Friday, 10 April 2020

అబ్ స్ట్రాక్ట్


                                   అబ్ స్ట్రాక్ట్

                                                                     డాక్టర్ మాటూరి శ్రీనివాస్
నిన్ను ఎప్పుడు చూసినా ఏదో క్రొత్తదనం కలివిడిగా నన్ను కవ్విస్తుంది
అయినా , నీవేమిటో? నేను తెలుసుకునే విఫల ప్రయత్నం చేయదలచుకోలేదు
నిన్ను ఎలా అర్ధం చేసుకోవాలోనని కూడా నేను మధన పడడం లేదు
కేవలం నా అనుభవాల దొంతరలు ఒక్కొక్కటిగా నిన్ను బేరీజు వేయడానికి
అహర్నిశలూ తలమునకలై వాటి పనిలో అవి ఉన్నాయ్
అందబోయే తెలియని అందాల కోసం అర్రులు చాస్తూ ఉంటాయి  
ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క క్రొత్త పదంతో, ఒక్కొక్క క్రొత్త అర్ధాన్ని
నా జీవన నిఘంటువులో పొందు పరిచే ప్రక్రియ, నా ఉనికిని సజీవంగా ఉంచుతుంది.
కొంత కాలానికి, ఇంత కాలం నేనెంత తొందర పడి అపార్దం చేసుకున్నానో తెలుస్తుంది  
నిజం చెప్పొద్దూ, అప్పుడు నీ కోసం సమయాన్ని కేటాయించ లేనందుకు సిగ్గేస్తుంది
నాకు నా తొందరపాటును తెలుసుకుని నిందించే అవకాశాన్నిచ్చినందుకు అభినందిస్తాను   
ఏదేమైనా, గమ్యాన్ని నిర్దేశించే చిత్తరువులంటే నే పడి చస్తానని తెలుసు కదా!
కానీ అగమ్యంగా గోచరించే గమ్యాలను కనుగొనడం అంటే నన్నునేను వెతుక్కోవడమే.
నన్ను నేను పదే పదే ప్రశ్నించు కుంటున్నానని గమనించిన  ఆ విచిత్ర వర్ణాలు
వెక్కిరిసున్నట్లు , దీనంగా చూస్తున్నట్లు , ఆత్మీయంగా ఆరాధిస్తున్నట్లు
సోరంగంలోనికి లాక్కుపోతున్నట్లు, గుండెకు పడిన ముడిని  బిగిస్తున్నట్లు
ఊపిరి సలపనీయకుండా ఒక్క మాదిరిగా భూమిలోనికి అదిమేస్తున్నట్లు ..  
తెలియని కళ్ళతో ప్రపంచం అంచనా కడదా మనుకోవడం దుస్సాహసమే
ఏ రసఖండం మీదైనా పర్పుల్ పూల పరిమళాలు  
సారవంతమైన బీజం లేకుండా, అందం పిండం కాకుండా  రావని మాత్రం తెలుసు
ఈ విశాల ప్రపంచాన్ని, నిన్ను,  నీలోని మాతృత్వపు అస్పష్టతను  ఆస్వాదించడం
భూమీ ఆకాశాలను ఒక్కమారుగా ఆలింగనం చేసుకున్నంత అనుభూతినిస్తుంది
నీవొక ప్రతి సృష్టి వని తెలిసి నప్పుడు నిన్ను నిన్నుగా స్వీకరించడం తప్ప
ఎవరు మాత్రం ఏమి చేయగలరు? నేను కూడా అంతే 
అంతుబట్టని ఆశావహంతో అర్ధం కాని ఆర్తితో నీలోకి ఎదురు చూడడం తప్ప
నన్నూ , నా సహనాన్ని, నా ఊహనీ నిలదీసే నీ భాషకు మొక్కడం తప్ప ....
                                                                                           06-06-18

No comments:

Post a Comment