అంతరాన్ని పెంచాలని
అమ్మ నాన్నల ఆకాంక్షలను తీర్చాలని 
నిద్రతో వాలుతున్న కనురెప్పలను వెనక్కి  మెదడుకి వేలాడుదీసుకుని
పడ్డ తాపత్రయాని పర్యవసానం ఈ  కీచక పర్వం అని తెలుసుకోలేకపోవడం
నిజమే , నిరపరాధమే , దానికే ఈ శిక్ష
రాత్రికీ పగలుకూ మధ్య నిద్రలేమి ఆనకట్టగా కట్టి
 సంపాదించిన స్నాతకోత్సవ డిగ్రీని ఉరి తీసిన తలారుల వెంపరితనానికి 
త్యాగం విలువ ఒక ప్రాణం విలువని
ఆ ఒక్క ప్రాణం విలువ వేల ప్రాణాల కొలువు అని ఎలా చెప్పాలి.?
ఉద్రేకాలు ఉన్మాదాలు ప్రాణాలను నిలిపిన దాఖలాలు ప్రపంచంలో లేవు
ప్రతీ చిన్న, పెద్ద అనారోగ్యానికి కూడా తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టినందుకు
ఈ దుశ్చర్యల పర్యవసానం సబబైన పరిష్కారమా?
వెలుగు నీడల్లాగే  , గాలీ వానల్లాగే ,
ఊపిరిపోయడం  ఊపిరి తీయడం ప్రక్రుతి ధర్మం
నడుమ జరిగే  ప్రక్రియను సరళీకృతం చేయడంమే
వైద్య వృత్తి కి సహజ సాధు శీలమైన ధ్యేయం
ఈ మాత్రం తెలుసుకోలేని యింగితరహితుల మధ్య ఏమి చేసినా నేరమే,
వ్యవస్థని లోని లొసుగుల్ని  ప్రశ్నించలేని
పాలకుల ముసుగుల్ని తొలగించలేని
మూకల చేసిన ఆటవిక  ప్రకటన ఈ హింస
ప్రాణాంతకమైనప్పుడు వైద్యుడి ప్రాణం సైతం నిస్సహాయతలో 
కొట్టి మిట్టాడడం తప్ప చేసేదేముంది ?
 న్యాయం తలుపులు మూసుకున్నప్పుడు అమానుషాన్ని 
దిగమింగడం తప్ప..
 నిరసనల జెండా తగిలించుకుని నిరంతరం ప్రాణభయంతో
జీవించడం తప్ప, ....
వ్యావృత్తిని నిరాదరణకు బలిపెట్టి ధార్మికతతో
నిర్వహించడం తప్ప .......


No comments:

Post a Comment